శల్యుళ్ళు - టీవీయస్. శాస్త్రి

shalya saaradhyam

మహాభారత కథలో 'శల్యుడు' అనే ఒక పాత్ర ఉంది. అతనిని గురించి కొంత క్లుప్తంగా ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చెబుతాను. 'శల్యుడు' పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి కుమారులైన నకుల, సహదేవులకు మేనమామ. ఇక ఇతని శీలాన్ని గురించి చెప్పాలంటే, ఇతనొక దుర్వ్యసనపరుడు. మధుపానమత్తుడు, జూదరి, వ్యభిచారి. ఈ అవలక్షణాలున్న మనిషికి ఇంకా చాలా అవలక్షణాలుంటాయి. ప్రత్యేకించి చెప్పాలంటే -- అసత్యపరుడు. సత్యవంతుడైన శత్రువు కంటే అసత్యవంతుడైన మిత్రుడు చాలా ప్రమాదకరం. చాలావరకు వీరి రూపురేఖలు అంత ఆకర్షణీయంగా ఉండవు. ఇతను చాలా స్వార్ధపరుడు. పైకి పెద్దమనిషిగా కనిపించటానికి చాలా తపన పడుతాడు. మితిమీరిన స్వార్ధం వలన, అసలు రూపం ఇట్టే బయటపడుతుంది.

మాద్రి చనిపోయిన తరువాత, తల్లిలేని పిల్లలైన నకుల, సహదేవుల యోగక్షేమాలను గురించి ఎన్నడూ విచారించిన దాఖలాలు లేవు. అంటే, బాధ్యతారహితుడు కూడా అన్నమాట!తండ్రిలాంటి ధర్మరాజు సంరక్షణలో ఉన్న నకుల, సహదేవులకు ఇతరుల అండదండలుండ నవసరంలేదు!కాలం గడిచింది. కౌరవ, పాండవులు భారతయుద్ధానికి సన్నద్ధులవుతున్నారు. ఇరుపక్షాలు వారివారి స్నేహితుల , బంధువుల సహాయం కోరుతున్నారు. ధర్మరాజు ముందుగానే శల్యుని సహాయాన్ని ఆర్ధించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న, సుయోధనుడు శకుని సలహా మేరకు -- శల్యుడు వచ్చే మార్గమధ్యంలో మందు, పొందు లాంటి అనేక వినోద కార్యక్రమాలను ఏర్పరిచాడు. మంచి Item Girls అతనిని తమ అశ్లీల నృత్యాలతో ఆనందం కలిగించటంతో పాటు, అతని శయ్యను కూడా పంచుకున్నారు. ఇన్ని అవలక్షణాలున్న మనిషికి తృప్తినిచ్చే ఏర్పాట్లే అవి. సుయోధనుడు ఇచ్చిన విందుకు సంతోషించి, అతని కోరికేమిటో తెలుసుకుంటాడు. యుద్ధంలో తమ పక్షాన నిలబడి సహకరించమని సుయోధనుడు వేడుకుంటాడు. త్రాగుబోతు భూమి మీదనే కాదు , మాట మీద కూడా నిలబడలేడు.

ధర్మజునికి ఇచ్చిన మాటను మరచిపోయాడు శల్యుడు. సుయోధనుడు కోరిన కోరికకు అంగీకారాన్ని తెలుపుతాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. శల్యుడు మంచి విలుకాడు. శత్రువు ఆవేశంగా యుద్ధం చేస్తుంటే, ఇతను రెచ్చిపోయిన ఆవేశంతో యుద్ధం చేసి శత్రువును తుదముట్టిస్తాడు. యుద్ధం మొదలైన తొలిరోజునే , శల్యుడు అభిమన్యుని బావమరది అయిన ఉత్తర కుమారుడిని దారుణంగా హతమారుస్తాడు. కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా సాగుతుంది. యుద్ధం ఆఖరి ఘట్టంలోకి ప్రవేశించింది. యుద్ధం దాదాపుగా తుది దశకు చేరుకుంది. యుద్ధం ప్రారంభమై అది 17 వ రోజను కుంటాను. ఆ నాటి యుద్ధానికి సర్వసేనాధ్యక్షుడిగా కౌరవుల పక్షాన శల్యుడు సారధ్యం వహిస్తున్నాడు. అంతవరకూ ఓర్పుతో వేచిచూచిన రాజనీతిజ్ఞుడు అయిన ధర్మజుడు, ఈ విషయాన్ని తెలుసుకొని , శల్యుని మేనల్లుళ్ళు అయిన నకుల, సహదేవులను వెంటబెట్టుకొని శల్యుని వద్దకు వెళతాడు. శల్యునికి ధర్మరాజుని చూడగానే అపరాధ భావం కలుగుతుంది.

శల్యుడు లాంటి వారికున్న మరో అవలక్షణం -- బంధుప్రీతి. శల్యుడికి ఎక్కడో మారుమూల దాగున్న ప్రేమ, పసివాళ్ళను చూసి చిగురించింది. జరిగిన విషయాన్నంతా ధర్మజునికి వివరించి, ప్రస్తుతం ఏమిచేయాలో వివరించమంటాడు. ఆసమయంలో శల్యుడే ఆలోచించి, "ఒక పని చేస్తాను, అటు పక్క ఉన్నట్లుగా నటించి, మీకు ఉపయోగపడే విధంగా యుద్ధంలో నా పాత్రను పోషిస్తాను. "అని, శల్యుడు తన కుటిల రాజనీతిని బయటపెట్టాడు. కర్ణుడికి రధసారధిగా పనిచేసి, మానసికంగా కర్ణుడిని క్రుంగ తీయటమే కాకుండా, సూటిపోటి మాటలతో అవమాన పరుస్తాడు. ఇటువంటి వారినే, నేడు అన్ని రాజకీయపక్షాలు కోవర్టులు అని అంటున్నారు. ఇటువంటి కోవర్టులు అన్ని పార్టీలలో ఉన్నారు. కర్ణుడు, అసలే శాపగ్రస్తుడు. ఇటువంటి రధసారధి ఉంటే, యుద్ధం ఎలా చేయగలడు?ఇటువంటి నీచులు రధసారదులుగా ఉంటే, ఆఖరికి అర్జునుడు కూడా గెలవలేడు. తప్పుడు సలహాలిచ్చి, ప్రజలను వక్రమార్గం పట్టించటాన్ని 'శల్య సారధ్యం' అనే మాట వాడుకలోకి వచ్చింది. తప్పుడు సమాచారాన్ని, సలహాలనిచ్చి మనల్ని వక్రమార్గంలో పడెయ్యటంలో వీరు కృతక్రుత్యులవుతారు. ఈ కోవర్టులు చాలా భయంకర ద్రోహులు. నమ్మకంగా ఉన్నట్లు నటించి మోసం చేయటం వీరి ప్రవృత్తి.

శ్రీశ్రీ గారన్నట్లు -కమ్యూనిష్టులకు అసలు శత్రువులు మాజీ కమ్యూనిష్టులే! -స్వపక్షానికి అసలైన శత్రువులు ఈ కోవర్టులే! వీరు ఏ పక్షంలో ఉన్నావారి నైజం ‘మోసం చెయ్యటం'. మన మధ్యలోనే ఇటువంటి కోవర్టులు అనేకమంది ఉంటారు. వీరిని గుర్తించటం ఎలాగని కదూ మీ సందేహం--అకారణంగా అతిశయోక్తులతో మనల్ని పొగుడుతుంటారు. జాగ్రత్తగా గమనిస్తే, అవి పొగడ్తలు కావు! తెగడ్తలు!! వీరి నుండి తప్పించుకోవటానికి ఒకటే మార్గం-అతిశయోక్తులతో కూడిన వారి పొగడ్తలను మొగ్గలోనే చిదిమెయ్యటం! ముఖ్యంగా, సమాజంలో ఉన్నతస్థానాల్లో ఉన్నవారు ఇటువంటి 'శల్యుళ్ళను' దూరంగా ఉంచాలి. భారత కథలో ఒక శల్యుడుంటేనే ఇంత కథ నడిచింది. ప్రస్తుతం, నవభారతంలో ప్రతి నగరంలో ఇటువంటి శల్యుళ్లు అనేకమంది ఉన్నారు. ఇంతకూ, భారత కథలో శల్యుడి పాత్రకు ముగింపు ఎలా ఉందో తెలుసుకోవాలని కదూ మీ కుతూహలం! ఉద్రేకపరులు శల్యుడిని ఎదుర్కొనలేరు! శాంతమూర్తి, రాజనీతిజ్ఞుడు అయిన ధర్మజుని చేతిలో ఇతడు హతుడయ్యాడు! ఇటువంటివారు ఎవరికైనా, ఎప్పటికైనా హాని కలిగిస్తారని గ్రహించి ధర్మజుడు ఇతనిని అంతమొందించాడు. శల్యుడు లాంటి కోవర్టుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి!

 

తస్మాత్! జాగ్రత!! జాగ్రత!!!

 

భారతంలోలేని కథ లేదు. అక్కడ కత్తులు, కిరీటాలు, గుర్రాలుంటే--ఇక్కడ పిస్టల్స్, టోపీలు, కార్లున్నాయి.
అదే తేడా!యుగాలు మారినా, జగాలు మారినా మానవ ప్రవృత్తి మారదు.
ప్రపంచంలో ఏ దేశంలోనైనా మానవుని శరీర సగటు ఉష్ణోగ్రత 98. 6F.
ఏ దేశంలోనైనా అర్ధరాత్రి పడక గదుల అంతరార్ధం ఒకటే!
దేశం ఏదైనా కన్నతల్లి చనుబాల తీపంతా ఒక్కటే!