
అయ్యదేవర కాళేశ్వరరావు.
వీరు కృష్ణాజిల్లా నందిగామలో లక్ష్మయ్య,వరలక్ష్మమ్మదంపతులకు 1881 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఎల్.పరీక్షలోనెగ్గి 1906లో విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.
రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్యసంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేకఉద్యమంలోను,
హోంరూలుఉద్యమంలోను వీరు పనిచేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయంచేశారు. కొమర్రాజులక్ష్మణరావు
నెలకొల్పిన విజ్ఞానచంద్రికా గ్రంథమండలిలో కార్యదర్శిగా
పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర' 'తురుష్క ప్రజాస్వామికం ', చీనా జాతీయోద్యమ చరిత్ర', 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు.1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన విజయవాడపురపాలకసంఘ అధ్యక్షుడిగానూ,
మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.1939లో మద్రాసుశాసనసభకు కాంగ్రెస్ పార్టీతరపునవిజయవాడ- బందరులకు
ప్రాతినిధ్యంవహిస్తూపోటీచేసిఘనవిజయంసాధించారు. రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మద్రాసు ప్రభుత్వమేర్పడింది. దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందారు. 1946లో విజయవాడ నుంచి శాసనసభకు ఎన్నికైన కాళేశ్వరరావు ప్రకాశం పంతులు పక్షం వహించాడు. టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు కానీ ఆయన శిష్యుడు వేముల కూర్మయ్యకు మంత్రి పదవి కాళేశ్వరరావు ప్రభావం వల్ల లభించింది. ఆ ప్రభుత్వం ఏడాది లోపే పడిపోయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాననే ఉన్నాడు. 1947లో కాళేశ్వరరావు శాసనసభలో బహుభార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టాడు.స్వాతంత్ర్యానంతరం 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి సభాపతిగా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు. శాసనసభాపతిగా శాసనసభలో భాష తెలుగులోనే ఉండాలని 1959 డిసెంబరు 14న రూలింగ్ ఇచ్చారు. 1961 ఆగస్టు 11న సభాపతి అనుమతి లేనిదే సభలో ఎవరైనా ఎలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయరాదని రూలింగ్ ఇచ్చారు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.
అయ్యదేవర కాళేశ్వరరావు పలు పుస్తకాలను తెలుగులో రచించారు. వేదాంతం, చరిత్ర, రాజకీయాల నేపథ్యం పై అనేక రచనలు చేసారు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్టు చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రపై పుస్తకాలు రాసారు. ఆయన రాసిన 'నా జీవిత కథ' అనాటి ఆంధ్రోద్యమ చరిత్రకు సంబంధించిన విషయాలు కలిగి ఉంది. వీరిపేరిట విజయవాడలో మార్కెట్ నిర్మించబడింది. సాహిత్యంలోనూ, రాజకీయాలలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుపొందిన ఈమహనీయుడు 1962ఫిబ్రవరి 26 న తుదిశ్వాసవదిలారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.