వేలు చీకితే … !!* - డా. కె.ఎల్. వి. ప్రసాద్

finger in mouth

పిల్లల అలవాట్లు తల్లిదండ్రుల పెంపకం మీద,కుటుంబ సభ్యుల,సంరక్షకు ల,జీవన శైలి మీద,పరిసర ప్రాంతాల మీద,జత కట్టిన పిల్ల స్నేహితుల మీద,ఆధారపడి ఉంటాయి. పిల్లల మీద ముఖ్యమైన ప్రభావం తల్లిదండ్రుల నుండే సంక్రమిస్తుంది. లేదా -పెంచే తాతల మీద ,అమ్మమ్మ -నానమ్మల మీద ఆధారపడి ఉంటుంది. అది మాట కావచ్చు,ఆట కావచ్చు,భాష కావచ్చు,యాస కావచ్చు,చేసే పని కావచ్చు,వారిలో అంతర్గతంగా దాగివున్న ఏ ఇతర అలవాట్లైనా కావచ్చు ! మంచి అలవాట్లతో ఎప్పటికీ సమస్య ఉండదు,కానీ,చేదు ఆల-వాట్లు  సంక్రమిస్తేనే అసలు సమస్య ఉత్పన్న మవుతుంది. అందుకని,పిల్లలే కదా !అని,వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం,ఇష్టం వచ్చిన --పనులు చేయడం,గారాభం తో ముద్దుగా బూతులు మాట్లాడడం,వాళ్ళ ఎదురుగా సిగరెట్లు,బీడీలు,చుట్టలు త్రాగడం ,గుట్కా-జర్దాలు,తినడం,వంటి ,పనులు అసలు చేయకూడదు. మనం చేసే ప్రతి పనీ,మాట్లాడే ప్రతి -మాట,పిల్లలు అనుకరించడానికి,అనుసరించడానికీ ప్రయత్నిస్తారు.అందు చేత,పిల్లల పెంపకం అంటే అది ఆషామషీ వ్యవహారం కాదు ! పిల్లల ఆరోగ్య సంరక్షణ ఒక ఎత్తైతే,వాళ్లకు మంచి అలవాట్లు నేర్పించడం , పెద్ద సవాలు గానే తీసుకోవాలి. మన కోపం,అసహనం,మన బలహీనతలు  వారి దగ్గర ప్రదర్శించడం వంటి వాటి వ ల్ల ,వారి జీవితాల్ని స్వయంగా చేతులారా పాడు చేసినట్లు అవుతుంది. అంటే -మన ప్రవర్తన,మన అలవాట్లు,మన జీవన శైలి పిల్లల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో  ఆలోచించాలి.  దంత సంరక్షణ,దంత సౌందర్యం కు సంభందించి పిల్లల కొన్ని అలవాట్ల ప్రభావం వారి దంతాల మీద,దంత సౌందర్యం మీద ఎంతటి ప్రభావం చూపిస్తుందో పరిశీలిద్దాం. 

-------------------

పుట్టిన పిల్లలకు తల్లి స్తన్యం యెట్లా అలవాటు చేస్తుందో,అట్లాగే నోట్లో ఏమి పెట్టినా చీకడానికి,చప్పరించడానికీ,ప్రయత్నిస్తారు పిల్లలు. తల్లి స్తన్యం పొంది నప్పటికీ,ఏదో అసంతృప్తి,పాలు సరిపోక పోవడం,వంటి కారణాల--వల్ల,ప్రాధమిక దశల్లో బొటన వేలు లేదా చేతి వేళ్ళు చీకడానికి కారణాలు కావచ్చు ! ఇవన్నీ అసంకల్పిత చర్యలు మాదిరిగానే మొదలవుతాయి. తర్వాత తల్లి  స్తన్యం ఒట్టిపోయిన తర్వాత సీసా పాలు (బోటిల్ ఫీడింగ్ )పాల పీక వంటివి ,అలవాటు చేయడం వల్ల కూడా వేలు చీకడానికి ప్రధాన కారణాలు అవుతాయి. బొటన వేలు చీకడం ద్వారా అందానిదేదో అందిన తృప్తి తో పిల్లలు ఈ అలవాటుకు బానిసలై ,అందులోని హాయిని అనుభవిస్తుంటారు. పిల్లల్లో బొటన వేలు చీకడం అనేది అయిదేళ్ల వయస్సు వచ్చేసరికి సాధారణంగా తగ్గుముఖం పట్టవచ్చు. కానీ స్తిరదంతాలు వచ్చేవరకూ ఈ అలవాటువల్ల పెద్ద సమస్యలేమీ ఉత్పన్నం కావు. అందుకే తల్లికూడా,దానిని ఒక సమస్యగా పరిగణించడు. కానీ స్థిర దంతాలు వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు పిల్లలు మానక పొతే దాని ప్రభావం -పై దౌడ మీద,అంగుటి మీదా,పై దౌడ ముందరి పళ్ళ మీద (ఇన్ సి జార్లు )పడుతుంది. అప్పుడు గాని తల్లి ,తన పిల్ల/పిల్లవాడి దౌడకు,దౌడ పళ్లకు జరుగుతున్నఅన్యాయం ఏమిటో గమనించ లేదు  !

మరి ,ఈ అలవాటు వల్ల ఏమి జరుగుతుంది … ?--

చేతి బొటన వ్రేలును,చీకడం ,లేదా వేళ్ళను చీ కదం,లేదా కాలి వేళ్ళను చీకడం వల్ల,పై దౌడ అంగుటి భాగం సహజ ఆకృతిని కోల్పోయి గూడు మాదిరిగా రూపాంతరం పొందుతుంది. తద్వారా ముందరి పళ్ళ మధ్య ఎడం రావడం వల్ల -పంటికీ ,పంటికీ మధ్య ఖాళీ ఏర్పడుతుంది. దీనివల్ల పలువరుస చూడడానికి అభ్యంతర కరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడ పిల్లల విషయంలో ఇది మరీ ఆలోచించ దగ్గది,అప్రమత్తంగా వుండవలసిన దీను. ఈ అలవాటును మాన్పించడం ఎలా ?

1)పిల్లల సున్నితమైన మనసు బాధపడకుండా మృదువుగా చెప్పి   మాన్పించాలి.
2)చీకే .. చేతి వేళ్లను గమనించి ,ఆ వే ళ్ళకు ప్రమాదం లేని చేదు లేపనాలు రాయడం ద్వారా అలవాటును మాన్పించాలి.
3)ఆర్థో డాంటిక్ -మూళ్ళ క్లిప్పులు ఉపయోగించి చికిత్స ద్వారా మాన్పిస్తారు.

చికిత్స --

చేతి వేలు /వేళ్ళు చీకడం వల్ల దౌడ లో మార్పులు వచ్చి,ముందరి పళ్ళ మధ్య ఖాళీ ఏర్పడడాన్ని (ఇలా కావడానికి వేరే కారణాలు కూడా ఉన్నప్పటికీ ఇక్కడ అవి అప్రస్తుతం )సాంకేతిక పరిభాషలో ‘డయాస్టిమా ‘అంటారు. సకాలంలో తల్లిదండ్రులు స్పందించి వేలు చీకడం అనే అలవాటును మాన్పించి ‘ఆర్థో -డాంటిక్ (క్లిప్పుల )చికిత్స ‘చేయించడం ద్వారా అందమైన పలువరుసను పునర్నిర్మించుకుని,సహజ దంత సౌందర్యానికి మార్గం చూపించ వచ్చు ! ముఖ్యంగా పిల్లల్లో ఈ అలవాటును తల్లులు గమనించిన వెంటనే శాయ -శక్తుల ప్రయత్నించి ఆదిలోనే ఆ .. అలవాటును మాన్పించ వలసిన ప్రధాన బాధ్యత తల్లులదే మరి !!