వివేకానందుడు యువతకిచ్చిన సందేశం - పిళ్లా కుమారస్వామి

వివేకానందుడు యువతకిచ్చిన సందేశం

వివేకానందుడు యువతకిచ్చిన సందేశం భారతీయ జీవన స్రవంతిలో ఆచంద్రార్కం నిలిచిన మహోన్నతమూర్తి వివేకానందుడు.అతని మనసంతా దేశభక్తి మయం. అతని జీవిత పరమావధి పేదలను రక్షించడం. తన దేశ ప్రజలను ప్రపంచంలో మొదటివారుగా గుర్తించాలని తపన పడిన ఉత్సాహశీలి. తన ఆఖండ విజ్ఞాన వాహినితో, నిర్జర ఝరీ ప్రవాహక ప్రసంగాలతో కంచు కంఠంతో ప్రపంచాన్ని ముఖ్యంగా యువతను ఉర్రూతలూ గించాడు. వైషమ్యాలతో, నిరాశా నిస్పృహలతో ఆత్మవిశ్వాస లేమితో కొట్టుమిట్టాడు వారికి కనువిప్పు కల్గించి తేజోవంతులను చేసిన మనోజ్ఞమూర్తి. యౌవన దశలోనే జీవిత సారాన్ని కాచి వడపోసి, దేశంలోని సంక్లిష్ట పరిస్థితులను అవగాహనతో అవలోకించిన లోకమనే పాఠశాల చదువరి. ఆయన జీవితం యువతకు ఒక సందేశం, ఒక స్పూర్తి." ఆయన పలికిన ప్రతి పలుకూ నేటి నైరాశ్యవు యువతను తట్టి లేపే ప్రచండ గర్జన. వివేకనందుడు తనకు యువతపై, తన దేశంపై గల నమ్మకాన్ని ఇలా వివరిస్తాడు. “నాకు నా దేశంపై, యువతరంపై అఖండ విశ్వాసముంది. ఉజ్వల యశస్సునందుకుని నలుదిశల పరివ్యాప్తిస్తుంది. నిత్యనూతన యవ్వనంతో గంగా స్రవంతిలా నా ప్రజలు ముందుకు సాగుతారు. నేటి యువతే నా దేశానికి ఆయువు పట్టు". నేటి యువత నైరాశ్యంలో వుంది. అదే సమయంలో కొంతమంది ఈ నైరాశ్యం జాడ్యం నుంచి బయటపడి ప్రజాసేవకులై పీడిత జనావళి ఆకాంక్షల కోసం అహర్నిశలు పోరాటాలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు. ఆత్మవిశ్వాసంతో తమకు రాణింపుగల రంగాలలో అవకాశాలను అంది పుచ్చుకొని వెళుతున్నారు. గతంలో కోనేరు హంపి చెస్ రంగంలో రాణించడం, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ రాణించడం నేడు సింధు షటిల్ గేమ్ లో ,ఇలా మొదలైన వారెందరో రాణిస్తున్నారు.ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. వివేకానందుడు యువతపై వుంచిన నమ్మకాన్ని సాఫల్యం చేయడానికి నేటి యువత మరింత పట్టుదలతో దేశభక్తి పూరితంగా , మతోన్మాద, కులోన్మాద రహితంగా ప్రాంతీయ సంకుచిత్వాన్ని వీడి విశాల ప్రజానీకం ఆకాంక్షల్ని, ఐక్యతను ఆశిస్తూ ముందుకెళ్లడానికి నడుం బిగించాల్సి వుంది. అమెరికా, జపాను దేశాలు సంచరించిన వివేకనందుడు వారి యువతను గమనించిన తరువాత మన దేశ యువతరాన్ని చూచి "నేడు అమెరికాలో, జపాన్లో యువకులు ప్రతి పనిలో ఉత్సాహ వంతులుగా ఉన్నారు. అందుకే వారుపారిశ్రామి కంగా ఎంతో ముందున్నారు. త్వరితగతిన స్వాలంబన సాధించారు. జపాను యువత తన దేశాన్నిసర్వతోముఖాభివృద్ధి కోసం సమిష్టితత్వంతో పని చేస్తోంది. కాని మన దేశంలో యువత నిరాశా నిస్పృహలతో ఉంది. నిరుత్సా హవంతమైన యువత సమాజ పురోగమానికి చేటు" అంటూ ఆనాడే తన అభిప్రాయం తెలియజేశాడు. వివేకానందుడు తన సహజ గంభీరమైన పలుకులతో యువతను మేల్కొలుపుతూ... " ఓ యువకుల్లారా! పరిశ్రమ చేయండి! బాగా ఆహారం తీసుకోండి! బుద్ధిబలం పెంచుకోండి.." “Awake! Arise! Stop not till you reach your goal" . “మేలుకో, లే లెమ్ము! అలసత్వం వద్దు, గమ్యం చేరేదాకా నీపరుగును, ప్రయత్నాన్ని ఆపకు" అని యువతను ప్రోత్సహించాడు. ఆయన అందించిన ఉత్సాహం నేటికీ యువత గుండెల్లో మార్మోగుతోంది. “మీ నిరాశా నిస్పృహలను పటాపంచలు చేయండి. నీ భారత ప్రజలకు, నీ సాటి మానవుల కొరకు, రండి ముందుకు - కదలిరండి ముందుకు " అని యువతకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపునందుకున్న సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ఒక సంకేతం. సిస్టర్ నివేదిత వివేకానందుని ఆదర్శాలను సాఫల్యం చేయడానికి కృషి చేయడం మరొక చక్కని ఉదాహరణ. ఒక సభలో యువశక్తి గూర్చి చెపుతూ - ''నాకు వందమంది బుద్ది బలశాలురైన యువకులను ఇవ్వండి. మీకు సుందర మహోన్నతమైన, పటిష్టమైన సమసమాజ రాజ్యాన్ని మీకిస్తాను " , వివేకానందుడు ఆశించిన సమసమాజం కొరకు ప్రపంచీకరణ ప్రభావంతో వ్యాపార సంబంధాలుగా వ్యక్తి శ్రేయస్సే పరమావధిగా మారిన నేటి పరిస్థితిలో యువతీ యువకులు ఆ ప్రభావం నుండి బయటపడి పాటుపడాల్సిన అవసరం నేడుంది. అందుకే వివేకానందుని ఆదర్శాలను మనం అధ్యయనం చేయాల్సిన అవసరం అందరి ముందర వుంది. యువకునిగా అతనిలోని భావావేశం, దేశభక్తి, ఆయను అలా మలిచాయి. పేదల పట్లఆయన కున్న కరుణ మహోన్నతమైనది. వారి పురోగమనానికి ఆయన కంకణ బద్దుడయ్యాడు. అందుకనే “ఆకలిగొన్న వానికి వేదాలు కాదు కావాల్సింది. కాసింత కడుపునిండా తిండి. కడుపు నిండిన తరువాత వేదాలు కావాలంటే చెప్పండి" అని ఆయన వేదాల గురించి గొప్పగా మాట్లాడే వారినుద్దేశించి చెప్పాడు. భారతదేశ సర్వ సమస్యలకు మూల కారణం అవిద్యేనని ఆయన గ్రహించాడు. అందుకే ఆయన యువకులతో "ఓ భారత యువతీ యువకుల్లారా! నేడు మన దేశంలో పేదరికం, నిర్లక్షరాస్యత ప్రబలి వుంది. వాటిని రూపుమాపేందుకు నడుం బిగించండి. గ్రామీణ ప్రజలకు విద్యనేర్పటానికి మీకు కావలసినవి 'మూడు'. ఒకటి- లాంతరు, రెండు మ్యాపు, మూడు-గ్లోబు. ప్రతి యువకుడు ప్రతి గ్రామంలో వీటిని వుపయోగించి దేశదేశాల పరిసితుల గూర్చి వివరించండి. వారికి లేని జ్ఞానాన్ని ప్రసాదించండి. వారిని అక్షరాస్యులుగా మార్చండి. వారికి జరిగే అన్యాయాలను వివరించండి. వారిని జాగృతం చేయండి. వారిని కార్యోన్ముఖులను చేయండి". ఇలా ఆనాటి యువతకు ఉద్బోధ చేసి కర్తవ్యం వైపు మరల్చిన మహోన్నతమూర్తి వివేకనందుడు. నేడు అభ్యుదయ కాముకుల సహృదయాల్లో సజీవంగా వున్నాడు. " కాని కొంతమంది మతోన్మాదులు ఆయనను హిందూమత పరివ్యాప్తి కొరకు మాత్రమే కృషి చేయనట్లుగా ప్రచారం చేయడం ఆయనకు ద్రోహం చేయడమే అవుతుంది. ఇలాంటి ప్రచారాలను తిప్పికొడుతూ ఆయన ఉత్తమ ఆశయాలను, ఆదర్శాలను ఆచరణలో చూపించి భవిష్యత దేశపటాన్ని పురోగమనం వైపు మరల్చాల్సిన బాధ్యత అభ్యుదయకాముకులైన యువతీ యువకులపై నేడెంతో వుంది. మరో ప్రపంచం కొరకు సమసమాజ నిర్మాణం కొరకు ఐక్యంగా సాగుదాం! అసమానతను పాతరవేయడానికి సమర్థవంతంగా కలిసి సాగుదాం!! __ పిళ్లా కుమారస్వామి 9490122229