మేనత్త. - నాగమణి తాళ్ళూరి

Aunt

నా చిన్నతనం లో ఎన్నెన్ని ఆటలు ఎంతలా ఆడేవాళ్ళమనీ.... ఆటలు తప్ప మరొకటి తెలియనట్లు , అసలు అందుకే పుట్టినట్లు. లేడి పిల్లలా ఛంగు ఛంగున గంతులేస్తూ రయ్యిమంటూ పరుగెత్తుతూ.... నాకైతే కాళ్ళు ఒక్క చోట నిలిచేవి కావు. వీధికి ఆ చివర నుండీ ఈ చివర వరకూ తూనీగ లాగా జుయ్యిమంటూ పొయ్యేదాన్ని. నడక అనేది ఒకటుందనే గుర్తుండేదే కాదు. పడినా లేచి దులుపుకుని మళ్ళీ పరుగెత్తడమే. సాయంకాలం చల్లని నీళ్ళు పడినప్పుడు చుర్రున మండే వరకూ గాయం అయిందని తెలిసేది కాదు. పగటి ఆటలు సరే.. రాత్రి వేళ చల్లని చిరుగాలులతో సావాసం చేస్తూ వెన్నెల వెలుగుల్లో ఆడే ఆటలు మరింత మనోహరం గా ఉండేవి. అసలు పున్నమి నాటి వెన్నెల......ఎలా ఉండేదనీ! వెండిని కరిగించి భూమిపై చిక్కగా పోసినట్లు. మెరుపులతో జలతారు వస్త్రం నేసి భూమి ని చుట్టేసినట్లు... తెల్లని తామర లను నేలంతా పరిచేసినట్లు.. ఏదో మాయ జరిగి లోకమంతా వింత సోయగాలు పొందినట్లు... ఏదో ఉషారు లోనుండి బయటకు తన్నుకొస్తూ ఉంటే ఆ వన్నెల వెన్నెల సొబగుల్లో మైమరిచి పోయి వేప చెట్టు కింద ఇసుక గుట్టలో దూదుం పుల్ల ఆడుతూ, ఒంటిని ఇసుకలో కప్పేసుకుంటూ , గుప్పెళ్ళతో ఇసుక తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆడుకుంటున్నప్పుడు ఆకలే ఉండేది కాదు , దాహమైనా తెలిసేది కాదు. అమ్మ కన్నెర్ర జేస్తూ పిలిచేదాకా ఇల్లు గుర్తొచ్చేదే కాదు. అలాంటి వెన్నెల రేయి నాడు చూసానో గమ్మత్తైన దృశ్యం. "అమ్మాయ్!" అని నాన్న పిలవగానే చేతులు దులుపుకుంటూ వెళ్ళాను. వాకిట్లో కుర్చీలో కూచుని ఉందో ఆడ మనిషి. ఆమెను "మనిషి" అనుకోలేదు నేను. పాల మీగడలో పసుపు కలిపిన ఛాయ. గులాబీల వర్ణాన్ని సొంతం చేసుకున్న పెదవులు. ఆమె కట్టుకున్న లేత చామంతి రంగు చీర ఆమె మేని రంగులో కలిసిపోతే గాలికి ఆమె పవిట చెంగు కొద్దిగా రెపరెప లాడుతూ ఆమెకు ఏదో రాజసాన్ని తెచ్చి పెడుతున్నాయి. నమ్మండీ ,నమ్మకపోండి మీ ఇష్టం కానీ ఇన్నేళ్ళుగా నా మనసులో మాట ఇప్పటికైనా మీకు చెప్పి తీరాలి. ఆమె చెవి దిద్దులు , మెడ లోని నక్లెస్ లోని ల తెల్లని రాళ్ళపై పడిన వెన్నెల కిరణాలు పరావర్తనం చెందుతూ జిగేల్ జిగేల్ మంటూ మెరుస్తూ ఉంటే ఆమె నా కంటికి దేవ కన్యలాగే కనిపించింది. ఆమె అందమో లేక వెన్నెల చేసిన మాయో నాకు తెలీదు కానీ మొదటసారి ఆమెను చూసినప్పుడు నోరు తెరుచుకుని మరీ చూస్తూ ఉండిపోయాను. "చిన్నా! కాఫీ!" అంటూ అమ్మ మర్యాదలు చేస్తోంది. ఆమె మా మేనత్త అంట. గొప్పింటి కోడలంట. అస్తమానూ పుట్టింటికి పంపరంట. "చిన్నా!" నీ మేనకోడలు మణి" అని నాన్న నన్ను ఆమెకు పరిచయం చేసినప్పుడు పలకరింపుగా ఆమె నవ్వింది. అప్పుడు మరింత మనోహరంగా కనిపించింది. దారి తప్పి ఏ వన దేవతో మా ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది. ఆమె ముందు నల్లగా ఉండే మా అమ్మ మరీ తేలిపోయినట్లు ఉంది. మొదటిసారి నాకు మా అమ్మ నచ్చలేదు. ఆమె మితభాషి. "చిన్నా చిన్నా"అంటూ నాన్న చెప్పే కబుర్లు వింటూ కూర్చుందే కానీ తనకు తానుగా ఏం మాట్లాడలేదు.ఏం చదువుతున్నావని నన్ను పలకరించలేదు. అందగత్తెలు అలాగే ఉంటారు కాబోలు అనుకున్నాను. ఆమె ఉన్న రెండు రోజులు నేను ఏదో మైకం కమ్మినట్లు , ఏదో మాయ నన్ను గట్టిగా చుట్టేసినట్లు ఆమె వెంటే ఉన్నాను తన వెనకే తిరిగాను. ఆమెకు వేడి నీళ్ళు తోడింది అమ్మ. ఉడుకు అన్నంలో గుడ్డు కూర, పెరుగు వేసి భోజనం పెట్టింది. ఎప్పటిలానే నాకు అర గుడ్డే వేసినా, నీళ్ళ మజ్జిగ పోసినా మొండికెత్తి ఏడిస్తే బాగోదని తమాయించుకున్నాను. మూడవ రోజు అమ్మ చీరా రవికెలతో ఆమెకు బొట్టు పెట్టి సాగనంపింది. అత్త వెళుతూ నా బుగ్గలు పుణికింది. నా చేతిలో రూపాయి బిళ్ళ పెట్టింది. ఆ క్షణం నాకు అత్తతో వెళ్ళిపోవాలి అనిపించింది. ఆ రాత్రి పడుకున్నా నిద్రపట్టలేదు నాకు. "చిన్నా ఇప్పుడు బావుంది కదండీ , బాగా రంగు తేలింది పిల్ల. పిల్లని కూడా తీసుకు వస్తే బావుండేది. పద్దు కి ఆరేళ్ళు వచ్చే ఉంటాయి.ఎప్పుడో పారాడేటప్పుడు చూడటమే కదా! అది కూడా మీ తమ్ముడి పెళ్ళిలో. ఆ తరువాత వాళ్ళు పంపనూ లేదు , నేనూ వెళ్ళిందీ లేదు, మధ్యమధ్యలో మీరెళ్ళడమే కదా" అమ్మ అంటోంది. అమ్మా నాన్న ఎప్పుడూ మేము నిద్ర పోయాకే మాట్లాడుకుంటారనుకుంటా.మొన్న అన్నం తినకుండా పడుకున్న రోజు మెలకువ వస్తే ఇలాగే మాట్లాడుకుంటున్నారు. "చిన్నా ఎందుకు వచ్చిందో తెలుసా!" అంటున్నాడు నాన్న. "చాన్నాళ్ళైంది కదా! చూసిపోవడానికి వచ్చి ఉంటుంది" "నీ పిచ్చి గానీ మనల్ని చూసిపోవడానికి ఎందుకు వస్తుందే! మన పేద కొంప వాళ్ళకి నచ్చుతుందా! ఊళ్ళో ఇళ్ళ స్థలం ఉంది కదా! ఐదు సెంట్లు. మా తమ్ముడు అమ్మి పంచుకుందాం అంటున్నాడు కదా! అది అమ్మినప్పుడు తనకూ వాటా కావాలని అడగటానికి వచ్చింది" నాన్న కొద్దిగా బాధపడుతున్నాడనుకుంటా, మాట వణికినట్లుగా ఉంది. "అదేంటండీ? వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్ళి చేసాం , మనకు తాహతు లేకపోయినా పిల్ల నలుగురిలో వెలితి అవకూడదని సారె ఘనంగా పంపాం. పురుళ్ళు పోసాం. ఇంకా మనదగ్గర ఏముందని భాగం అడగమని పంపారండీ? మనకంటూ ఉన్నది ఆ కాస్త నేల.వాళ్ళకేం తక్కువైందంట ఇప్పుడు" "మూడు భాగాలు వేయకపోతే బావ మీ ఊరుకోరు అన్నయ్యా" అంటోంది. అమ్మ ఏం మాట్లాడలేదు. కళ్ళు తెరిచి చూసాను. దీపం వెలుగులో అమ్మ కళ్ళలో చిన్న కన్నీటి బిందువులు కనపడుతున్నాయి.చప్పున కళ్ళు మూసుకున్నా. అమ్మ ఏడుస్తోందా! పాపం. నాకూ ఏడుపొచ్చింది. చిన్నా పెళ్ళికి కట్నం ఇవ్వడానికి పెళ్ళి ఖర్చులకూ మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన నలభై సెంట్ల పొలం అమ్మేసాను.పెళ్ళయిన మొదటి ఏడాది పండుగకు రేడియో కావాలని అడిగితే నా ఉంగరం అమ్మి కొన్నాను. దానికి మొదటిసారి అబార్షన్ అయినప్పుడూ,రెండోసారి గుర్రపు వాతం కమ్మినప్పుడు ఆసుపత్రి ఖర్చులకు నీ మెడలోని గొలుసు అమ్మేసాను. నిన్ను బోసి మెడతో నిలబెట్టేసాను. ఇంటి స్థలం అమ్మగా వచ్చే డబ్బుతో నీకో తాడు చేయించుదామనుకున్నాను. చిన్నాకు కూడా భాగం ఇస్తే బాకీలు కట్టగా మనకేం మిగలదే" నాన్న మెల్లిగా అంటున్నాడు. "సరే కానివ్వండి! చిన్నా అత్తారింట్లో సుఖంగా ఉండటం కన్నా నాకేమీ ఎక్కువ కాదండీ.. బంగారం లేకపోతే నన్నెవరైనా కొడతారా ఏంటి? కానీ మనకూ ఓ ఆడపిల్ల ఉంది. దానికంటూ ఏమీ మిగల్లేదు అనే బాధ. కానివ్వండి దీని రాత ఎలా ఉందో! ఇది పెరిగే నాటి కన్నా మన పరిస్థితులు బాగు పడతాయేమో!" నా తల నిమురుతూ అంటోంది అమ్మ. "నా తల్లికే లోటు తెలియనివ్వనే! ఇది బంగారం. కట్నం కూడా అడక్కుండా ఎగరేసుకుపోతారు నా తల్లిని. చూస్తూ ఉండు. దాని కాళ్ళ దగ్గర పడి ఉండే మొగుడు దొరుకుతాడు" నాన్న నవ్వినట్లే ఉన్నాడు. ఊరుకోండి దిష్టి తగుల్తుంది అంటోంది అమ్మ. వాళ్ళ మాటలు పూర్తిగా అర్ధం కాకపోయినా అత్త కూర్చుంది మా అమ్మ త్యాగం చేసిన సింహాసనం మీద అన్నమాట. అయినా అమ్మలో అత్త మీద కోపం లేదు. నాకెందుకో ఇప్పుడు అత్త కంటే అమ్మ అందంగా కనిపిస్తోంది. అమ్మ మెడను చుట్టేసుకుని బజ్జున్నా....