పెళ్ళి చూపులు - ఎం బిందుమాధవి

marriage looks

యాజమాన్యం వారిచ్చిన "స్వర్ణ కరచాలనం" ( golden handshake) పుణ్యమా అని పాతికేళ్ళ బ్యాంక్ సర్వీస్ నించి రిటైర్అయి నాలుగు రోజులయింది! కులాసాగా కబుర్లు చెబుతూ మామయ్యగారికి నోట్లో అన్నం పెడుతున్నా! ఆయనకి అన్నం ముద్ద నోట్లో పెట్టి ఏదో ఒకపద్యమో..శ్లోకమో పాడిస్తూ ఉంటాను. ఈ మధ్య ఆయన ఎంత సేపైనా నములుతూనే ఉంటున్నారు...మింగటం మర్చి పోతున్నారని..ఇలా ఏదో ఒకటిపాడిస్తుంటే....ఆయన ప్రమేయం లేకుండా...ముద్ద కడుపులోకి వెళ్ళిపోతోందని గమనించాను...అదన్న మాట సంగతి! 

*******

గత మూడేళ్ళుగా మంచానికి పరిమితమైన మామయ్యగారు...అడపా దడపా..హాస్పిటల్ కి వెళ్ళే అవసరంపడటం..నాలుగు రోజులుండి వచ్చెయ్యటం జరుగుతోంది. 

 

ఈ సారి...నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండి నిన్ననే ఇంటికొచ్చారు. 

 

ఆయన ఈసారి హాస్పిటల్ ట్రిప్ లో మేము తెలుసుకున్న విషయం...మామయ్యగారికి గొంతుకండరాలకి సిగ్నల్స్ పంపే బ్రైన్సెల్స్ 'డెడ్' అవటంతో...ఆయన మింగటం అనే చర్య మర్చిపోయారని! 

 

అందుకే ఈ పాటలు..పద్యాలు..శ్లోకాలు! 

 

గుత్తి వంకాయ కూరతో అన్నం ముద్ద నోట్లో పెట్టుకుని..ఆయన నా వంక ఎగా దిగా చూస్తూ..."ముసునూరి శంకర్రావు గారునాకు ఉత్తరం వ్రాశారు" అన్నారు. 

 

"ఆ:( హా..ఏమని వ్రాశారు" (ఆ ముసునూరి శంకర్రావు గారు మా నాన్నగారే)!   అని సరదాగా నేను (మామయ్యగారు అలాఎందుకన్నారో) కూడా...అలా అడిగా..

 

"వారమ్మాయిని మా అబ్బాయికి ఇస్తామని వ్రాశారు..వారిది తెనాలిట!" అన్నారు 

 

"ఓహ్..ఇంతకీ వారమ్మాయిని చేసుకున్నారా?" నా ప్రశ్న.. 

 

ఆయన పైనించి క్రింది దాకా నన్ను చూసి.."..మహలక్ష్మి లాగా ఉన్నావని చేసుకున్నాం"...అని సందేహంగా మొహం పెట్టి.. "నువ్వేగా" అన్నారు, నవ్వుతూ! 

 

"ఓహో.. అయితే పెళ్ళి చూపుల్లో మీకు నేను నచ్చానా?" అనడిగా 

 

ఒక్కసారిగా నా ఆలోచనలు ఆ రోజు పెళ్ళి చూపుల జ్ఞాపకాల్లోకి వెళ్ళాయి. 

 

                              @@@@@

 

ఆఫీస్ కి బయలుదేరుతూ చెప్పులేసుకుంటున్న నాతో "ఉమా రేపు ఆఫీస్ కి సెలవు పెట్టు".... అమ్మ కేక వంటిట్లోనించి 

 

"రేపు 'హోలీ పండగ ' కదా..కష్టమర్లు ఉండరు ..పెద్దగా పని ఉండదు..స్టాఫ్ కూడా ఎక్కువ రారు..పర్మిషన్ పెడతాలే" అనిఅమ్మకి సమాధానం చెప్పి వెళ్ళిపోయాను. 

 

మధ్యాహ్నం లంచ్ టైల్ లో పర్మిషన్ తీసుకుని వచ్చేశాను. మొహం కడుక్కుని, చీర మార్చుకుని..హాల్లో కూర్చుని అక్కకొడుకుతో ఆడుకుంటున్నాను 

 

వాకిట్లో కలకలం..

పెళ్ళివారొచ్చారని నాన్న ఎదురెళ్ళారు. 

వచ్చినవారికి మంచినీళ్ళు..కాఫీలు..బిస్కెట్స్..అతిధి మర్యాదలకోసం అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది! 

 

నెలరోజుల పిల్లవాడేడుస్తున్నాడని..అక్క బెడ్ రూం లోకి వెళ్ళింది. 

 

పెళ్ళి కొడుకు, తల్లి-తండ్రి, మేనత్త-భర్త వచ్చారు. వచ్చినవారికికుర్చీలు చూపించి..నేనూ ఓ కుర్చీలో కూర్చున్నాను. 

 

ఈ హడావుడిలో ఇంట్లో వాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళు కానీ నా గురించి మర్చిపోయి మర్యాదల్లో పడ్డారు. 

 

అందరూ సెటిలయ్యాక..మర్యాదలయ్యేసరికే నేను పెళ్ళి కొడుకు ( ఇప్పుడు మా వారనుకోండి) మేనత్త గారి భర్త  మాట్లాడుకుంటున్నాము. 

 

ఉభయ పరిచయాలయ్యాయనుకున్నారంతా... 

 

పాపం పెళ్ళికొడుకు నా వెనక కదులుతున్న కర్టెన్ వంక  మాటి మాటికీ చూస్తున్నాడు...పెళ్ళి కూతురొస్తుంది..వస్తుంది అనిసందేహాస్పదంగా! 

 

ఒక సారి కర్టెన్ కదిలినప్పుడు... పసివాడికి పాలుపట్టి అక్కయ్య బయటికి వచ్చింది...మెడలో నల్లపూసలు..బాలింతనడికట్టుతో ఉన్న స్త్రీ... లాభం లేదు..పెళ్ళికొడుకు మొహంలో నిరాశ! 

 

మళ్ళీ కర్టెన్ కదిలింది..పెళ్ళికూతురొస్తుందని ఎదురుచూస్తున్న పెళ్ళికొడుక్కి ...ఊహు: మళ్ళీ నిరాశే..పాంట్-షర్ట్ తో 15-16 ఏళ్ళ అమ్మాయి వచ్చింది! ఈ అమ్మాయేనా పెళ్ళి కూతురు? అనే సందేహం పెళ్ళి కొడుకు కళ్ళల్లో..  

 

పెళ్ళికొడుకు చూపుల్లో ఉన్న భావాలు  నాకు భలే సరదాగా కామెడీ షో లాగా ఉన్నాయ్. కానీ నాకు తెలియదుగా..దానినేపధ్యం! 

 

పల్లెటూరులో పుట్టి..పెరిగి..పక్కనున్న టౌన్ లో చదువంతా పూర్తి చేసి... "మాస్టర్ డిగ్రీ"  మాత్రం సిటీలో చదివిన పెళ్ళికొడుక్కి సందేహం..."ఎంత సిటీలో పెరిగిన అమ్మాయైనా..మరీ పెళ్ళి చూపులకి ఇలా పాంట్-షర్ట్ వేసుకుంటుందా?"..అని

 

ఈ సందేహ సందోహం నడుస్తూనే ఉన్నది...ఇరు పక్షాల తల్లిదండ్రులు..ఎవరి కుటుంబాల గురించి వాళ్ళుమాట్లాడుకుంటున్నారు! 

 

పాపం పెళ్ళికొడుకు నిరీక్షణ కొనసాగుతూనే ఉన్నది..

 

ఒక్కగానొక్క కొడుక్కి తను ఎంపిక చేసిన పిల్లని  (ఆస్తితో..కట్నంతో) కాదని..బస్తీలో పుట్టి..పెరిగి..చదువుకుని.. ఉద్యోగంచేస్తున్న పిల్లని కొడుకు చేసుకోవాలనుకోవటం మింగుడుపడని అత్తగారి మొహంలో ఈ తంతు పట్ల ఒక అసంతృప్తి! ఆ :( ఎవరైతే ఏంలే అనే నిరాసక్తత! 

 

కోడలి ఎంపిక అనేది తనకి కాదు..అత్తగారికి మాత్రమే సంబంధం అనే ముఖ కవళికలతో మామగారు (పెళ్ళికొడుకుతండ్రి)! 

 

కొంచెం సేపయ్యాక..మేనత్త భర్త గారు.."ఇంక మేమెళ్ళొస్తామండీ.." అని చెప్పి లేచి బయటికి నడుస్తూ ..."పిల్ల బాగుందిరా. నీకు సరిగ్గా సూట్ అవుతుంది. ఇంకే ఆలోచనా పెట్టుకోకుండా ఎస్ చెప్పెయ్" అని మెల్లిగా అతని చెవిలో గొణిగి...అమ్మాయి నువ్వు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి చూసొచ్చినప్పుడు ఉన్నట్లే ఉందా? అనే భావం వ్యక్తపరిచే కళ్ళతో పక్కకితిరిగితే..ఇంతకీ పెళ్ళికూతురుని చూడందే? అనే భావంతో పెళ్ళి కొడుకు! 

 

ఆయన గట్టిగా నవ్వి.."ఒరేయ్ ఇందాకటి నించి నాతో మాట్లాడుతున్న అమ్మాయేరా పెళ్ళి కూతురు! ఇంకా బయటికిరాలేదనుకుంటున్నావా? భలేవాడివిరా!" అనే సరికి పెళ్ళికొడుక్కి మతి పోయింది. 

 

అయ్యో తనే పెళ్ళి కూతురని తెలిస్తే.. ఇంకొంచెం బాగా చూసేవాణ్ణి కదా! ఇలా చేశారేమిటి..అనే నిస్సహాయమైనచూపులతో వెనక్కి తిరిగి దొంగ చూపులు చూస్తూ బయటికి నడిచాడు పెళ్ళి కొడుకు! 

 

ఇంటికెళ్ళి పిల్లనచ్చిందని..వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుకోమని చెప్పిన పెళ్ళివారితో మాట్లాడటానికి నాన్న వెళ్ళారు. 

 

అదే అదనుగా.. నన్ను సరిగా చూడచ్చు అని ..మధ్యాహ్నం లంచ్ టైం లో ఆఫీస్ కి వచ్చాడు విస్సు (పెళ్ళికొడుకు) 

 

మొదట్లో కొంచెం మొహమాటపడి..ఆ తరువాత నిన్న జరిగినవన్నీ వివరిస్తూ 

 

"అబ్బ.. ఒక్కరూ..అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా అని అడగరే?...అప్పుడైనా నువ్వు బయటికొస్తావు..చూడచ్చు అనిఆశ పడ్డాను..నువ్వేమో కాలి మీద కాలేసుకుని అక్కడే కూర్చున్నావు! 

 

 "పెళ్ళిచూపుల తంతు మొత్తం ఒకటే కన్ ఫ్యూజన్.." అని విస్సు చెబుతుంటే నాకు ఒకటే నవ్వు! 

 

"ఓహో చూడకుండా ఒప్పుకున్నారన్నమాట! అయితే ఇప్పుడు చూసి ఒద్దనుకుంటారా?" అని తనుఆటపట్టించటం..పదిహేను రోజుల్లో పెళ్ళి ...అంతా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. 

 

*******

 

మామయ్యగారికి ముద్ద గొంతుకడ్డంపడి పొలమారింది. ఆ దగ్గుకి జ్ఞాపకాల్లోంచి బయటికొచ్చాను. 

 

గుండెలమీద రాసి..కొంచెం మంచినీళ్ళు తాగించేసరికి కుదుటపడ్డారు. 

 

భోజనం ముగించాక...పడుకోబెట్టి.."సాయంత్రం మీరు ఉద్యోగం చేసినప్పటి కబుర్లు చెప్పుకుందాం" అనిబయటికొచ్చి...మావారితో "ముసునూరి శంకర్రావు గారు మామయ్యగారికి  పాతికేళ్ళక్రితం ఉత్తరం వ్రాశారుట..ఇందాకఅన్నం తింటుంటే గుర్తొచ్చిందని చెప్పారు" అన్నాను! 

 

పాతికేళ్ళ తరువాత కూడా మళ్ళీ కన్ ఫ్యూజనే మా వారికి!!