జాతీయ కవి శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారు - ambadipudi syamasundar rao

జాతీయ కవి శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారు

స్వాతంత్ర ఉద్యమకాలంలో "మాకొద్దీ తెల్ల దొరతనము" అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రుతలూగించి స్వాతంత్ర పోరాటం వైపు జనాలను మళ్లించిన జాతీయ కవి శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు.దురదృష్టవశాత్తు నేటి యువతకు అసలు పరిచయము లేని పేరు ఈ పేరు తెలుగు నాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ. ఆయనంత ప్రసిద్ధి పొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరు దేశభక్తి కవితలు వ్రాసి పాడి జైలు శిక్ష అనుభవించినవారిలో ప్రథముడు గరిమెళ్ళ ఈయన పాటలు సత్యాగ్రహులకు గొప్ప తెగువను ఉత్తేజాన్ని కలుగజేసేవి. అలాగే "దండాలు దండాలు భరతమాత "అనే గీతము ప్రజలను ఎంతాగానో జాగృతముచేసింది. గరిమెళ్ళ నిజాయితీకి నిర్భీతికి మారుపేరుగా నిలిచాడు.

గరిమెళ్ళ సత్యనారాయణగారు శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట తాలూకా గొనెపాడు అనే గ్రామములో 1893 జులై 14 న సూరమ్మ, వెంకట నరసింహము దంపతులకు జన్మించాడు. స్వగ్రామంలో ప్రాధమిక విద్య పూర్తిచేసి విజయనగరం, మచీలీపట్నము,రాజమండ్రి మొదలైన చోట్ల పై చదువులు చదివాడు.బిఎ పూర్తి చేసాక గంజాము కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా కొంతకాలము పనిచేశాడు ఆ తరువాత విజయనగరము హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు కానీ స్వతంత్ర భావాలు స్వేచ్చాప్రియత్వము ఎక్కువగా ఉండటం వల్ల ఏ ఉద్యోగములోను ఇమడలేక పోయినాడు చిన్నప్పుడే మేనమామ కూతురిని వివాహము చేసుకున్నాడు.

1920డిశంబరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో సహాయనిరాకరణ తీర్మానం ఆమోదించబడింది వీరావేశముతో స్వాతంత్ర ఉద్యమము లోకి దూకిన గరిమెళ్ళ 162 లైన్ల మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాటను వ్రాసాడు ఆ రోజుల్లో ఈపాట చాలా పాపులర్ అయింది ఎంత పాపులర్ అయింది అంటే ఈ పాట నకళ్ళను రాజమండ్రిలో ఒక్కొక్కటి రెండు అణాలకు (12 పైసలు) కొనుక్కొని చదువుకునేవారు ఈ పాట నేటికీ తెలుగు వారందరి చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది. ఈ పాట ఆనోటా ఈనోటా అప్పటి బ్రిటిష్ కలెక్టర్ బ్రేకన్ చెవిన పడింది. అయన గరిమెళ్ళను పిలిపించి ఆ పాటను పూర్తిగా పాడమన్నాడుట.ఇంకేముంది స్వతహాగా మంచి గాయకుడు అవటం వలన తన కంచు కంఠము తో పాటను పాడాడు. పాట విన్న కలెక్టర్ భాష అర్ధము కాకపోయినా ఆ పాటలోని మహత్తర శక్తి సామాన్య ప్రజలను ఎలా చైతన్య పరచగలదో తానూ ఉహించ గలనని చెప్పి ఆ పాట బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష వేసాడు.కలక్టర్ ఆయనకు శిక్ష వేసాడుగాని ఆ పాటను జనబాహుళ్యములో ఆపలేకపోయాడు ఆ రోజుల్లో కాంగ్రస్ కార్యకర్తలు ఎక్కడ మీటింగ్ పెట్టిన ఈ పాటను పాడుకుంటు మువ్వన్నెల జెండా ఎగరేసుకుంటూ వీధులలో తిరిగేవారు.

శిక్ష పూర్తిచేసుకొని బయటకు వచ్చిన గరిమెళ్ళ మళ్ళి గొంతెత్తి ప్రజల మధ్య పాడతూ జనాన్ని ఆకట్టుకోసాగాడు.ఇది చుసిన బ్రిటిష్ ప్రభుత్వాధి కారులు గరిమెళ్ళ బయట ఉంటె బ్రిటిష్ ప్రభత్వానికి మంచిది కాదు అని భావించి అరెస్ట్ చేసి మళ్ళా రెండేళ్లు కఠిన కారాగార శిక్ష వేశారు. జైలులో ఉండగా 1923లో గరిమెళ్ళ తండ్రి మరణించాడు క్షమాపణ చెపితే వదిలివేస్తామని అధికారులు చెప్పిన అభిమాన ధనుడు దేశభక్తుడు అయిన గరిమెళ్ళ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు.గరిమెళ్ళ చాలా సార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో ఉండగానే తమిళ కన్నడ భాషలు నేర్చుకొని తమిళ కన్నడ గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు.భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల గ్రంధాన్ని తెలుగులోకి అనువదించాడు.1921లో గరిమెళ్ళ రచించిన స్వరాజ్యా గీతాలు అనే పుస్తకము వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తి గీతాలు బాల గీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. శ్రీశారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చు వేసాడు కానీ అవి ఎక్కువగా అమ్ముడు పోకపోవటం వల్ల నష్టము వచ్చింది అంతేకాకుండా అయన ఊళ్లు తిరుగుతూ ఉండటం వల్ల ఆ పుస్తకాలను చెదలు తినేసాయి.ఆవిధముగా పుస్తకాల వల్ల నష్టము వచ్చింది.

1935 లో జీవనోపాధికోసము గరిమెళ్ళ మద్రాసు వచ్చి అక్కడ గృహలక్ష్మి అనే పత్రికకు సంపాదకుడిగాఉన్నాడు. ఆ తరువాత అక్కడ మానేసి వాహిని పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరాడు. కొన్నాళ్ళు ఆంధ్రప్రభ లో పనిచేశాడు కొంతకాలము ఆనందవాణి పత్రికకు సంపాదకుడిగా పనిచేసేడు అయన జీవితములో సంతోషించదగ్గ విషయము అయన జైలు నుంచి వచ్చినాక ఎన్నో చోట్ల ఆయనకు ప్రజలు చేసిన సన్మానాలు. భార్య చనిపోయే నాటికి ఇద్దరు కూతుళ్లు మళ్లి పెళ్లి చేసుకున్నాడు అప్పులు తీర్చటం కోసము అస్తి అమ్మేశాడు.కొంతకాలము ప్రియాగ్రహారము లో గ్రంధాలయ కార్యదర్శిగా పనిచేసాడు ఈయన పేదరికములో ఉన్నప్పుడు కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు ఆర్ధిక సహాయము చేసేవారు.అలాగే వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు గారు కూడా ప్రతినెలా కొంత ఆర్ధిక సహాయము చేసేవారు తన రచనలను వివిధ పత్రికలకు ఆలిండియా రేడియో కు పంపుతూ సంపాదిస్తున్నప్పటికీ అయన అవసరలకు సరిపడేది కాదు ఆ విధముగా పేదరికము ఒకవైపు అనారోగ్యము మరొకవైపు భాధిస్తు ఉండగా ఒక కన్ను పోయింది పక్షవాతము వచ్చింది దిక్కులేని పరిస్తుతులలో చివర్లో యాచన మీద బ్రతికాడు

స్వాతంత్రము వచ్చినాక కూడా ప్రభుత్వాలు ఆయనను పట్టించుకోలేదు ఏవిధమైన సహాయము చేయలేదు ఆ పరిస్థితులలో అయన అభిమానులు సహాయము చేయని ప్రభుత్వాన్ని నిందిస్తూ"మాకొద్దీ నల్ల దొరతనం"అనే పాటను వ్రాయమని చెప్పిన దేశభక్తి గల గరిమెళ్ళ ఒప్పుకోలేదు,కానీ ప్రభుత్వాలు అయన దేశభక్తిని అసలు గుర్తించలేదు ఆ విధముగా దుర్భర దారిద్ర్యమును అనారోగ్యాన్ని అనుభవిస్తూ 59 ఏళ్ల వయస్సులో 1952 డిశంబర్ 18 న మరణించారు. చివరికి అయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు పూనుకొని పూర్తిచేశారు ఇది మాకొద్దీ తెల్ల దొరతనం అని గొంతెత్తి పాడిన ఒక దేశభక్తుడి కధ