నవ్వుల జల్లు - జయదేవ్

మంత్రి : మహారాజా... పొరుగు దేశం నుంచి మన రాజ్యంలోకి ప్రవేశించి స్థావరాలు ఏర్పరచుకుంటున్నారు!
రాజు : ఎవరు?
మంత్రి : ఊర పిచ్చుకలు ప్రభూ... పొరుగు రాజ్యం నుంచి వచ్చి, మన ఇళ్ళల్లో గూళ్ళు కట్టుకుంటున్నాయి!!


నల్లదోమ : "కుంజర యూధంబు దోమ కుత్తుకన్ జొచ్చెన్" అంటే ఏమిటన్నా?
తెల్లదోమ : అబ్బా... ఫలహారం తింటున్నాను! ముద్ద మింగుడు పడే మాటలు పలకవయ్యా... తమ్ముడూ!!

దండ నాయకుడు : ప్రభో... విప్లవ కారులు మనమీదికి దండెత్తి వస్తున్నారు!!
ప్రభువు : అణచి, తుంచి వెయ్యండి. పోండి!!
దండ నాయకుడు : వాళ్ళ నాయకురాలు, మన మహారాణి గారు ప్రభో!
ప్రభువు : చచ్చాం!!! ఐతే ఎలా తప్పించుకోవాలో చెప్పు!!


రవి వర్మ : యువరాణి స్వయంవరానికి వచ్చిన, వివిధ దేశాల యువరాజులు కోటలోపల విడిది చేశారు! అందరూ గున్న ఏనుగుల్లా ఇంతలేసి లావున్నారు!!
భువి శర్మ : నేనూహించానులే! స్వయంవరం దండోరా వేసేప్పుడు, మన యువరాణి చిత్రపటాన్ని వివిధ దేశాల్లో చూపించారు! గంతకు తగిన బొంతలు స్వయంవరానికి వచ్చారు... అంతే!!


మంత్రి వర్యుడు : యుద్ధ భేరీలు, రణ భేరీలు నిర్మించే కర్మాగారాన్ని నిర్మించడానికి నిధులు కావాలా?
దరఖాస్తు దారుడు : ఔను మంత్రివర్యా! నిధి మంజూరు చెయ్యండి!!
మంత్రి వర్యుడు : ఛస్తే కుదర్దు! రాజుగారు ఒప్పుకోవాలిగా? రాజుగారికి యుద్ధబేరీలు, రణభేరీలంటే చమటలు పోస్తాయి తెలీదా??


రాజశేఖరుడు : సేనా నాయకా, యువరాజు గారికి గుర్రం స్వారీ నేర్పుతున్నారా?
సేనా నాయకుడు : యువరాజా గారు ప్రస్తుతం పుత్తూరులో ఆరోగ్యం కోలుకుంటున్నారు రాజా!
రాజశేఖరుడు : పుత్తూరులోనా?
సేనా నాయకుడు : ఔను మహారాజా! యువరాజు వారు గుర్రం ఎక్కబోతూ కింద పడ్డారు!!
 


వృద్ధ మహారాజు : నా మరణ శాసనం రాసుకోండి! నా మరణానంతరం, ఈ రాజ్యం, సేనాధిపతి గారి కుమారుడికి చెందుతుంది!
మహారాణి : నా బొందిలో ప్రాణముండగా నేను దీనికి ఒప్పుకోను!
సేనాధిపతి : ఒరేయ్ ఎవరక్కడ, ఇద్దరినీ సంకెళ్ళు తగిలించి, కారాగారంలో తొయ్యండ్రా!!


యువరాణి : ఈ రోజు నిండు అమావాస్య! నౌకావిహారానికి రమ్మంటున్నావే! కటిక చీకటి కదా?
కపట ప్రేమికుడు : క్రితం సారి నిండు పున్నమినాడు నౌకావిహారానికి వెళ్ళాం గుర్తుందా? రాజ భటుల కంటపడ్డాము! నువ్వు తప్పించుకున్నావ్! నన్ను చితక బాదారు!!
 


మహారాణి : మీరు వెళ్ళేది వేటకే కదా? వీర తిలకం దిద్దమంటున్నారు?
మహారాజు : నేను యుద్ధానికి ఎలాగూ వెళ్ళను! ఆ ముచ్చట తీర్చుకుందామనీ!!


కోట భటుడు : ఈ వింత తెలుసా? మన సేనాపతి, కర్రసాము, కత్తి సామూ, రెండూ రావంట! చివరికి ములుగుకర్ర పట్టుకోడం కూడా చేత కాదంట!!
పేట భటుడు : అదేం పెద్ద విషయం కాదు! మన రాజుగారికి రాజ్యం ఏలడమే చేతకాదు తెల్సా??