మన బాలు - శ్రీనివాస్ మంత్రిప్రగడ

మన బాలు

బాలు గారు తన శరీరాన్ని ఈ ప్రాపంచిక పంచభూతాలకు వదిలి వెళ్ళిపోయి ఆరు రోజులైనా ఎవ్వరికీ గుండెల్లోని బరువు తగ్గటల్లేదు...

సామజిక మాధ్యమాలన్నిటిలోను అశేషంగా బాలు గారి  జ్ఞాపకాలు పంచుకుంటూనే ఉన్నారు...

చిత్రకారులు బాలుగారి బొమ్మలూ, కార్టూన్లు వేసి పంచుకుంటుంటే కవులు స్మ్రుతి గీతాలు పంచుకుంటున్నారు...

కాస్త రాయగలిగే నాబోటి చిన్నకారు రాతగాళ్లనుంచి లబ్ద ప్రతిష్టులైన రచయితలవరకు అందరూ తమ భావనలు పంచుకున్నారు...

కుదిరిన వాళ్ళు వీడియోలు చేసి సామజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు...ఈ విషాదం మనకు తెలిసిన ప్రపంచమంతా వ్యాపించినట్టు ఉంది...

కొన్ని నిజాలు, కొన్ని కల్పనలూ ఇంకా ఇవాళ్టి అంకాత్మక ప్రపంచాన్ని కుదిపేస్తున్న నకిలీ వార్తలూ....ఒక వరదలాగా వచ్చి పడుతున్నాయి...

ఎంత తలచుకున్నా తక్కువే అనిపిస్తోంది అందరికీ...యాతమేసి తోడినా ఏరు ఎండదు...పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు...

ఉద్యోగరీత్యా రకరకాల ప్రాంతాల్లో పని చెయ్యడం...వివిధ భాషల వాళ్లతో పరిచయాలుండడం వల్ల ఎన్నో రాష్ట్రాల్లో నాకు స్నేహితులు ఉన్నారు..వాళ్ళందరూ నా లాగే మాములు మనుషులు...బాలు గారి గురించి అయిదు దక్షిణాది రాష్ట్రాల్లోని నా స్నేహితులు పాటల రూపంలో, ఫోటోల రూపంలో , బాలుగారిని చుసిన సందర్భాల గురించి రాతల రూపంలో పంచుకుంటుంటే...

తూర్పు, ఉత్తర, పశ్చిమ భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నా స్నేహితులు వాళ్ళ బాధను, భావనలను చిన్న కవితల రూపంలో, చిన్న మెసేజిల రూపం లో పంచుకున్నారు... 

ఆ స్మ్రుతి సంభాషణలలో తడిసి ముద్దైపోతున్న నాకు బాలుగారు ఏఒక్కరి సొత్తు కాదు అనిపించింది...

ఆ మహానుభావుడి ఆత్మ ని శరీరం అనే బంధంలో కట్టిపడేసి అర్ధం లేని అనుభవాలను  కలిగించాం...ఇప్పుడా ఆత్మ విడులై విశ్వమంతా వ్యాపించింది అనిపించింది..నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం అంటూ బాలు గారు తన విశ్వజనీయతని ఎప్పుడో చాటుకున్నారు..మనకు అర్ధం కావడానికే ఇంత సమయం పట్టింది...

మేధావులమని చెప్పుకునే మాన్యుల నుంచి మేధావులమేమో అని భ్రమపడే నాలాంటి సామాన్యుల వరకు అందరూ తమకు తోచిన స్థాయిలో ఎదో ఒకటి ప్రతి రోజూ అంటూనే ఉన్నాం...

ఈ  ప్రపంచం లో ఉండే కడుపు నిండిన వాళ్లకు మంచి ఆలోచనలు చేసి  వాటిని ఇంకా మంచి భాషలో పంచుకునే అవకాశం ఉంది...

ఇదో పార్శ్వం...
 
మేధావులు కాని, రోజూ మన ప్రపంచం నడిచేలా చూసే సామాన్య మానవులు కూడా ఎప్పుడూ లేని చేతన చూపిస్తూ వాళ్ళ భావనలు పంచుకుంటున్నారు....అవన్నీ మౌఖికంగా ఉండడం వల్ల వాటిల్ని గుర్తించే అవకాశం లేదు...

ఇవాళ మార్నింగ్ వాక్ కి వెళ్తుంటే మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ ఒకతను...వయసులో కొంచం పెద్దవాడు నన్ను అపి  ఊరికే పలకరించి "ಅವನು ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿ...ಮಹಾನ್ ಗಾಯಕ..ಆರಂಭಿಕ ಜಗತ್ತನ್ನು ತೊರೆಯುವುದು" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు...

ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అతనా బాధను పంచుకునే విధానం చుస్తే జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే సిరివెన్నెల వారి మాటలు బాలుగారి గాత్రంలో నా చెవిలో మారు మోగాయి...

పనిమీద ప్రయాణం చేసిన నేను గత రెండు రోజుల్లో బెంగుళూరు ఇంకా హైదరాబాద్ లో పదిహేనుకి పైగా టాక్సీలు ఆటోలలో ప్రయాణం చేశాను...

మంజునాథ, సురేశా, ఎల్లయ్య, యాదగిరి, రహ్మత్ ఖాన్, షేక్ మౌలా, జోసెఫ్ అబ్రహం, బేబీ జీసస్, ప్రభాకర్ నాయుడు...వివిధ డ్రైవర్లు...వివిధ జీవన విధానాలు పాటించే వాళ్ళు...అందరూ ఒకసారైనా బాలు గారి మరణం గురించి వాళ్ళ బాధను వెళ్లబోసుకుంటుంటే...బాస బాసే స్టోను స్టోనే అనిపించింది...

ఎన్నో సామజిక, ఆర్ధిక , సాంస్కృతిక విబేధాలున్న ఈ దేశంలో అందరూ ఆలోచిస్తున్నది బాధ పడుతున్నది బాలు గారి గురించే...

ఇటువంటి సంఘటన ఇంతకు ముందు అబ్దుల్ కలాం గారు కాలం చేసినప్పుడు చూసాను... ప్రతి మనిషీ...పెద్ద కార్పొరేట్ మేనేజర్ దగ్గర నుంచీ, మాకు టీ ఇచ్చే చోటు గాడి  వరకు అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం నాకు గుర్తుంది...మళ్ళీ ఇప్పుడు బాలుగారి కోసం ఆలా పరితపించడం కనిపించింది...

రాఘవేంద్ర స్వామి తాను బృందావన ప్రవేశం చేసే ముందు శిష్యుల తో అంటారు..."ఈ శరీరం ప్రపంచం తో బంధం ఏర్పాటు చేసుకోవడానికి అవసరం...కానీ ఒక స్థాయి తరువాత ఆ బంధమే ఒక హద్దు అయి విశ్వమంతా వ్యాపించే అవకాశం తగ్గిస్తుంది...మేము ఈ దేహాన్ని వదిలితే ప్రపంచం అంతటా వ్యాపించగలం" అని...

అలాగే ఈ అర్ధంలేని ప్రపంచాన్ని తన కళతో ఇంత సుసంపర్ణం చేసిన మన బాలు ఈ జన్మలో తాను వాడిన దేహాన్ని ఒంటరిగా తన వ్యాసాయ క్షేత్రంలో వదిలేసి ప్రజలందరి  హృదయాల్లోనూ జీవితం ప్రారంభించారు... 

అయన చేసిన కళా సేవకు మనం తీర్చుకో వలసిన ఋణం  అయన విగ్రహాలు పెట్టడం వల్లో, ఆయనకు అవార్డులు ఇప్పించడం వల్లో తీరదు...అయన పరితపించిన ప్రపంచం కోసం మన వంతు కృషి చెయ్యడం మాత్రమే ఆయనకు సరైన నివాళి 

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా...గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి...నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన...నీకే నా హృదయ నివేదన..