పే బేక్ టు సొసైటీ - కామేశ్వర రావు రాపాక

Pay back to society

“అయ్యా, నమస్కారమండి. తమరెవరో పెద్ద బాబు గారిలాగా ఉన్నారు. మా లాంటి వాళ్ళు ఉండే వీధులకు మీరు రారు గాని ఇవాళ ఎలాగో వచ్చారు. ముక్కు గట్టిగా మూసుకోండయ్యా. లేకపోతే ఈ కంపు భరించలేక మీ కడుపులో తిప్పడం మొదలవుతుంది. వాంతులు కూడా వస్తాయి. ఒక్క నిముషం మీరు భరించలేని ఈ బాధ మేము తరతరాలుగా అనుభవిస్తున్నాం. నాకు తెలిసి మా తాత, తండ్రి, నేను, నా పిల్లలు ఇక్కడే పుట్టి ఇక్కడే మట్టిలో కలిసిపోతున్నాం. మేము ఎలా భరిస్తున్నాం అని మీరెవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మేము కూడా మనుషులమే బాబు. మమ్మల్ని ఆదుకోవాలని ఆలోచన మీకు రాదా? సమాజం పట్ల మీకు బాధ్యత లేదా?”

——-///——-

సీనియర్ సివిల్ జడ్జిగా రిటైర్ అయిన తరువాత నేను హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ఒకసారి చిన్ననాటి మిత్రులను కలవాలని, లాస్ట్ మంత్ మా ఊరికి వెళ్ళాను. అందరినీ కలిసాక మరుసటి రోజు ఉదయం మా సోంపేట ఊరి అమ్మవారు ‘శ్రీ సోమ పోలమాంబ’ దర్శనానికి మా కజిన్ శ్రీరాములుతో కలిసి వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో అమ్మవారి గుడి పక్కనున్న వీధి గుండా వెళ్తే మెయిన్ రోడ్డు కు త్వరగా చేరుకోవచ్చని శ్రీరాములు చెప్పడంతో ఆ వీధిలోకి ప్రవేశించాం. అది మా ఊరిలో ఒక దళిత వాడ. మునుపెన్నడు ఆ వీధి గుండా నేను వెళ్లలేదు. ఆ వీధి కొద్దిగా దుర్వాసనతో కూడుకున్నదవడం వలన కర్చీఫ్ తో ముక్కులు మూసుకుని నడుస్తున్నాం. సగం దూరం వెళ్లిన తరువాత ఒక బోరుబావి కనిపించింది. అక్కడ కొంత మంది మహిళలు నీళ్లు పట్టుకుంటున్నారు. ఒక యువకుడు బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇంకొక వ్యక్తి నిలబడ్డాడు. ఆ నిలబడిన వ్యక్తి మమ్మల్ని చూసి అన్న మాటలవి. అతని మాటలకు నేను ఒక్కసారిగా బిక్కచచ్చిపోయాను. తరువాత తేరుకుని నిదానంగా ఆలోచించాను. అతను వేళాకోళంగా అన్నా, అవి అక్షర సత్యాలు.

అన్నీ విన్న మేము తలాడించి వచ్చేసాము. ‘మేము ఏమీ చేయలేం’ అని సదరు వ్యక్తి కూడా తనకుతానే సర్ది చెప్పుకున్నట్టు ఊరుకున్నాడు. కానీ అతని మాటలు నన్ను నిలదీస్తున్నాయి. న్యాయ శాస్త్రాన్ని చదివి న్యాయస్థానంలో తీర్పులిచ్చిన నేను సామాజిక న్యాయం సంగతి ఎప్పుడు ఆలోచించలేదు. అవును, ఇలాంటి వారికి న్యాయం జరగాలి. కానీ ఎలా???

ఆ మాటలన్న వ్యక్తి గురించి ఆరా తీసాను. అతనొక నిరుద్యోగి. ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమోనన్న ఆశతో మా ఊరి ఎం ఎల్ ఏ వెనక తిరుగుతుంటాడట. వాళ్ళ నాన్న మా ఊళ్ళో గాంధి మండపం పక్కన చెప్పులు మరియు గొడుగులు రిపేరులు చేసేవాడు. చాలా సార్లు చిన్నప్పుడు తన వద్ద నా చెప్పులు కుట్టించుకున్నాను. వాళ్ల నాన్నమ్మ, ఎల్లమ్మ, పొలాల్లో పెరిగిన బర్నిక చెట్ల పాదులు కొట్టుకొచ్చి వాటిని పళ్ళు తోముకోవడానికి వీలుగా పందుంపుల్లలుగ చేసి వీధుల్లో అమ్మేది. మా ఇంటి దగ్గరకు వచ్చి ‘పిల్లల కోసం ‘లేత పుల్లల కట్ట’ కట్టానమ్మా’ అని మా అమ్మతో చెప్పి మాకు లేత పందుంపుల్లల కట్ట ఇచ్చేది. “వారి సేవలను పొందుతూ పెరిగిన నేను పెద్దయ్యాక ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారి సామాజిక సేవకు ప్రతిగా నాలాంటి వారు ఏమైనా చెయ్యాలి కదా!” అనుకున్నాను.

——-///——-

అలా జాలారి వీధి గుండా మెయిన్ రోడ్డుకు వస్తుండగా, ఆ వీధిలో ఉండే చాకలి రామస్వామి ఇల్లు గుర్తొచ్చింది. ఇంటిని సరిగ్గా గుర్తించలేక పోయాను. అక్కడున్న వారిని వాకబు చేస్తుండగా నా వయసున్న ఒకాయన బయటకు వచ్చి “అన్నా బాగున్నారా?” అని అడిగాడు. “నీవు ఎవరు అన్నట్టు క్వశ్చెన్ మార్క్ ఫేస్ పెట్టాను”

“నేను వెంకటేశం అన్నా, రామస్వామి కొడుకుని. మీపేరు కృష్ణారావు కదా”

“అవును, నేను గుర్తు పట్టలేక పోయాను”

“నేను హైస్కూలులో నీ కన్నా ఒక సంవత్సరం జూనియర్ అన్నా. ప్రతి సంవత్సరం నీ దగ్గర పాత పుస్తకాలు తీసుకుని నేను చదివే వాడిని. నాన్న చనిపోయి పాతికేళ్ళు అయిందన్నా.

“ఏమి చేస్తున్నావిప్పుడు?”

“టెంత్ తరువాత నేను విశాఖపట్నం లోని షిప్ యార్డులో లేబర్ గా ఉద్యోగంలో చేరాను. గత సంవత్సరం రిటైర్ అయ్యాను. మన ఊళ్ళో అయితే చుట్టాలు పక్కాలు అందరూ ఉంటారని ఇక్కడికి వచ్చేసాను.”

“ఓహ్ అలాగా, అంతా కుశలమేనా? ఎంత మంది పిల్లలు?” అని అడిగాను.

“ఆ.. బాగే. నాకు ఇద్దరు కూతుళ్ళన్నా. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసీసాను. మాకు మీ లాగా పెన్షన్ ఉండదన్నా, అందుకే మళ్ళీ మా కుల వృత్తి చేసుకుంటున్నాను.”

రామస్వామి సేవలు మరువలేనివి. మా నాన్నగారు తెలుపు రంగు ఓపెన్ షర్ట్ వేసుకొని , పంచె కట్టేవారు. అవి రామస్వామి చేతుల మీదుగా మా ఇంటికి వచ్చేసరికి మల్లెపూవులా మెరిసేవి. మా అందరి బట్టలు కూడ ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చేవాడు. ఆ సేవలు అమూల్యమైనవి.

——-///——-

మెయిన్ రోడ్డు మీదికి వచ్చి ఎడమ వైపు తిరిగిన వెంటనే మంగలి సూరి క్షౌరశాల కోసం వెతికాను. ఇప్పుడు అక్కడ ‘మంగలి షాపు’ బోర్డు స్థానంలో “సోమేశ్వర బేండ్ పార్టీ” బోర్డు కనిపించింది. “సూరి చనిపోయిన తరువాత కొడుకులు తమ వృత్తి కొనసాగిస్తూ ఈ బేండ్ పార్టీని కూడ నిర్వహిస్తున్నారు” అని శ్రీరాములు చెప్పాడు.

చిన్నప్పుడు హెయిర్ కట్ కోసం ఈ షాపు వద్ద క్యూ కట్టే వాళ్ళం. అప్పుడు ఫేషన్ “మాప్ కటింగ్”. అది మాలాంటి స్టూడెంట్స్ మరియు ఉద్యోగస్తులు అడిగితేనే చేసేవాడు లేకపోతే “బురికి కటింగే”. కొబ్బరి బురికి ఆకారంలో తల మీద వెంట్రుకలు ఉండేవి. మిగిలిన తల చుట్టూ కత్తితో గీకేసేవారు. సూరి మాకు క్షవరం బాగా చేసేవాడు. మా నాన్న గారికి అప్పుడప్పుడు తల మర్దన చేసేవాడు. ‘చాలా నేర్పుగా చేస్తాడు’ అని మా నాన్నగారు అనేవారు. ఆయన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే.

——-///——-

ఆ రాత్రి శ్రీరాములు ఇంట్లో బస. తెల్ల వారి లేచి వీథి అరుగు మీద కుర్చీలో కూర్చున్నాను. నా చిన్నప్పుడు మా అందరి స్నానాల కోసం మా వీధి చివరనున్న నూతిలో నీళ్ళు తోడుకొచ్చి మాకు సప్లై చేసే పార్వతమ్మ కనిపించింది. ఆమె ఇప్పుడు శ్రీరాములు ఇంటికి కూడా సప్లై చేస్తుంది. ఇప్పుడైతే పంచాయతీ వారు నూతులన్ని మూయించి వాటి స్థానంలో బోరు బావులు వేయించడం వలన ఆమె ఇప్పుడు బోరు బావి నీళ్ళు సప్లై చేస్తుంది.

“ఏం, పార్వతమ్మ బాగున్నావా?” అని అడిగాను

“ఏం బాగు బాబు, ఇదిగో ఇలా నీలు మోసుకోవడంతోనే నా బతుకు తెల్లారి పోయింది”.

“మీ అబ్బాయి ఏమి పని చెయ్యడం లేదా? “

“అడేమి నాడెం అయినోడు కాదయ్యా. ఇక్కడ టిపినీ దుకానమెట్టాడు. నాలు నెల్లు అయినప్పుడికి లాస్ అయిపోయిందని దుకానం మూసీసాడు. తర్వాత ఇక్కడేమి పని దొరకడం లేదని మా యీది లోని కొందరు గుంటలుతో కలిసి అందుమానమెల్లిపేయాడు. కోడలు, నేను ఇద్దరం ఇదే పని. గవుర్మెంటోలు నెల నెలా ఇస్తున్న పెనసని పైసాలు ఎటూ సరిపోవు. అందుకే ఇంకా నీళ్ళు మోస్తన్నాను”

“ఇక్కడేమి పనులు దొరకవా?”

“ఏం పనుల్లేవ్ బాబు. వర్సాలు పడితే ఒక మూడు నెల్లు ఎవసాయం పనులుంతాయి, దుక్కులు, ఉనుపులు, కోతలు, ఆ తర్వాత కూకోడమే.”

“గవర్నమెంట్ వాళ్ళు పనికి ఆహారం పథకముంది కదా”

“ఆ… అదొక మూడు నెల్లు పని. సెరువులు తవ్విస్తారు. ఆ పనిలో కూడా కూలీ ఇచ్చినకాడ మద్దినున్నోలు దగుల్బాజీలు. మనకిచ్చిన పైసాల్లో కొంత నొక్కేసి మిగిలింది ఇస్తారు. అవి ‘కూటికి రావు కోరకి రావు’ ఒక్కో సమచ్చరం అదీ ఉండదు.”

పాపం పార్వతమ్మ ఇంకా కష్టపడుతుంది. పార్వతమ్మ లాంటి వారి జీవితాలు కష్టాలకంకితం. మనసులో ఏదో బాధ నన్ను కలచివేసింది.

——-///——-

కొంత సేపటికి చిన్నప్పుడు మా ఇంటికి పాలు పోసే సరస్వతి వచ్చింది. శ్రీరాములు మనవడికి ప్రతి రోజు ఆవు పాలు ఇస్తుందట.

“ఏమ్మా! ఎలా ఉన్నారు” అని పలుకరించాను.

“ఆ… బాగున్నాం బాబు. మీరెలాగున్నారు?”

“మేమంతా బాగున్నాం”

“మీ పాల వ్యాపారం బాగుందా?”

“లేదు బాబు, ఇప్పుడు ఎవరు పాలు పోయించుకోరు. ‘పేకెట్ పాలు’ మీద పడ్డారు అందరూ. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు పేకెట్ పాలొచ్చి మా కడుపు కొట్టాయి. నాకు కూడా ఒంట్లో బాగు లేదు. ఆసుపత్రికి తిరగడంతోనే సరిపోతుంది. గీదల పని ఎవరు చేస్తారు?, గీదలు కూడా చాల కరీదైపోయాయి. కొనలేక మీము పల్లకున్నాం. ఒక ఆవుంది, దాన్ని కూడా అమ్మెద్దామనుకుంటున్నాను. అందాక ఎవరైనా అడిగితే ఆవు పాలు తెచ్చిస్తాను.

సరస్వతిని చూస్తే ఏదో జబ్బుతో బాధ పడుతుంది అనిపించింది. మనిషి చాలా సన్నగా అయి పోయింది.

దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం స్వతంత్రం సాధించి, సర్వ సత్తాక సార్వభౌమత్వ దేశంగా వర్ధిల్లుతున్న నా దేశంలో ఇలాంటి నిర్భాగ్యులెందరో!!! ఇప్పటికీ చావలేక బ్రతుకుతున్నారు.

ఊరికి దూరంగా విసిరేసినట్లున్న మురికివాడల్లో దుర్గంధంతో కాపురం చేసేవారు కొందరు, బ్రతుకు తెరువు లేక భార్యాపిల్లలను విడిచి పెట్టి పొట్ట చేతబట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కొందరు, కడుపుకు పట్టెడన్నం లేక ఆకలి మంటలకు బలైన వారు కొందరు, వైద్యం అందక రోగాలు రొస్టులతో బాధ పడే వారు కొందరు. ఇదే నేను గర్వంగా చెప్పుకునే ‘వెలుగులు నిండిన నా దేశం.’ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన నా దేశం, ప్రపంచ కుబేరులలో మూడవస్థానం సంపాదించింది గానీ ప్రపంచ నిరుపేదలలో భారతీయులే అధికం అన్న సంగతి మరిచిపోయింది.

——-///——-

ఈ సామాజిక సేవకుల కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ‘ఐ హేవ్ టు పే బేక్’ అనుకున్నాను. నా చిన్నప్పటి స్నేహితులతో ఈ విషయం ప్రస్తావించాను. అందరూ ఓ కే అన్నారు. వెనువెంటనే నా మకాం హైదరాబాద్ నుండి మా ఊరికి మార్చేసాను. మా పిల్లలు అక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు కాబట్టి, నేను ఊరు మారడానికి ఎవరూ అడ్డు చెప్పలేదు.

మా మిత్రులు అందరూ వారికి తోచిన రీతిలో సహాయ సహకారాలు అందించారు. ఊరిలో కూడ కొంతమంది సేవా ధృక్పథం గల వారిని కలిసాం. ‘మనమంతా మనకోసం’ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాం.

ఈ సంస్థ ద్వారా పార్వతి, సరస్వతి లాంటి నిర్భాగ్యులందరికి కూడు, గూడు సమకూర్చాం. పంచాయతీ వారి సౌజన్యంతో దళిత వాడల్లో మురికి కాల్వలు పేరుకుపోవడం నివారించి వాటిపై సిమెంట్ స్లాబ్ లతో మూయించాం. తరువాత నిరుద్యోగులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాం. బ్యాంకు సహాయంతో వారికి ఋణాలు ఇప్పించి వారి చేత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టించి వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి చేయూతనందించాం. మూడవ ప్రాధాన్యతగా అందరికీ ఉపయోగపడే విద్య, వైద్యం మీద దృష్టిసారించాం. ఊరిలో ఉండే స్కూళ్లకు కావలసిన ఆధునిక వసతులు సమీకరించడం జరిగింది. మా జిల్లా మంత్రి గారితో సంప్రదించి ముప్పై పడకల ప్రభుత్వ వైద్యశాల మంజూరు చెయ్యించుకున్నాం. తరువాత పిల్లలు ఆడుకోవడానికి పార్కు, మరియు గ్రంథాలయం, పూర్వం ఉన్నవే, వాటిని పునరుద్ధరించాం.

మా సేవాసంస్థలో కొంతమంది యువ వలంటీర్లతో ఒక సామాజిక సేవా దళం తయారు చేసి, ఊరంతా తిరుగుతూ ఎవరికి ఏ సహాయం అవసరమో తెలుసుకుని మా సంస్థ కు వారి వివరాలు చేరవేసేలా ఏర్పాటు చేసాం. ఆవిధంగా పురజనుల అవసరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమయానుకూలంగా తగిన సహాయం అందేలా చేస్తున్నాం.

ప్రభుత్వం వారు స్కూల్ యూనిఫారం, బుక్స్, మధ్యాహ్న భోజనం అన్నీ ఉచితంగా ఇస్తున్నా ఇంకా నిరుపేదల పిల్లల్లో యాబది శాతం స్కూల్ కు వెళ్లడం లేదు. ఎందుకంటే పిల్లల్ని స్కూళ్లకు కాకుండా పనులకు పంపిస్తే రోజుకి ముప్పయి లేక నలబై రూపాయలు దొరుకుతాయని వారి తల్లిదండ్రుల ఆశ. అలాంటి వారిని గుర్తించి వారికి తగిన ఆర్ధిక సహాయం చేస్తూ, వారి పిల్లల్ని కూడా స్కూల్ కు పంపిస్తున్నాం. అలా పదిహేను సంవత్సరాల లోపు పిల్లల్లో నూరుశాతం అక్షరాస్యత సాధించాం.

ప్రతి లబ్ధిదారుడు తిరిగి సమాజానికి సేవ చేసే విధంగా సామాజిక సైనికులుగా తయారు చేసాం. అలా ఊరిలో ఉన్న వారంతా స్ఫూర్తి పొంది స్వచ్ఛందంగా ‘పే బేక్ టు సొసైటీ’ అనే నినాదంతో మా ఊరిని సర్వతోముఖాభివృద్ధి చేసుకుంటున్నాం.

మరిన్ని కథలు

Dharmanna dharmasatram
ధర్మన్న ధర్మ సత్రం.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Nisshbda Atidhi
నిశ్శబ్ద అతిథి
- డా: సి.హెచ్. ప్రతాప్
Jalayagnam
జలయజ్ఞం
- జీడిగుంట నరసింహ మూర్తి
Cheppani maata
చెప్పని మాట
- గవాస్కర్
Todokarundina ade bhagyamu
తోడు ఒక్కరున్నా అదే భాగ్యము!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Nalakoobara manigreevulu
నలకూబర మణిగ్రీవులు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Phone call
ఫోన్ కాల్
- డా: సి.హెచ్. ప్రతాప్
Vasudhaika kutumbam
వసుధైక కుటుంబం
- అంబల్ల జనార్దన్