నాతిచరామి - శ్రీమతి దినవహి సత్యవతి

always with you

దుబాయ్ నుంచి భారతదేశం వచ్చిన విమానంలో చెన్నైలో దిగి, కరోనా నేపథ్యంలో విమానాశ్రయంలో రకరకాల పరీక్షలూ అయ్యాక గండం గడిచిందనుకుని బయటపడ్డాడు గోపాలం.  

భార్యకి ఒంట్లో బాగాలేదని కబురు తెలిసి హుటాహుటిన బయలుదేరి చెన్నై వచ్చిన గోపాలం  అక్కడినుంచి గుంటూరు దగ్గరున్న పెదకాకాని వెళ్ళాలి. గుంటూరు వెళ్ళడానికి సాయంత్రం హైదరాబాద్  ఎక్స్ ప్రెస్ (చెన్నై నుంచి గుంటూరు మీదుగా హైదరాబాదు వెళ్ళే రైలు ) ఉంది సెంట్రల్ నుంచి. క్యాబ్ లో వెళ్తే ఏ.సి. చల్లదనానికి జలుబు చేస్తుందేమోనని జంకి  విమానాశ్రయం వెలుపలికి వచ్చి చెన్నై సెంట్రల్ కి ఆటో మాట్లాడుకున్నాడు.

ఆటో ఎక్కుతూ డ్రైవర్ ముక్కుకి రుమాలు కట్టుకుని ఉండడం చూసి తానూ  బ్యాగులోంచి మాస్క్ తీసి పెట్టుకున్నాడు. దుబాయ్ లో ఉన్న కొడుకు కిరణ్ కి  ఫోన్ చేసి తన క్షేమ సమచారాలు తెలిపి పెదకాకాని  చేరుకున్నాక   మళ్ళీ చేస్తానని చెప్పి పెట్టేసాడు.

‘ఎంగింద వరె సామీ’ అడిగాడు ఆటో డ్రైవర్ కి తమిళం తెలుగు కలగలిపి

‘ఓ నీకు తెలుగు వచ్చునా?’ అన్నాడు గోపాలం.

‘ఆ కొంజం కొంజం పురియుం (తెలుసును)’ అన్నాడు

‘దుబాయ్ నుంచి వచ్చాను’  

‘ఇంద కరోనాలో ఎప్పుడీ వచ్చావు సామీ’ అన్నాడు మళ్ళీ

‘నా భార్యకి ఒళ్ళు బాగాలేదు’ బదులిచ్చాడు  

‘అయ్యో అప్పుడియా పావం’ అని ఊరుకుని  స్టేషన్ లో దింపాక  ‘భద్రం  సామీ’ అని వెళ్ళిపోయాడు డ్రైవర్.

కరోనా నేపథ్యంలో  స్టేషన్  లో కూడా థర్మల్ స్క్రీనింగ్  చేసి లోపలికి వదిలారు. బ్రతుకు జీవుడా అనుకుని కరెంట్ రిజర్వేషన్ లో టిక్కెట్టు కొనుక్కుని రైలెక్కి కూర్చున్నాడు. కరోనా భయం వల్ల రైల్లో కూడా ఎక్కువ జనాలు లేరు. ఉన్న కొద్దిమందీ ముఖానికి మాస్కులు పెట్టుకుని ఒకరినొకరు తాకకుండా దూరదూరంగా కూర్చోవడం గమనించి ‘హతవిధీ ఎటువంటి రోజులు వచ్చాయి’  అనుకున్నాడు బాధగా గోపాలం.  

రాత్రి సుమారు పావు తక్కువ ఒంటిగంటకి రైలు గుంటూరు చేరింది. అక్కడనుంచి  పెదకాకానికి బస్సులో వెళ్ళాలి కానైతే ఆ సమయంలో బస్సులేమీ ఉండవు. ఏదైనా దూరప్రాంతం నుంచి వచ్చి పెదకాకాని మీదుగా విజయవాడ వెళ్లే బస్సులు కొన్ని అప్పుడప్పుడూ ఉంటాయి కానీ ఈ కరోనా వల్ల చాలా బస్సులు రద్దు చేసారని ఎవరో చెప్పగా తెలిసింది గోపాలానికి.   

అయితే గుంటూరునుంచే బయలుదేరే బస్సులు మళ్ళీ ఉదయం సుమారు నాలుగున్నరనుంచీ మొదలవుతాయని తెలుసు కనుక  ప్లాట్ఫార్మ్ పైనే వైటింగ్ హాల్ కి వెళ్ళి జోగుతూ  ఎందుకైనా మంచిదని నాలుగింటికి అలారం పెట్టాడు. అలారం శబ్దానికి లేచి స్టేషన్ బయటకి వచ్చి  ఆటో ఎక్కి బస్టాండ్ కి  పోనిమ్మన్నాడు.

‘బాబయ్యా  ఏడనుంచి వస్తన్నావు  ఏ ఊరెళ్ళాల?’ అడిగాడు ఆటో అతను. చూడానికి సుమారు అరవైఏళ్ళ వయసున్నవాడిలా అనిపిస్తున్న  అతని పిలుపులోని అప్యాయతకి సంతోషించాడు గోపాలం.

‘ఈ పిలుపులూ ఆప్యాయతలూ మనవాళ్ళకే తగును’ అనుకుని  ‘దుబాయ్ నుంచి వస్తున్నాను పెదకాకాని వెళ్ళాలి బాబాయ్’ అన్నాడు తానూ అదే మార్దవం స్వరంలో ఒలికిస్తూ

‘ఓ పక్క కరోనా తో జనాలంతా భయపడతా ఉంటే నువ్వేందయ్యా ఊళ్ళు తిరగతన్నావు?’

‘అత్యవసరమైన పనిపడింది అందుకని రాక తప్పలేదు. నాసంగతటుంచి నీ మాటేమిటీ? ఈ వయసులో ఇంత ఉదయాన్నే ఆటో తిప్పుతున్నావు నీకు కరోనాతో  భయమనిపించడం లేదా’ అడిగాడు .

‘అవును బాబయ్య నువ్వు చెప్పేది నిజమే కానీ భయపడి ఇంట్లో కూకుంటే తిండెలాగ? నా కొడుకొక్కడూ ఎంతకని కష్టపడతాడు? అక్కడికీ అయ్యా పెద్దోళ్ళకి గమ్మున అంటుకుంటాదంట వెళ్ళొద్దన్నాడు పిచ్చితండ్రి ఆడికి నేనంటే వల్లమాలిన ప్రేమ. ఏం భయంనేదురా అని నేనే ఇలాగొచ్చాను బాబయ్యా. ఎన్నాళ్ళు  బతికితే అన్నాళ్ళు కలిసి కష్టం సుఖం పంచుకోవాలి కదా బాబయ్యా’ వేదాంత ధోరణిలో చెప్పాడు

‘తప్పనిసరిగా వచ్చావు సరే మరి ముక్కుకి మాస్క్ ఇదిగో నాలాగ పెట్టుకోక పోయావా? అన్నాడు.

‘కొందామని చూసా కానీ అది మాలాంటి పేదోళ్ళకి అందుబాటులో లేదు బాబయ్యా’ అన్నాడు దిగులుగా.

‘హూ...’ అని దీర్ఘంగా నిట్టూర్చి అటో దిగేటప్పుడు ‘ఇది పెట్టుకో’ అంటూ  తన వద్ద ఉన్న మరొక  మాస్క్ తీసిచ్చాడు. అలాగే బాడుగతో పాటు మరో రెండొందలు చేతిలో పెట్టాడు ఉంచుకో అని.

ఆ మాత్రానికే పొంగిపోయి ‘సల్లగా ఉండండి బాబూ’ అని మనసారా దీవించాడు ఆటో బాబాయ్.  

ప్లాట్ఫార్మ్ మీద కదలడానికి సిధ్ధంగా  ఉన్న బస్సెక్కి పెదకాకానికి టక్కెట్టు కొని సీటులో కూలబడి ‘లక్ష్మి ఎలా ఉందో?  ఆఖరి చూపైనా దక్కుతుందో లేదో’ అనుకున్నాడు బాధగా. ఈ ప్రయాణానికి ముందు కొడుకు కిరణ్ తో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది...

‘ఎందుకు నాన్నా ఎప్పుడో మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన ఆవిడ అంటే మీకు అంత తాపత్రయం?’ కసిగా అన్నాడు.    కిరణ్ కి పీకలదాక కోపం తల్లి వాడిని చిన్నతనానే వదిలి వెళ్ళి  తల్లి ప్రేమ లేకుండా చేసిందని.

మాది ప్రేమ వివాహం. మా  పెళ్ళైన రెండేళ్ళకి కిరణ్ పుట్టాడు. ముచ్చటైన సంసారం. కిరణ్ నాలుగో తరగతికి వచ్చాడు. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో లక్ష్మిలో ఏదో తెలియని అసంతృప్తి మొదలైంది. లక్ష్మి ధనవంతుల అమ్మాయి. మధ్యతరగతి కుంటుంబానికి చెందినవాడినని తెలిసే నన్ను ఇష్టపడి చేసుకున్నా కాలక్రమేణా బీదరికం ఆమెను బాధించసాగింది. దాంతో చీటికి మాటికీ విసుక్కోవడం, నా పేదరికాన్ని వేలెత్తిచూపడం, నేను ప్రతిక్రియ చూపకపోవడంతో ఆ అసహనమంతా కిరణ్ పై చూపించడం మొదలుపెట్టింది. తాను చాలా ప్రయత్నించాడు పరిస్థితుల్ని చక్కబెడదామని. కానీ గొప్ప జీవితానికి అలవాటుపడిన లక్ష్మి ఎంతోకాలం ఇమడలేకపోయింది. ఒకరోజు చెప్పాపెట్టకుండా  మమ్మల్ని వదిలేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత తల్లిదండ్రులూ వత్తాసు పలకడంతో లేనిపోని కారణాలు పుట్టించి  నానుంచి విడాకులు తీసుకుంది లక్ష్మి. కనీసం కిరణ్ గురించైనా నిర్ణయం మార్చుకోమని ఎంతో చెప్పజూసాడు  కానీ లాభం లేకపోయింది. అప్పటికే ఊహ తెలిసి పరిస్థితులు అర్థం  చేసుకునే వయసుకొచ్చిన కిరణ్ మనసుని తల్లి ప్రవర్తన బాగా దెబ్బతీసింది. నాటినుండీ తల్లిపట్ల  ఏహ్య భావాన్ని పెంచుకున్నాడు. తల్లి మాటెత్తితే చాలు కోపంతో ఊగిపోతాడు.  

లక్ష్మి తమని వదిలి వెళ్ళిపోయినా తాను మాత్రం ఆమెను మర్చిపోలేకపోయాడు. ఇంక భారతదేశంలో ఉండలేక వేరే ఉద్యోగం చూసుకుని దుబాయ్ వచ్చి స్థిరపడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని  సంవత్సరాల తరువాత ఈ కబురు ఆ వైపునుంచి అదీ బాబాయ్ ద్వారా .

‘అలా అనకురా అబ్బాయ్ నువ్వెంతకాదన్నా, కాదనుకున్నా  ఆవిడ నీ కన్నతల్లి. ఇంక నా సంగతంటావా మీ అమ్మ  నన్ను కాదనుకుంది  కానీ నేనెప్పుడూ అనుకోలేదురా. నాతిచరామి అని ప్రమాణాలు చేసి అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచాను మీ అమ్మతో. నా ఊపిరి ఉన్నంతవరకూ మీ అమ్మని కాదనుకోలేను. ఆమె పట్ల నా బాధ్యతని మర్చిపోను’ అన్నాడు తాను.  

ఎప్పుడో కాదనుకుని వెళ్ళిపోయిన తల్లి పట్ల తండ్రి అనురాగానికి చలించిపోయాడేమో మరేమీ అనకుండా  గాఢంగా  కౌగలించుకుని ‘జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్నా. అంతటా అసలే కరోనా వ్యాపించి ఉంది.  మీరు తిరిగి వచ్చేదాకా నాకు  బెంగగా ఉంటుంది. అమ్మెలాగూ నన్ను చిన్నప్పుడే వదిలేసింది. ఇంక నాకు మీరు తప్ప ఎవరున్నారు? ’ అంటూ కంటతడి పెట్టుకున్న కొడుక్కి ధైర్యం చెప్పి బయలుదేరివచ్చాడు.....

‘పెదకాకాని దిగేవాళ్ళు రావాలి’ అన్న డ్రైవర్  కేకకి ఆలోచనలలోంచి  బయటపడి బస్సు దిగి ఆటో ఎక్కి శివాలయం  వెనుక వీధికి పోనిమ్మన్నాడు. ఆటో దిగుతుండగానే ఇంటిముందు పరిస్థితి చూసి ఏం జరిగి ఉంటుందో అర్థమై మనసు పిండినట్లైంది. భార్య కడసారి చూపు దక్కలేదని విలపించాడు. కొడుకుకి ఇక్కడ జరిగినదంతా తెలిపి తాను తిరిగి రావడానికి కొన్ని రోజులవుతుందని చెప్పాడు. తదుపరి హిందూ ధర్మప్రకారం  దహనసంస్కారాలు జరిపి, సప్తపదులలో చివరి అడుగువరకూ లక్ష్మికి తోడుగా నిలచి, లక్ష్మిని పునిస్త్రీ గా  పుణ్యలోకాలకి సాగనంపి, భర్తగా  తన బాధ్యతలు నెరవేర్చాడు గోపాలం.  

                                                            ***********