స్త్రీల సున్నిత సమస్యలను బహిర్గతం చేసిన ‘నేను కనిపించే పదం’ - అఖిలాశ

స్త్రీల సున్నిత సమస్యలను బహిర్గతం చేసిన ‘నేను కనిపించే

భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీలు సమాజంలో మోసగింపబడుతున్నారు. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ ఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీలను నీచంగా చిత్రీకరించారు. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీలను ఒక ఆట బొమ్మగా, సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీలకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది. స్త్రీవాద సాహిత్యంపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. స్త్రీవాదం నిలబడదని, వారు రాసే సాహిత్యంలో వాస్తవాలు లేవని, ఊసుపోక రాసుకునే సాహిత్యమని ఇలా కుహన మేధావులు రకరకాలుగా విమర్శ చేశారు. కాని స్త్రీలు స్త్రీవాద సాహిత్యాన్ని వారి భుజాలపై మోశారు. వారికి చాలామంది పురుష సాహిత్యవేత్తల మద్దతు కూడా లభించింది. స్త్రీలు పడుతున్న అనేక సమస్యలను స్త్రీవాద సాహిత్యం బహిర్గతం చేసింది. ఇంకా చేస్తూనే ఉన్నది.

కల్పనా రెంటాల గారు 2001లో “నేను కనిపించే పదం” శీర్షికతో కవితా సంపుటిని తెలుగు సాహిత్యలోకానికి అందించారు.75 పుటలు ఉన్న పుస్తకంలో 31 కవితలు ఉన్నాయి. పిల్లలకు బాల్యం అందమైనదై ఉండాలి. కాని అందరి బాల్యం అందంగా, ఆహ్లాదకరంగా ఉండదు. కొందరికి బాల్యం పుష్పగుచ్చం మరి కొందరికి రేగికంప. ముఖ్యంగా ఆడపిల్లల బాల్యం స్వేచ్ఛలేనిది. ఇప్పుడైతే చిన్నపిల్లలను బయటకి వదలాలంటేనే భయంగా ఉంటుంది. పసిపిల్లలపై కూడా అత్యాచారాలు జరగడం మానవత్వ పతనానికి ముఖ్య కారణం.  

“అందమైన బాల్యం

నాకెప్పుడూ అందని చందమామే”

ఇక్కడ “నా” అనే పదం స్త్రీ జాతికి ఐకాన్ లాంటిది. మగపిల్లలతో పోల్చుకుంటే ఆడపిల్లల బాల్యం సరిగా ఉండదు. అభద్రత, భయం, వివక్ష, అణచివేత, ఇంట్లో వారి నియంత్రణ, బయట నుండి హేళన మాటలు, వెక్కిరిచూపులు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంటూ జీవితాన్ని నెట్టుకురావడం కత్తి మీద సాము లాంటిదే.

“నా లోకానికి ఎల్లలేమిటని నువ్వు అడిగినప్పుడు

నాకు గోడలు తప్ప ఇంకేమీ కనిపించలేదు”

పై వాక్యం పురుష ఆధిపత్యానికి చెంపపెట్టు లాంటిదే. దీనికి పురుష ప్రపంచం జవాబు చెప్పాల్సి ఉన్నది. అయితే పురుష జాతిని మొత్తం నిందించాల్సిన అవసరం లేదు కాని ఎక్కువగా పురుష ఆధిపత్యం వల్లే స్త్రీలు సమస్యలు ఎదుర్కున్నారు ఇంకా ఎదుర్కుంటున్నారు కూడా…, పరదా చాటున, నాలుగు గోడల నడుమ, వంటింటికే పరిమితం చేసి వారి రెక్కలను విరిచేసి స్వేచ్ఛగా ఎగరకుండా చేశారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే ఇప్పుడు స్త్రీలు సంఘటితం అవుతున్నారు. సమస్యలపై పోరాడుతున్నారు, హక్కులకోసం నినదిస్తున్నారు, స్త్రీజాతిని మేలుకొలుపుతున్నారు. ఇది ఇంకా జరగాలి. అప్పుడే ఆధునిక స్త్రీలు ముందుకు వెళ్ళగలరు.

“నీ దేహకాంక్ష చల్లారాక

నువ్వు పడుకున్నదీ ఒక స్త్రీ పక్కనో, స్మశానంలోనో,

పేడ కుప్ప దగ్గరో…”

అనేకమంది స్త్రీలు తమ భర్తలతో లైంగిక పరమైన సమస్యలు ఎదుర్కుంటూనే ఉన్నారు. పడక గదిలో స్త్రీలను ఒక వస్తువుగా భావిస్తూ రాక్షసంగా ప్రవర్తించడం, సిగరెట్లతో కాల్చడం, గాయాలు చేయడం, శృంగారం పేరుతో దారుణంగా హింసించడం లాంటివి అనేకం జరుగుతూనే ఉన్నాయి. కాని చాలామంది స్త్రీలు పడకగదిలో వారు అనుభవించే దుఃఖాన్ని, బాధలను బహిర్గతం చేయరు. బయటకి చెప్పుకొని వారి సమస్యను పరిష్కరించుకోరు ఇదే అదునుగా తీసుకొని కొంతమంది పురుషులు రెచ్చిపోతూ ఉంటారు. మరికొంతమంది స్త్రీల సమస్యలు ఏమిటంటే భర్త తనకు కావాల్సిన సుఖాన్ని పొంది, ఆ తర్వాత స్త్రీని పట్టించుకోడు, స్త్రీని ప్రేమగా కాకుండా రాక్షసంగా అనుభవించడం, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనకు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అనే ఆలోచనలతో ఉంటాడు. స్త్రీలు తమ సమస్యలను బయటపెట్టాలి. వారి సమస్యలపై వారే పోరాటం చేయాలి.

Iam@ అనే శీర్షికతో రాసిన కవితలో ఆధునిక మహిళలు సామాజిక మాధ్యమాల నుండి ఎదుర్కుంటున్న సమస్యలను, వేధింపులను బహిర్గతం చేశారు. కల్పానా గారు స్త్రీలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. కల్పనా గారు భావవాద కవయిత్రి, భావవాద కవయిత్రులు దేవుడు, దెయ్యం, ఆత్మ, పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం లాంటివి నమ్ముతారు వాటినే ప్రమోట్ చేస్తారు. అయితే ఈ పుస్తకం 2001లో వచ్చింది కనుక ఇప్పుడు వారి ఆలోచనలు మారి ఉండవచ్చు. భావవాది నుండి భౌతికవాదులుగా, అభ్యుదయవాదులుగా మారుతారు. అయితే ఈ పుస్తకంలోని వాక్యాలను పరిశీలించినప్పుడు వారు భావవాది కవయిత్రి అని చెప్పవచ్చు.

“అయిదు గోడల గది

లోపల ఆత్మల అజ్ఞాతవాసం” (పుట 10)

“అహంకారంతో ఉబ్బిన ఆత్మలే” (పుట 13)

“ఆమె ఒక మజిలీ కాదు

ఆ ఏకాంతపు ఆత్మ అనవరతం”(పుట 30)

“మరో దేహంలోకి ప్రవేశించడం అంటే

మరో జన్మ ఎత్తడమే” (పుట 35)

పై వాక్యాలు చేసిన ఏ సాహిత్యవేత్త అయినా భావవాదులే అవుతారు. కనుక అప్పటికీ కల్పనా గారు కూడా అచ్చమైన భావవాద కవయిత్రే అవుతారు. ఇప్పుడు వారు మారి ఉంటే పర్వాలేదు కాని లేదంటే మారాల్సిన అవసరం అయితే ఉన్నది.

జిహాద్ అనగా ఆశయసాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం, పోరాడటం. దీన్ని కొంతవరకు స్ట్రగుల్ అనే ఆంగ్ల పదంతో పోల్చవచ్చు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే నిరంతరం ఆశయాన్నే దృష్టిలో పెట్టుకొని దాని కోసం పధకాలు రూపొందిచడం, వాక్కు, వ్రాతల ద్వారా ప్రచారం చేయడం, అందుబాటులో ఉండే వనరులన్నీ వినియోగించుకోవడం, అనివార్యమైతే ఆయుధం చేపట్టి పోరాడటం, అవసరమైతే ఆ మార్గంలో ప్రాణాలు సైతం ధారబోయడం - ఇవన్నీ జిహాద్ క్రిందికే వస్తాయి. దైవ ప్రసన్నత పొందే సత్సంకల్పంతో ధర్మ పరిరక్షణ కోసం హింసా దౌర్జన్యాలను అరికట్టేందుకు చేసే ఇలాంటి పోరాటాన్ని 'జిహాద్ ఫీ సబిలిల్లాహ్' (దైవమార్గంలో పోరాటం) అంటారు. అయితే జిహాద్ పేరుతో మనుషులను చంపడం జరుగుతోంది. మనుషులను చంపడాన్ని, యుద్ధాన్ని ఏ అభ్యుదయ సాహిత్యవేత్త ఆహ్వానించరు, ఆహ్వానించకూడదు కూడా.

“స్త్రీలను బొమ్మలు చేసి

ఆడుకుంటున్న తాలిబాన్ ముష్కరులపై

ఇక జిహాద్ ప్రకటిద్దాం రండి”

అని కల్పనా గారు పిలుపునిచ్చారు. చంపడం, హత్యలు చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం అవ్వడం జరగదు. ఇక కవయిత్రి గారిది న్యాయమైన కోపమే కాని నిరసన వ్యక్తపరిచేటప్పుడు ఏ సాహిత్యవేత్త అయినా హద్దులు దాటకూడదు. జిహాద్ పేరుతో ముష్కరులు మహిళలను వేధించడం, అమాయకులను చంపడం జరుగుతుంటే మనం కూడా అదే చేద్దామని చెప్పడం సరైన పరిష్కారం కాదు. తప్పు చేసిన వారిని శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉన్నది. అందులో కూడా తప్పులు జరుగుతుంటే లేవనేత్తాల్సిన అవసరం సాహిత్యవేత్తల బాధ్యత.

తీసుకున్న వస్తువును కవిత్వంలో చేయడంలో కల్పన గారు సఫలీకృతం అయ్యారు. అయితే అక్కడక్కడ భావవాద ఛాయలు ఉండటం పంటి కింద రాయిలా అనిపిస్తుంది. కల్పనా గారి  పేరులోనే కల్పన ఉన్నది కాని వారి కవిత్వంలో లేదు. వారి కవిత్వం నిండా వాస్తవికత ఉట్టి పడుతోంది. సున్నిత అంశాలను కూడా కవిత్వం చేసే సామర్థ్యం వారిలో పుష్కలంగా ఉంది. శిల్పం విషయంలో సాధారణమైన రీడర్ కి కూడా అర్థమయ్యేలా కవిత్వాన్ని అందించారు. వారు ఉపయోగించిన ఉపమలు, ప్రతీకలు, సిమిలీలు, మెటాఫర్ కవిత్వ వస్తువులను దాటి వెళ్ళలేదు. పదబంధాలు, వాక్య నిర్మాణం లాంటి ఫండమెంటల్ విషయాలు వారికి చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకున్న వస్తువు తాలుకు సమగ్ర సమాచారం వారి దగ్గర ఉన్నది. సమస్య తాలుకు మూలాలు తెలుసుకునే కవిత్వాన్ని రాశారు. అయితే ఎక్కువగా సమస్యలను మన ముందు ఉంచారు కాని వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వాటి పరిష్కార మార్గాలు చెప్పలేదు. అది కాస్త లోతుగా అనిపిస్తుంది.

స్త్రీల సున్నిత సమస్యలను సైతం బహిర్గతం చేసి చాలామంది ఆదర్శంగా నిలిచినా కల్పనా రెంటాల గారెకి అభినందనలు.