అన్వేషణ - ఒక సమీక్ష
పోడూరి వారి ' అన్వేషణ ' చదివిన తరువాత మనలో సత్యాన్వేషణ మొదలౌతుంది. స్వీయ అనుభవాన్ని రంగరించి, పరిశీలన జత చేసి, విస్తృతంగా శోధించిన రీసేర్చ్ సారాంశం అందిస్తూ సాగింది అన్వేషణ. నిజంగా వారి అన్వేషణ, చదువరులకు ఒక అమృతభాండం. మనకి ఇష్టమైన టాపిక్స్, రచయితల పేర్లు, పుస్తకాల పేర్లు, యుట్యూబ్ లింక్ లతో సహా పేర్కొన్నారు.
లైఫ్ ఆఫ్టర్ డెత్, ది ఇంగ్లీష్ టీచర్ (ఆర్ కే నారాయణ్), ద డేట్లెస్ డైరీ (ఆర్ కే నారాయణ్), ది ప్రూఫ్ ఆఫ్ హెవెన్ (డా.హెబెన్ అలెగ్జాండర్), డైయింగ్ టు బి మి (అనితా మూర్జాని),సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా (పాల్ బ్రంటన్ ). ఇందులో వారు చెప్పిన మరణానంతరషయాలు కథలు కాదు నిజమే అంటూ నిజ జీవిత ఉదాహరణలిస్తారు.చదువుకోవాలనుకొనే వారికి ఎంతో ఉపయుక్తం.
కథానాయకుడు ఆల్బర్ట్ కు తండ్రి మరణానంతరం కొన్ని ప్రశ్నలు కలుగుతాయి చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికెళతాడు, ఏమౌతాడు చనిపోయినవారిని చూడగలమా? సమాధానాలకోసం మార్కెట్లోని ప్రసిద్ధ పుస్తకాలన్నీ చదువుతాడు.
తను తెలుసుకోవాలనుకున్న చావు, పుట్టుకల వెనుక రహస్యం, అది తెలుసుకొన్న భారతదేశంలోని మహనీయుల వల్లనే సాధ్యం అని అర్ధం, చేసికొని, భారతదేశం వస్తాడు. ఒక నమ్మకం ప్రకారం కాకుండా తన అనుభవ పూర్వకంగా విషయాలు అవగాహనలోకి రావాలనేది తన అభిమతం. ఒక స్వామీజీ ముందు ' అర్హత ' సంపాదించాలి అని తెలియచెబుతారు.
ఆలోచనలు అవే వస్తాయా? మనం తెచ్చుకొంటామా? అన్న విషయం చెబుతూ బెంజమిన్ లిబెట్ చేసిన పరిశోధన సారాంశం మనకందిస్తారు. రమేష్ బల్సేకర్ (నిసర్గదత్త మహరాజుల శిష్యుడు) శాస్త్రియ నిరూపణ' అంతా భగవన్నిర్ణయమే ఎలాగో చూపిస్తారు. వైదీశ్వరన్ కోవిల్ తాళపత్ర సమాచారం, సిద్ధేశ్వరీ పీఠం -మంత్రశక్తి ఎలా పనిచేస్తుందో, సరళమైన ఉదాహరణల ద్వారా మనకు చెబుతారు.
నమ్మకం వదలి ప్రశ్నించడం మొదలైందంటేనే అర్హత చేకూరినట్లు అని స్పూర్తినిస్తారు. వాసనలంటే గతంలో మనం ఇంద్రియాల ద్వారా మనలోకి చేర్చుకున్న ముద్రలే, అవే మనకు సాధనలో అడ్డు తగులుతుంటాయనీ, వాటి బలం తగ్గించుకుంటుండాలనీ తేటతెల్లంచేస్తారు.
చాలా నచ్చిన విషయం, గొప్పదైనదీ ఏమిటంటే, 'నేను, ఈ ప్రపంచం, భగవంతుడు' అన్న మూడింటి మీద స త్యాన్వేషణ పుస్తకాలతో రావడం కష్టమనీ, దానికన్నా 'స్వయంగా గానీ ,గురువు సహాయంతో గానీ ఆ రహస్యం తెలిసికొని అటుపై ఆ తెలుసుకొన్న రహస్యం 'శాస్త్రాలతో సరియో కాదో' పోల్చుకోమంటారు. రామకృష్ణులనూ, రమణ మహర్షులనూ, జెర్మన్ అర్ధర్ షోపెణవర్లనూ మనకు ఉదాహరణలుగా పేర్కొంటారు.
ఉండడం, ఉన్నట్లు తెలియడం (సత్, చిత్) అసలైన జ్ఞానం అని మనలో తృష్ణ కలిగిస్తారు. జ్ఞానానికి ఆకారంలేదనీ, ఆకారం లేనిది అనంతమనీ, 'నేను' ఎలా అనంతమో విశదీకరిస్తారు. ద పవర్ ఆఫ్ నౌ- ఎఖోర్ట్ టోలె -సిద్ధాంతం పరంగా మనసు ని ప్రస్తుతంలో వుంచి ఎప్పుడూ ఎలా ఆనందంగా వుండచ్చో సూచనలూ తెలియ చెబుతారు.
అష్టావక్ర -జనకుల విషయం చెబుతూ, కల నిజమా, మెలకువ నిజమా అంటే ఆ రెండింటికీ సాక్షిగా వున్న నీవు మాత్రమే సత్యం అని గొప్ప విషయ నిరూపణ చదువరికి కొత్త కోణాన్ని చూపడం తధ్యం. మంచి గురువు దొరికితే గమ్యం చేరినట్లే అని కిటుకులు చెబుతారు.
అజ్ఞానం ఎందుకొచ్చింది? ఆలోచనలు ఎలా నిరోధించాలి? జడం కాని చైతన్యం జడం ఐన శరీరంతో ఎలా వున్నది? ఏ సాధనలు చేస్తే సాక్షిగా వుండవచ్చు? అంతర్గత ఆనందాన్ని బాహ్యంగా ఎప్పుడు గుర్తిస్తాం? కేనోపనిషత్ ప్రకారం కన్నుకు కన్ను ఏది? చెవి కి చెవి ఏది? స్వరూ పాన్ని గుర్తించిన వారికి ఎలా ఉంటుంది, ఆ స్థాయి ఏమిటి? పుట్టుక, మరణం ఎవరికి వుంటాయి, ఎవరికి వుండవు? అనంత చైతన్యం లో తనను తాను గుర్తిస్తూ ఆనంద పరవశంలో వున్న స్థితికి ఎప్పుడు, ఎలా, ఏం చేస్తే అందుకోగలం? నేను అన్న భావన అనంతం గా వ్యాపించి వున్నది అన్నది ఏ సాధన ద్వారా అందుకోవచ్చు? అజ్ఞానం తొలగడం, నేను ఎవరు అన్న విచారణ ఎక్కడికి తీసికెళుతుంది? నేను కి శరీరానికి సంబంధం వుందా? అన్నసందేహాలకి తమదైన శైలిలో చక్కని విషయ నిరూపణ, వివరణ అద్భుతంగా మనకి అందించారు రచయిత. ఆల్బర్ట్ కి అన్ని సందేహాలు తీరతాయి.
వారు 40 ఏళ్ళ కు పైగా చేసిన కృషి, వ్యక్తిగత పరిశిలన, ఆధ్యాత్మిక సందేహాలూ, అనుభవాలూ, వాస్తవం ఏమిటి, మనం అనుకునేది ఏమిటి? ఎందుకు? అన్నదానికి చాలా లాజికల్ గా ఈ రచన ద్వారా చదువరికి పంచారు వారు. ఇది చదివిన ప్రతి చదువరీకీ, జీవత పరమార్ధం అవగతం అవ్వడమే కాక, గమ్యానికి చేరాలంటె ఏమి చెయాలి, ఎలా చెయాలి, రుజువేమిటి? అని తెలియ వస్తాయి. రచయిత ఎంతో అభినందనీయులు, చదువరులు అదృష్టవంతులు.
ఆశ్చర్యానికి గురి చేసిన మరో అంశం ' కనీసం రూ.300/-ఎదైనా స్వచ్చంద సేవకు వినియోగించి ఉచిత కాపీ కి సంప్రదించండి : అంటూ రచయిత పేరు వెంకట రమణ శర్మ మరియు వారి సెల్ నంబరూ 7904115627 పుస్తకంలో పేర్కొన్నారు.