అభ్యుదయవాది దామోదరం సంజీవయ్య. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అభ్యుదయవాది దామోదరం సంజీవయ్య.

అభ్యుదయవాది దామోదరం సంజీవయ్య.1921--2021.
(శత జయంతి వేడుకల సందర్బంగా) 9వ తేదిన వీరి వర్ధంతి.
విద్యా వినయశీలి,సద్గుణ సంపన్నుడు,ఉత్తమ ఆశయాలకు ప్రతిరూపమే దామోదరం సంజీవయ్యగారు.మన రాష్ట్రానికి తొలి హరిజన ముఖ్యమంత్రి కూడా వీరే!అలాగే జాతీయ కాంగ్రేస్ అద్యక్షునిగా సేవలు అందించిన మొదటి హరిజనుడు కూడా వీరే. పట్టుదల,నిరంతరకృషితో,జాతీయ వాదిగా సేవలు అందించిన వీరు కర్నులు జిల్లాలోని పెదపాడు గ్రామంలో 1921/ఫిబ్రవరి /14 న మంకులమ్మ,మునెయ్య దంపతులకు జన్నించారు. వీరి తండ్రి మునెయ్య చేనేత కార్మికుడు. మంచి రచయితకూడా, అనేక పద్యాలు,కీర్తనలు రాసారు.
చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోయిన సంజీవయ్యగారు పాలకుర్తి వీథిబడిలో విద్యాభ్యాసం ప్రారంభించి కర్నులు అమెరికన్ బాప్టిస్టు మిషన్ చర్చి స్కూలులో పదవ తరగతి పూర్తి చేసారు.తను మునిసిపల్ స్కూల్లో చదివే రోజుల్లో అంటరానితనం ఆయనను బాగా బాధించింది. బి.ఏ. మద్రాసులో చదివారు.
1946 లో మద్రాసు "లా"కాలేజిలో చేరారు.అలా పోస్టుగ్రాడ్యుయేషన్ స్ధాయిలో మద్రాసు ప్రభుత్వం స్కాలర్ షిప్ పొందిన తొలి వ్యెక్తికూడా వీరే!
ఆరోజుల్లో ప్రముఖ రచయిత రా.వి.శాస్త్రి వీరికి మంచి మిత్రులు వీరు 1950 ప్రాంతంలో జూనియర్ గా పని చేస్తున్నప్పుడు రాజకీయాలపట్ల ఆసక్తి పెరిగింది.అదేసంవత్సరం బెజవాడ గోపాలరెడ్డిగారి ప్రోత్సాహంతో తాత్కాలిక పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనారు. అప్పుడు వారి వయసు 29 సంవత్సరాలు.ఎందరో దేశభక్తులు,రాజనీతిజ్ఞుల ప్రసంగాలు పార్లమెంటులో వినడంవలన వీరికి జాతీయ ధృక్పధం అలవడిండి. అదేసమయంలో జవహర్ లాల్ నెహ్రు సంజీవయ్యగారిని బాగా అభిమానించేవారు.
కులమత వర్గద్వేషాలకు ప్రాంతీయ ధోరణలకు సంకుచిత రాజకీయాలకు అతీతంగా దేశాభ్యుదయం ప్రజాసేవకే జీవితం అంకితం చేయాలి అనే ధృఢ నిశ్చయంతో 1952 లో ఎమ్మిగనూరు-పత్తికొండ నియోజక వర్గంనుండి నాటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రశాసనసభకు ఎంపిక అయ్యారు.
రాజాజి మంత్రివర్గంలో అత్యంత ప్రతిభావంతులుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన వీరు సహాకార మంత్రిగా పనిచేసారు. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తొలి ఆంధ్ర రాష్ట్ర మంత్రి వర్గంలో పనిచేసారు. మధ్యపాన నిషేధానికికి గట్టిగా కృషిచేసారు.
1954 సంవత్సరంలో నవంబర్ లో ప్రభుత్వం మధ్యపాన నిషేద కారణంగా పడిపోయింది.అలా బెజవాడ గోపాల రెడ్డిగారి మంత్రివర్గంలో రవాణా వాణిజ్య శాఖల మంత్రిగా, నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో స్ధానిక స్వపరిపాలన,కార్మిక శాఖా మంత్రిగా ప్రతి గ్రామానికి ఒక పంచాయితి అనే వివాదం లేవనెత్తి ప్రజాస్వామిక వికేంద్రికరణ వ్యవస్తకు పునాది వేసారు. ఇది పంచాయితీరాజ్ వ్యవస్ధకు దోహదపడింది.అందరి ఆమోదం పొందింది.
1954 / మే/ 7 న కృష్ణవేణి గారితో సంజీవయ్యగారి వివాహం జరిగింది. 1960 లో వీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యరు.అప్పటికి ఆయన వయసు 39 సంవత్సరాలు స్వాతంత్ర్యానికి పూర్వం తరువాతకూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి హరిజనుడు వీరే!
భారతదేశంలోనే తొలిసారి గా బాలికల పాలిటెక్నిక్ కాలేజిని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఘనత వీరిదే!అనేక కార్పోరేషన్లకు రూపకల్పన ప్రారంభించారు.పులిచింతల ప్రాజెక్టుకు శంఖుస్ధాపన జరిగింది.
1962 అఖిలభారత కాంగ్రేస్ అధ్యక్ష పదవిని అలంకరించారు.1964 లో నెహ్రు మంత్రి వర్గంలో క్యాబినెట్ మంత్రిగా,అనంతరం లాల్ బహద్దూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలోనూ పనిచేసారు. 1966 ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పరిశ్రమల మంత్రిగా,1970లో మరలా కార్మిక మంత్రిగా 1971లో మరలా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు. వీరికి సాహిత్యంపైన మంచి పట్టు ఉండటంతో కొన్ని పద్యాలు,కొంత సాహిత్యం సృష్టించారు.నిరంతరం బడుగు వర్గాల ఉన్నతికి విషేష కృషి సల్పిన ఈమానవతావాది 1972/మే/8 నకొత్త ఢిల్లిలో గుండెపోటుతో మరణించారు.తెలుగుజాతి రత్నాలలో ఒకరైన వీరు అందించిన అపార సేవలుస్మరిస్తూ ఈ మహనీయుని స్మరించుకుందాం! నివాళి అర్పిద్దాము.