అమృతాంజనము సృష్టి కర్త కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు. - ambadipudi syamasundar rao

అమృతాంజనము సృష్టి కర్త కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు

1893లో ప్రారంభమైన అమృతాంజనం భారత దేశములో బాగా పాపులారిటీ ఉన్నబ్రాండ్ లలో ఒకటి దీని ఉత్పత్తి మొదట ముంబై లో జరిగింది కాబట్టి చాలా రోజులు ఇది మరాఠీ వారి ఉత్పత్తి అనుకునే వారు కానీ నిజానికి దీనిని తయారుచేసి పాపులారిటీ తెచ్చింది తెలుగువాడైన కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారు స్వాతంత్ర సమరయోధుడు, జర్నలిస్ట్ సాంఘిక సంస్కర్త వీటన్నిటిని మించి "తలనొప్పి నివారిణి అమృతాంజనం" ఆవిష్కర్త ఒకసారి చధరంగపు చాంపియన్ బాబీ ఫిషర్ భారతీయ చదరంగపు అటగాడు విశ్వనాథన్ ఆనంద్ ను అమృతాంజనం గురించి అడిగాడట తన సొంత దేశము అయినా ఐస్ ల్యాండ్ లో అమృతాంజనం దొరకటం లేదని తనకు అమృతాంజనం కావాలని అడిగాడు అంటే అమృతాంజనం ప్రతిభ దేశాలు దాటి ప్రముఖుల చెంతకు చేరింది అని చెప్పవచ్చు. భారతదేశములో 1980 ,1990 ల మధ్య పెరిగిన ఏ పిల్లవాడిని అడిగినా అమృతాంజనం గొప్పతనము చెపుతాడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ప్రతి వారి ఇంట్లో విధిగా ఉండే మందు ఇది. అమృతాంజనం లేని ఇల్లు ఊహించటం చాలా కష్టము. ఈ పసుపు రంగు పేస్ట్ లాంటి ఔషధము విపరీతమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులను జలుబును తగ్గించే అమోఘమైన మందు. తాతయ్యలు,భామ్మల కాలము నుండి అమృతాంజనం వాడకం ఉంది దీనిని వాడి తలనొప్పినుండి సత్వరమే ఉపశమనము పొందేవారు ఇంత అమోఘమైన మందును తయారుచేసింది శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు
కాశీనాథుని నాగేశ్వరరావు గారు పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించినవాడు ఈయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోధ్ధారక, విశ్వదాత అని అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అతనును 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది ఆయనకి ఆంధ్ర మహాసభ వారు దేశోధ్ధారక అని బిరుదు ఇచ్చారు ఈయన ప్రముఖ రాజకీయ వేత్త స్వాతంత్ర సమరంలో చురుకుగాపాల్గొన్నవాడు ఆంధ్రపత్రిక కు సంపాదకుడు తెలుగునాట మొదటి తరము వ్యాపార వేత్తలలో ప్రముఖుడు అంతే స్థాయిలో జాతీయ స్థాయిలో మహాత్మాగాంధీ లాంటి ప్రముఖులతో కలిసి పని చేసిన రాజకీయవేత్త నాగేశ్వర రావు పంతులు గారు.నాగేశ్వరరావు గారు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను అతను స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. అతను స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.
నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లాలో ఎలకుర్రు గ్రామములో 1867లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య.ప్రాధమిక విద్యను పూర్తి చేసుకొని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ, మద్రాస్ లో పట్టభద్రుడైనాడు ఆ కాలేజిలో ప్రముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం అతని పై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనును ప్రభావితం చేశాయి ఆ తరువాత ఔషదాల విక్రయ వ్యాపారము కోసము కలకత్తా వెళ్లారు. అక్కడ ఔషదాల తయారీలో ప్రాధమిక అంశాలను నేర్చుకున్నారు అక్కడ నుండి ముంబై లోని ఒక యూరోపియన్ కంపెనీలో పనిచేయటానికి ముంబై వెళ్లారు. అనతికాలంలోనే తన ప్రతిభతో అంచలంచలుగా ఎదుగుతూ ఆ సంస్థ యజమానిగా మారాడు తనకంటూ ప్రత్యేకమైన విషయాన్నీ వృద్ధి చేయాలన్న తలంపు ఎప్పుడు మనసులో మెదులుతూ ఉండేది. అప్పటికే జాతీయ స్వతంత్ర భావాలు ఆయనలో అభివృద్ధి చెందినాయి. కందుకూరి వీరేశలింగము గారి ప్రభావము వీరిపై ఎక్కువగాఉండేది.
కలకత్తాలో మందుల పరిశ్రమలో సంపాదించిన అనుభవంతో మంచి ఘాటైన పసుపు రంగులోని నొప్పి నివారిణి బామ్ ను భారీగా తయారుచేసే ఒక కంపెనీని 1893లో ముంబై లో ప్రారంభించారు.ప్రారంభములో ఏ ఉత్పత్తి అయినా పాపులర్ అవటానికి కష్టపడాలి అలాగే నాగేశ్వర రావుగారి బ్రాండ్ కూడ నాగేశ్వరరావు గారు తన అమృతాంజనం బామ్ ను సంగీత కచేరీలు జరిగే చోట ఉచితముగా పంచి పెట్టేవారు తరువాతి రోజుల్లో ఇదే విధానాన్ని నిర్మా వాషింగ్ పౌడర్ ను పాపులర్ చేయటానికి ఆ కంపెనీ వ్యవస్థాపకుడు కర్సన్ భాయ్ పటేల్ కూడా అమలు పరిచాడు 1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత అతను తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో పులిట్జర్ ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం సెప్టెంబరు 1908లో బొంబాయినుండి అతను ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు గారి వ్యాసాలు అయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై అతను అవగాహననూ ప్రతిబింబించాయి.
1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభించారు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో 'ఆంధ్ర గ్రంథమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.
ఆనతి కాలము లోనే నాగేశ్వర రావు గారి వ్యాపారము బాగా అభివ్రిద్ది చెందింది అప్పట్లో అమృతాంజనం ఖరీదు పది ఆణాలు (రూపాయికు16 ణాలు) అంత తక్కువ రేటుకు అమ్మినా అమృతాంజనం నాగేశ్వర రావు గారికి విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టి ఈ ఆంధ్ర వ్యాపార వేత్తను మిలియనీర్ ను చేసింది.అయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. అతను దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నాడు
వ్యాపారము బాగా అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల నాగేశ్వర రావు గారు సాంఘిక సంస్కరణల వైపు దృష్టి మళ్ళించాడు అప్పట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రము ఉండవలసిన అవసరము ఎంతకైనా ఉన్నాదని గట్టిగా విశ్వసించి ఆ దిశలో ప్రయత్నాలు సాగిస్తూ బొంబాయి లోని తెలుగు మాట్లాడే వారి తో సమావేశాలు నిర్వహించేవాడు. ఆ క్రమములోనే ఆంధ్రపత్రిక అనే పేరుతొ ఒక వార్తాపత్రికను ప్రారంభించాడు ఐదేళ్లలో ఈ పత్రిక బాగా పాపులర్ అయ్యింది ఆ తరుణములో రావుగారు మద్రాసుకు మారిస్తే ఎక్కువ మంది తెలుగు వారికి దగ్గర అవవచ్చు అన్న తలంపుతో తన కార్యస్థానాన్ని బొంబాయి నుండి మద్రాసుకు 1936 లో మార్చాడు.ఈ పత్రికలో మద్రాస్ ప్రెసిడెన్సీ లో భాగముగా కాకుండా తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము ఆవశ్యకతను వివరించే వ్యాసాలను ప్రచురించేవాడు.ఆ విధముగా తరువాతి కాలములో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ స్థాపకులలో ఒకడు అయినాడు ముఖ్యమైన నాయకులతో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసి ఉద్యమాన్ని ఇంటింటికి చేరేటట్లుగా కృషి చేసాడు.
రాజకీయాలలో చురుకైన పాత్ర వహిస్తూ 1924 నుండి 1934 వరకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కి అధ్యక్షుడుగాకొనసాగాడు. ఈయన ఈ ఉద్యమాలలో రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను స్వాతంత్ర ఉద్యమములో పోషించిన కీలక మైన పాత్ర వల్ల ఈయన దేశ సేవ త్యాగనిరతి మొదలైన లక్షణాలను గుర్తించి ఈయనకు దేశోద్ధారక అనే బిరుదును ఇచ్చారు.ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో అతను ఒకడు.ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ అతను వివరించాడు.
1937 నవంబర్ లో నాగేశ్వర రావు గారి స్వగృహములో తెలుగు నాయకులు అందరు సమావేశము అయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేశారు మద్రాసు లోని నాగేశ్వరరావు గారి నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది నాగేశ్వరరావు గారు అసమాన దానశీలి. అయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తుండేవాడు. అతను ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. అతను దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ అతనును విశ్వదాత అని కొనియాడాడు. ప్రపంచ యుద్ధము కారణముగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము వెనుకకు నెట్టబడింది చివరకు స్వాతంత్రము తరువాత ఆ కోరిక 19 , డిశంబర్ 1952 లో కార్య రూపము దాల్చి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది. కానీ దురదృష్టము ఏమిటి అంటే నాగేశ్వరరావు గారు తన కల నెరవేరటం చూడకుండానే 11,ఏప్రిల్,1938న స్వర్గస్తులైనారు అంటే తన ఇంట్లో తెలుగు నాయకులందరి సమావేశము ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కోసము యాక్షన్ ప్లాన్ తయారు చేసిన ఐదు నెలలకు అయన చనిపోయినవారు
కాశీనాథుని నాగేశ్వరరావు గారి తెలుగు భాషాభిమానము, సాహిత్యము, విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి అతను ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం. ఇతను భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు, ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంథమాల ద్వారా అతను తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ, విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు. ఇతను బసవపురాణం, పడింతారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలగు పూర్వపు గ్రంథాలను, మాలపిల్ల, మహాత్మాగాంధీ ఆత్మకథ మున్నగు ఆధునిక గ్రంథాలనేం ప్రచురించాడు. ఇతను అనేక విషయాలపై వ్యాసాలు, అనేక గ్రంథాలకు పరిచయవాక్యాలు, ప్రవేశికలు కూడా రాశాడు. 1938లో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు యొక్క ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము యొక్క మూడు సంపుటాలు ముద్రించాడు. తెలుగు నాటకరంగానికి కూడా అతను పలురకాల సేవలు చేశారు. తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్తును 1929లో స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో అతను కూడా ఒకరు అయన ఆలోచనలు అయన ప్రచురణ సంస్థ "ఆంధ్ర గ్రంథ మాల" మరియు అయన ఏర్పాటు చేసిన గ్రంధాలయము,కాశీనాథుని నాగేశ్వరరావు గారు తన 70వ ఏట 1938లో మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ అతను సేవ ఎనలేనిది. భారతదేశపు ప్రియమైన నొప్పి నివారిణి అమృతాంజనం ద్వారా ప్రజల మనస్సులలో చిరస్థాయిగా అయన వారసత్వముగా నిలిచిపోయినాయి అయన తదనంతరము అయన అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ గారి ఆధ్వర్యములో చాలా కాలము ఆంధ్ర పత్రిక నడిచింది.
అంబడిపూడి శ్యామసుందర రావు

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు