పర్యావరణ పరిరక్షణలో సాహిత్య విద్యార్థుల పాత్ర - డా.రాంభట్ల వెంకటరాయ శర్మ

Literature Students Responsibility

భారతీయ చింతనలో, వాజ్మయంలో ప్రకృతికి ఆరాధనాభరితమైన స్థానం ఇవ్వబడింది. "సర్వేజనా సుఖినోభవంతు" అనడమే కాకుండా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలని అభిలషించారు. అదేవిధంగా ప్రకృతిలోని ప్రతి అణువుకు దైవత్వాన్ని ఆపాదించారు. అందుకే భూమికి శాంతి, నింగికి శాంతి, అంతరిక్షానికి శాంతి, అగ్నికి శాంతి, నీటికి శాంతి, దిక్కులకు శాంతి, ఓషధులకు శాంతి చివరకి శాంతికే శాంతి కావాలని ఋగ్వేదంలో ఆకాంక్షించారు. ఇంత భావాత్మకంగా ఉదాత్తంగా, ఉద్వేగంగా ప్రకృతిని తాత్వీకరించడం మనిషిని ప్రకృతిలో అంతర్భాగంగా చూడటం ప్రపంచ వాజ్మయంలో అరుదుగా కనిపిస్తుంది. ఈ విషయంలో పాశ్చాత్యుల కంటే మనం ఉన్నతంగా ఆలోచించినట్లు కనపడుతున్నది స్పినోజా' అనే డచ్ తత్త్వవేత్త 17 వ శతాబ్దంలో pantheism అనే భావన ద్వారా ప్రకృతిని దైవీకరించడం ప్రారంభించాడు. ప్రకృతిలో ప్రతి అంశంలో దైవాన్ని చూడటాన్ని pantheism అంటారు. అంతకు ముందు వేల సంవత్సరాల క్రితమే ప్రకృతిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా ఉంది. నేటికీ మన దేశంలో చెట్టు, పుట్ట, రాయి, పాము మొదలైన వాటిని ఆరాధించటం చూస్తున్నాం. 'విలియం వడ్స్ వర్త్' అనే ఆంగ్ల కవి 18 వ శతాబ్దంలో ప్రకృతిని apparelled cellestial light అని వర్ణించాడు మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, వాతావరణం, వివిధ రకాల మొక్కలు, రకరకాల జంతువులు వీటన్నింటిని కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చును. గాలి,నీరు, నేల,ఆహారం అవసరం. చెట్లు పక్షులు జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసినవి వాటినుండి దొరుకుతాయి. అవి క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటాం. కాగా ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రపంచంలోని ప్రతి జీవికి శక్తి సూర్యుడి నుండి లభిస్తుంది. మొక్కలు సూర్యశక్తి వలన కిరణజన్య సంయోగ క్రియవలన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. భూమిపై నివసించే రకరకాల జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. అన్ని జీవరాశులకు ప్రధాన ఆహారం మొక్కల నుండి అందుతోంది. సాహిత్యంలో కవులు చెట్లను, ప్రకృతిని వర్ణించారు. ఇక్కడ కొన్నింటిని ఉదాహరిస్తున్నాను. ముందుగా చెప్పుకున్నట్లుగా పంచభూతాత్మకమైనది పర్యావరణం. ఈ పంచభూతాలు గాలి, నీరు, నింగి నేలలకు మూర్తిమత్వం ఆపాదించినది మన పురాణ వాజ్మయం. “వాయువు" దిక్పాలకుడిగాను, వాయు పుత్రులైన హనుమను, భీమసేనుణ్ణి మహాబలవంతువులుగా ఇతిహాసాలు పేర్కొన్నాయి. నీటికి గంగగా అభివర్ణించి స్త్రీత్వాన్ని ఆపాదించి, పాపాలను పోగొట్టే సురనదిగా శివుని తలమీద ఉండే స్త్రీగా పురాణాలు తెలియజేస్తున్నాయి అగ్నికి సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా అగ్ని పేరుమీద అగ్ని పురాణం ఉంది. అగ్నిమీలే పురోహితం" అనేది ఋగ్వేదంలోని మొదటి మంత్రం. భూమిని శ్రీమహా విష్ణువు భార్యగా, మానవులకు భూమాత", సీతాదేవిని "భూజాత'గా పిలవడమే కాకుండా సహనానికి మారు పేరుగా అభివర్ణించారు. ఇక “ఆకాశం గగనం శూన్యం" అని అమరం. వరహాపురాణంలో ఆకాశానికి మూర్తిమత్వం ఆపాదించబడింది. ముద్గలపురాణంలో కూడా ఈ కథ ఉంది. వినాయక జనన వృత్తాంతంలో పార్వతీ పరమేశ్వరులు చూస్తుండంగా ఆకాశం అందమైన రూపం ధరించి ఒక బాలుడి రూపంలో నిలబడ్డాడు. ఆ ముగ్ధ మనోహర రూపానికి అందరూ మైమరచి పోయారట. ఆ బాలుడే గజవదనుడై వినాయకుడౌతాడు. సృష్టి పరిణామ క్రమంలో వానరం నుంచి పరిణతి చెందిన ఆది మానవుడు గుహలలో, చెట్టు తొర్రల్లో తలదాల్చుకునే వాడట. అంటే మానవుడు భూమి మీద జీవం పోసుకున్న మొదలు, చెట్లు జీవనాధారం మయ్యాయి. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో చెట్ల ప్రస్థావన మిక్కిలిగా కనిపిస్తోంది. భారతంలో పాండవులు, అజ్ఞాత వాసానికి వెళ్తూ, తమ ఆయుధాలను శమీ వృక్షం ( జమ్మి చెట్టు) మీద ఉంచారు. ఈ జమ్మి చెట్టును "చెట్లలో రాజు"గా పిలుస్తారు. అన్ని ఋతువులలోనూ ఈ చెట్టు ఒకేలా ఉంటుంది. గుబురుగా ఆకులు కప్పి ఉంటుంది. చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి. ఎంతటి బలమైన వర్షానైనా, గాలులైనా తట్టుకోగలదీ జమ్మి చెట్టు. సంవత్సర కాలం అజ్ఞాతవాసం కాబట్టి ఆరు ఋతువులలో ఒకేలా ఉండే జమ్మి చెట్టు ఆయుధాలకు తగినదని గుర్తించి ఆ చెట్టు మీద కట్టి పెట్టారు. దసరాగా పిలుచుకునే “విజయదశమి" నాడు “శమీ వృక్షానికి పూజ చేయడం తెలుగు నాట విశిష్టమైనది. శ్లో|| శమీ శమయతే పాపం శమీ శతృ వినాశనీ అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శనీ అనే శ్లోకం చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. రాజప్రబంధం, ప్రబంధరాజం అయిన ఆముక్తమాల్యదలో ప్రఖ్యాతమైన వటవృక్ష (మర్రిచెట్టు) వర్ణన ఇదిగో కాంచెన్వైష్ణవు డర్థయోజన జటాఘాటోత్థ శాఖోపశా ఖాంచఝ్జాట చరన్మరు ద్రయదవీఁయ ప్రేషితోద్యచ్ఛదో దంచత్కీటకృత వ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య ని స్సంచారాత్త మహాఫలోపమ ఫలస్పాయద్వటక్ష్మాజమున్. (ఆముక్తమాల్యద 6-15) మాలదాసరి చూసిన మర్రిచెట్టును ఇలా శ్రీకృష్ణదేవరాయలు వర్ణించారు. మన పండుగలలో "వట పున్నమి" నాడు మర్రిచెట్టును పూజిస్తారు. జ్యేష్ట శుద్ధ పున్నమిని “వట పున్నమి" అంటారు. సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలు కాపాడుకున్న రోజు ఈ వటపున్నమి, శ్రీమహా విష్ణువు వటపత్రశాయి అని ప్రతీతి ఇక ప్రాణవాయువును పుష్కలంగా ఇచ్చే రావి చెట్టును ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర చూస్తూనే ఉంటాం నవీనాంధ్ర సాహిత్యంలో చెట్టు కవిగా పేరు పొందిన ఇస్మాయిల్ , మృత్యువృక్షం(1976) చిలకలు వాలిన చెట్టు(1980) చెట్టునా ఆదర్శం (1982) వంటి రచనలు చేశారు నదీ తీరాలలో నాగరికత వర్ధిల్లినదనడానికి సింధు నాగరికత, నైలు నది నాగరికతలే ఉదాహరణలు నీరు జనజీవనానికి నిత్యాధారం. పురాణేతిహాసాలలో కావ్యాలలో నదుల వర్ణనలు చాలా ఉన్నాయి. హరి పాదాల నుండి గంగ ఆవిర్భవించిదని, శివుని స్వేద బిందువులే గండకీ నదిగా మారాయని కథ. గౌతముడి వలన గోదావరి పుట్టిందని స్కాందపురాణంలో కాశీఖండంలో కథనం. తుంగభద్రా నది వర్ణన పాండురంగ మాహాత్మ్యంలో ఉంది. జీవనదులు జీవనాధారం. ఇవన్నీ సాహిత్య విద్యార్థులకు కొంతవరకూ చదువుకునే అవకాశం ఉంది. అయితే ఇంతటి విశిష్టత కలిగిన పర్యావరణం, మానవ తప్పిదాల వలన కలుషితమై ప్రమాదంగా మారుతోంది. గత 200 సంవత్సరాల్లో పారిశ్రామికీకరణ వలన, జనాభా పెరుగుదల కారణంగా పర్యావరణ సమతౌల్యం భంగపడటమే కాకుండా గ్లోబల్ వార్మింగ్ పెరిగి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తోంది పర్యావరణం పరిరక్షణకు సాహిత్యవేత్తలు, సాహిత్యాన్ని అభ్యసిస్తున్న విద్యార్థుల పాత్ర కీలకమైనది *పర్యావరణ స్పృహ కలింగించే రచనలు*-- పర్యావరణాన్ని రక్షించేందుకు చేయవలసిన ముఖ్యమైన కర్తవ్యం మొక్కలను నాటడం. చెట్లు సురక్షించడం. ఇది విద్యార్థులకు అలవాటు చేయడం. కాలుష్యాన్ని తగ్గించి ఆక్సిజన్ విడుదల చేసే చెట్లను గురించి తమ రచనల ద్వారా అందరికీ తెలియజేయాలి. పాఠశాల విద్యార్థులకు చెట్ల వలన కలిగే ఉపయోగాలను విడమరచి చెప్పాలి. ఆహారం, ఇంధనం, ఔషధాలు, పారిశ్రామిక ముడి ఉత్పత్తులు మొదలైనవి సమకూర్చే చెట్ల విశిష్టతలను అందరికీ అర్థమయ్యే సామాన్య పదజాలంతో వివరించడానికి ప్రయత్నించాలి. భూగోళాన్ని హరితం” చేయడానికి ఏంచెయ్యాలో రచనలలో ఆవిష్కరించి, సమాజానికి హితవును చేకూర్చాలి. నీటి వినియోగానికి సంబంధించి, కలుషిత నీటి వలన వ్యాపించే వ్యాధులను గురించిన అవగాహనను కల్గించే విధంగా మార్పు తీసుకురావాలి. తత్సంబంధ రచనలు చేయాలి. ప్రోత్సహించాలి. పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. శరీర శుభ్రత, మరుగుదొడ్ల వాడకాన్ని ప్రోత్సహించే విధంగా చైతన్యాన్ని కలిగించాలి. విద్యార్థి దశనుండే పరిసరాల పరిశుభ్రతను అలవాటు చెయ్యాలి పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని వ్యక్తిగతంగా తగ్గించుకోవడంతో పాటు ప్లాస్టిక్ వలన జరిగే అనర్థాలను, సమాజానికి అర్థమయ్యే రీతిలో రచనల ద్వారా తెలియజేయాలి. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. రసాయన ఎరువుల వినియోగం వలన కలిగే భూ కాలుష్యాన్ని, అనర్థాలను తెలియజేయాలి. వ్యర్థ పదార్థాలను తగిన విధంగా నిర్వహించటం అలవాటు చెయ్యాలి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటం, సహజ వనరులు గాలి, నీరు, నేలను రక్షించటం, వ్యర్థ పదార్థాలను తగిన విధంగా నిర్మూలించినప్పుడే సాధ్యపడుతుంది. అందుకు తగిన విధానాన్ని రూపొందించి ఆచరణలో పెట్టాలి మన ఇంటికి దగ్గరిలో ఉన్న పాఠశాలను సందర్శించి, అక్కడి విద్యార్థుల చేత పర్యావరణ క్లబ్బులు ఏర్పాటు చేయించటం, కంపోస్ట్ ఎరువు తయారీ వంటి వాటిని ప్రోత్సహించాలి. పార్కును పెంచి మొక్కలను నాటాలి. రచయితలు ముఖ్యంగా చెయ్యవలసిన పని, కాగిత వినియోగాన్ని సరైన క్రమంలో అలవాటు చేసుకోవడం. కాగితానికి రెండు వైపులా రాయాలి. అదనంగా మార్జిన్లు, అనవసరమైన రాతలను మినహాయించాలి. కాగితం కన్నా ఇంటి దగ్గర చిత్తుపని, రివిజను మరియి ప్రాక్టీసులకు నల్లబల్ల లేక పలకను ఉపయోగించాలి. పుట్టిన రోజు ఉత్సవాలలో కాగితం ప్లేట్లను మరియి క్లప్పులను మినహాయించాలి. రీసైకిల్ కాగితం మీద ప్రింటింగ్ చేస్తే తప్ప గ్రీటింగ్ కార్డులు ఉపయోగించరాదు. ప్లాస్టిక్ సంచులు స్థానంలో ప్రత్యామ్నాయమైన గుడ్డ సంచుల వినియోగం పట్ల తమ రచనలతో అవగాహన పెంచాలి."సుందర్ లాల్ బహుగుణ" గారి "చిప్కో" ఉద్యమాన్ని, సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చిన్న చిన్న పాటల రూపంలో విద్యార్థులకు అందించాలి. చెట్లు నరకడానికి వ్యతిరేకమీ ఉద్యమం.తెలుగు సాహిత్య ప్రక్రియ ఏదైనా సరే, ప్రతి రచయిత, కవి తనవంతుగా పర్యావరణ సంబంధ రచనలు చేయడానికి అలవాటు పడాలి అలా కుదరని పక్షంలో సంవత్సరంలో ఒక్కరోజున అంటే పర్యావరణ దినోత్సవం జూన్ 5 నాడైనా పర్యావరణానికి సంబంధించిన సాహిత్యాన్ని వెలువరించేలా ఆలోచించాలి. సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని, సమాజం ఆదరిస్తుంది. తద్వారా సాహిత్య విలువలు రోజురోజుకు ద్విగుణీకృత మౌతుంటాయి.