అంతరార్థం - పద్మావతి దివాకర్ల

Meaning

ముద్దులమూట కడుతున్న తన కూతురు లల్లీ చెప్పే వచ్చీరాని మాటలు వింటూ మురిసిపోతోంది వాసంతి.  అప్పుడే లల్లీకి రెండేళ్ళు నిండి మూడో ఏడు వచ్చింది.  ఇంకో ఆర్నెల్లు దాటితే ప్లేస్కూలో చేర్చాలని నిర్ణయించుకుంది వాసంతి.  ఇప్పటినుండే దగ్గరలో ఎక్కడెక్కడ ప్లేస్కూళ్ళు ఉన్నాయో అని వాకబు చేస్తోంది.  ఇంత చిన్నవయసులోనే స్కూల్‌కి పంపడం ఇష్టంలేదు ఆమె భర్త వీరేంద్రకి.  ప్రస్తుతం చదువులో ఉన్న పోటీ తట్టుకోవాలంటే ఇప్పటినుండే స్కూల్‌లో చేర్చాలనేది వాసంతి వాదన.  చివరికి తన వాదనే నెగ్గించుకొని ప్లేస్కూళ్ళ వేటలో పడిందామె.

వాసంతికి నాలుగిళ్ళ ఆవతల ఉండే వాహిని తన అబ్బాయిని వాళ్ళున్న వీధికి దగ్గరలోనే ఉన్న ప్లేస్కూల్లో ఈ మధ్యనే చేర్చినట్లు తెలిసింది.  ఆ స్కూలు గురించిన వివరాలు తెలుసుకుందామని వాళ్ళింటికి వెళ్ళింది వాసంతి.

వాహిని వాసంతిని చూస్తూనే తన ఇంట్లోకి ఆహ్వానించింది.  వాసంతి వచ్చిన కారణం తెలియగానే, "మా బాబుని పక్కవీధిలో ఉన్న 'వాగ్దేవి విద్యాలయం'లో నెలరోజుల క్రితమే చేర్పించాము.  అక్కడ ప్లేస్కూల్ నుండి ఏడవ తరగతి వరకూ ఉంది.  ఇప్పుడు జాయిన్ చేస్తే ఏడో తరగతి వరకూ చూసుకోనక్కరలేదు.  స్కూలు కూడా చాలా దగ్గర.  పెద్ద స్కూలు, ఆవరణ కూడా పెద్దదే!  స్కూల్ ఫీజులు కూడా మనలాంటివారికి అందుబాటులోనే ఉన్నాయి. మీ పాపని కూడా అందులోనే చేరిస్తే బాగానే ఉంటుంది.  మనిమిద్దరమూ కలిసి వెళ్ళి వాళ్ళని సులభంగా దిగబెట్టవచ్చు, తీసుకురావచ్చు.  పిల్లలు కూడా ఒకళ్ళకొకళ్ళు తోడు ఉంటారు." అందామె.

వాహిని చెప్పిన స్కూలు వివరాలు వాసంతికి నచ్చాయి.  పైగా స్కూలు చాలా దగ్గరలోనే ఉంది.  నడిచివెళ్ళే తోవే.  స్కూలుకి వెళ్ళి ఒకసారి చూడాలని భావించిన వాసంతి, "రేపు మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను.  ఓ సారి స్కూలు చూసినట్లూ ఉంటుంది.  మిగతా వివరాలు కూడా కనుక్కోవచ్చు." అందామె.  వాహిని అలాగేనంది.

ఆ మరుసటి రోజు ఉదయం ఏడుగంటలకే వాహిని బాబుతో వాసంతి ఇంటికి వచ్చింది.  పాప లల్లీని భర్తకి అప్పచెప్పి వాసంతి కూడా వాళ్ళతో బయలుదేరింది.

పక్క వీధిలోనే ఉంది ఆ స్కూల్.  పైకి చాలా అందంగా ఉందా స్కూల్.  బయట పెద్ద గేట్, దాని పక్కనే స్టూల్ వేసుకొని కూర్చొని ఉన్నాడు వాచ్‌మేన్.  వీళ్ళని చూడగానే గేట్ తీసాడు. లోపలికి ప్రవేశించగానే పూల మొక్కలతో ఒక చిన్న తోట ఉంది. స్కూలుకి ముందుభాగాన వరండాలో పిల్లలకి సంబంధించిన రకరకాల ఆటవస్తువులు, ప్లేస్కూల్ పిల్లలకోసం జారుడు బల్లలులాంటివి, టెడ్డి బేర్లు, మీక్కి మౌసులు వగైరాలు ఉన్నాయి. వరసగా అరడజనుకు పైగా గదులు, ఆ పక్కనే ప్రిన్సిపాల్ గది, ఆఫీసు గది కూడా ఉన్నాయి.

వరండాకి రెండుప్రక్కలా లాన్, అందులో రకరకాల పూలమొక్కలు, కుండీల్లో క్రోటన్సు ఉన్నాయి.  వాటిని తేరిపార చూసింది వాసంతి.  అన్నీ పరిశీలిస్తూ ముందుకి నడిచింది వాసంతి.  అవన్నీ దాటుకొని వాహిని, వాసంతి ఇద్దరూ ప్రిన్సిపాల్ రూములోకి ప్రవేశించారు.

బాబుని చూస్తునే వాళ్ళ స్కూల్ టీచర్ వాహినిని పలకరించి బాబుని క్లాస్ గదిలోకి తీసుకెళ్ళింది.

వాసంతిని ప్రిన్సిపాల్‌కి పరిచయం చేసి విషయం చెప్పింది వాహిని.

"మా స్కూల్లో మీ పాపని చేర్చాలని నిర్ణయం తీసుకున్నందుకు మీకు అభినందనలు.   మా స్కూల్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం.  ఇంతకీ మీ పాపని ఎప్పుడు స్కూల్లో చేరుస్తారు?" అంది ప్రిన్సిపాల్. 

"ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.  త్వరలోనే ఏ సంగతి చెప్తాను." అంది వాసంతి.

"అలాగే!  మా విద్యా సంస్థకి సంబంధించిన వివరాలన్నీ ఈ బ్రోచర్‌లో ఉన్నాయి. చదవండి." అని ఓ బ్రోచర్ అందించిందామె.

అది అందుకొని ఆమెకి నమస్కరించి వాసంతి కుర్చీలోంచి లేచింది.  వాహిని ఆమెని అనుసరించింది.  వెళ్తూన్నప్పుడు వాసంతి స్కూలులోపల, బయట నిశితంగా పరిశీలించసాగింది.

"చూసారా!  స్కూల్ ఎంత బాగుందో?  ప్రిన్సిపాల్, టీచర్లు కూడా చాలా మంచివాళ్ళు.  మీ పాపని కూడా తప్పకుండా ఇక్కడే చేర్చండి." అంది వాహిని.

"మా లల్లీని ఇక్కడ చేర్చడం నాకు ఇష్టం లేదు." అంది వాసంతి ఓ నిర్ణయానికి వచ్చి.

ఆమె మాటలకి ఆశ్చర్యపోయింది వాహిని.

"అదేంటి?  స్కూలంతా తిరిగి చూసారు కదా.  అంతా బాగానే ఉంది కదా!  మరి మీ అభ్యంతరమేమిటో నాకు బోధపడలేదు." అంది వాసంతి విస్మయంగా.

"అంతా శ్రద్ధగా చూసాను కాబట్టే చెబుతున్నాను.  మీరు గమనించారో లేదో ఆ స్కూల్ తోటలో, వరండాలో ఉన్న పూల చెట్లు చూసారా!  ఎలా ఎండిపోయాయో!  సంరక్షణ కరువైంది వాటికి.  పూల చెట్లపైనే శ్రద్ధ చూపలేని స్కూలువాళ్ళు పూలలాగే నాజూకైన మన పసిపిల్లల్ని శ్రద్ధగా ఎలా చూస్తారన్నది నా సందేహం.  అందుకే మా లల్లికోసం ఇంకో స్కూల్ చూస్తాను." అంది వాసంతి.

వాసంతి మాటల్లోని అంతరార్థం బోధపడింది వాహినికి.  ఆ తర్వాత అరకిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్లేస్కూల్లో లల్లీని చేర్చింది వాసంతి.  కొద్ది రోజులలోనే వాహినికి కూడా బాబు చదువుతున్న స్కూలుపై అనుమానం కలిగి, ఆమె కూడా లల్లి చేరిన స్కూల్లోనే తన బాబుని కూడా చేర్చింది.