పూర్ణారావు - పూతరేకులు - ఆదూరి హైమావతి.

purna rao-pootarekulu

పూర్ణారావు వీధి బళ్ళో సారీ ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వపాఠశాల   వీధికి ఎదురుగా ఒక చిన్న వసారాలో ఉండటాన దాన్నంతా వీధిబడి అనిపిలుస్తారు అంతే. నేనేం చులకనచేయడం లేదు సుమండీ! మావాడు , నేనూ కూడా ఆబళ్ళో అప్పటికి ఐదోతగతి  వెలగ బెడుతు న్నాం.

  ఒకరోజు సాయంకాలం బళ్ళోనుంచీ వచ్చేసరికి వసారాలో వాళ్ల తాతతో పాటుగా కూర్చునున్న ముగ్గురిలో ఒకాయన పూర్ణారావును చూసి తన చేతిలో దాచుకునున్న సంచీలోంచీ ఒక పొట్లాం తీసి,

 " ఇంద బాబూ ! పూర్ణా తిను. పూతరేకుల్లెండి కరణంగారూ! మా తోడల్లుడు విశాఖపట్టణం నుంచీ తెచ్చాడు. అక్కడి ప్రత్యేక తీపి వంటకం లేండి. చాలా బావుంటుంది రుచి" అంటూ వాళ్లతాతకు చెప్పి, వీడిచేతికి అందించాడు.

ఆ పొట్లాం అందుకుని ఛెంగున బామ్మ దగ్గరకెళ్ళాడు పూర్ణా. వాడికి తీపి వంటకాలంటే మాహా ఇష్టం. కిటీకీలోంచీ అంతా వింటున్న బామ్మ బానమ్మ "పూర్ణా! వాటి నలాగే పడమటి వాకిలినుంచీ, పట్టుకెళ్ళి  మన రైతు రామయ్య పిల్లాడు కుమార్ కు ఇచ్చిరా! పాపం వాడు పొద్దుటినుంచీ ఏమైనా తిన్నాడోలేదో! వాడి అమ్మా నాయనా పొలం పనులకెళ్ళి ఇంకా వచ్చి ఉండరు. " అని హుకుం జారీ చేసింది ,మెల్లని గొంతుతోనే.

పూర్ణారావు ప్రాణం గిలగిలా కొట్టుకుంది. కొత్త కొత్త తీపి తినుబండా రాలు తినాలని వాడికి మహా ఉబలాటం. వాళ్ల బామ్మ ఏదీ పడనివ్వదు. తామిద్దరిదీ  తీపి రక్తశరీరం కావటాన వాడికీ వస్తుందని ఆమెభయం. 

వాడి ఆరోగ్యం ఏమైపోతుందోని ఆమె ఆవేదన, అమ్మా నాయనా దూరంగా ఉన్నారాయె! బళ్ళోకూడా వాడిమీద రైతురామన్న కొడుకు కుమారును నిఘాపెట్టింది.

"వెధవ , వాడికి తీపులంటే ఇష్టం ,ఏమన్నా తిండాడేమో చూస్తూ ఉండు కుమార్! నీకు తినను బొరుగులూ బెల్లం పెడతాను " అని లంచంకూడా ఏర్పాటు చేసిది. లంచం మరిపి తెల్లవారు దాటుకున్న  దేశం కదా మనది.! 

  అందుకని పాపం పూర్ణకు బళ్ళోనూ , చాటుగా కూడా ఏమీ తినను పడట్లేదు. ఆరైతు రామన్న కొడుకు కుమార్ వెధవ రోజూ బళ్ళోకొస్తాడు. వాడికి చదువుకంటే పూర్ణా మీద నిఘా అంటే మహా ఇష్టం, ఎందుకంటే వాళ్ళబామ్మ రోజూ పెట్టే బొరుగులూ బెల్లం మహిమ.

 ఐతే కుమార్ గాడు చదువు లోనూ మంచిగానే ఉంటాడు.   మా అందరికీ వాడో ప్రతిపక్షం గాడు.వాడి మార్కులు చూసి మా అమ్మనాన్నలు మమ్మల్ని తిడుతుంటారు . నేనన్నీ నిశ్శబ్దంగా గమనించుకుంటూ ఉండేవాడిని.   

ఒకకంట పంతుళ్లనూ, మరోకంట పూర్ణనూ చూస్తూ ఉంటాడు కుమార్ గాడు.  అలా అలవాటై వాడికి పెద్ద సి ఐ డి ఉద్యోగం వచ్చింది చదువయ్యాక . 

ప్రస్తుతానికి వద్దాం.

పూర్ణా అలా ఆ పూతరేకుల పొట్లం పట్టుకెళ్ళి కుమార్ గాడికిచ్చి దూ రం నుంచీ వాడు ఒక్కోపూతరేకూ తింటూ ' ఆహా ఏమి రుచి " అంటూ ఉంటే , ' ఓరినీ అదృష్టం చెడా!' అని మస్సులో తిట్టుకుంటూ చూస్తూ చూస్తూ  ఇంటికొచ్చి స్నానం చేసి ఒక్కపూతరేకూ తిననివ్వని ,అసలది ఎలావుంటుదో, దానిరుచి ఎలావుంటుందో చూడనివ్వని బామ్మ మీద కోపంతో ఆమెకేసి చూడకుండా, మాట్లాడకుండా వెళ్ళి చదువుకోసాగాడు.  

 బామ్మ" వాడికి ఇష్టమైన బెండకాయ వేపుడు, పెసర అప్పడాలూ వేయించి వాడి దగ్గరకొచ్చి ఘుమ  ఘుమాయిస్తున్న నేతితో ముద్దలు చేసి నోట్లో పెట్టబోగా ముఖం పక్కకు తిప్పేసుకుని , ముక్కుతో కమ్మని నేతి వాసన పీల్చుకున్నాడు.

 మాది పక్కిల్లేకనుక నేనంతా మా కిటికీలోంచీ రహస్యంగా పూర్ణాను గమనిస్తూ ఉంటాను.

"మా బాబుగా! మా పూర్ణాగా , పూర్ణమంటే ఎంత కమ్మని వంటకం, ఏదీ ఒక్కమారు నోరుతెరూ మానాయనగా!" అంటూ  బుజ్జగిస్తూ పెడుతుండగా ,మెల్లిగా ముద్దమీద ముద్ద లాగించి "ఏంటిబామ్మా! నన్ను ఒక్కటీ  తిననివ్వక అన్నీ వాడికి ఇచ్చిరమ్మనావ్!"  అన్నాడు.

"నాయనా! పూర్ణా! ఎవరుచేసారో, ఎన్నాళ్ళ క్రితం  చేశారో  , చేతులవీ బాగా కడుక్కుని చేశారో లేదో! మనకెలా తెలుస్తుంది నాయనా! నీ ఆరోగ్యం పాడైతే మేమేం  చేయాలిచెప్పు.      నీకోసమే నాయనా! పూత రేకులదేముంది ? ఎప్పుడైనా తినవచ్చు ఆరోగ్యం ముఖ్యం కదా!" అంటూ బుజ్జగిస్తూ పాలన్నం  కడుపునిండాపెట్టేసింది.

" మరి కుమార్ గాడికెందుకు ఇవ్వమన్నావ్? వాడి ఆరోగ్యం పాడైతేనో? " మా పూర్ణాకు  సందేహం ఉంచుకునే అలవాటే లేదు.

" వాళ్ళకు అరుగుతాయినాన్నా  ! వాళ్లు బాగా కష్టం చేసే మనుషులు కదా!సరే గానీ ఇహ వెళ్లిపడుకో."అంటూ వాడిని మరిపించింది బామ్మ పూతరేకులనుంచీ. 

    

మీకు అసలు ఉపోద్ఘాతం చెప్పకుండా కధలో కొచ్చేశానాయె.   వాళ్ళిల్లూ మాఇల్లూ పక్కపక్కనే, కాంపౌండ్ వాలే అడ్దం. 

   పూర్ణారావు నేనూ చిన్ననాటినుండీ  చెలికాళ్ళం లెండి. వాడి అమ్మ మహా తెలివైంది. పదోక్లాసులో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావటాన ఇంటర్ చదివేప్పుడే పోస్టల్ జాబ్ వచ్చింది. తాలుకాఫీసులో పనిచేసే వాళ్ళ నాన్న , ఆమె తెలివితేటలూ,పనిలో నేర్పరితనమూ విని , ఆమెను వివాహ మాడాడు, పెద్దల అనుమ్మతితోనే లేండి. అమ్మా,నాన్నా ఉద్యోగ పనులతో తీరికలేక కొట్టుమిట్టాడు తుండగా పెద్దల పోరుపడలేక వీడ్నికనేసి వాళ్లబామ్మా, తాతాగార్లకు అప్పగిం చేసి ,ఊపిరి పీల్చేసుకుని , హాయిగా ఉద్యోగాల  పనుల్లోపడి పోయారు. మళ్ళా ఇంకోబిడ్దను కనే ,ఓపికా తీరికా లేక , ఏకైక వారసుడైన  వజ్రం ముక్కలాండి పూర్ణారావును బామ్మా తాతా అపురూపంగా చూసుకోసా గారు.    

అసలు విషయానికొస్తాను .నాకు చిన్న నాటి  కబుర్లంటే మాహా ఇదిలేండి.

మరునాడు బళ్ళోకెళ్లగానే కుమార్ గాడు వచ్చి " పూర్నారావ్ పూర్నారావ్!  అబ్బా! ఆపూతరేకులెంత బావున్నాయోయ్! నిజంగా అవి తినని జన్మ వృధా. రోజా రేకులకంటే మెత్తగా తియ్యగా వున్నాయి" అంటూ పురిపెట్టాడు.

 అంతా వాడి చుట్టూ మూగారు  " ఏంటి? ఏంటని?" . కుమార్ అంతా చెప్పి " పూర్ణారావు ఎంత మంచి వాడంటే పూతరేకులు తెచ్చి నాకు ఇచ్చాడు.నేను అదే తినడం పూతరేకులుట తియ్యగా వున్నాయి.  --"  అంటూ చెప్తుండగానే  ,క్లాసులోకి పంతులుగారు వచ్చేశారు.

"ఏంట్రా ఆమాటలు ?" అంటూనూ.

 కుమార్ గాడు ‘పూత ‘ అనిచిన్నగా అంటూ ‘రేకులు’ అని గట్టిగా అన్నాడు. ధర్మరాజు “'అశ్వత్థామ హతః,' అని పెద్దగా అని 'కుంజరః'  అనే పదాన్ని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా పలికినట్లు  , ఎందుకంటే పంతులుగారు 'ఎప్పుడూ నీకు తిండి ధ్యాసేనుట్రా?' అని నాలుగంటిస్తారని వాడి భయం.

"ఈరోజు పాఠమదేరా కుమార్ !" అంటూ’ గృహాల రకాలూ’ చెప్తూ' సిమెంటు రేకులు, యాస్ బెస్టాష్ రేకులు ' అంటూ పంతులు గారు చెప్పుకుపోయారు.కుమార్ వీపు భద్రంగా ఉంది ఆరోజుకు.  

మా అందరి అదృష్టమాని మాస్కూల్లో 6,7 తరగతులు వచ్చాయి. పై ఊరికి వెళ్లకుండా ఉండూర్లోనే 7వరకూ చదివాం. ఆతర్వాత మళ్ళా పదోక్లాస్ వరకూ వచ్చింది. ఆడుతూ పాడుతూ ఇంట్లోనే తింటూ తిరుగుతూ పదోక్లాస్ ఐందనిపించాం.ఆతర్వాత మేం ఇంటర్ కు పై ఊరికెళ్ళాల్సి వచ్చింది. 

  పూర్ణ మనస్సులో మాత్రం పూతరేకులు నిల్చిపోయాయి. అప్పుడప్పుడూ నాతో "ఒరే శివా! ఎప్పటికైనా పూత రేకులు కడుపారా  తినాలిరా!"అనేవాడు పాపం.

ఎందుకంటే అప్పుడప్పు డూ కుమార్ పూతరేకుల ప్రస్తావన మా పూర్ణా వద్ద తెస్తూనే ఉన్నాడు.  "పూర్ణారావ్! మళ్ళా ఎవ్వరూ మీకు పూతరేకులు ఇవ్వలేదేంట్రా! ఇస్తే మీ బామ్మ నాకు పంపిస్తారేమోనీ!" అని గెలికేవాడు. మా పూర్ణాకు ఉడుకు పుట్టేది.

" ఒరే శివా! ఎప్పటికైనా వీడి ముందే పూతరేకులు తినాలిరా! ఈ వెధవకు పెట్టకుండా" అనేవాడు.

 ఇప్పుడు కాస్త ఎదిగాం కదా! ఇంటర్లో చేరాం, చదువుమీద ధ్యాస పెట్టాం.  

 పూర్ణారావు  కాపలాకోసమో , రక్షణకోసమో, లేక దయతోనో  కానీ  కుమార్ నూ తానే ఫీజు కట్టించి మాతోపాటు ఇంటర్ లో చేర్పించింది,పూర్ణా బామ్మ . వారిది పేదలను ఆదుకునే స్వభావం అంతా చదువుకుని   పైకి రావాలని వారి ఆశయం కూడా. 

  అంతా ఉదయాన్నే టిఫిన్ తినేసి బస్ లో కాలేజికెళ్ళేవాళ్ళం . మధ్యాహ్న భోజనం మా అందరికీ మా ఉరినుంచీ క్యారేజీలు వచ్చేవి. అంతా ఒక చోట కూర్చుని తినేసి క్లాసులకు వెళ్ళేవాళ్లం.

 ఐతే అక్కడా కుమర్ నుమా పూర్ణా మీద నిఘాకు పెట్టనే పెట్టింది వాడి బామ్మ. బయట ఎక్కడా ఏమీ తినకుండా కట్టు బాటన్నమాట. ఎలాగో ఇంటర్ ఐపోయాక డిగ్రీలోకి వెళ్ళాం.

 మా వాడు సులువని  బి.కాం ఆపైన ఎం.కాం చేసేసి ఒక బ్యాంక్ లో మంచి ఉద్యోగం విజయవాడలో సంపాదించాడు.

 నేనుబి.ఎస్సీ, ఆపైన ఎమ్మెస్సీ చేసేసి విజయ వాడలోనే ఒక కాలేజ్ లో లెక్చరరుగా చేరిపోయాను.మాపెద్దల నిర్ణయం మేరకు త్వరగా వివాహం కూడా చేసేసుకున్నాను.

కుమార్ డిగ్రీ అయ్యాక పోలీ స్ ఆఫీసయ్యాడు, అదీ సి.సి.డీ గా. వాడి వివాహమూ ఐంది.

మాముగ్గురిలోకీ మా పూర్ణా ఇంకే ఇంకా వివాహం కాలేదు. ముగ్గురం కలుసుకున్నప్పుడు నవ్వుకునేవారం మా బాల్య గురించీ చెప్పుకుంటూ.  కుమార్ మాత్రం  అప్పుడప్పుడూ "పూతరేకుల మాటేంటి పూర్ణారావ్? " అంటుండేవాడు.  

ఐతే కధ ఇంకా పూర్తికాలేదండీ!   అసలు కధ ఇక్కడే ఉంది.       

మా  తల్లిదండ్రులూ ఏకైక కుమారుడినైన నావద్ద కు విజయవాడకు వచ్చేశారు.పూర్ణా తల్లిదండ్రులూ రిటర్ మెంట్ ముందు విజయవాడ కు బదిలీ  చేయించుకుని వచ్చేశారు. పూర్ణా తాత బామ్మకూడా వారిపొలాలన్నీ అమ్మేసుకుని  పిల్లలతో ఈ  వృధ్ధాప్యం లో హాయిగా గడపవచ్చని విజయవాడకు వచ్చేశారు. రైతు రామయ్య కూడా కుమార్ దగ్గరికి  విజయవాడ వచ్చేశారు. సో అంతా విజయ వాడ వాస్తవ్యులమయ్యాం. 

పూర్ణా బామ్మ నాకు రోజూ ఫో చేసి " ఏమయ్యా! శివా ! మీ  ఇద్దరికీ వివాహాలయ్యాయి.మా మనవడి సంగతేంటీ? ఇదేనుటయ్యా స్నేహమంటే?మావాడిని పెళ్ళికాని ప్రసాద్ లా వుంచుతావా ఏంటయ్యా!!" అనసాగింది.

 అదేదో నాతప్పైనట్లు. నేను నవ్వుకుని ఈమారు ఎలాగైనా మావాడిని ఒకింటివాడిని చేయాలని గట్టి  నిర్ణయానికొచ్చాను.

 ఎన్ని సంబంధాలు చూసినా ,పిల్ల చదువుకున్నదైనా , ఉద్యోగస్తు రాలైనా మావాడు నచ్చట్లేదు. వాడితో వాడి బామ్మ మొహమాటానికి ఒకటి రెండు సంబంధాలు చూడను పూర్ణాతో వెళ్ళిన నాకు  చూచాయగా వాడి మనసు తెలిసొచ్చింది.  

వాళ్ళ బామ్మా,తాతలకూ, అమ్మా ,నాన్నలకూ నచ్చిన ఒక లెక్చరర్ సంబంధం  గురించీ చెప్పింది వాళ్లబామ్మ.

" పిల్ల బంగారు తల్లిరా శివా! కుటుంబ మర్యాదా బావుంది. సాంప్రదాయమైనవారు ,  జాతకాలూ కలిశాయి , ఎలాగైనా ఈసంబం ధం కుదిరేలా చూడునాయనా!" అంటూ బాధపడింది.

విచరించగా మా కాలేజీలో ఆ అమ్మాయి 'తెలుగు లెక్చరర్ 'గా  ఉద్యోగం చేస్తున్నదని తెలుసుకుని ,నేను కాస్త  పరిచయం చేసుకున్నాను, సహోద్యోగిగా. 

ఒకరోజు మా కాలేజ్ లో ఒక బ్యాంక్ బ్రాంచ్ పెట్టారు పిల్లల సౌకర్యంకోసం.దాని ప్రారంభోత్సవానికి  మా పూర్ణా వచ్చాడు బ్యాంక్ తరఫున. అందరికీ టిఫిన్ , కాఫీ ఏర్పటు చేయడంలో నేను కల్చరర్ క్లబ్ నిర్వహిస్తున్నందున ముందుకువచ్చి ఆ ఏర్పాట్లు చేసాను.

    అతిధులందరికీ దగ్గరుంది తెలుగు లెక్చరర్ చిన్మయి   పిల్లలచేత టిఫిన్ ,కాఫీలు అతిధులకు అందించడంలో నాకు సాయపడింది.

చేతికి టిఫిన్ ప్లేట్ రాగానే  పక్కనే ఉన్న నేను" పూర్ణా ! ఇవేరా పూతరేకులు అంటే! రుచి చూడు "అన్నాను.వాడు అలవాటు ప్రకారం అటూ ఇటూ చూస్తుండగా " కుమార్ లేడు లేరా! ఇక్కడ. తినెయ్ " అన్నాను. సరదాగా నవ్వుకుంటూ తినేశాడు. నా ప్లేట్ లోది కూడా ఎవ్వరూ చూడకుండా వాడిప్లేట్లోకి మార్చేసి మెల్లిగా చెవిలో,

 " తినేసెయ్ !హోం మేడట. ఆమె మాకాలేజ్ లో లెక్చరర్ , వాళ్ళింట్లో చేసినవిట, ఆమె కల్చరర్ క్లబ్ మెంబర్ ,నాతో పాటుగా ఇలాంటి ఫంగ్షన్ లో  నాకు హెల్ప్ చేస్తుంటుంది. " అన్నాను. 

వాడు మహదానందంగా తినేసి నాకేసి కృతజ్ఞతగా చూశాడు.

ఫంగ్షన్ ఐపోయి వెళ్ళిపోయాం.

 ఆమర్నాడు  ఆదివారం " పూర్ణా! అదేదో సంబంధం చెప్తున్నారు బామ్మగారు , వెళ్ళి చూడరాదుట్రా!పెద్ద వాళ్ళను, నిన్నింతకాలం సాకిన వాళ్లను బాధపెట్టకూడదురా! నేనూ నీకు తోడుగా వస్తాను  పద" అని నేనే  , ఒప్పించి వెంట బెట్టుకునివెళ్ళాను. మేమిద్దరమే వెళ్లాం.

వెళ్లగానే వారు చాలా మర్యాదగా ఆహ్వానించారు. లాంఛనంగా టిఫిన్ పెట్టారు. చూస్తే ప్లేట్లో  పూతరేకులు. మా వాడు నాకేసి చూశాడు.

నేను కాస్త చొరవతీసుకుని " ఇవి విశాఖ లో పేరుమోసిన తీపిపిండివంట  కదండీ ! కాకినాడ కాజా, విశాఖ పూతరేకూ అంటారు" అన్నాను కొద్దిగా తుంచి నోట్లో పెట్టుకుంటూ.

ఆయజమాని " మాది విశాఖపట్టణమేనండీ! మా ఇంట్లో ఇవి చేయడం ప్రత్యేకత. "అన్నాడు.

"ఎలాచేస్తారండీ !ఏదో తమాషాగా ఉన్నాయి " అన్నాను.  

" ఒక పెద్ద ప్రత్యేకమైన కుండ ఉంటుందండీ!దానిమీద ఒక బట్టను ముందుగా దీనికోసమని తయారు చేసుకున్న, దోసె పిండి వంటి బియ్యపు పిండిలో ముంచి ఆబట్టను క్రింద బోర్లించి సెగమీద ఉంచిన కుండ  మీద అద్దుతారు. వెంటనే అది పెద్ద అట్టులాగా ఊడి వస్తుంది. దాన్ని తీసి పరిచి దానిమీద నెయ్యి రాస్తూ పంచదార పొడి లేదా బెల్లపు పొడి చల్లుతూ మడతలు వేస్తారు. చిన్నతనంలో మా అమ్మగారితో పాటు నేనూ చేసేవాడిని సరదాగా. మాశ్రీమతీ, మా అమ్మాయీ కూడా చేయితిరిగిన పూతరేకుల తయారీ వాళ్ళు , చాలా బాగాచేస్తారు." అని చెప్పి, " బావున్నాయా!" అని అడిగాడు.

" నేను మావాడికేసి చూస్తూ కన్నుగీటి ," బావున్నా”యన్నాను.

కాఫీ అయ్యాక, ఆయజమాని లోపలకెళ్ళి , ఏదోమాట్లాడి వచ్చాడు. మరికాస్సేపటికి ,ఆయన శ్రీమతి అనుకుంటాను వారి అమ్మాయితో కలసి వచ్చింది. ఇద్దరూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. వారికి కనపడకుండా మావాడిని గిల్లాను , తలెత్తి చూడమని సైగచేస్తూ.

 మావాడు తలెత్తి ఆమెకేసి చూస్తుండగా ,నేనూ అప్పుడే చూస్తున్నట్లు " ఓహ్ !  మీరా! చిన్మ్యై గారూ!" అన్నాను.ఇద్దరి చూపు లూ కలిశాయి,.నావికాదండీ! మా పూర్ణవీ,  చిన్మ్యై వీ కలిశాయి. ఇహ చెప్పేదేముందీ!చూపులుకలిసిన శుభవేళ ఎందుకు మరి ఈ ఆలస్యం అన్నట్లు , మావాడు బయటికి రాగానే " ఒరే శివా! నాకు నచ్చేసిందిరా! ఎలాగైనా ఈ సంబంధం కుదర్చరా! పుణ్యముంటుంది." అన్నాడు.

 రోగి కోరిందీ , వైద్యుడు చెప్పిందీ ఒకే పధ్యం ఐంది.  మావాడు ఒకింటివాడయ్యాడు.వారి వివాహ విందులో పూతరేకులే ముందుగా వడ్డించిన వంటకం. ఐతే వంటవారి చేత చేయించారు లెండి, పెళ్ళికూతురి చేత కాదు.

 చివరి మాటండీ! వారింట్లో ప్రతిరోజూ పూతరేకులే ఉపాహారమండీ! కచ్చ తీరాతింటున్నాడు పూర్ణారావు పూతరేకులను.

 కావలిస్తే  మీరూ వచ్చి తినవచ్చు.

                                  ****