భారతీయ తాత్వికచింతన గొప్ప మలుపు తిప్పిన బుద్ధుడు - Pillaa Kumaraswaamy

భారతీయ తాత్వికచింతన గొప్ప మలుపు తిప్పిన బుద్ధుడు

క్రీ.పూ.563లోవైశాఖ పూర్ణిమలో నేటి నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరానికి సమీపంలో లుంబినీ గ్రామంలో బుద్దుడు జన్మించారు. బుద్ధుడు హేతువాది, గొప్ప విజ్ఞాని, బుద్ధుడు చెప్పిన విషయాలు ఆధునిక విజ్ఞానం చెప్పే సూత్రాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ విశ్వం ఎలాంటి అతీంద్రియ శక్తుల సహాయం లేకుండానే నడుస్తోందని చెప్పాడు. ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి ఆధారపడి నడుస్తోందని చెప్పాడు. ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి సంబంధాలు కలిగి వుంది. ఈ సంబంధాల అల్లికలో ఎలాంటి ప్రాకృతిక శక్తుల జోక్యానికి అవకాశం లేదన్నాడు. ఇంద్రజాలానికి, మహేంద్ర జాలానికి మంత్రతంత్రాలకు చోటు లేదన్నాడు. ఈ విజ్ఞానాన్ని థేరవాదం పాటిస్తున్నది. ఆయన ప్రతిపాదించిన విజ్ఞాన దాయక విషయాలు ప్రధానంగా 1. ఈ ప్రపంచం ప్రతిక్షణం మారుతూ వుంటుంది. ఈ మారే ప్రపంచం వెనుక మారనిది ఏదీలేదు.నిత్యమైనది ఏది ఉండదు అని చెప్పారు. ప్రతీది నిరంతరం మార్పు చెందుతుందన్నారు.ఈ క్షణం లో కనిపించే దీపశిఖ మరో క్షణం లో కనిపించే దీపశిఖ ఒకటి కాదన్నారు..ఈ ప్రపంచం మారుతూ ఉంటుందన్నారు. దీనినే మార్క్స్ ప్రపంచంలో మార్పు ఒక్కటే మారని దన్నాడు.అయితే ఆయన ప్రపంచం లోని విరుద్ద శక్తుల మధ్య నున్న ఘర్షణ ద్వారా మార్పు జరుగుతోందన్నారు. 2. ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైనది, ఆశ్రయమైంది మరొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచం సర్వసమృద్ధం, సర్వస్వతంత్రం, తనకుతానే ఆధారమైంద న్నారు.విశ్వం స్వయంభువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3. ప్రతిదీ ఉన్నది అనేది ఒక కొస అయితే ప్రతిదీ లేదనేది మరో కొస అవుతుంది. అసలు సత్యం ఈ రెండు కోసల మధ్య ఉందన్నారు. 4. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. ప్రతిదీ ఒక ప్రవాహం, నది ప్రవహిస్తున్నట్లు ఈ విశ్వం విస్తృతమవు తోందన్నారు. సైన్సువిశ్వం వ్యాకోచిస్తోందని చెపుతోంది. 5.ఆత్మ లేదని స్పష్టం చేశారు. ఆత్మ ఉన్నదని చెప్పే ఏ మతమైనా అది అనుసరణీయం కాదన్నారు. అలా చెప్పడం మూఢత్వమే అన్నారు. 6.ప్రతి కార్యానికి కారణం ఉంటుంది అన్నాడు. ప్రతిదానికి హేతువు ఉంటుంది అన్నారు. హేతువు లేకుండా ఉన్న దేనిని నమ్మకూడదు అన్నాడు. ప్రతీది పరిశీలించి, చూసి, మీ పరిశీలనలో నిజమని తెలితేనే నమ్మండి అన్నారు. ఎవరో చెప్పినది నమ్మడానికి వీలులేదు అన్నారు.ఇది నేడు విజ్ఞాన శాస్త్రం చెప్తున్నదిదే. 7.ఆయన ప్రతిత్యసముత్పాద సిద్ధాంతం ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పాతది నశించి కొత్తది పుడుతుంది.ఈ పద్దతి ఒక ప్రవాహం లాగా సాగుతుంది.దీనిని విచ్చిన్న ప్రవాహం అన్నారు. విత్తనం నాశనం అవుతూనే మొక్క పుడు తుంది. కులనిర్మూలన జరిగాకే సమాజం మార్పుకు గురవుతుంది.పాతది పూర్తిగా నశించి కొత్తది ఏర్పడుతున్న సంధికాలం మనం గుర్తించనంతగా వుంటుంది.ఇదొక శూన్యకాలం.నాగార్జునుడు దీన్నే శూన్యవాదంగా ప్రతిపాదించాడు. పాత దాంట్లో నుంచే కొత్తది ముందుగానే ప్రారంభమై పాతది నశించగానే కొత్తది ముందుకొస్తుందని మార్క్సిజం చెపుతోంది. 8.దేవుడు ఉన్నాడా లేడా అన్నది ప్రధానం కాదు.దుఃఖనివారణే ప్రధానం అన్నారు. సృష్టికర్త అంటూ ఎవరో ఉన్నారని నమ్మడం మూఢత్వమే అవుతుందంటూదైవ భావనను వ్యతిరేకించారు. 8. విద్యుత్తు ఎక్కడ ఉంటుందో అక్కడ అయస్కాంత శక్తి కూడా ఉంటుంది. విద్యుత్తును వెన్నంటి అయస్కాంత శక్తి ఉన్నట్టే శరీరంతో పాటు చైతన్యం కూడా ఏర్పడు తుందన్నారు. 9.ఎవరో చెప్పినారనో, ఎక్కడో రాసినారనో వాటిపై ఆధార పడకుండా నీ స్వబుద్ధితో ఆలోచించి స్వయంగా తేల్చు కోవడమే బుద్ధునిగా మారిడాన్నదానికర్థమన్నారు. సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధమని ఆయన చెప్పారు. బుద్ధుడు జీవిస్తున్న కాలంలో యజ్ఞయాగాదులు విపరీతంగా జరుగుతుండేవి. ఆయజ్ఞయాగాదుల్లో జంతుబలి తప్పనిసరిగా వుండేది. భగవంతుని సేవించటానికి భక్తిని ప్రదర్శించటానికి, కోరికలు నెరవేర్చుకోవటానికి వేలాది జంతువులను బలిచ్చేవారు. ఇప్పటిలాగా పూలు, పండ్లు, తియ్యని తినుబండారాలుపెట్టేవారు కాదు. ఆ సందర్భంలో జరిగే హింసాత్మకతతో కూడిన ప్రార్ధనలను, కర్మకాండలను బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. బుద్దుడు హింసకు బదులుగా మానవీయ లక్షణాలను ప్రతిపాదించాడు. ఇతరుల పట్ల దయ, కరుణ, ప్రేమవుండాలని చెప్పాడు. మనిషి మనిషిగా మనుగడ సాగించడానికి పంచశీల బోధించాడు. ఆయన బోధనలు సమాజం సజావుగా నడవడానికి,మనిషి తన ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.ఇవి నేటికీ సమాజం అందుకోలేక పోతోంది. బుద్ధుడు బోధించిన పంచశీల : 1 జీవహింస చేయకపోవడం 2. దొంగతనము చేయకపోవడం 3. వ్యభిచరించక పోవడం 4. అసత్యంచెప్పకపోవడం 5. మత్తు పదార్థాలను, మద్యాన్ని సేవించకపోవడం. బుద్దుడు మానవతావాది. మానవున్ని కేంద్రంగా చేసుకొని మనిషి ఆనందంగా నివసించడానికి కావలసిన సామాజిక వాతావరణాన్ని కల్పించాలన్నాడు. బుద్ధుడు మనిషికి సంబందించిన నాలుగు ఆర్యసత్యాలు (నోబుల్ ట్రూత్స్) చెప్పాడు. అవి 1. మనిషికి దు:ఖం ఉంది. 2 దుఃఖానికి కారణం ఉంది 3. దుఃఖ నివారణ ఉంది. 4 దుఃఖ నివారణ మార్గం ఉంది. బుద్ధుడు దు:ఖమంటే ఏమిటో వివరించాడు. జన్మదు:ఖం, ముసలితనం దు:ఖం, రోగం దు:ఖం, మరణం దు: ఖం, అప్రియమైన వాటితో సంగమం దుఃఖం, ప్రియమైన వాటి నుండి విడిపోవడం దు:ఖం, కోరినది లభించకపోతే దుఃఖం, కోరికలంతా దు:ఖమే. మనుషులు దు:ఖంతో, కష్టాలతో, పేదరికంతో సతమతమవుతూ జీవిస్తున్నారనేది ఆయన రెండో భావన. ప్రపంచమంతా దు:ఖమయం. ఈ దు:ఖాన్ని ప్రపంచం నుండి తొలగించడం ఎలాగన్నదే ఆయన ధర్మం. మరేది ఆయన ధర్మం (మతం) కాదు. ప్రస్తుత ప్రపంచీకరణలో దు:ఖం అంటే మనిషి పరాయీకరణ చెంది మనిషి పొందే మానసిక సంఘర్షణగానూ లేదా మానసిక వ్యాకులతగానూ మనం తీసుకోవచ్చు. దీన్ని నివారించటానికి బౌద్ధం ఆచరణాత్మక సమ్యక్ మార్గాలను ఎనిమిదింటిని (అష్టాంగ) చూపింది. ఇక్కడ సమ్యక్ అనగా మంచి అని అర్థం. అష్టాంగమార్గాలు : 1) సమ్యక్ దృష్టి (రైట్ వ్యూస్) : అవిద్య నాశనమే సమ్యక్ దృష్టి లక్ష్యం. పూజాకర్మకాండల మీద విశ్వాసం పదలమంటుంది. శాపాల పవిత్రతను విశ్వసించవద్దంటుంది. ప్రాకృతిక శక్తులను, మూఢనమ్మకాలను వదిలివేయమంటుంది. అనుభవం మీదగాని, వాస్తవిక విషయాలమీద గానీ ఆధారపడని అన్ని రకాల ఊహాసిద్ధాంతాలను త్యజించమంటుంది. 2) సమ్యక్ సంకల్పం (రైట్ డిటర్మినేషన్) : ఇది దృఢంగా నిశ్చయించుకోవడానికి మార్గాన్ని చెబుతుంది. 1) కోరికలకుకల్లెంవేయాలి 2) ఇంద్రియలోలుడు కాకుండా భోగలాలసత నుంచి బయటపడాలి.3) ద్వేషభావం మానుకోవాలి4) ఏ ప్రాణికి ఏవిధమైన హాని చేయరాదు. 3) సమ్యక్ భాషణం (రైట్ స్పీచ్) : ఇది ఇలా బోధిస్తుంది... 1) ఎల్లప్పుడూ నిజాన్ని చెప్పాలి. 2) అబద్ధం చెప్పరాదు. 3) ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు. 4) అపవాదులు వేయరాదు. 5) తోటివారిని తిట్టరాదు, కోపగించుకోరాదు. 6) అందరితో మర్యాదగా, దయతో ఉండాలి. 7) వ్యర్థ సంభాషణ చేయరాదు. ఏది మాట్లాడినా అర్థవంతంగా ఉండాలి. 4) సమ్యక్ ఆచరణ (రైట్ యాక్షన్) : ఇది సరైన ప్రవర్తనను బోధిస్తుంది. 1) ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. 2) ఇతరుల హక్కులను గుర్తించాలి. 5) సమ్యక్ జీవనం (రైట్ లైవ్లిహుడ్) : ఇది వ్యక్తికి, సమాజానికి నిజమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. 1) జీవించడానికి సరైన వృత్తిని అవలంబించాలి 2) ప్రాణికోటికి బాధ కలిగించే బానిసల వ్యాపారం, ఆయుధాలను, జంతువులను, మద్యం, మాంసం విక్రయించే వ్యాపారాలు చేయకూడదు. 3) చేస్తున్న వృత్తిలో, వ్యాపారాలలో వంచన, అవినీతి,మోసం మొదలైనవి చేయరాదు. 6) సమ్యక్ కృషి (రైట్ ఎఫోర్ట్) : ఇది నాలుగు పనులు చేస్తుంది, మనస్సుకు శిక్షణ నిస్తుంది.ఆ నాలుగు ఏవంటే 1) మనసులో చెడు తలంపులను ఇంద్రియ నిగ్రహంతో రాకుండా చేయడం 2) ఒకవేళ వస్తే వాటిని అణచివేయడం 3) మానసిక దౌర్బల్యాలను అరికట్టి మనసును ప్రక్షాళన చేయడం, 4) మంచి ఆలోచనలను, మంచి విషయాలను పెంపొందించడం. 7) సమ్యక్ చైతన్యం (రైట్ కాన్షియస్ నెస్) : ఇది సరైన జాగరూకత, సరైన ఆలోచనలు ఉండాలని చెబుతుంది. 1)మనస్సు ఎప్పుడూ మేల్కొని ఉండటం, నిర్మలంగా ఉంచుకోవడం 2) మోహవికారాదులు కలుగకుండా చూసుకోవడం 3) దురాశకు దూరంగా ఉండటం 8) సమ్యక్ నిమగ్నత (రైట్ మెడిటేషన్) : ఇది మనస్సును ఏకాగ్రత సాధించడానికి శిక్షణ ఇస్తుంది. మంచి పనుల గురించి ఆలోచించడానికి అది మనస్సుకు శిక్షణ ఇస్తుంది. చెడుపనులు, చెడు ఆలోచనలవైపు పోకుండా నిరోధిస్తుంది, బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాలు, పంచశీల ధర్మాల ఆధారంగా బౌద్ధం ఇప్పటికీ నడుస్తోంది. బుద్ధుడు తను చెప్పే ధర్మాలన్నింటిని ఆనాటి ప్రజల భాషైన పాళీ భాషలో ప్రచారం చేశాడు. ఆనాటి పాళీభాషలో తెలుగువారువాడే చాలా పదాలు ఉన్నాయని భాషాశాస్త్రవేత్తలు చెపుతున్నారు. యజ్ఞ యాగాదులను చేయవద్దని చెప్పడమే గాక వేదప్రమాణాలను తిరస్కరించారు. జీవహింస చేయరాదన్నాడు.మనిషి నాగరికంగా జీవించడాని కనువైన పంచశీల బోధించారు. అయితే ఆయన పునర్జన్మ విషయంలో స్పష్టం గా చెప్పక పోవడంతో ఆయన తదనంతరం బౌద్ధంలో చీలిక వచ్చింది. వీరు మహా యానులు, (హీనయానులు)థేరవాదులుగా చీలి పోయారు. హీనయానులను థేరవాదులని పిలిచారు.మహా యానంలో భావవాదం ప్రవేశించింది. బుద్దుని దేవునిగా చేశారు.మరికొంతమంది తాంత్రిక విద్యలను కూడా ప్రవేశపెట్టి వజ్రయాను లయ్యారు.థేరవాదులు మాత్రం భౌతిక వాదం స్వీకరించి బుద్దుని ధమ్మాలను పాటిస్తున్నారు. ఆత్మ, పరమాత్మ ల చర్చలతో సతమవుతున్న భారతీయ తాత్విక చింతనను, మానవుని కేంద్రం చేసుకుని మానవీయ భావనలను ప్రచారం చేసి,తాను ఆచరించి, ఆచరణాత్మక తాత్విక చింతనను ప్రవేశ పెట్టడం ద్వారా గొప్ప మలుపు తిప్పాడు బుద్ధుడు.

మరిన్ని వ్యాసాలు

ద్వీపాలు-వర్షాలు.పురాణకథ.
ద్వీపాలు-వర్షాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మాస్క్ బాంబులు
మాస్క్ బాంబులు
- చంద్ర శేఖర్ కోవూరు
Lahiri Lahiri Lahirilo -2
లాహిరి లాహిరి లాహిరిలో-2
- కర్రా నాగలక్ష్మి
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
- డా.బెల్లంకేండ నాగేశ్వరరావు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కోరికలే గుర్రాలు ఐతే
కోరికలే గుర్రాలు ఐతే
- చంద్ర శేఖర్ కోవూరు