అందె ఉంగరం - శశికళ ఓలేటి

Ande vungaram

వెంకటి చెప్పిన కధలు:-

అందె ఉంగరం

ఒకప్పుడు ఆ సాయంసంజలను గోధూళివేళ అనేవారేమో కానీ ఇప్పుడు మాత్రం... ఆవులమట్టెలతో కాకుండా ఇసుక, సిమెంట్ తోలే లారీలూ, పోక్లెయినర్లు తవ్వి, పైకి చిమ్మే మట్టితో ధూళిధూసర వర్ణంలోకి చేరుకున్న సాయంధూళి వేళది.పొద్దుగూకడంతో...మూటాముల్లె సర్దుకుని పనివారంతా... ఒకరూ ఒకరూ నిష్క్రమించడంతో.... నిర్మానుష్యమై సామ్రాజ్యాన్ని కోల్పోయిన చక్రవర్తిలా మౌనంగా, బెంగగా నిలుచుండి పోయాయి నిర్మాణంలో ఉన్న ఆ ఆకాశహర్మ్యాలు! వాటికి తోడుగా నిలుచున్న భారీక్రేన్లతో పాటూ.... ఆ కట్టడాలకు వెనకాల సరుగుడు గడంచీల మీద కూర్చుని మంచి వయసులో ఉన్న ఒకజంట కూడా ఉంది. వాళ్ళు రాములప్పాయి, హరప్పడూ!

" నేనడిగింది ఏంచేసావ్? "....రాములు మొహమాటంగా అడిగింది!

" కళ్ళుమూసుకో యేస్ ఓపాలి! ఈ గుంటకన్నీ తొందరే".... అంటూ ముద్దుగా విసుక్కుంటూ... సిమెంట్ బస్తాల వెనక దాచిన బేగ్ పట్టుకునొచ్చాడు హరప్పడు!

దాంట్లోంచి ఒక్కటొక్కటిగా వస్తువులు బయటకు తీసి..." ఈపాలి కళ్ళు తెరువు రామూ..." అన్నాడు!

కళ్ళు తెరిచిచూసిన రాములుకు ... ఆ సంధ్యకాంతుల్లో ప్రతిఫలిస్తున్న ఆ స్వర్ణకాంతులకు మనసు ఉప్పొంగిపోయింది.

ఆనందంతో హరప్పడిని కౌగిలించుకుని..." ఏటిది హరీ! నేనడిగిందేటి? నువ్వు తెచ్చిందేటి? ".... అంటూ గోముగా కోప్పడింది!
" మరందుకేనేస్ ఇన్నిదినాలు పట్టినాది! నచ్చినాయా లేదా సెప్పేస్! " అంటూ తొందరచేసాడు హరి.

" ఇయిగో... ఈ లోలాకులు, బుట్టలూ మన బేబీకి. ఈ తాళిబొట్టూ-నాను సెయినూ.... మనిద్దరం ముడెట్టుకోడానికి. పైనల్ గా ఇంగో నువ్వడిగిన అందె ఉంగరం. అంత మోజేటే బాబూ నీకు ఆ అందుంగరం అంటే! షాపాడి సేత వంద ఉంగరాలు తీయించి ఇది సెలక్ట్ చేసినా! సూడు... సిమ్మాద్రప్పన్న కొండనాగా పైకంటా వొంపు తిరిగి... కొండమీన దేవుడల్లే ఈ కెంపుపొడి సివరన! "..... గొప్ప భావకతతో హరి చెప్తుంటే.... అబ్బురంగా చూస్తూ బుగ్గమీద ఒక ముద్రేసింది రావులు!

తన చీరకొంగు చివర్న ముడేసిన ఉంగరం బయటకు తీసింది రావులు! హరివేపుకు చెయ్యి జాపి..." అరప్పడూ... ఇంకో నీకోసమిది. ఎంకన్నబాబు ఉంగరం!"!

" సానా బావుందే! డబ్బెక్కడిది పిల్లా నీకు. మొన్ననే కదా... బేబీ వొయిద్యానికి బోల్డు కర్చు పెట్టీసినావు గదా...!" అన్నాడు హరి.
" నీకెందుకేస్ నానెలా తెచ్చానో! మా శోభమ్మగారి పెనివిటికోసం కొన్నారంట. అయ్యగారికి పట్టలేదని నాకమ్మీసినారు. నెలానెలా జీతం పట్టీసుకోమన్నా" ... చిరుకోపంతో రావులు మొహం ముడుచుకుంది!

" బంగారం కుదిరిన నాడే మంచి టయామని మా అమ్మ సెప్పేది. నడు! ఉంగరాలు మార్చీసుకుందారి! ".... అంటూ రావుల్ని తొందరచేసాడు హరప్పడు!

ఇద్దరి ఆకారాలనూ పరకాయించి చూసింది రావులు! సిమెంట్ పనికి మట్టికొట్టుకుపోయిన పొడుగులాగూ, చొక్కాతో అతనూ... నాలుగిళ్ళ పాచిపనులు చేసొచ్చి నలిగిపోయిన కాటన్ చీరలో తనూ!

కళ్ళలో సన్నటి నీటిపొర! " ఏటిది హరీ! మన జీయితాలు ఇంకొప్పుడూ ఇంతేనా! పనిచేసే ఇళ్ళల్లో పాపగార్ల పెళ్ళిళ్ళు చూసినపుడు నాకు చక్కగా మనువుచేసుకోలని వుండేది. ఇలాటి అందె ఉంగరం పెట్టించుకోలని చాలా కోరిక! మా యమ్మ దొంగదాయి... నాకు పదేనేల్లు..అప్పుడు! ఆల్ల తమ్ముడికిచ్చి... పోలాలమ్మ గుడిముందు తాళిబొట్టు కట్టించీసింది. ఆడు కాల్సుకుతినీసినాడు నాలుగేళ్ళు. బేబీ పుట్టాకా లారీలో పోయినోడు మరి రానేదు. ఎవతినో లేపుకుని పోయాడని క్లీనరు రాజుగాడు సెప్పినదాకా మాకు ఆడి అయిపే లేదు! బేబీకి పదమూడేళ్ళు ఉప్పుడు. ఆడు సచ్చినట్టే నాకు! ....

రాములప్పయి ఏడిస్తే విలవిలలాడిపోతాడు హరప్పడు! " ఊరుకోయేస్! నాకు మాత్రం వొవరున్నారు? మా మవయ్య లారీ ఎక్కించి ఈ వూరు తెచ్చీటప్పుడు నావొయిసు పదారేళ్ళు. ఆయనతో పాటూ తాపీపనులకెళ్ళి... పదేసి ప్లోరులు గడంచీలెక్కి ప్లాస్టరింగులూ, పెయింటింగులూ...చేసా! ఆ తరవాత ఇటుకకట్టుడు, పిల్లర్లేయడం.... రాడ్ బెండింగూ , స్లాబులూ, స్కఫోల్డింగూ అన్నీ నేర్సుకున్నా! మీ ఇంటికి అద్దెకొచ్చానా... నా దశ తిరిగిపోనాది. తాపీమేస్త్రి అయిపోనాను! నువ్వు దొరికీసినావు. ఎవురేమనుకుంటే అనుకోనీ! మీ యమ్మ గెంటేత్తే బయటకు పోదారి! బేబీ నా సొంతకూతురు లెక్క! పిల్లను బాగా సదివిద్దారి! "...... అంటూ భరోసాగా చెప్పాడు హరి!
" ఓ పని సేద్దాం హరీ! ఈ యాదివారం సిమ్మాచలం యెళ్దాం. ఈ తాళిబొట్టు కట్టీసీయి నాకు. సరిపోద్ది. వాగే వోళ్ళు నోరుమూయిద్దారి! ".... ఆ చీకట్లు చిక్కబడుతున్న నిశీధి సాక్షిగా.... ఆ అసంపూర్తి గోడల మధ్య ఒకరిచేతిలో ఒకరు చేయేసుకుని.... వాగ్దానాలూ, భవిష్యత్ ప్రణాళికలూ చేసుకున్నారు అమాయకంగా!

అడ్డుగోడలెయ్యడానికి వారిమధ్య ఆర్ధికతారతమ్యాలు లేవు. ఇద్దరిలో ఎవరుపెద్దో ఎవరుచిన్నో కూడా తెలీదు! కులాల సారూప్యం అసలు తెలీదు! తెలిసినదల్లా ఇద్దరికీ ఒకరితోడు ఒకరికి కావాలని.

ఆ రాత్రి ఆ నక్షత్రాల కాంతిలో మిలమిలలాడుతున్న ఆ కొద్దిపాటి బంగారం సాక్షిగా వారిద్దరూ భార్యాభర్తలుగా ప్రధానం, ప్రమాణం చేసుకున్నారు!

నాలుగేళ్ళు హాయిగా గడిచిపోయాయి. హరప్పడు పూర్తిస్థాయి మెయిన్ మేస్త్రీ అయిపోయాడు. కొలతలేయడంలో, ఎస్టిమేట్లు వెయ్యడంలో, అనుకున్న సమయానికి పని కంజాయింపు చెయ్యడంలో హరప్పడు తరవాతే అని పేలెర్లిపోయాడు! ముగ్గురు కంట్రాక్టర్లకు హరప్పడే పెద్దమేస్త్రీ!

శ్రీకాకుళం నుండి లేబర్ని తేవాలన్నా, తాండవ, శారద, నాగావళి నుండి ఇసకలారీలు తెప్పించాలన్నా హరప్పడి భరోసాయే వాళ్ళకు!

తనని గౌరవంగా సొంతమనిషిలా చూసుకునే శోభమ్మగారిల్లు తప్పా మిగిలిన ఇళ్ళల్లో పనులు మానేసింది రాములప్పాయి.

వాళ్ళ కూతురు బేబీ ఇంటరు సీఈసీ ఫస్ట్ క్లాసులో పాసయ్యింది. .... ఈలోపున హరప్పడి పనినేర్పు దగ్గరనుండి చూసిన ఓ బేంకాయన... హైదరాబాదు వచ్చేసి తనకూ, తన నలుగురి స్నేహితులకూ మణికొండలో కాంట్రాక్టు తీసుకుని ఇళ్ళు కట్టిపెట్టమని పిలిచాడు!

అది వాళ్ళ జీవితంలో అతిపెద్ద నిర్ణయం! ఉన్న ఊళ్ళో కలోగంజో తాగి సంతృప్తిగా బతికేయాలా లేక తెలీని మహానగరానికి వలసపోయి రిస్కు తీసుకోవాలో తెలీని సందిగ్దత. రాములప్పాయే ధైర్యం చేసింది. బేబీ భవిష్యత్తు కోసం వలసపోవడమే ఉత్తమమనుకుంది.

కానీ పెట్టుబడి? లక్షరూపాయిల బంగారం, రెండులక్షలు పిల్లకోసం చీట్లుకట్టి సంపాదించిందీ చేతిలో ఉంది. కానీ మరో రెండులక్షలయినా ఉంటే కానీ పని జరగదు. ఆ సమయంలో "నేనున్నానంటూ"...తను నమ్ముకున్న శోభమ్మగారే అక్కరకొచ్చింది రాములికి.

కొందరుంటారు. వాళ్ళకు పెద్ద గడుసుతనాలూ, లెక్కలూ, తారతమ్యాలూ తెలీవు. స్నేహమంటే స్నేహమే! "ఈ బాపనమ్మకు ఆ పనిదాయితో స్నేహమేంటో!".... అని ఇరుగూపొరుగూ నవ్వినా ఆ శోభమ్మకు లెక్కలేదు. రాములప్పాయి బంగారానికి తన బంగారాన్ని కొంత కలిపి... బేంక్ లోన్ తీయించి అవసరమైనంత సొమ్ము రాములు చేతిలో పెట్టింది ఆవిడ!

ఆరోజు తనవేలినుండి అన్యమనస్కంగా..అందె వుంగరం తీయబోతున్న రాముల్ని చెయ్యట్టుకుని ఆపింది ఆవిడ. ఆవిడకు తెలుసు ఆ అందె ఉంగరమంటే రాములికి ఎంత ప్రేమో!

"ఆ దూరదేశం వలస పోతున్నవాళ్ళు మళ్ళీ ఆవేపులకు తిరిగి వస్తారో లేదో? తన బంగారం తాకట్టు విడిపిస్తారో లేదో? ..... ఈ యోచనే లేదు ఆవిడకు. "సాయమడిగింది! చేసాను! "....అంతే! ఆ తరువాత తన భర్తచేతిలో ఆమె పడ్డ పుర్రాకులు ఆ పెరుమాళ్ళకే ఎరుక!

కలిసొచ్చే రోజులొచ్చినపుడు చేసిన కష్టానికి వందరెట్ల ఫలం ఇస్తాడేమో భగవంతుడు.

రెండులారీల్లో లేబర్నీ, పనిముట్లనూ వేసుకుని హరప్పడూ, రాములప్పాయి కూతురితో సహా మణికొండ చేరారు. అప్పుడప్పుడే పెరుగుతున్న ఐటీ వలన ఆరోజుల్లో మణికొండలో విస్తృతమైన గృహనిర్మాణాలు మొదలయ్యాయి.

ఆ బేంక్ ఉద్యోగులవి ...ఒకే వీధిలో ఒకేలాంటి ఐదిళ్ళ కాంట్రాక్టు కావడంతో.... ఆర్కిటెక్ట్ ప్లాన్ చేతిలో పెట్టడమేంటి చకచకా అల్లుకుపోయాడు హరి.

పాలిటెక్నిక్ కాలేజీలో లో కార్పెంటరీ నేర్చుకుని కొత్తమోడల్స్ లో ఉడ్ వర్కులు చేస్తున్న తెలిసిన ఇచ్ఛాపురం కార్పెంటర్ని కుర్రాళ్ళనేసుకుని వచ్చేయమన్నాడు. అందరినీ ఓ రెండంతస్థుల ఇంట్లో పెట్టాడు. అందరికీ వంట రాములే!

ఐదిళ్ళ పనులు ఏభై ఇళ్ళయి.... ఐదంతస్థుల భవనసముదాయాలయ్యి.....అయిదారేళ్ళలో చిన్నస్థాయి కాంట్రాక్టర్ నుండి నమ్మకస్థుడయిన బిల్డర్ గా ఎదిగాడు హరి! కాస్త చదువబ్బి పోర్టులో చిన్న ఉద్యోగం చేసుకునే బావమరిది గోవిందును తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టారు! రాములు చెల్లెలు అచ్చయమ్మ... నర్సీపట్నం రోడ్డు మీద కాకాహోటల్ నడిపే తన మొగుడూ, పనోళ్ళతో మణికొండలో వాలిపోయి.... లేబర్ భోజనాలకు ఇంచార్జి అయిపోయింది. విశాఖపట్నం, విజీనగరం, సిక్కోలు నుండి పరివారాన్నంతా హైదరాబాదు తెచ్చి... తలో పనిలోపెట్టేసారు ఇద్దరూ!

ఇంతకీ శోభమ్మగారి బంగారం తాకట్టు విడిపించిందా లేదా అనికదా మన సందేహం! చేతిలో అడ్వాన్సులు పడడమేంటి... ఆఘమేఘాల మీద వూళ్ళో వాలి.... మంచి కంచిపట్టుచీర కొని.... పువ్వుల్లో పెట్టి మరీ శోభమ్మగారి బంగారాన్ని అప్పగించింది రాములప్పాయి! అంతే కాకుండా ప్రతీ కార్తీకపౌర్ణమికీ ఆవిడ పుట్టినరోజుకు విధిగా ఆవూరొచ్చి... బట్టలుపెట్టి , కాళ్ళకు దణ్ణవెట్టి... ఆ మర్నాడు సముద్రస్నానం చేసి మరీ విమానం ఎక్కేది రావులు! శోభమ్మగారి అబ్బాయి హైదరాబాదులో ఇల్లుకట్టుకోవాలని అనుకుంటే.... సగం ఖర్చుకే ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిపెట్టించింది మొగుడుచేత!

లా పూర్తిచేసి కోర్టుకెళ్తున్న బేబీకి... ఆస్థి, అంతస్థు చూసి మరీ తమ కులపోళ్ళ అబ్బాయే... హైకోర్టు లాయరుగారబ్బాయికి.... స్థలాలమ్మేసి కోటిన్నర ఖర్చుపెట్టి... అంగరంగ వైభవంగా పెళ్ళిచేసారు.

వూళ్ళనుండి రైళ్ళూ, బస్సులూ ఎక్కిమరీ ఆ పెళ్ళికొచ్చిన బంధువులందరూ.... పక్కకొప్పులెట్టి, అడ్డపొగతాగుతూ, వడ్డిభాష మాట్లాడుకుంటూ పెళ్లిమండపంలో అటూయిటూ తిరుగుతూ ఉంటారని.... నాగరీకులయిన మగపెళ్ళివారు వాళ్ళను చూసి నవ్వడానికీ చిరాకుపడ్డానికీ వీల్లేదని ముందే కండీషను పెట్టారు హరీ-రాములూ ... కోటిరూపాయిలు వాళ్ళ చేతికిస్తూ!

జనాలు కాలం కలిసిరావడం చూసారు కానీ ... ఇంత వైభవంగా కలిసిరావడం బహుశా ఈజంటకే జరిగినట్టుంది అనుకోసాగారు! . రాజు వెడలె రవితేజములలరగ.... అన్నట్టు పరివారాన్నంతా వెంటేసుకుని తిరిగేవారు హరప్పారావు గారు అలియాస్ హరప్పడు! రామలక్ష్మి అలియాస్ రాములప్పయ! నరదృష్టికి నాపరాళ్ళు పగులుతాయి కదా! అలాగే....వీరి కుటుంబదుర్గానికీ బీటలు మొదలయ్యాయి!

ముగ్గురుపిల్లలు పుట్టుకొచ్చాకా....వాళ్ళ పెళ్ళయిన పదిహేనేళ్ళకు బ్లడ్ కేన్సర్ తో అల్లుడు హఠాత్తుగా పోయాడు. తనను ఎంతో అపురూపంగా చూసుకునే భర్త మరణానికి బేబీ కుంగిపోయింది. ముద్దులకూతురిని ఆ స్థితిలో చూసి విరాగులయిపోయారు ఆ దంపతులిద్దరూ! ఆ దుఃఖోద్వేగానికి రాములికి గుండెజబ్బు మొదలయింది. రోజూ కేజీకి తక్కువ కాకుండా బంగారునగలు పెట్టుకుని, పట్టుచీరలు తప్పా మారు కట్టని రాములప్పాయి భారీశరీరానికి జబ్బులవలనా, విరక్తి వలనా... నూలుచీరా, పుస్తెలుతాడూ తప్పా ఏం వేసుకున్నా భారంగా అనిపించేది!

మరికొన్ని ఒడిదుడుకుల మధ్య రాములప్పాయికి అరవైయేళ్ళు వచ్చాయి. హరప్పడి పుట్టుపూర్వోత్రాలు తెలియనందున... ఆమె పుట్టినరోజునే షష్టిపూర్తిగా చెయ్యాలని ... అప్పుడప్పుడే విషాదంలోంచి బయటపడ్డ కూతురూ, కుటుంబ సభ్యులూ తలపోసారు.

తమవూరిలోనే చెయ్యాలని రాములూ, హరి పట్టుపట్టడంతో.... ఆ వూరిలోనే ఘనంగా ఏర్పాట్లు చేసి.... అంగరంగవైభవంగా తన తల్లితండ్రుల పెళ్ళిజరిపింది కూతురు. అదే పెళ్ళిలో.... మేనకోడలి మీద ప్రేమతో అవివాహితుడిగా ఉండిపోయిన తమ్ముడు గోవిందు చేతిలో కూతురు చెయ్యి పెట్టి అప్పగించింది రాములు. భర్తతో తమను నమ్ముకున్న వారందరికీ ఇవ్వదలుచుకున్నది ఇప్పించేసింది. బంగారాన్నీ సగం కూతురుకిచ్చి మిగిలిందంతా బంధువులకు పంచేసింది!

మతిపోయినదానిలా ఒకటీ ఒకటీ నగలు ఒలిచేసి ఇచ్చేస్తుంటే....అందరూ ఖిన్నులైపోయారు ఆమె చేష్టలకు. ఆరాత్రి హడావిడి ముగిసి... అందరూ ఎవరితావులకు వారు చేరారు!

రాములప్పాయి, హరప్పడూ... తాము ఆవూర్లో కొనుక్కున్న అపార్ట్ మెంట్ కు వచ్చారు. మొత్తం ఇల్లంతా పూలతో అలంకరించి... " వెల్కమ్ టు న్యూలీ వెడ్" అని గులాబీపువ్వులతో రాయించింది బేబీ! ఇద్దరూ అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

హాయిగా స్నానం చేసి మెత్తని తెల్ల నూలుచీర కట్టుకుంది రాములు. తెల్లగా పిండారపోసినట్టు వెన్నెల బాల్కనీ అంతా! హరప్పడు వచ్చి భార్యపక్కన ఉయ్యాలలో కూచున్నాడు. ముప్ఫై ఐదేళ్ళ క్రితం తామిద్దరూ ఊసులుచెప్పుకుని... బాసలు చేసుకున్న ప్రదేశమది. మౌనంగా ఆ అందమైన రోజులన్నీ మననం చేసుకుంటున్నారు ఇద్దరూ! ఇంతలో హరి ఏదో గుర్తొచ్చినట్టు... జేబూలోంచి చిన్నపెట్టె తీసాడు. మృదువుగా రాములమ్మ చెయ్యి తనచేతిలోకి తీసుకుని... దాంట్లోంచి తీసిన వస్తువు చేతిలో పెట్టాడు. అది అతిఖరీదయిన పెద్దపెద్ద వజ్రాలు పొదిగిన అందె వుంగరం! వెన్నెలకాంతికి మరింత మిరుమిట్లు కొల్పుతోంది ఆమె అరచేతిలో.

రాములమ్మ కుడిచేతి మధ్యవేలుకు పెట్టమని సూచించింది. ఎందుకంటే ఆమె ఉంగరం వేలుకు ఇప్పటికీ... అరిగిపోయి... వంపుతిరిగిపోయి....బంగారం రంగు వెలిసిపోయి...పాత అందె ఉంగరం అలాగే ఉండిపోయింది.

దాన్ని లాగబోయాడు హరప్పడు.

" అది ఊడిరాదు హరీ! ఆ వేలుచూడు ఎలా బలిసిపోయిందో! ఉండనీ దాన్ని! ఇన్ని నగల్లో నాకిష్టమయిన నగ అదొక్కటే! నీ మొదటి కష్టార్జితం! ....! .... ఆ చిరుచలిలో భారంగా వస్తున్నాయి ఆమె మాటలు. అతనేమీ మాట్లాడలేదు. ఆ పెట్టె తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు... తన వేలికున్న పాత వెంకన్న బాబు ఉంగరం కేసే తదేకంగా చూసుకుంటూ!

మీరు ఊహించింది నిజమే. ఆ రాత్రి భర్త పరిష్వంగంలో సుఖంగా నిద్రపోయిన రాములప్పాయి మరి లేవలేదు.

ఆమె దేహాన్ని ఆమెకు అత్యంత ప్రియమయిన ఆ " అందె ఉంగరం" తోనే దహనం చేసారు! కాష్టం చల్లారేకా కాటికాపరి బూడిదంతా వెతుక్కున్నాడు...కానీ ఎక్కడా పిసరంత బంగారం జాడా దొరకలేదు. బహుశా ఆమె ఆత్మతోనే ఆ అందె ఉంగరం కూడా ఆవిరైపోయినట్టుంది!

రాములప్పాయి పోయాకా హరప్పడూ మరెంతో కాలం లేడు. తన జీవితాన్నే మార్చేసిన తన అదృష్టదేవతను వెతుక్కుంటూ పోయాడు!

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ