తీరిన సందేహం (చిన్నపిల్లల కథ) - డి వి డి ప్రసాద్

solved doubt(moral story)

హిమలయాల్లో అనేక సంవత్సరాలు తపస్సు చేసి అద్భుత శక్తులు సాధించిన వినయానందస్వామి అనే సాధువు ప్రజలకు తన ఆధ్యాత్మిక బోధనలు తెలియచెప్పే ఉద్దేశ్యంతో దేశసంచారం చేయ సంకల్పించాడు.  తన ప్రవచనాలతో సాధారణ ప్రజలను ఆధ్యాత్మికత వైపు మళ్ళించి, వాళ్ళల్లో వైషమ్యాలు తొలగించి సన్మార్గం వైపు నడిచేటట్లు చేయడం ఒక్కటే అతని లక్ష్యం. అంతే కాకుండా మంచివారికి కోరిన వరాలు  ప్రసాదించేవాడు. చెడ్డవార్ని కూడా తన ప్రవచనాలతో మంచి మార్గంలోకి తీసుకు రాగల శక్తి కలవాడు ఆయన.

అతని వెంట శిష్యుడు రామానందుడు కూడా ఉన్నాడు.  ఒకసారి తన గ్రామం వచ్చి ధర్మబోధ చేస్తున్న వినయానంద స్వామి ప్రసంగాలు రామానందుడ్ని బాగా ఆకర్షించాయి. ఆ రోజునుండే అతన్ని సేవించి తనను శిష్యునిగా చేర్చుకోమన్నాడు. అందుకు వినయానందస్వామి అంగీకరించగా అతని సేవ చేసుకుంటూ అతని వెన్నంటే రామానందుడు కూడా నడిచాడు.

అలా ఊరూరు తిరుగుతూ ఓ రోజు సాయంకాలానికి బ్రహ్మపురమనే ఊరు చేరుకున్నారు. అప్పటికే చీకటి పడటంతో ఆ రాత్రిపూట ఆశ్రయం కోసం వాళ్ళిద్దరూ ఆ గ్రామంలో ధనవంతుడైన సోమనాధుడి ఇంటి తలుపు తట్టారు. తలుపు తీసిన సోమనాధానికి సాధువైన వినయానందుడు, అతని శిష్యుడు రామానందుడు కనిపించారు.   అతన్ని చూసి వినయానందస్వామి తనను గురించి చెప్పుకొని ఆ పూటకి తనకీ, తన శిష్యుడికి ఆతిథ్యమిచ్చి ఆ రాత్రికి ఆశ్రయమివ్వమన్నాడు.

సోమనాథుడు బాగా ధనవంతుడే, అయినా అతనికి అహంకారం మెండుగా ఉంది. ఆ ఊళ్ళో కూడా ఎవరికీ సహాయపడే స్వభావం కాదు సోమనాధానిది. అతనికి సాధుసన్యాసులంటే అసలే లెక్కలేదు. పైగా వారందరూ సోమరిపోతులు అని అతని అభిప్రాయం.  వాళ్ళు ఊరి మీద పడి ఉచితంగా తమ అవసరాలు తీర్చుకొనే వారనే భావన గలవాడు సోమనాధం.

వాళ్ళని చూస్తూనే కళ్ళు చిట్లించి, "వెళ్ళండి, వెళ్ళండి!  ఆతిథ్యమూ లేదు, ఆశ్రయమూ లేదు.  అడ్డమైన సన్యాసులకి ఇక్కడ ఆశ్రయమివ్వడానికి ఇదేమైనా ధర్మసత్రవనుకున్నారా?" అంటూ కసిరి తలుపు వేసుకున్నాడు సోమనాధం.

సోమనాధం స్వభావం గ్రహించిన వినయానందుడు చిన్నగా నవ్వుకొని వీధిబాట పట్టాడు. అయితే అతనితో వస్తున్న శిష్యుడు రామానందుడికి బాగా ఆగ్రహం వచ్చింది. అమర్యాదగా ప్రవర్తించిన సోమనాధం మీద బాగా కోపం వచ్చింది.  అయితే వినయానందుడు వీధిలోకి రావడంతో అతని వెనకే నడిచాడు రామానందుడు.

అయితే రెండడుగులు వేసారో లేదో, రెండిళ్ళవతల ఉన్న ధర్మన్న గురుశిష్యులిద్దర్నీ చూసి వినయంగా చేతులు జోడించి తన ఇంటికి ఆహ్వానించాడు. ధర్మన్నకి సాధు సన్యాసులన్నా, అతిథులన్నా చాలా గౌరవం.  వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని చాలా సంతోషించాడు ధర్మన్న.  ఆ పూట ధర్మన్న ఆతిథ్యం స్వీకరించి అతని ఇంట బస చేసాడు వినయనందస్వామి తన శిష్యుడితో.

భోజనం ముగించి విశ్రాంతి తీసుకునేటప్పుడు, సోమనాధం వల్ల జరిగిన అవమానం ఇంకా మర్చిపోని రామనందుడు, "స్వామీ!  తమరు మంచివారిని అనుగ్రహించి వరాలు ప్రసాదించే మహిమలు కలవారు కదా!   అలాగే సోమనాధం లాంటి స్వార్థపరులకు తమరు శాపం ఇవ్వ వచ్చుకదా!  అతనికి మీలాంటి ఆధ్యత్మికవేత్త అంటే అసలు గౌరవం లేదు. ఆతిథ్యం ఇవ్వకపోగా అవమానపర్చాడు కూడా!  అతన్ని మీరు శపిస్తారనుకున్నారు. అలా ఎందుకు చేయలేదన్న సందేహం నాకు కలిగింది." అన్నాడు.

శిష్యుడి సందేహం విన్న వినయానందుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు, "వరాలు ప్రసాదించడం, శాపం ఇవ్వడంలాంటి మహిమలు నాకు ఉండటం నిజమే.  ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన కారణంగా అవి సిద్దించాయి.  మంచివారికి వరాలు ప్రసాదిస్తే అవి లోక కళ్యాణానికే దారితీస్తాయి. దానివల్ల నా తపశ్శక్తి ఏ మాత్రం తరగదు. కాకపోతే క్షణికఆగ్రహానికి, ఆవేశానికిలోనై ఎవరినైనా శపిస్తే తపశ్శక్తి క్షీణిస్తుంది. అందువల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, కేవలం మన అహం చల్లారుతుందంతే!  అందుకే నేను శాపమిచ్చి నా తపశ్శక్తి వృధా చేసుకోదలచలేదు. సోమనాధానికి అహంకారమెక్కువ, నేను కూడా అహంకారినైతే ఇద్దరికీ తేడా ఇంకేముంది?”

అయితే ఇంకా రామనందుడికి సందేహం పూర్తిగా తీరకపోవడం గ్రహించి, "రామానందం! నీ మనసులో సందేహం అర్ధమైంది.  సోమనాధం అహంకారం ఎలా పోతుందనికదా నీ సందేహం.  చూడు, ఇంకొద్ది రోజులలో అతను మన ప్రవచనాల వల్ల దారికి వస్తాడు." అన్నాడు వినయానందుడు.

ఆ మరుసటి రోజు నుండే ఆ ఊళ్ళో రామాలయంలో వినయానందుడి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆరంభమయ్యాయి. ఈ నోటా, ఆ నోటా వాటి గురించి విన్న సోమనాధుడు కూడా రామాలయానికి వచ్చి వినయానందుడి ప్రసంగాలు విన్నాడు. తన వల్ల తప్పు జరిగిందని గ్రహించగలిగాడు. అతనిలో మార్పు కలిగి, వినయానందుడ్ని కలసి అతని కాళ్ళపై పడి, తనని క్షమించి తన ఇంటికివచ్చి తన ఆతిథ్యం స్వీకరించమని కోరాడు.

ఈ సంఘటనతో రామనందుడికి సందేహం తీరి, గురువుగారి మీద భక్తిభావం మరింత పెరిగింది.