దీపావళి - ప్రాముఖ్యము - గుమ్మా రామలింగ స్వామి

importance of deepavali

ఆశ్వయుజ శుద్ధ చతుర్దశిని నరక చతుర్దశి అని, ఆ మరుసటి రోజు దీపావళి అని, మహా ప్రముఖమయిన పండుగలుగా మహాలక్ష్మి అసీస్సుల కొరకు, అనుగ్రహము కొరకు భారత దేశమే కాదు, విదేశాలలో కూడా భారతీయులు నివసించు నేపాల్, శ్రీలంక, మలేషియా, యూరప్, అమెరికా మొదలగు దేశాలలో వేడుకగా జరుపుకొను పండగ ఈ దీపావళి.. దీనిని కొన్ని ప్రాంతములలో, ఐదు రోజులు, నాలుగు రోజులు, మూడు రోజులు, రెండు రోజుల పండుగగా జరుపుకొను అచారమున్నది. ప్రాంతాల వారిగా దేశ, కాల ఆచారము బట్టి జరుపుచున్నారు. త్రయోదశినాడు, అక్షయతృతీయ అని, తరువాత నరక చతుర్దశి అని తరువాత అమావాస్యనాడు దీపావళి గా, తరువాత కార్తిక మాసం మొదటి రోజు పాడ్యమి నాడు బలి పాడ్యమని, విదియనాడు యమ విదియ గాను, ఈ పండుగను భారత దేశంలో అనాదిగా ఆచరించుచున్న ఆచారం. దీపావళి అనగా దీపముల వరుస. దీపముల సమూహము అని కూడా అర్ధము చెప్పవచ్చును.

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం
శత్రు వృద్ది వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే
దీపం జ్యోతి పర బ్రహ్మ దీపంజ్యోతి జనార్దనః
దీపోహారతి పాపాని సంద్యా దీప నమోస్తుతే !

సకల కళ్యాణ ప్రదము, ఆరోగ్యము, ధనము, శత్రువులపై విజయము ప్రసాదించు దీపమునకు నమస్కరించుచున్నాను, ఈ దీపము, పర బ్రహ్మ మహావిష్ణు స్వరూపము, సకల పాపములు హరించు సంద్యా దీపమునకు నమస్కారము అని ఈ శ్లోకమున దీప ప్రాశాస్త్యమును చెప్పుచున్నారు. సంధ్య అనగా మూడు సంద్యలు అని అర్ధము.

ఈ దీప ఆరంభము విశేషము గూర్చి తెలుసుకొందాము. ఒకనాడు ఇంద్రుడు దుర్వాస మహా మునికి ఆతిధ్య మిచ్చి సకల సత్కారములు చేసెను. దానికి ఆ ముని సంతోషించి మహా మహిమాన్వితమయిన ఒక పూలహారమును బహుకరించెను. ఇంద్రునకు అది అంత గొప్పదిగా కనిపించలేదు. ఆ హారమును తన ఐరావతము మెడ లోకి విసిరెను. ఆ ఏనుగు ఆ హారమును క్రింద పడవేసి కాళ్లతో త్రొక్కెను. దానికి ఆ తాపసి ఆగ్రహించి, ఇంద్రుని తన ఐశ్వర్యము, పదవి పోయి బ్రష్టుడవు కమ్మని శపించి వెడలిపోయేను. మహేంద్రుడు చేసిన అపరాధము గ్రహించి మహావిష్ణువు ఆశ్రయించి, విషయము వివరించి, దానికి నివారణ, తరుణోపాయము అనుగ్రహించమని వేడుకొనెను. ఆ పరమాత్మ ఇంద్రునకు మహాలక్ష్మి స్వరూపమయిన దీప మహత్యమును చెప్పి దీపారాధన, జ్యోతి నమస్కారము, ఆవశ్యకత, ఫలములు వివరించెను. ఇంద్రుడు ఆ విధముగా వివిధ దీపములతో మహాలక్ష్మిని ఆరాధించి ఆమె అనుగ్రహము సంపాదించి మరల పూర్వ వైభవమును సంతరించుకోనెను. ఇది దీప మహాత్యము తెలుపు పురాణ గాధ. ఈ దీపము అజ్ఞానమును తొలగించి సన్మార్గము చూపుచు మానవాళికి మహోపకారి యగు మహలక్షియెనని హిందువుల విశ్వాసము.

శ్రీ మహావిష్ణువు ద్వాపరమున నరకాసురుని సంహరించి దేవ మునిగణ సాదు సజ్జనులను వాని బారి నుంచి కాపాడిన రోజుగా నరక చతుర్దశిని జరుపు కొనుట మన ఆచారము. ఆ తరువాతి అమావాస్యనాడు ఆ సంబరము జరుపుకొని మహాలక్ష్మిని పూజించుట దీపావళి ప్రాముఖ్యము. మరియొక గాధ ప్రకారం శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతా సమేతుడయి అయోధ్యకు వచ్చిన రోజుగా కొందరి భావము. జైనుల చివరి తీర్ధంకరునకు, మోక్షం సిద్ధించిన రోజుగా వారి ఆచారము ప్రకారము ఈ దీపావళి పండుగ జరుపు కొందురు. బలిచక్రవర్తి పాతాళము నుంచి తిరిగి వచ్చిన రోజని మరి కొందరి నమ్మకము.

దక్షిణ భారతమున మాత్రము నరక చతుర్దశి, దీపావళి, పాడ్యమి మూడు రోజలు అరుపుకొను ఆచారమున్నది. కర్ణాటక మహారాష్ట్రలలో, కార్తికమాస మొదటి దినము పాడ్యమినాడు పశువులకు అలంకారము చేసి పూజించు సాంప్రదాయము కలదు. దీనిని బలిపాడ్యమి గా వ్యవహరింతురు. ఆ తరువాతి రోజు, విదియనాడు యమ ధర్మ రాజు తన సోదరి ఇంటికి వెళ్లి ఆతిధ్యము స్వీకరించి ఆమెను ఆశిర్వదించెనని యమవిదియ నాడు సోదరులు సోదరి గృహమునకు వెళ్లి ఆశీర్వదించి బహుమతులు ఇచ్చుట మనము చూచుచున్నాము.

ఈ పర్వదినమున హిందువులు ఉదయమే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానము చేసి, గృహములను పువ్వులతోను తోరణములతోనూ అలంకరించి ముగ్గులువేసి అలంకరించాలి. సాయంకాలమున, ప్రదోష సమయమున, దీపము దక్షిణదిక్కుగా తిరిగి వెలిగించి, పెద్దలకు నమస్కారము చేయవలెను. ఇలా చేయుట వారికి ముక్తి మార్గము చూపునది అని భావిస్తారు. దీనినే ఉల్కాదాన మంటారు. దీనిని దీపావళి నాటి సాయంత్రము ముందుగా చేయవలెను. అనంతరము భక్తి శ్రధలతో మహాలక్ష్మి ఆరాధించి ప్రార్ధించి వేడుకగా బాణసంచా వెలిగించి ఆనందించు పండుగ ఈ దీపావళి. ఈ పండుగ ప్రాముఖ్యమంతయు మహాలక్ష్మిని ఆరాధించుట, కొలుచుట, పూజించుట అని గ్రహించవలెను.

పంచ భూతములలో అగ్ని ప్రధానమయినది. అగ్నిలో తేజస్సు, ఆహారం, విద్యా నిండి ఉంటాయి. అందుచే అగ్ని హోత్రమునకు మన సంప్రదాయమున మిక్కిలి ప్రాధాన్య మీయబదినది. దీపములో మూడు రంగులు కలిసి ఉంటాయి అవి నీలము, పసుపు, తెలుపు. ఇవి సత్య, తమో, రజో గుణాలకు సంకేతములు మరియు లక్ష్మి, సరస్వతి, దుర్గలకు కూడా ప్రతీకలు. ఈ దీపాన్ని ఆరాధించుట త్రిజగన్మాతలను ఆరాధించుటయే. ఈ దీపావళి రోజుని, ఉత్తర భారత దేశమున నూతన సంవత్సరముగా భావించి, క్రొత్త ఖాతాలు, పుస్తకాలు తెరచి వ్యాపారారంభం చేయు ఆచారము మనకు తెలిసినదే. ఇట్టి మహా మహిమాన్వయితమయిన ఈ పండుగ హిందువులందరి ముఖ్యమయినది.శుభ మయినది.

ఈ దీపావళి పండుగకు కారణ భూతమయిన, ఆధారమయిన, నరకాసుర సంహార ఘట్టమును వ్యాసమహర్షి భాగవతమున వివరించెను. దానిని అనువదించిన బమ్మెర పోతన గారి భాగవతమునండి కొంత మనవిచేసెదను.

నరకాసురుడు భూదేవి పుత్రుడు. కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించిన తరువాత, వరాహముర్తికి, భూదేవికి అసుర సంద్యా సమయమున జన్మంచిన మహాబలశాలి. అతడు మహావిష్ణువు, తల్లి భూదేవితో, తనకు తల్లి వలన తప్ప మరెవ్వరి వలన మరణము సంభవించకుండా వరము పొందినవాడు. దేవమాత అదితి కుండలాలను అపహరించి దేవతల మణి పర్వతమును ఆక్రమించి, దేవతలను పీడించి, దేవ ముని సాదు జనులకు కంటకమయినాడు. ఇటుల చాలా కాలము వాని బాధలను భరించి, ఇంద్రుడు ద్వాపరమున శ్రీకృష్ణుని ఆశ్రయించి మొరపెట్టు కున్నాడు. శ్రీకృష్ణుడు అభయమిచ్చి యుద్ధానికి సంసిద్ధుడగుట చూచి సత్యభామ తానుకూడా వత్తునని యుద్ధము తిలకించ వలెనని ముచ్చట పడినది. పరమాత్మకు కావలసినది నదియె కదా! అనునయమున యుద్ధరంగము, ఏనుగుల ఘీంకారము, భయానక దృశ్యాలు చెప్పి, అది హంసలతో ఆడుకోనుట, సరోవరాలు కమలాలు, కావని చెప్పుచూ, ఆమెలో ఆసక్తి పెంచెను. సత్యభామ యుద్ధమునకు వచ్చి, తన యుద్ధవిద్యా నైపుణ్యమును ప్రదర్శించి దానవులను, నరకుని, తనే సంహరించ గలనని చెప్పుచూ జరుగవలసిన కార్యమునకు నాంది పలికెను. ఆ ఘోర యుద్దమును పోతన వర్ణించు చున్నాడు. చూడుడు.

వేణిం జొల్లెమువెట్టి సంఘటిత నివీ బంధయై భూషణ
శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరిచీజాలముల్ పర్వగా
బాణిం పయ్యద చక్కగా దురిమి శుంభద్వీరసంరంభయై
యేణిలోచన లేచి నిల్చే దనప్రాణేశాగ్ర భాగంబునన్

యుద్ధసన్నద్ద అయిన సత్యభామ జడముడి పెట్టినది, నడుము చుట్టు కొంగు చుట్టి బిగించినది, ఆభరణములు సరిచేసుకున్నది, చంద్ర బింబము వంటి ముఖమున పిల్ల గాలులు వీచగా పయ్యెద సరిచేసుకున్నది, వీరాటోపముగా ఆ హరినాక్షి దిగ్గునలేచి భర్త ముందు నిలబడినది, యుద్ధ మారంభ మయినది.

జ్యావల్లిధ్వని గర్జనమ్ముగ సురల్ సారంగ యూధమ్ముగా
నావిల్లింద్రశరాసనమ్ముగ సరోజాక్షుండు మేఘంబుగా
దా విద్యుల్లత భంగి నింతిసురజిద్దావాగ్నిమగ్నంబుగా
బ్రాహుట్కాలము సేసె బాణచయమంభశ్శికర శ్రేణిగాన్

ఆ ధనుష్టాన్కారము మేఘ గర్జనగా ఉంది. ఆకాశం లో యుద్ధం వీక్షిస్తున్న దేవతలు చేతక పక్షులులా ఉన్నారు. చేతిలో విల్లు ఇంద్ర ధనస్సులా ఉంది. కృష్ణుడు నీలమేఘంలా ఉన్నాడు. తాను మెరుపు తీగలా ఉంది. నరకాసురుడను దావాగ్నిని అణచి వేయునట్లుగా సత్యభామ శర పరంపరను వర్షంవలె కురిపించినది.

యుద్ధానంతరము నరకాసురుడు నేలకొరగగా, దేవతలు మునులు సంతసించిరి. పుష్ప వృష్టి కురిపించిరి. దేవమాత కుండలాలను ఆమెకు ఇచ్చి నరకుని చెరలోనున్న పదహారు వేల కన్యలను శ్రీకృష్ణుడు, విడిపించి పెడ్లియాడి సత్యభామా సమేతంగా ద్వారకకు తిరిగి వచ్చెను. ఆ శుభ సందర్భముగా, సకల లోకాలలో మహాలక్ష్మి స్వరూ పమయిన, దీపాలను వెలిగించి పండుగ చేసుకొనిరి. అదే ఆనందమయ దీపావళి పండుగ..

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు