మౌనం వీడదాం రండి! - బి ఎస్ నారాయణ దుర్గా భట్

let us leave silence

అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ శ్రీ శారదాసత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ సొసైటీ సమ్యుక్తంగా నిర్వహించిన కవితలపోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత  

 

మౌనం భారత యుద్ధానికి  నాంది
మౌనం కాకూడదు పురిటి సంధి !
మౌనం అవిష్కరించేది కాదు ..
అంతరంగాలు కొలిచేది !
మిత్రమా !!
మనలోలోపలి మౌనాన్ని వెలివేద్దాం
స్తబ్దతను బద్దలు చేద్దాం ..
మనం ఋషులం కాదు
యోగులంకానే కాదు !
నిజాయితీగా ఒక్క రోజైనా
అంతర్మథనం చేసుకుందాం
మౌనం మనకు భూషణం కాదు ...
మన అతిశయం!
ఇంకా మనలో మనమే మార్మిక భాష మాట్లాడుకుంటుంటే ..
దుర్గంధ కశ్మలంలో ఈదుతున్నట్లే ? కాదా !
అకాశం మౌనాన్ని మింగుతుంది .
విపర్యాలోస్తే విస్ఫోటిస్తుంది ..
ప్రళయంగా - విలయంగా ఉల్కాపాతాలతో ఉనికి చాటుకుంటుంది .
సముద్రం మౌనాన్ని తనలో ముడుచుకుంటుంది .
ఉద్రేకాలను- ఉద్విగ్నలతను కెరటాల పొత్తిళ్లలో చుట్టుకుంటుంది..
కట్టదాటితే ...
ఉప్పెనలూ !సునామీలు !
ఊరు వాడా ఉనికి కోల్పోతాయి ..
భూదేవి మౌనమే సహనంగా ..ఓర్పుతో గుండెల్లో ఉపిరిగా దాచుకుంటుంది..
అసంబద్ధ కదలికలకు
భూకంపక్షేత్రమై కడలినైన కుదిపేస్తుంది ..
నిప్పు మౌనం నివురు కప్పు
తుంది .
అగ్నికణాల కార్చిచ్చుగా సప్త 
జిహ్వ ల్ని జాస్తుంది .
బూదికుప్పలు మిగుల్చుతుంది
గాలి మౌనరాగాలతో పలకరిస్తుంది ..
మలయమారుతాలతో  పులకరింపచేస్తుంది ..
అపసవ్యం ఆవహిస్తే మహావృక్షాలనైనా ..కూకటివేళ్ళతో పెకలించి వేస్తుంది ..
జాతి అచేతనమైనప్పుడు ,
నీతి అలంకారంగా మారుతున్నప్పుడు ,
దేశం శుషుప్తిలోకి జారుతున్నప్పుడు ,
మౌనము మసిపూసిన మారేడుకాయ ! మేథావి మాను మాకై నీడనివ్వని ఛాయ !
స్పందించే పంచ భూతాలే ప్రేరణ !
ఆశయం అజ్ఞాతంవదిలితే ...
ముడుచుకున్న నరాలు - సింహనాద స్వరాలను వినిపిస్తాయి ..మౌనము నుండి నిష్క్రమిద్దం.
మౌనానికి సమాధి కడదాం !!
తరతరాల స్వాతంత్యానికి గ్రహణం పట్టకుండా దిగ్దర్శనమౌదాం....
ప్రజాస్వామ్య విశ్వగీత శృతి తీగలమై
జనగీతిగా  మిగులుదాం !!