పైరసీ భూతం - సాయిరాం ఆకుండి

Movie Piracy Prevention Program

మూవీ పైరసీ జడలు విప్పిన భూతంలా భయాన్ని గొలుపుతున్న విషయం సర్వవిదితం. లక్షలాది మంది జీవితాలు ముడిపడివున్న పరిశ్రమ మనుగడకు శాపంలా పరిణమించిన రుగ్మత ఇది.

దినదినమూ విస్తృతమవుతున్న సాంకేతిక పైరసీకి కొత్త కొత్త ద్వారాలు తెరుస్తుండగా పైరసీ ఒక అపరాధం అనే భావన తగినంత ప్రాచుర్యం కాకపోవడం ఈ దుర్వ్యసనం విస్తృతమవడానికి దోహదపడుతుంది. ఎక్కడో విదేశాల్లో ఇంటర్ నెట్లో చేసిన ఒక అప్ లోడ్ ఒక చైన్ రియాక్షన్ లాగ వేలవేల డౌన్ లోడ్ లతో  కోట్లరూపాయల శ్రమను బూడిదపాలు చేస్తోంది. పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తోంది.

పైరసీ జాడ్యాన్ని పూర్తిగా నిర్మూలించడం అంతిమధ్యేయం. దినదినమూ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతతో అది సమీప భవిష్యత్తులో కష్టసాధ్యమైన లక్ష్యం కావచ్చు గానీ పైరసీ విస్తరణను నియంత్రించి పైరసీ వ్యతిరేఖ వాతావరణాన్ని సృష్టించడం, ఇది దొంగతనం లాంటి అనాగరిక చర్య అనే భావనలను పెంపొందించడం, పైరసీ రహిత సామాజిక వాతావరణాన్ని నెలకొల్పే కార్యక్రమాలు చేపట్టడం ప్రస్తుత కాలానికి మంచి ఫలితాలనిస్తుంది. భారతదేశంలో సగటు మనిషికి సినిమాయే ఏకైక వినోదం. తాము అభిమానించే సినిమా తారల్ని తమ ఇంట్లోని సభ్యుల్లా ఆపేక్షగా అభిమానంగా చూసుకుంటారు. తమ అభిమాన తారలు బాగుండాలని కోరుకోవడం ద్వారా పరోక్షంగా పరిశ్రమ విలసిల్లాని ఆశించే ప్రజలు పైరసీ రక్కసిని తరిమికొట్టే యుద్ధంలో సైనికులు కాగలరు.

కిందనుదహరించిన కార్యక్రమాలు పైరసీ విస్తరణను అరికట్టి, అది కలిగించే నష్టాలను నియంత్రించగలవు:

మూవీ క్రాప్ట్స్ కు చెందిన ప్రముఖులతో ఒక Task Force ఏర్పాటు చేసి MP3 (Movie Piracy Prevention Program) ని నిర్వహించే బాధ్యత అప్పజెప్పాలి.

ప్రతీ సంవత్సరము ఆ ఏడాదికి వివిధ కార్యక్రమాలు ప్రణాళిక చెయ్యడం:

* ప్రతీ నెలా పైరసీ కంప్లయింట్ చేసిన వారిలో/జన్యూయిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారిలో కొందరిని సెలెక్ట్ చేసి - ఆ వ్యక్తులు అభిమానించే నటీనటులతో Get together లో పాల్గొనే అవకాశం కల్పించడం,

* మీడియా సహకారంతో పైరసీ వ్యతిరేక అంశాలతో కథలూ, కార్టూన్లూ, ఇంకా వివిధ కళారూపాలతో పోటీలు నిర్వహించడం, అభిమాన తారలతో బహుమతి ప్రధానం చేయించడం.

* పైరసీ వ్యతిరేక కార్యక్రమాలలో యువతను కూడా భాగస్వాములుగా చేర్చుకోవడం. ఐ.టీ. ప్రొఫెషనల్స్ సహకారంతో యాంటీ - పైరసీ ప్రమోషనల్ ఈవెంట్స్ కి సాంకేతిక హంగులతో మరింత ప్రాచుర్యం తేవడం.

* ఏడాదిలో ఒక రోజుని పైరసీ డే గా పరిగణించి పైరసీ భూతాన్ని వధించే కార్యక్రమాన్ని రావణసంహారంలా నిర్వహించడం.

* పైరసీ నేరాలకు శిక్షలు విధించిన వార్తలకు ప్రాచుర్యం కలిగించేలా చర్యలు చేపట్టడం.

* పైరసీ డౌన్ లోడ్స్ మరింత విస్తరించకుండా ఉండాలంటే - అది అధర్మం, అక్రమం అనే భావన పాదుకొల్పేలా కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా చిన్నపిల్లల్లో సినిమాని థియేటర్ లో చూడడమే సముచితం అనే భావన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం.

* న్యాయ నిపుణుల సలహాలతో యాంటీ పైరసీ చట్టాల పదునును అభ్యర్ధించడం, కృషిచేయడం.

ఇలాంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగుతూ ఉంటే, నిరంతర పోరాటం జరుగుతూ ఉంటే పైరసీ రక్కసి బలహీనపడి కొన్నాళ్ళకి అంతమవుతుందని ఆశించడం మంచి ఆశయం కాగలదు.