అచ్చమయిన తెలంగాణ మహాకవి - ambadipudi syamasundar rao

అచ్చమయిన తెలంగాణ మహాకవి

22/7 న దాశరధి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భముగా ఆయనను గుర్తు తెచ్చుకుంటూ ఈ వ్యాసము

తెలుగు వారికి "దాశరధి" గా సుపరిచుతుడైన కవి పూర్తి పేరు దాశరధి కృష్ణమాచార్యులు.ఈయన గొప్ప కవి, స్వాతంత్ర సమర యోధుడు,ప్రజాకవి, అన్నిటికంటే గొప్ప మానవతావాది. తన కవిత్వముతో తెలంగాణాను మేల్కొల్పిన అభ్యుదయ,ఆధునిక కవి. తెలంగాణా ప్రజల కన్నీళ్లను అగ్నిధార గా మలచి నిజాం పాలన మీదికి ఎక్కు పెట్టిన మహాకవి దాశరధి. పద్యాన్ని ఆయుధముగా చేసుకొని తెలంగాణాను నైజామ్ పాలన నుండి విముక్తి కోసము ఉద్యమించినా మహాపురుషుడు దాశరధి. నా తెలంగాణా కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఆనాటి ఉద్యమానికి ప్రేరణ అందించిన ప్రజాకవి దాశరధి. అచ్చమయిన తెలంగాణ మహాకవి. "నను గని పెంచినట్టు కరుణామయి నా తెలంగాణా "అని సగర్వంగా ప్రకటించుకున్న దాశరధికి తెలుగు అభిమానానికి కొదువలేదు."ఎవరు కాకతి? ఎవరు రుద్రమ?ఎవరు రాయలు?ఎవరు సింగన? అన్ని నేనే అంతా నేనే వెలుగు నేనే తెలుగు నేనే "అని తెలుగు అవేశము ఆవహించి గర్జించాడు, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రము ఏర్పడిన సందర్భముగా ,"ఆంధ్ర రాష్ట్రము వచ్చె,మహాంధ్ర రాష్ట్ర మేరుపడువేళ, పొలిమేర చేర పిలిచె,నా తల్లి ఆనందం పంచుకుంది" అని తన సంతోషాన్ని లోకానికి పద్యరూపములో తెలియజేసిన కవి దాశరధి. జాతీయ కవిగా "జయ జయ భారతి యుగ యుగమ్ముల పున్నెపు పంట నీవు"అని భారతమాతకు నీరాజనాలు ఇచ్చాడు. చదువుల తల్లి సరస్వతి కటాక్ష వీక్షణాలతో తాను కవితలు చెప్పగలుగుతున్నానని ప్రకటించుకున్న కవి దాశరధి.

దాశరథి కృష్ణమాచార్య 1925జులై 22న పూర్వ వరంగల్ జిల్లా ప్రస్తుత మహుబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామములో జన్మించాడు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి ఇంగ్లీష్ సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతము,ఇంగ్లిష్ ఉర్దూ భాషలలో పాండిత్యాన్ని సంపాదించాడు చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిహైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు." రైతుదే తెలంగాణము రైతుదే,ముసలి నక్కకు రాచరికము దక్కునే"అని గర్జించాడు "దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది దిగిపోవోయ్, తెగిపోవోయ్"అంటూ నిజాం ను సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. దాశరధి కవిత్వములో మల్లెలు ,మోదుగలు,శృంగార,వీరరసాలు,సంయోగము పొందాయి. ఒక విప్లవ వినూత్న యుగ ప్రారంభాన్ని సూచిస్తూ,"నవ భారత యువకుల్లారాకవులారా భవితవ్యపు హవనానికి హోతలు,నూతన భూతల నిర్మాతలు మీరే మీరే"అంటూ కర్తవ్య పరాయణులు కావించిన కవి దాశరధి. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగు లోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.

ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు ఓరుగల్లు కోటలో1940లో ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రధమ వార్షికోత్సవ సందర్భాన కవి సమ్మేళనికి నిర్మించిన పందిళ్లను రజాకార్లు అగ్నికి ఆహుతి చేస్తే అక్కడే ఆ భస్మ రాసుల వద్దే ఆనాటి యువకవి దాశరధి కూలిన పందిళ్ళ వద్దే పద్యాలూ వినిపించి విప్లవ శంఖారావాన్ని పూరించాడు. ఆ సభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నందుకు నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామీ కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు.కష్టాలలో,రణరంగములో సైతము రామణీయకతను పరికించగల సరస హృదయుడు దాశరధి. మానుకోట తాలూకా వెల్లి కుదురు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు ఒక చిన్న పల్లెలో ఆప్యాయముగా మంచి నీళ్లు అందించిన పల్లె పడుచు ఒయ్యారం ఆమె అమాయకత్వం ఆయనను అలరించాయి. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు.1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వ ఆస్థాన కవిగా1977 నుండి 83 వరకు ఉన్నారు.,అగ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయల నుండి గౌరవ డాక్టరేట్ ను, ఆంధ్ర విశ్వ విద్యాలయము నుండి కళా ప్రపూర్ణ బిరుదును అలాగే కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డును అందుకున్నారు.ఈయన కవితా సంపుటాలలో కొన్ని అగ్నిధార, మహాంధ్రోదయము, రుద్రవీణ, మార్పునా తీర్పు,ఆలోచనా లోచనాలు,ధ్వజమెత్తిన ప్రజా మొదలైనవి ఉన్నాయి " ఆగర్భ శ్రీనాధునికి అనాధునికి చిరకాలము నుంచి జరుగుతున్నా సంఘర్షణయే దాశరధి కవితా వస్తువు, దౌర్జన్యము,అన్యాయము,అక్రమము మీద తిరుగుబాటే ఒక మాటలో దాశరధి కవిత్వము" అని దేవులపల్లి రామానుజ రావు గారు అగ్నిధార తోలి ప్రచురణలో తొలిపలుకులలో వివరిస్తారు 1961 లో ఇద్దరు మిత్రులు సినిమాతో సినీ రంగ ప్రవేశము చేసి కొన్ని వందల పాటలను వ్రాసి తెలుగు సినీ సాహిత్యానికి సేవ చేసాడు..కవిసింహము, అభ్యుదయ కవితా చక్రవర్తి ,ఆంధ్ర కవితా సారధి వంటి బిరుదులను పొందినవాడు.తెలుగు సాహితి వినీలాకాశములో ధ్రువ తారగా వెలుగొందిన దాశరధి 1987నవంబర్ 5 న సాహితి ప్రపంచములో అమరుడైనాడు