చిలుక కినుక - చెన్నూరి సుదర్శన్

Parrot anger

ధర్మయ్య  ఈమధ్య తాను తీసిన కార్డుకు వ్యతిరేకంగా జోస్యం చెబుతుండడం  రామచిలుక గమనిస్తోంది. యధార్థాన్ని కప్పి పుచ్చుతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో రామచిలుకకు అర్థంగావడం లేదు. పాపం! పల్లెటూరి జనం ధర్మయ్య చెప్పే బూటకపు మాటలను నమ్ముతున్నారు. ఈ  పాపం నాకు గూడా చుట్టుకుంటుందా! అని  బోనులో ఉన్న రామచిలుక ఆలోచనలో పడింది.

ఇంతలో “రామ్మా.. చిలుకమ్మ.. నా బుజ్జి చిలుకమ్మ. ఒక్క సారి ఇలా వచ్చి  ఈ తాతగారి జాతకం తీయమ్మా..” అంటూ ధర్మయ్య చిటికలేస్తూ.. పిలిచే సరికి  తేరుకుని బయటకు వచ్చింది. ముందుకూర్చున్న  తాతయ్య తన పేరు సుబ్బయ్య అని చెబుతుంటే.. ఎగాదిగా చూసింది రామచిలుక. తరువాత పేకముక్కల్లా  పరచిన కార్డుముక్కల్లో నుండి ఒక కార్డును తన ముక్కుతో లేపి, ఓరకంట చూస్తూ.. బయటకు లాగి,  బోనులోకి వెళ్ళింది. ధర్మయ్య ఏంచెబుతాడోనని వినసాగింది.

“సుబ్బయ్యగారూ.. మీ జాతకం అదిరి పోయింది. ధనలక్ష్మి మీ నట్టింట్లో నాట్యమాడుతోంది.  అది మీరు గుర్తించడం లేదు. నేనొక తాయెత్తు ఇస్తాను. దాన్ని ముందుగా పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చెయ్యండి. తరువాత దానిని మేడలో వేసుకొండి. మీ ఇంట్లో బంగారు లంకె బిందెలు ఎక్కడున్నాయో! రాత్రి కలలోకి వస్తుంది. అసలే కలికాలం ఎవరినీ నమ్మొద్దు. మీరే స్వయంగా తవ్వి తీయండి. దాంతో మీ అరిష్టాలన్నీ తీరి పోతాయి. తాయెత్తు ఖరీదు వేయి రూపాయలు” అంటూ రామచిలుక తీసిన బొమ్మను చూపించాడు. అది సాక్షాత్తు లక్ష్మీదేవి ఫోటో. ఎవరికైనా ఆశ కలుగడం సహజం. తాతయ్య నీళ్ళు నములుతూ.. నావద్ద అంత పైకం లేదన్నాడు.

“దానికే భాగ్యం సుబ్బయ్యగారూ.. మీ వేలికున్న ఉంగరం ఇవ్వండి చాలు. తాయెత్తు మహిమతో పది వేళ్ళకు పది ఉంగరాలు తొడుక్కోవచ్చు” అంటూ కళ్ళెగరేశాడు ధర్మయ్య.

సుబ్బయ్య సరే అన్నట్టు ఉన్న ఒక్క ఉంగరమూ ధర్మయ్య చేతిలో పెట్టి తాయెత్తు తీసుకుని గబా, గబా ఇంటికి దారి తీశాడు.

రామచిలుక ఇది అన్యాయమంటూ అరిచింది. బోను తెరచి బయటకు పిలిచి చిన్న జామపండు ముక్క ఇచ్చాడు ధర్మయ్య. రామచిలుక తింటూ.. “ధర్మయ్యా.. నీ పేరును నువ్వే చెడగొట్టుకుంటున్నావు. ఇలా అధర్మంగా అమాయకులను మోసం చెయ్యగూడదు” అని హితవు పలికింది.

“నీకేం తెలుసే పిచ్చిదానా! దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ మీసం మెలేశాడు ధర్మయ్య.

“నీ పేదరికం చూసి జాలి పడ్డాను. మా వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. నీ చేతిలో బోను చూసి.. నాజోస్యం చెప్పుకుంటూ బతుకుతావనుకున్నాను. ఆరోజు కావాలనే జామతోటలో నీ చేతికి చిక్కాను.. కాని వాళ్ళమాటే నిజమయ్యింది. ఇలా అన్యాయపు బతుకు వద్దు .. బాగుపడవు” అంటూ శపిస్తున్నట్లుగా.. కోపంతో తుర్రున ఎగిరి పోయింది రామచిలుక. ఊహించని పరిణామానికి కొయ్యబారిపోయాడు ధర్మయ్య.

“తాతయ్యా.. తాతయ్యా..” అని రామచిలుక పిలుచుకుంటూ వెళ్లి సుబ్బయ్య భుజంపై వాలింది. రామచిలుక మాట్లాడుతూండడం.. నిర్భయంగా తన భుజంమ్మీద వాలడం ఆశ్చర్యపోయాడు సుబ్బయ్య.

“బలే ముద్దొస్తున్నావు.. ఇప్పుడు నా జాతకం తీసిన చిలుకవేనా.. నీకు మాటలు గూడా వస్తున్నాయే..” అంటూ ముద్దు, ముద్దుగా అన్నాడు సుబ్బయ్య.

“అవును తాతయ్యా. మీరు చిలుకజోస్యం పేరుతో మోసపోతున్నారు” అనే సరికి సుబ్బయ్య ఎలా అన్నట్టు అరచేతిని తిప్పాడు. అదే అరచేతి మీద కూర్చుంటూ రామచిలుక అసలు విషయం చెప్పసాగింది.

“చూడు సుబ్బయ్యా.. చిలుకజోస్యంలో చిలుక తప్పేమీ ఉండదు. కిటుకంతా  జోస్యం చెప్పేవాని మీద, వాని దగ్గర ఉన్న కార్డు ముక్కల మీద ఆధారపడి ఉంటుంది. అందులో కూడా చిన్న, చిన్న తేడాలుంటాయి. నేను తీసిన లక్ష్మీదేవి బొమ్మ కింద మూలకు చిన్న తేలుబొమ్మ ఉంది. అలా ఉంటే నీ డబ్బు, నగలు దొంగిలించ బడుతాయని అర్థం. కాని అది కనబడకుండా జాగ్రత్త పడుతూ నీకు ధనయోగ మున్నట్టు చెప్పాడు ధర్మయ్య.  ధనయోగముండాలంటే లక్ష్మీదేవి బొమ్మలో మూలకు కలశం ఉండాలి. నీ వేలి ఉంగరం కొట్టేశాడు అంటే నేను తీసిన కార్డు ఫలితమే కదా..! బాగా ఆలోచించు”

సుబ్బయ్య దీర్ఘాలోచనలో పడ్డాడు.

“నలుగురిని తీసుకు వెళ్ళి వానికి తగిన బుద్ధి చెప్పుతావో! లేక మూర్ఖంగా జోస్యాన్ని నమ్మి ఇంటికి వెళ్తావో! నీఇష్టం” అంటూ ఎగిరి పోయింది రామచిలుక.

చిలుక జ్యోస్యం చెప్పేవాని భరతం పట్టాలని వెంటనే వెనుదిరిగాడు సుబ్బయ్య. * 

మరిన్ని వ్యాసాలు

నాన్న కి ప్రేమతో...
నాన్న కి ప్రేమతో...
- ఉషాభగావతి పేరి
కట్టమంచి రామలింగారెడ్డి.
కట్టమంచి రామలింగారెడ్డి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్.
పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పాలగుమ్మి పద్మరాజు.
పాలగుమ్మి పద్మరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
హరికథా చక్రవర్తి ఆదిభట్ల నారాయణదాసు.
హరికథా చక్రవర్తి ఆదిభట్ల నారాయణదాసు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.