సుబ్బయ్య చింత (బాలల కథ) - డి వి డి ప్రసాద్

subbiah thinking

బ్రహ్మపురం అనే వ్యవసాయ ప్రధానమైన గ్రామంలో ఆ ఏడు  వర్షాలు సరిగ్గా  కురిసి  పంటలు  బాగా పండాయి.  అందరిమొహాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది.  సంక్రాంతి పండుగ దగ్గరకి రావడంతో ఊరంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.  ఆ రోజు సాయంకాలం రోజూలానే నాలుగు దారిల కూడలిలో గల మర్రిచెట్టు కింద ఊరిలోని జనం పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు.

"ఈ ఏడు బాగా దిగుబడి వచ్చింది.  ధాన్యం అమ్మగా వచ్చే డబ్బులతో ఈ ఏడు నేను మేడమీద ఇంకో అంతస్తు లేపుతాను." ఆనందంగా అన్నాడు మోతుబరి సోమయ్య.

"నా పొలంలో కూడా పంటలు బాగా పండాయి.  ఎన్నోఏళ్ళుగా నా భార్య రవ్వలహారం కోసం పోరుతోంది.  ఈ సారి రవ్వలహారం కొని ఆమె కోరిక తీరుస్తాను." అన్నాడు పెద్దరైతు రంగన్న.

"నాకు కూడా ఈ ఏడు ఎన్నడూ రానంత దిగుబడి వచ్చింది.  నేను మాత్రం నాకు రాబోయ ధనంతో పొరుగు ఊళ్ళో ఓ ఐదెకరాల పొలం కొనదల్చాను." హుషారుగా అన్నాడు రామయ్య.

ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆనందాన్ని మిగతా అందరితో పంచుకుంటున్నారు.  అందరి మాటల్ని ఉదాసీనంగా, మౌనంగా వింటున్న భీమన్న మీద రంగన్న దృష్టి పడింది.  "మరి నీ మాటేంటి భీమన్నా?  నీ పొలంకూడా బాగానే పండింది కదా! " అని అడిగాడు భీమన్నని.

భీమన్న దీర్ఘంగా నిట్టూర్చి, "నిరుడు నా కుమార్తె పెళ్ళికోసం చేసిన అప్పుతీర్చడానికే ఆ డబ్బులు సరిగ్గా సరిపోతాయి.  అంతే!" అన్నాడు.

"ఓహ్! అదా!  అయినా నువ్వు రుణవిముక్తడవుతావు కదా మరి.  వచ్చే ఏడు వచ్చేదంతా నీకు మిగులే!  అందుకోసం నువ్వేం బెంగపెట్టుకోకు." ఓదార్చాడు రామయ్య.

"అవును, అదీ నిజమే!" అంగీకరించాడు భీమన్న.

అయితే ఇప్పుడు అందరి దృష్టి సుబ్బయ్యమీద పడింది.  సుబ్బయ్య బాగా ధనవంతుడేకాక పిసినారి కూడా.  రకరకాల వ్యాపారాలు చేస్తుంటాడు. అందరికీ అధికవడ్డీలకి అప్పులిచ్చి ముక్కుపిండిమరీ వసూలు చేస్తూంటాడు.  అప్పులు వసూలు చేయడంలో సుబ్బయ్య దయాదాక్షిణ్యాలు కానీ కనికరం కానీ చూపెట్టడు.  ఒకవేళ ఎవరైనా అప్పు తీర్చకపోతే వాళ్ళ పొలం లాక్కొని తన పొలంలో కలిపేసుకుంటాడు. 

అలాంటి సుబ్బయ్య ఒంటరిగా ఓ మూల వేరుగా కుర్చొని ఉన్నాడు.  అతని మొహంలో అంతులేని దిగులు, చింత ఉన్నాయి. భీమన్న కన్నా దీనంగా ఉందతని వాలకం.  అతని వైపు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బయ్యకేం దిగులు?  అతనికి ఉన్న వ్యవసాయ భూములపైన కూడా ఈ ఏడు బాగా దిగుబడి వచ్చిందే, మరి అతనికెందుకంత దిగులో అంతుబట్టలేదెవరికీ.

ఆఖరికి రామయ్య అతని దిగులుకి కారణం అడిగాడు.

అందుకు సుబ్బయ్య పెద్దగా నిట్టూర్చుతూ, "ఏం  చెప్పమంటావు రామయ్య?  ఈ ఏడు అందరికీ బాగా లాభాలు వచ్చాయి కదా,  నా వద్ద అప్పు చేసినవారందరూ తమతమ అప్పు తీర్చివేస్తారు.  అంతేకాక, పండుగ ఖర్చులకి, మళ్ళీ పంటలు కోసం కూడా కొత్తగా అప్పు తీసుకొనే వారే ఉండరు. దీనివల్ల నాకు వడ్డీ నష్టమే కదా!  అందరికీ లాభాలు వచ్చే వేళ మరి నాకు వచ్చేది నష్టాలే కదా మరి!" అన్నాడు మరింత దిగులుగా. 

సుబ్బయ్య చింతకి కారణం అర్ధమై అందరూ నిర్ఘాంతపోయారు.  అవును మరి! అందరూ బాగున్న వేళ సుబ్బయ్య లాంటి స్వార్థపరులకి చింతే కదా మరి!