అసాధ్యుడు - కవితాసంపుటి సమీక్ష - పుట్టి గిరిధర్

అసాధ్యుడు - కవితాసంపుటి సమీక్ష
తెలుగువారి ఠీవి - మన పీవీ
===================
 
దక్షిణాది నుండి ప్రధానిగా ఎన్నికైన ఏకైక తెలుగువాడు, తెలుగుజాతి కీర్తిపతాక మన పీవీ నరసింహారావు. ఆయన గురించి చెప్పాలంటే అక్షరాలు చాలవు. ఎన్నెన్నో సంస్కరణలు చేసుకుంటూ రాజనీతిజ్ఞుడుగా ఎదిగారు. ఆయన మౌనమే ఆయనను ఋషిలా చేసింది. విద్యార్థి దశనుండి ఉద్యమాల్లో పాల్గొంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని సరైన దారిలో కొనసాగించినవారు.
(వేయిపడగలు) సహస్రఫణ్, ఇన్ సైడర్ (లోపలి మనిషి) వంటి రచనలతో సాహిత్యంలో గొప్ప పేరుప్రఖ్యాతలు సాధించారు. అలాంటి పీవీ జీవితాన్ని అంశంగా తీసుకుని మొగ్గల ప్రక్రియలో "అసాధ్యుడు" గా తీసుకువచ్చారు భీంపల్లి శ్రీకాంత్. తాను స్వయంగా ఈ మొగ్గలు ప్రక్రియను సృష్టించి ఎందరో మొగ్గల కవులను పరిచయం చేస్తున్నారు.
 
"అసాధారణ ప్రజ్ఞావంతుడిగా తెలంగాణావనిలో ప్రభవించి
బహుముఖీన వ్యక్తిత్వంతో వెలుగొందిన జ్ఞానతేజస్సు
స్వయంకృషితో సకలరంగాల్లో తేజరిల్లిన ప్రజ్ఞావతంసి పివి"
 
అంటూ ఈ సంపుటిలో పీవీ జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. వందేమాతర ఉద్యమంతో మొదలై నిజాం నియంతృత్వ పాలనకు అలుపెరుగని పోరుసల్పిన పీవీ భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదల బతుకు మార్చాలనే తపనతో భూములను పంచిన ఉదార చరిత ఆయనది. స్వామీ రామానందతీర్థ అనుయాయుడిగా, సోషలిస్టు నాయకుడిగా గాంధీ అడుగుజాడల్లో నడిచిన నాయకుడు. దేశభక్తిని నరనరాన నింపుకొని బాల్యం నుండే పాండిత్యాన్ని ప్రదర్శించిన ప్రతిభా మూర్తి. తెలుగు అకాడమీ స్థాపనలో మాతృభాష పట్ల మమకారాన్ని చాటి, గురుకుల వ్యవస్థకు పునాదులు వేసి, ఇంటర్ విద్యను మొదలెట్టి విద్యావేత్త. సమాజసేవలో పాలుపంచుకుంటూ కష్టకాలంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన రాజనీతిజ్ఞుడు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన సంస్కర్త. భూసంస్కరణ చట్టాలను తెచ్చిన ధీశాలి. తెలంగాణ ముద్దుబిడ్డగా దేశ ప్రధానిగా ఎదిగి తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిన ఘనుడు. అటు రాజకీయాలను, ఇటు సాహిత్యాన్ని రెంటినీ రెండుకళ్లుగా చూసే మేధావి, బహుభాషాకోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు, హాస్యచతురుడు ఇలా ఎన్నో అంశాల్లో ఆరితేరినవాడు. ఇలా పీవీ గొప్పతనాన్ని చెబుతూనే, వారి జీవితాన్ని సరళమైన పదబంధాలతో వందకు పైగా మొగ్గలతో మన ముందుంచారు భీంపల్లి శ్రీకాంత్.
 
నిరంతర సాహిత్యచైతన్యంతో నిండి ఉండే భీంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. స్వయంగా తాను వివిధ ప్రక్రియల్లో రాసిన కావ్యాలు ఉన్నాయి. ఈ మొగ్గలను పీవీ స్మృతికావ్యంగా చెప్పుకోవచ్చు. "అసాధ్యుడు"గా పీవీ జీవితాన్ని మరోసారి సరికొత్త "మొగ్గలు" ప్రక్రియలో చదివేందుకు వీలుగా ఉంది.
 
- పుట్టి గిరిధర్
9491493170