Maikasura colony - దుర్గమ్ భైతి

మైకాసుర కాలనీ

" మీరు ఎన్నైనా చెప్పండి,ఈసారి అతడు వేదిక దగ్గరికి రాకూడదు అంతే! " సుబ్బారావు ఖరాఖండిగా అన్నాడు. "అది…" కృష్ణమూర్తి ఏదో చెప్పబోయాడు. "మీరు ఏమి చెప్పకండి ప్రెసిడెంట్ గారు,అతని వలన మన కాలనీ ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు.ఈసారి మనం ఏదో ఒకటి చేయాలి " పతంజలి ఆవేశం కట్టలు తెంచుకుంది. "ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం పైనే మన కాలనీ భవితవ్యం ఆధారపడి ఉంది.ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుందాం " సముదాయించాడు రఘునాథం. బయట వర్షానికి వాతావరణం చల్లగా ఉన్నది కాని మధుబాల కాలనీ ప్రెసిడెంట్ ఇంట్లో మాత్రం వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.దీనికంతటికీ కారణం రాబోయే దసరా వేడుకలు.మధుబాల కాలనీలో రెండు వందల ఇళ్ళు ఉన్నాయి.కాలనీలో సంవత్సరానికి మూడు సార్లు అంటే,సంక్రాంతి,దసరా, కాలనీ వార్షికోత్సవం రోజున భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు.పెద్దలకు,పిల్లలకు రకరకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేస్తారు.వేడుకల చివరి రోజున నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమ వేదిక నే పెద్ద సమస్య గా మారింది. కాలనీ వాసులు అంతగా భయపడే విషయం బండ రాజు.అతడు కాలనీ పాలక వర్గంలో కార్యదర్శి. పైగా అన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాత గా తనే ఉంటాడు. ఐదేళ్ళు గా అక్కడ జరిగే ఏ వేడుకలో నైనా మైకుని ఎవరికి ఇవ్వడు. బండ రాజు వ్యాఖ్యానం వినసొంపుగా లేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు. కార్యక్రమం ప్రారంభంలో మైకు పట్టుకుని తన పాండిత్యం, లేని గొప్పలు చెప్పుకుంటూ అరగంట దాకా మైకు విడిచిపెట్టడు.ప్రెసిడెంట్ ఎన్నో సైగలు చేసినా పట్టించుకోడు. ఇతని అనవసర సుత్తి భరించలేక సగం మంది ఇంటికెళ్లుతారు. బండరాజు ప్రవర్తన కు విసుగు చెంది ఒకసారి ముఖ్య అతిథి గా వచ్చిన కార్పొరేటర్ మధ్యలోనే తిట్టి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులతో హాజరై ఆనందంగా చూడాలనుకున్న కాలనీవాసుల గుండెల్లో బండరాజు తన వ్యాఖ్యానం తో రైళ్లు పరుగెట్టేలా చేసాడు. పసి పిల్లలను తీసుకురావడం మాని వేసారు. ముసలి వారి ని బంధువుల ఇంటికి పంపిస్తున్నారు. కొందరు చెవుల్లో దూది పెట్టుకుని వస్తున్నారు.గతంలో ఈయన గారి మైకు స్వరానికి తట్టుకోలేక ఒక వృద్ధుడు వేదిక ముందే కుప్పకూలాడు.అందరు అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.అంబులెన్స్ తిరిగి వచ్చే వరకు అతని మైకు ఆగలేదు.బండ రాజు ని పాలక వర్గం నుండి తొలగించాలని వేడుకలప్పుడు అందరు గొంతెత్తి అరుస్తారు.ఎన్నికలప్పుడు అతనికున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఓట్లు వేసి మరీ గెలిపిస్తారు. సాంస్కృతిక పోటీలో గెలిచిన బహుమతులు ప్రశాంతంగా తీసుకుందామనుకున్న కాలనీ వాసుల కు బండ రాజు మైకాసురుడిగా ప్రతి సారి అడ్డు తగులుతున్నాడు.పాలక వర్గం ఎన్నోసార్లు నచ్చ చెప్పి చూసింది.అతడు పద్ధతి మార్చుకోలేదు.అతడు మంత్రి గారికి సమీప బంధువు కావడంతో ప్రెసిడెంట్ మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు.మధుబాల కాలనీ ని మైకాసుర కాలనీ గా మార్చిన బండ రాజు భరతం పట్టాలని కోర్ కమిటీ ఈసారి గట్టి నిర్ణయం తీసుకుంది. ** * దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి.వేదిక పైకి బండరాజు రాగానే అందరు గోల చేసారు. కోర్ కమిటీ సైగ చేసారు. ఒక్కసారిగా ఒక అపరిచిత వ్యక్తి వచ్చి బండరాజు చేతిలోని మైకు లాక్కొని అరవడం మొదలు పెట్టాడు.తనకు పోటీగా వ్యాఖ్యాత ను తెచ్చారని ఆలస్యంగా గమనించిన బండరాజు మరొక మైకు తీసుకొని అరిచాడు.వారి అరుపులకు పిల్లలు ఏడుస్తూ పారిపోయారు. పెద్దలు తిట్టుకుంటూ వెళ్లారు.కొందరు చోద్యం చూస్తూ నిలబడినారు.ఇద్దరు మైకాసురుల అరుపులకు వేదిక నిలువునా కూలింది.అంబులెన్స్ ల కూతలతో మధుబాల కాలనీ ప్రతిధ్వనించింది.ముల్లు ను ముల్లు తో తీయాలనే ప్రయత్నం బెడిసికొట్టగానే పాలక వర్గం వేడుకలకు చరమ గీతం పాడింది. ------/////--------

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల