హాస్య బ్రహ్మ జంధ్యాల. - సూర్యదేవర వేణుగోపాల్

హాస్య బ్రహ్మ జంధ్యాల.

హాస్యబ్రహ్మ జంధ్యాల......

సూర్యదేవర వేణుగోపాల్.

 

 

"నవ్వడం భోగం నవ్వించడం యోగం"

జంధ్యాల గారు తరచూ ఈ మాటను చెప్పేవారు. నవరసాలను తన సంభాషణల ద్వారా అలవోకగా పలికించినప్పటికి, హాస్య రసానికే పెద్ద పీఠ వేశారు. హాస్యం లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొత్తకొత్త హాస్య రస ప్రయోగాలు చేశారు. జంధ్యాల గారి నుండే తెలుగులో పూర్తి హాస్య చిత్రాలు పెరిగాయి.

సినిమాలలో హాస్యాన్ని సంభాషణలు, కథ ఇంకా నటుల హావభావాల ద్వారా ప్రేక్షకులకు అందించబడుతుంది. హాస్య రసానికి చెందిన కథ అయితే సినిమా మొత్తం హాస్యంగా సాగిపోతుంది. వేరే కథ అయితే సమయానుకూలంగా హాస్యాన్ని చూపిస్తారు. ప్రతి సినిమాలో హాస్యం ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుంది.

జంధ్యాల గారి కన్నా ముందు వచ్చిన సినిమాలలో కూడా మంచి హాస్యమే ఉండేది. సంభాషణలు ద్వారా, కథ ద్వారా హాస్యాన్ని అందించినవారున్నారు. పింగళి గారు, డి.వి నరసరాజు గారి లాంటి వారెందరో మంచి హాస్యాన్ని అందించారు. . పూర్వపు సినిమాలలో కథా బలం ఎక్కువ. కథకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ హాస్యాన్ని సమాయనుకూలంగా అందించారు. పూర్తి హాస్య రస చిత్రాలుఆ కాలం లో తక్కువ.

జంధ్యాల గారు హాస్యాన్ని వైవిధ్యభరితంగా చూపించారు. కథ కంటే హాస్యానికే పెద్ద పీఠ వేశారు. కథ లో పెద్దగా బలం లేకపోయినా, కథ బాగా చిన్నదే అయినా, దానికి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అద్ది చక్కగా మెరిపించారు. వారి సినిమాలకు ప్రాణం హాస్యమే. నవరసాలలో హాస్యానికే అగ్రతాంబూలం ఇచ్చింది జంధ్యాల గారే. నిజంగా ఇది తెలుగు సినీ జగత్తు లో ఒక నూతన ఒరవడే . జంధ్యాల గారి వల్లే పూర్తి హాస్య చిత్రాలు తెలుగులో రావడం ఎక్కువైంది. ఇదే జంధ్యాల గారు సృష్టించిన నూతన ఒరవడి.

మంచి హాస్య భరితమైన సినిమాలకు దర్శకత్వం వహించి వైవిధ్యమైన హాస్యాన్ని అందించారు. మంచి మంచి హాస్య నటీనటులను తెరకి పరిచయం చేశారు. (బ్రహ్మనందం గారు, వీరభద్రరావు గారు, వేలు గారు.. మొదలగువారు.. ).

వీరి దర్శకత్వం లో రూపొందిన "శ్రీవారికి ప్రేమలేఖ (1984)" రెండురెళ్ళ ఆరు (1986)""ఆహా నా పెళ్ళంట (1987)" చూపులు కలసిన శుభవేళ (1988)" "వివాహ భోజనమ్ము (1988)" "హై హై నాయకా (1989)" బావ పన్నీరు (1991)" మొదలైనవన్నీ జంధ్యాల గారి హాస్య విశ్వరూపాన్ని చూపుతాయి. ఇవన్నీ బాగా విజయవంతమైనవే. కథా బలం సామాన్యం అయినా, చక్కటి హాస్యం వల్ల ఇవన్నీ బాగా ఆడాయి.

ఈ సినిమాలలో ఎన్నో పద ప్రయోగాలు చేశారు. కొన్ని హాస్య పదాలను నూతనంగా సృష్టించారు. అంతకు ముందు "సుత్తి" అన్న పదానికి అర్దం వేరు. కానీ జంధ్యాల గారు "సుత్తి" అన్న పదానికి అర్ధాన్నే మార్చేశారు. 1988 లో వచ్చిన "నాలుగు స్థంభాలాట"  సినిమాలో ఈ మాటను వాడారు. ఇప్పుడు "సుత్తి" అనే మాట విసిగించడానికి మారు పేరుగా మారింది. ఇది జంధ్యాల గారి నూతన సృష్టి.

తిట్టడం లో అనేక భాషా ప్రయోగాలు చేశారు. వారు రాసిన తిట్లన్ని విపరీతమైన నవ్వును పుట్టించేవి. "నవరంధ్రాలలో మైనం పోస్తా (శ్రీవారికి ప్రేమలేఖ 1984)" "అశుద్ధ భక్షకా (ఆహా నా పెళ్ళంట 1987)" "పరమ బోరింగ్ ముఖం (ఆహా నా పెళ్ళంట 1987)" పింజారి వెధవా (శ్రీవారికి ప్రేమలేఖ)" "అరగుండెధవ" ఇలా ఎన్నోరకాలైన కొత్త తిట్లను తెలుగువాళ్ళకి పరిచయం చేసి హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

జంధ్యాల గారు ప్రతిభా శాలి. భాషపై పట్టు బాగా ఉండేది. ఎన్నో సినిమాలకు సంభాషణలు రాశారు. తన సంభాషణలో నవరసాలను తగు మోతాదులో కూర్చేవారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంభాషణలు అందించారు.

శంకరా భరణం(1980) సప్తపది (1981) సీతాకోకచిలుక (1981) సాగర సంగమం (1983) స్వాతి కిరణం (1992) వంటి గొప్ప చిత్రాలకు సంభాషణలు అందించి National Award పొందారు. ఇవి Sentiment సినిమాలు అయినప్పటికి కొన్ని కొన్ని సన్నివేశాలలో చక్కని హాస్యాన్ని అందించారు.

నిస్సందేహంగా జంధ్యాల గారి వల్ల తెలుగు చిత్రాల హాస్యం లో నూతన ఒరవడి మొదలైంది. అగ్రహారపు భాష, వ్యవహారికి భాష, గ్రామీణ భాషలు జంధ్యాల గారి సంభాషణలలో ఎక్కువగా ఉండేవి.

ఎన్ని సినిమాలకు సంభాషణలు రాసినా హాస్యానికి తానే మహా రాజునని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆగ్ర దర్శకులు పై జంధ్యాల గారి ముద్ర ఖచ్చితంగా ఉంది. పరిశీలించి చూస్తే ఆ విషయం బోధ పడుతుంది.

అందుకే ఆయన హాస్యానికే బ్రహ్మ అయ్యారు.

("హాస్య బ్రహ్మ" జంధ్యాల గారి బిరుదు)

 

సూర్యదేవర వేణుగోపాల్.

H. NO. 1-879

సుందరయ్యనగర్

మధిర ఖమ్మం జిల్లా తెలంగాణ

507203

venusuryadevara@gmail.com