మానవ పరిణామంలో భాషా ప్రాముఖ్యత - హరి యస్ యస్ వి

language Importance

మనిషి చాలా తెలివైన వాడు. భూమి మీదున్న మిగిలిన జంతువుల మేధస్సుకూ, మనిషి మేధస్సుకూ మధ్య అపారమైన తారతమ్యత రావడానికి తోడ్పడిన అంశాలలో భాష అనేది కీలక పాత్ర వహిస్తుంది. మిగిలిన జంతువులకి భాష లేదా అంటే, కొన్ని పరిశోధనలు ఉన్నాయనే చెబుతున్నాయి.కానీ మనుషులకున్నట్టుగా సంకేతాలను వాడే భాష (Symbolyc language) మాత్రం వేరే ఏ జంతువుకు లేదు.

మనిషి ఆలోచనలతో భాష ఎంతలా పెనవేసుకుందంటే, భాష లేకుండా మనిషి ఆలోచించలేనంత. ఒక్క క్షణం అలోచించి చూడండి, మన ప్రతి ఆలోచనా భాషతో ముడిపడిందే.మనం భాషతోనే ఆలోచిస్తున్నాం, భాష లేకుండా ఆలోచించలేం.భాషలేకుండా ఆలోచించడం ఏమిటా అనే సందేహం మీకు రావొచ్చు. సరే, ఉదాహరణకు ఒక పుట్టు చెవిటి ,మూగ వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తికి ఊహ తెలిసే సమయానికి ఏ భాషా వచ్చి ఉండదు. కానీ,మెదడు మాత్రం పనిచేస్తుంది. అలాంటప్పుడు పరిసరాలనైతే పరిశీలిస్తాడుగా ? ఆలోచనలైతే వస్తాయిగా ? వస్తే అవి ఎలా ఉంటాయి ?
కొన్ని పరిశోధనలో తేలిందేమిటంటే, వారికీ మాములు మనుషులలాగ ఆలోచన వచ్చిన వెంటనే దానికి సరిపడా వాక్యాలు గట్రా ఉండవట, ఆలోచనలకు సంబంధించిన చిత్రాలు కన్పిస్తాయట.

కాబట్టి, పైన చెప్పిన ఉదాహరణ నుండి మనం ఒక విషయాన్నయితే తేల్చి చెప్పొచ్చు, భాష అనేది లేకపోతే మనిషి జీవన పరిణామం(Human evolution) మొదట్లోనే ఆగిపోయేది, ఆగకపోయినా ఇంత వేగవంతంగా అభివృద్ధి దిశలో అయితే ఉండక పోయేది. ఒకవేళ సంకేతాలతో కూర్చిన భాష లేకపోతే (కనిపెట్టకపోతే ) మనిషికి ఉన్న ఇంకొక ప్రత్యామ్నయం సైగలు.కానీ, సైగలతో మనిషి సైన్స్, టెక్నాలజీ వరకు వచ్చి ఉండేవాడు కాదు. భాష లేకపోయినా అన్వేషణ, కుతూహలం మాత్రం మానవ లక్షణం కాబట్టి, సైగల భాషతో మనిషి పరిణామం ఎలా ఉండేది అనేది మన మెదడుకు మేత.

ఇప్పుడు ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే ప్రపంచీకరణ (globalization). క్రీ.శ 14 వ శతాబ్దం నుండి ప్రపంచీకరణ మొదలైందని చరిత్ర చెబుతుంది. మొదట్లో అది వ్యాపార రంగానికే పరిమితం అయినప్పటికీ, మెల్లి మెల్లిగా సాంస్కృతిక పరివర్తన, బహుభాషా అవలంబన వరకు వచ్చింది.ఇన్ని రోజులు ఎవరి సంస్కృతికి తగ్గట్టుగా వారి భాషను పెంపొందిచుకున్నారు. ఇప్పుడు అన్నీ పోయి ఒక భాష,ఒక సంస్కృతిగా మారే దిశగా మానవ అభివృద్ధి జరుగుతోంది. దీనికి ఉత్ప్రేరకంగా దోహదపడే అంశాలైన , science,technology,internet అన్నీ కూడా ఆంగ్ల భాషలోనే అభివృద్ధి చెందుతున్నాయి.
ఇప్పుడే అసలైన చిక్కు వచ్చి పడింది. మరి నిజంగా ఆంగ్ల భాషకు మిగిలిన భాషలకున్నంత పటుత్వం ఉందా ? నేనైతే లేదనే అనుకుంటున్నాను.

ఎందుకంటే ఒకసారి కింది ఉదాహరణను పరిశీలించండి.

రా, రారా, రావే, రండి

ఈ పదాలను పరిశీలిస్తే,

రా - ఈ పదం ఒక వ్యక్తిని రమ్మని పిలవడానికి వాడినట్టు తెలుస్తుంది.

రారా - ఈ పదం రమ్మని పిలుస్తున్నారని తెలుపుతూనే, ఆ సంభాషణలో ఉన్న వ్యక్తులకు ముందే పరిచయం ఉందని, వాళ్ళిద్దరి మధ్య మంచి చనువు ఉందని మరియు ఆ రెండవ వ్యక్తి పురుషుడని తెలుపుతుంది.

రావే - ఈ పదం రమ్మని పిలుస్తున్నారని తెలుపుతూనే, ఆ సంభాషణలో ఉన్న వ్యక్తులకు ముందే పరిచయం ఉందని, వాళ్ళిద్దరి మధ్య మంచి చనువు ఉందని మరియు ఆ రెండవ వ్యక్తి స్త్రీ అని తెలుపుతుంది.

రండి - సంభాషణలో ఇద్దరే ఉంటె, రమ్మనడంతో పాటు, మొదటి వ్యక్తికంటే రెండవ వ్యక్తి పెద్దవాడని లేదా వారిద్దరి మధ్య ఉన్న పరిచయం ఇంకా చనువు వరకు వెళ్లలేదని అర్థమౌతుంది.

ఆంగ్ల భాషలో పైన చెప్పిన అన్ని సందర్భాలకు come అనే ఒకే పదాన్ని వాడుతారు. ఇక్కడ తెలుగు భాషలో ఉన్నంత పటుత్వం ఆంగ్ల భాషలో ఐతే కనిపించడం లేదు. ఇది కేవలం నేను గమనించిన ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలా ఉన్న భాషలన్నిటిలో కూడా తారమ్యాలు సహజం. భాష అనేది కేవలం ఒక సందర్భంలోని సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకే కాకుండా, ఆ సందర్భాన్ని, దానిలో ఉన్న మనుషుల భావోద్వేగాలను, వాటి తీవ్రతను, మానవ సంబంధాలను,సంస్కృతిని,వారి ఆలోచన విధానాన్ని వీలైనంత ఎక్కువగా చిత్రీకరించగలగాలి.

ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనిషి అభివృద్ధికి భాష ఇంత తోడ్పడినప్పుడు, అభివృద్ధి అనేది భాష మీద ఇంత ఆధారపడి ఉన్నప్పుడు, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని కూడా భాష ప్రభావితం చేస్తుంది.అలాంటప్పుడు ఉన్న భాషలన్నిటిలో ఏ భాష ఎక్కువ పరిణితి చెందింది ? భవిష్యత్తులో జరిగే మానవాభివృద్దికి ఎక్కువగా దోహదం చేసే భాష ఏది ? అనే అంశాల పైన కూడా పరిశోధన జరగాలి. ఒకవేళ ఇప్పుడున్న సాంకేతికతను వేరే భాషలోకి మార్చడం కుదరదు అని తేలితే, వేరే భాషలలో ఉన్న ఉత్తమ అంశాలను ఆంగ్ల భాషలోకి ఆపాదించడం ఎలా అనే దిశగా సాహిత్య పరిశోధనలు ప్రారంభించాలి