మిక్కిలినెని. కళారత్నం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మిక్కిలినెని.  కళారత్నం.

నాటక, సినీ రంగాలలో రాణించిన కళామూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తగారు 1916 జూలై7 వ తేదిన కృష్టాష్టమి నాడు సౌభాగ్యమ్మ,వెంకయ్య గార్లకు గుంటూరు జిల్లాలోని లింగాయపాలెంలో జన్మించారు. వీరికి ఇద్దరు చెల్లెళ్ళు - నలుగురు అన్నదమ్ములు. విజయవాడ వద్దనున్న కోలవెన్నులో ప్రాధమికవిద్య, హైస్కూలు విద్య పునాదిపాడులో అభ్యసించి "పశువైద్యాచార్య" పట్టాపొందారు. తన బాల్యంలో గ్రామంలొ ప్రదర్మించే జంగంకధలు, వీధిభాగవతాలు, తోలుబొమ్మలాటలు, చక్కభజనలు, పగటివేషాలు, హరికధలు వంటి వివిధ జానపద కళారుపాలు వీరిని బాగా ఆకర్షించాయి. తొలిసారిగా కోలవెన్ను గ్రామంలోని పంచముఖ ఆంజనేయ నాటక సమాజంలో "చింతామణి"లో భవాని శంకరుని పాత్ర ధరించారు. అలా పలు నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించి మెప్పు పొందారు. అలా కపిలవాయి రామనాధశాస్త్రిగారి శిష్యులు అయ్యరు. కొంత కాలం చిత్రకళా, ఫోటోగ్రాఫి నేర్చుకున్నారు. సాటి కళాకారిణి సీతారత్నం గారిని వివాహం చేసుకున్నారు. ఈమె ప్రజానాట్యమండలిలో రాష్ట్రకమిటి సభ్యురాలు. "మాభూమి" ప్రదర్మనలో కధానాయకిగా మిక్కిలినేని వారి సరసన నటించి, నాటి స్వాతంత్ర్య పోరాటంలో కమ్యునిస్టు పార్టిలో వీరు ప్రజా కళాకారులుగా ఎనలేని సేవలు అందించారు. 1955-56 ప్రాంతంలో వీరు సినిమాలలో నటిస్తూనే నటనపై నార్ల వెంకటేశ్వరరావు గారి కోరికపై వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అలా చరిత్ర గర్బంలో కలిసి పోతున్న కళాకారుల గురించి, దాదాపు నూటయాభై జానపద కళారూపాల గురించి భావితరాలకు తెలిసేలా 'నటరత్నాలు' పేరిట రెండు భాగాలు. 'ఆంధ్రనాటకచరిత్ర' - 'తెలుగువారి జానపదకళారూపాలు' - 'ప్రజాపోరాటరంగస్ధలం' - 'ఆంధ్రుల నృత్యవికాశం' - 'తెలుగువారి చలనచిత్ర కళ' వంటి పలు ఉత్తమ రచనలు చేసారు. సినిమా రంగంలో చారిత్రక చిత్రాలలో "తెనాలిరామకృష్ణ"(1956) రాజద్రోహి కనకరాజుగా, "పల్నాటియుద్దం"లో కన్నమదొరగా, "మహామంత్రి తిమ్మరుసు "(1962) లో రామలింగనాయకుడిగా, అమరశిల్పిజక్కన్న(1964)లో విష్ణువర్ధనుడిగా, అలానే పౌరాణికాలలో "మాయబజార్"(1957)లో బలరాముడిగా, " సీతారామకల్యాణం(1961)లో జనకుడిగా, "శ్రీకృష్ణపాండవవీయం"- "శ్రీకృష్ణసత్య" - "దానవీరశూరకర్ణ" చిత్రాలలో భీముడిగా, జానపదాలలో "రాజకోటరహస్యం" - "భామావిజయం"  - "అగ్గివీరుడు" - "ప్రతిజ్ఞాపాలన" - "లక్ష్మికటాక్షం" సాంఘీక చిత్రాలు "వరకట్నం" - "ఉమ్మడికుటుంబం" - "మేనరికం" - "లక్షాధికారి" - "కులగోత్రాలు" వంటి దాదాపు నాలుగు వందల చిత్రాలకు పనిచేసారు. వీరు రచించిన ఆంధ్ర నాటక చరిత్రను అక్కినేని వారికి అంకితం ఇచ్చారు. అలాగే నాలుగు వందల మంది రంగస్ధల కళాకారులను పరిచయం చేసిన "నటరత్నాలు" రెండు భాగాలకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఆకాడమి బహుమతి లభించింది. ఈ పుస్తకాలను నందమూరి వారికి అంకితం ఇచ్చారు. వేయి పేజిలు కలిగిన "తెలుగు వారి జానపద కళా రూపాలు" పుస్తకానికి, తెలుగు విశ్వ విద్యాలయం వారి పురస్కారం లభించింది. 'ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వీరిని "కళాప్రపూర్ణ" పురస్కారంతో గౌరవించింది. డా. సి. నారాయణరెడ్డి, గుమ్మడి, నేరెళ్ళవేణుమాధవ్, నందమూరి వార్లతో సన్నిహితంగా ఉండే మిక్కిలినేని 2011 పిబ్రవరి 21 న శాశ్వితనిద్రలో ఒరిగిపోయారు.