పుస్తకాలు-రచయితలు-పత్రికలు-ప్రభుత్వం - అఖిలాశ

పుస్తకాలు-రచయితలు-పత్రికలు-ప్రభుత్వం

ఇప్పుడున్న సమాజం కంటే మరింత మంచి సమాజాన్ని కలకనే వారే రచయితలు. ఆ కలను నిజం చేయడానికి నిరంతరం సమాజం కోసం ఆలోచిస్తూ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా తమ కలాల గొంతులతో నినదిస్తారు. అన్యాయాలు, దోపిడీలు, అక్రమాలు, వివక్ష, అంటరానితనం, మహిళల సమస్యలు, కుటుంబ విలువలు, అనుబంధాలు ఒక్కటేమిటి అపరిమితంగా స్పందించి.., సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించేవారే రచయితలు. ప్రభుత్వాలను ప్రశ్నించి, నిరసనలు వ్యక్తపరిచి, పోరాటాలు చేసి హతమైన రచయితలు ఎందరో ఉన్నారు. అసలు రచయిత అనే వారే సమాజంలో లేకపోయి ఉంటే ఎన్నో తప్పులు బయటపడేవి కాదు. చరిత్రను ఉన్నది ఉన్నట్లు రాసేవారు కాదు. ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై, అనేక విషయాలపై రచయితలు ప్రజలను ఎంతగానో చైతన్యపరుస్తున్నారు. తిండి, నిద్ర, వ్యక్తిగత పనులు మానుకొని మరి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. వాస్తవానికి దేశం కోసం సరిహద్దులో పోరాడే సైనికుడు, దేశంలో ఉంటూ సమాజాన్ని కాపాడే రచయిత ఇద్దరూ ఒక్కటే. ఇద్దరి కల తమ దేశాన్ని రక్షించుకోవాలనే. దేశం బాగుపడాలంటే అటు సరిహద్దులలో శత్రువులతో పోరాడటం మాత్రమే కాదు సమాజంలో చెడిపోతున్న వ్యవస్థలపై, వ్యక్తులపై కూడా అలుపెరగని పోరాటం చేయాలి. అదే రచయితలు చేస్తున్నది.

ఒక్కప్పుడూ రచయితలు అంటే అమితమైన అభిమానం ఉండేది. అత్యంత గౌరవం చూపేవారు. రచయితలను అరుదైన వ్యక్తులుగా భావించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. రచయితలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. మొదటగా రచయితలు వారు రాసిన సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలనుకుంటారు. దానికోసం అనేక పత్రికలకు వారి రచనలను పంపుతారు. ఇప్పుడంటే సాంకేతికత పెరిగింది కనుక మెయిల్ చేస్తున్నారు కాని ఒక్కప్పుడూ రచన రాయడం ఒకెత్తు అయితే రాసిన రచనను పోస్ట్ లో పంపాలి. దానికి అయ్యే ఖర్చు భరించాలి. ఒకవేళ రచన ప్రచురణ కాకపోతే కాలేదని ఒక బాధ మరియు డబ్బు వృధా. అయితే అప్పుడు రచన ప్రచురణ అయితే రచయితకు గౌరవ వేతనంగా కాస్తో కూస్తో డబ్బులు అందేవి. మన పూర్వ రచయితలు కొందరూ ఆ డబ్బుతోనే వారి జీవితాలను గడిపే వారు కూడా. ఇప్పుడు ఏదైనా పత్రికలో రచన ప్రచురణ అయినా కూడా చాలా పత్రికలు గౌరవ పారితోషికం ఇవ్వడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి పత్రికలు తప్ప చాలా వరకు ఏ పత్రిక డబ్బు ఇవ్వడం లేదు. దినపత్రికల తర్వాత రచయితలు ఎక్కువగా మాస పత్రికలు మరియు ఇప్పుడైతే అంతర్జాల పత్రికలకు వారి రచనలు పంపుతున్నారు. ఇక్కడ అందరినీ నిందించడం లేదు కాని మాస పత్రికల్లో లేదా కొన్ని అంతర్జాల పత్రికల్లో రచన ప్రచురణ అవ్వాలంటే చందా కట్టాల్సిందే. చందా కడితేనే రచన ప్రచురణ అవుతుంది. పాపం చాలామంది రచయితలు చందాలు కట్టి మరి వారి రచనలను అచ్చులో చూసుకుంటున్నారు. అయితే చాలా మాసపత్రికలకు వ్యూయర్ షిప్ ఉండదు. సాహిత్య మాసపత్రికలు రచయితలు తప్ప మరెవరూ చదవడం లేదు. డబ్బులు చెల్లించి రచన ముద్రణ అయినా తర్వాత కూడా సదరు పేపర్ కటింగ్ ని అనేక సామాజిక మాధ్యమాల ద్వారా రచయితే స్వయంగా ప్రమోట్ చేసుకోవాలి.

 ఈ మధ్య ఒక అంతర్జాల వార పత్రిక వారు రచయితల రచనలు ప్రచురించి రచన చదవడానికి చందా కట్టాల్సిందే అన్నారు. అంటే రచయిత రాసిన రచన రచయితే డబ్బు కట్టి చదవాల్సిన దుస్థితి. చందాలు తీసుకోవాల్సింది రచయితల దగ్గర కాదు రీడర్స్ దగ్గర. సదరు పత్రికలకు రీడర్స్ ఉండరు. రచయితలే రీడర్స్. వారే రాయాలి, వారే చదువుకోవాలి. రీడర్స్ లేని పత్రికలు, పత్రికలు నడపలేనివారు నడపకండి. ఎవరు మిమ్మల్ని పత్రికలను నడపమంటున్నారు? ఇక్కడో మరో విషయం చెప్పాలి పత్రికలు నడిపి వారేదో డబ్బును దండుకుంటున్నారు అనడం లేదు. కొంతమంది పత్రికల వారు సాహిత్యం, భాషపై అమితమైన ప్రేమతో, అభిమానంతో పత్రికలను నడుపుతున్నారు. అయితే వారు రచయితల దగ్గర డబ్బు తీసుకోకుండా ఇతరత్రా ఆదాయ మార్గాలతో పత్రికలను నడుపుతున్నారు. దయచేసి పత్రికల వారు చందాల రూపంలో రచయితల దగ్గర డబ్బులు తీసుకోవద్దు. రచయితలకు సాహిత్యం నుండి వస్తున్నది ఏమీ లేదు.

రాసిన సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి రచయిత పడే కష్టం వర్ణనాతీతం. ప్రూఫ్ రీడ్ దగ్గర నుండి ప్రింట్ అయ్యే వరకు సకలం రచయితే చేసుకోవాలి. మొదట సాహిత్యాన్ని డి.టి.పి చేసుకోవాలి. చాలావరకు ఒక పేజికి ముప్పై నుండి నలభై రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇది అన్యాయం. కేవలం వర్డ్ ఫైల్ లో ఉన్న యూనికోడ్ టెక్స్ట్ ని లేఔట్ చేయడానికి ఇంత డబ్బు దండుకోవడం దారుణమనే చెప్పాలి. మళ్ళీ కవర్ పేజి కోసం ఆర్ట్ వేయించాలి అంటే దానికో ఐదు వేల రూపాయలు ఖర్చు. వంద పేజీల పుస్తకం ఐదు వందల కాపీలు ప్రింట్ చేయాలంటే ముప్పై నుండి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసుకోవాలి. ఆ డబ్బు వెనక్కు వస్తుందా అంటే అదీ లేదు. ఇది సొంతంగా చేసుకుంటే.., అదే పబ్లిషర్ ద్వారా అయితే ఇవన్నీ చేసినందుకు వారు కూడా ఒక ఐదు వేల రూపాయలు తీసుకుంటారు. కొంతమంది పబ్లిషర్స్ రచయితల రక్తాన్ని తాగేస్తున్నారు అనుకోండి. వారి పేర్లను చెప్పలేను కాని మంచితనపు ముసుగులో దోచుకోవడం పరిపాటి అయిపోయింది. ప్రచురణ అయినా తర్వాత పుస్తకాన్ని ఉచితంగా పంచి పెట్టుకోవాల్సిన దారుణమైన స్థితిలో రచయితలు ఉన్నారు. అలా పంచి పెట్టిన కూడా పుస్తకాన్ని ఎవరూ చదవడం లేదు. డబ్బు వృధా, కనీసం తమ సాహిత్యం ఎవరైనా చదువుతున్నారు అంటే అదీ లేదు.

ఇక్కడ ఎవరూ కోట్లు సంపాదించడం లేదు కాకపోతే రచయితలే అత్యంత నష్టపోతున్నారు. ప్రభుత్వాలు రచయితలకు సరైన విధంగా గౌరవించాలి. చాలామంది పేద రచయితలకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. అలాంటి వారిని ప్రభుత్వాలు గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరూ చేయాలి. ప్రతి జిల్లా వ్యాప్తంగా రచయితలను గుర్తించి ఒక లిస్టు తయారు చేసి రచయితలకు ఇల్లు, కనీస అవసరాలు తీర్చాలి. ప్రభుత్వాలకు ప్రతిపక్షంగా ఉండేవారు రచయితలే కావచ్చు కాని సమాజం కోసం పాటుపడే వారిని విస్మరించడం సరైన పద్ధతి కాదు. పుస్తకాలు ముద్రణ వేసుకోవడానికి ప్రతి సంవత్సరం డబ్బులు మంజూరూ చేయాలి లేదా ప్రభుత్వమే పుస్తకాలను ప్రచురించాలి. రచయితలు ముద్రించుకున్న పుస్తకాలను ప్రభుత్వాలు కొనుగోలు చేసి రచయితలను ఆదుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆడిటోరియం కట్టించి అక్కడ రచయితలు తమ పుస్తకాలు విడుదల చేసుకునే సౌకర్యాలు కల్పించాలి మరియు సాహిత్య సభలు జరుపుకోడానికి అవకాశం కల్పించాలి. ప్రభుత్వం కూడా సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు జరిపి కవులను, సాహిత్య కారులను తగిన విధంగా గౌరవించాలి. సభకు హాజరవ్వడానికి తగిన ఖర్చులు కూడా ప్రభుత్వాలే భరించాలి. జగన్ గారి ప్రభుత్వం పుస్తక కొనుగోలు కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం శుభ పరిణామమే కాని అందులో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది.

 అఖిలాశ