నవ్వుల జల్లు - జయదేవ్

శిష్యుడు : రుద్రాక్షలు ధరిస్తే, రక్తపు పోటు, మలబద్ధకం, చర్మ వ్యాధులు, స్థూలకాయం సమస్యలుండవట! అందుకనే యిన్ని మాలలు ధరించారా గురువర్యా?
గురువు : రుద్రాక్షలకీ, ఆ వ్యాధులకీ సంబంధం లేదు నాయనా!
శిష్యుడు : మరి మీ ఆరోగ్య రహస్యం?
గురువు : మితంగా తింటాను! పగటి పూట నిద్రపోను, అంతే!


అనామక రూపం : విశ్వకర్మా... నువ్వు నిర్మించిన ఈ కట్టడంలో వాస్తుదోషం వుంది!
విశ్వకర్మ : నా నిర్మాణంలోనే తప్పు కనిపెట్టావ్! ఎవరయ్యా నీవు?
అనామక రూపం : నేనేనయ్యా... వాస్తు పురుషుడ్ని!!
విశ్వకర్మ : ఓహో! ఐతే ఒప్పుకుంటాను! తప్పెక్కడో చెప్పు, సరిచేస్తా!!


పాండవ పక్షపాతి - 1 : తటాకమనుకుని అద్దంలో, అద్దమనుకుని తటాకంలో కాలుపెట్టి పడ్డాడట గదా... దుర్యోధన చక్రవర్తి?
పాండవ పక్షపాతి - 2 : కుడి కాలా, ఎడం కాలా, ఏ కాలుపెట్టాడట?
పాండవ పక్షపాతి - 1 : ఎడం కాలే పెట్టుంటాడు!! అదే విపరీతాలకి దారి తీసింది!!


గంధర్వుడు - 1 : మత్తు, మత్తుగా వుంది!
గంధర్వుడు - 2 : ఏం తాగావ్?
గంధర్వుడు - 1 : నీళ్ళు!
గంధర్వుడు - 2 : మధుపానం తాగు మత్తొదుల్తుంది!!


శిష్య పరమాణువు : "కొండ అద్దమందు కొంచెమై కానదా!" అన్నారే వేమన గారు! అర్ధమేమిటి?
గురువ రేణ్యుడు : కొండని పిండి చేసి, ఆ పిండిని మొహానికి రాసుకుని అద్దంలో చూడు! నీకర్థమవుతుంది!! పద్యం పూర్తిగా చదవడం నేర్చుకోరా! శుంఠా!!


గంగులు : సీతమ్మవారిని, రావణాసురుడే ముహూర్తంలో, అపహరించాడో అదే ముహూర్తంలో, యీ నగలూ, ధనం దోచాం, రా!!
సుబ్బులు : ఐతే... ఏవంట?
గంగులు : ఈ దోపిడీ నగలూ, ధనమూ, స్వంత వాడికి చేరిపోతుంది, కొన్ని రోజుల్లో!!
సుబ్బులు : చచ్చాం... వీటిని ఇక్కడే పారేసి, తప్పించుకుపోదాం పద?


సుబ్బాయమ్మ : గోపికల జడలు పైకి లేచి, పాములు పడగవిప్పి ఆడేలా, ఆడుతున్నాయి గమనించావా?
రంగాయమ్మ : బృందావనంలో శ్రీ కృష్ణుడు వేణుగానం చేస్తున్నాడు, నీ చెవికి వినలేదా??
సుబ్బాయమ్మ : వినకేం గానీ... మనకొప్పులు కూడా కదుల్తున్నాయిగా??


వెంకట్రెడ్డి : "ఇందుగలడందులేడని సందేహము వలదు" అని భగవంతుడి గురించి అంత నిక్కచ్చిగా పోతన గారెలా చెప్పగలిగారంటావ్?
చంద్రంనాయుడు : ఆయన్ని పక్కన కూర్చోపెట్టుకుని, ఈయన గారు భాగవతం రాసేశారు గదా!!


సేవకుడు : ఇందు మూలంగా తెలియచేసేదేమనగా... దానవీరశూర కర్ణుల వారు, ఈ సభా స్థలానికి, నిర్ణీత సమయంలో రాలేక పోతున్నారని వార్త వచ్చింది! ఆయన గారి రధా చక్రాలు దారి మధ్యలో కూరుకుపోయాయటహో!!


దండ నాయకుడు : ఒరేయ్... హిరణ్యకశిపుల వారి ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుడ్ని ఏనుగుల చేత తొక్కిస్తున్నారా లేదా?
భటుడు : ఏనుగులు పట్టు వదిలించుకుని మనల్ని తొక్కి చంపుతున్నాయి నాయకా... అవి మీవేపే పరుగెడుతున్నాయి, పారిపోండి!!


తానీషా సిబ్బందిలో ఒకడు : కారా గృహంలో వుండే రామదాసుకు, బాగా ఉప్పు దట్టించిన, రొట్టెలు పడేశారా?
భటుడు : వాటిని తిని, "ఏమి రుచిరా..." అని ఆనందంగా పాడాడు నాయకా!
తానీషా సిబ్బందిలో ఒకడు : ఐతే ఈసారి, ఉప్పులేని చప్పటి రొట్టెలు పడేయండి!
భటుడు : వాటిని కూడా యిచ్చాం నాయకా... తిని, అదేపాట అందుకున్నాడు నాయకా!!

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు