దివికేగిన స్వరకమలం - Ramakrishna Sadhu

దివికేగిన స్వరకమలం
  1. ఏ దివిలో విరిసిన స్వర వర పుష్పానివో ఈ భువి చేరినావు. సంగీత సరస్వతి కటాక్షం మెండుగ కలిగి పాటకు వరమైనావు. నీ గొంతులోని తియ్యదనంతో, నీ పాటలోని మాధుర్యముతో కోట్ల ప్రజల గుండెలు ఊయలలూగించావు.
  2. గాన గంధర్వునిగా నిన్ను పొందడం ఈ జాతి చేసుకున్న పుణ్యము.అన్నమయ్యలా కోనేటి రాయుడి స్తుతి చేసినా, రామదాసులా భద్రాద్రి రాముడి గురించి ఆలపించినా,జాము రాతిరి జాబిలికి జోలపాడినా, బంగరు రంగుల చిలకా అంటూ ప్రియురాలిని పలుకరించినా, బ్రోచేవారెవరురా అని ఆర్దృతతో శివయ్యను గుండె లోతుల్లో నింపుకున్నా, గ్యాంగ్ లీడర్లా ఉర్రూతలూగించినా, ఇంత వైవిధ్యం నీకు మాత్రమే సాధ్యం.
  3. తరలిరాద తనే వసంతం అని పాడినట్టు నువ్వు కోలుకుంటావని తిరిగి నీ గానామృతాన్ని మాకు పంచుతావనే ఆశ నేటితో తుంచేశావు.నీవు భువిలో జనులను అలరించినది చాలని ఆ దేవదేవునికి అనిపించిందో, లేక ఆసుపత్రిలో అలసిన నీ గుండెను చూసి ఆ అంతర్యామికి మనసు చెలించిందో, నిన్ను తనలో ఐక్యం చేసుకుని భౌతికంగా మాకు దూరం చేశాడు. నేడు ధారాళంగా కురిసిన వాన నీ అభిమానుల శోకమా లేక తమకోసం నువ్వు వస్తున్నావని దేవతలు కురిపించిన ఆనంద నీరాజనమా!
  4. నా కూతురు మూడవ యేట పాడుతా తీయగా చూస్తూ " నాన్నానేను కూడా బాలు తాత గారి ముందు పాట పాడతాను" అంది. ఇలాంటి ఎంతోమంది పిల్లల కలలు నెరవేరకుండా తనువు చాలించావు. ఇది అన్యాయం కాదా.నీ పాటలు అజరామరం. నీ గానంతో అమృత ధారలు కురిపించి మమ్ము ధన్యులను చేశావు. చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి అని నీ చెరగని చిరునవ్వుని మాత్రమే మాకు మిగిల్చి మమ్మల్ని శోక సంద్రం లో ముంచేసి కానరాని లోకాలకు పయనమైనావు.  సిరివెన్నెల గారి మాటల్లో చెప్పాలంటే "బాలు ప్రతి ఇంట్లో ముఖ్య సభ్యుడు". నీ అంత మహాగాయకుడు మళ్ళా పుట్టడు అనుకోవడంలో బహుశ ఎటువంటి అతిశయోక్తి లేదు.
  5. మహానుభావా ఇదే నీకు నా అశ్రు నివాళి...
  6. సాధు రామకృష్ణ