గెలుపు - Ramesh Machabhaktuni

Gelupu

పట్టుదల విజయానికి పునాది.జరిగిన అవమానాలు,ఎదురైన సంఘటనలు పట్టుదలకు సోపానాలై...విజయతీరాలకు చేరుస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు

******

ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 10 వ తరగతి "ఏ " సెక్షన్ రూమ్.

1988 వ సంవత్సరం మార్చి నెల...

మధ్యాహ్న భోజన విరామం అనంతరం...మొదటి పీరియడ్...తెలుగు సబ్జెక్ట్....

శీతారామారావు గారి క్లాస్...ఆ తరగతి కి ఏ ఒక్క స్టూడెంట్ మిస్ అవ్వరు....

కారణం మాస్టర్ చెప్పే పాఠాలు ఛలోక్తులతో నిండి,పద్యాలు రాగయుక్తంగా ఆలపించి, విషయo మొత్తం అరటిపండు వలచిన చందంగా ఉంటుంది.

అందుకే తరగతి మొత్తం నిండిపోతుంది....

మాస్టారు లోపలికి రాగానే...అందరూ లేచి అభివాదం చేసి...మాస్టర్ అనుమతితో ఆశీనులైనారు.

శ్రీనాధుడు ఆ నాటి విజయ నగర సామ్రాజ్య విషయంలో పరిస్థితి ని వివరించే చాటుపద్యాలను...భావ యుక్తంగా పాడి వినిపించే సమయంలో...అటెండర్ రంగ...సర్క్యులర్ రిజిస్టర్ క్లాస్ లోకి తెచ్చాడు...

మాస్టర్...ఆ పుస్తకం ...తీసుకుని..విషయం చదివి వినిపించారు...

"వచ్చే నెల ఏప్రిల్ మొదటి వారం లో మన కాలేజి వార్షికోత్సవం జరగబోతుంది.నాటికలు,పాటలు,డాన్స్ పోటీలో పాల్గొనే వారు...రేపటి లోపు..మన స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ వద్ద మీ మీ పేర్లు నమోదు చేసుకోండి...." అన్నారు.

సర్క్యులర్ లో సంతకం పెట్టి, అటెండర్ వెళ్ళగానే... స్కూల్ లీడర్ ను ఉద్దేశించి..." రాజు...నీవు ఎలాగూ నాటిక వేస్తావు కదా.ప్రైజ్ కూడా నీకే వస్తుంది.అది ఖాయం.ఐతే...ఈ సంవత్సరం ఎవరైనా కొత్త వాళ్ళు..పాల్గొంటరేమో కనుక్కో...కొత్త వాళ్ళు ఐతే నీ అనుభవం తో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది...' అన్నారు

"సరే...మాస్టర్..." అని గర్వం గా తలాడిస్తూ...."మనతో పోటీ పడి గెలవడమో వీళ్ళ వల్ల ఏo అవుతుంది. ప్రైజ్ ఈ సంవత్సరం కూడా మనదే..."అని మససు లో అనుకున్నాడు రాజు..

ఇంతలో...క్లాస్ వెనుక వరుస నుంచి లేచాడు రాము..."సార్..ఈ సంవత్సరం నేను,మా ఫ్రెండ్స్ కలిసి నాటిక వేద్దాం అనుకుంటున్నాము.."

రాజు కోపం గా రాము వైపు తినేసే లాగా చూస్తూ..."నువ్వా...నాటిక..నీకు డైలాగులు చెప్పటం వచ్చా..."అని కోపం గా అరిచాడు క్లాస్ లో సార్ ఉన్నాడనే స్పృహ లేకుండా...

తెలుగు మాస్టర్ కు ఒక్కసారిగా కోపం వచ్చింది.దాంతో..."రాజు...వాడికి ట్రైనింగ్ ఇచ్చిచూడు.అంతే కాని...నిరుత్సాహ పరచకూడదు.." అని మందలించారు.

రాము పై కోపాన్ని దిగమింగుకుంటూ..."అలాగే ...సార్ ..నేర్పుతానండి..."అన్నాడు రాజు.

తెలుగు మాస్టర్ రాము వైపు చూస్తూ.."అల్ ద బెస్ట్" అని ప్రోత్సహించారు.

రాజు కు కోపం తారాస్థాయికి చేరింది.కళ్లు ఆ కోపంతో ఎర్రగా మారాయి.

పీరియడ్ ముగియడం తో, మాస్టర్ క్లాస్ నుంచి వెళ్లారు...వెంటనే బిలబిల మంటూ విద్యార్థులు బయటకు దారి తీశారు.

****

ఆ రోజు ఆదివారం.రాము,నాగేశ్వరరావు,వెంకట్రావు,శ్రీను బంగళా రోడ్డు లోని గ్రంధాలయం నకు వెళ్లాలని నిర్ణయం చేసుకొన్నారు.

ఉదయం 10 గం.లకు గ్రంధాలయం నకు చేరుకున్నారు.

లోపలికి వెళ్ళగానే...రామారావు గారు ఆప్యాయo గా పలకరించారు. " ఏం...రాము...నాటిక వేస్తున్నారట గా...మంచి నాటిక వేయాలి.ప్రైజ్ పొందాలి.."అన్నారు.

ఆ లైబ్రరీ కి లైబ్రెరీయన్ రామరావు గారు.

"ఏమిటి సార్...మేము నాటిక వేసే సంగతి మీ దాకా వచ్చిందా..."అన్నాడు రాము ఆశ్చర్యం తో...

"పోటీ అలాంటిది మరి...."అన్నారు రామారావు గారు నవ్వుతూ...

"సార్...మీరే మాకు సహాయం చేయాలి.మంచి నాటిక ఎంపిక చేయాలి సార్.."అని అభ్యర్ధిoచాడు రాము.

రామారావు గారు.. ఆ గదిలో ఎడమ వైపు ఉన్న రాక్ చూపిస్తూ..." ఆ రాక్ లో మంచి నాటిక ల పుస్తకాలు ఉన్నాయి.వాటిలో మీకు నచ్చినవి ఎంచుకోండి.ఫైనల్ గా నేను సెలెక్ట్ చేస్తాను.. సరేనా.." అన్నారు.

అప్పుడు మొదలైన...సాగర మథనం..అదే....వెతుకులాట....మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.

నలుగురు మిత్రులు నాలుగు వైపులా...రాక్ లోని పుస్తకాలను జల్లెడ పట్టారు.

ఆయాసపడుతూ వెతికిన నాలుగు పుస్తకాలను లైబ్రైరియన్ గారి టేబుల్ మీద పెడుతూ..."సార్ ...మంచి నాటిక ఏంపిక చేయండి.ప్రైజ్ మాకే రావాలి.."అన్నారు ఏకకంఠంతో...

వారి పట్టుదల చూసి ముచ్చటేసింది..లైబ్రరీయన్ రామారావు గారికి...ఆ నాటికల్లోనుంచి ఒక పుస్తకం బయటకు తీశారు.

"ఈ నాటిక వేయండిరా అబ్బాయిలు..ప్రైజ్ మీకే..."అనగానే...ముక్తకంఠంతో నలుగురి మిత్రులు..."నాటిక పేరేమిటి సార్...అని పొలికేక వలె అరిచారు.

"సైలెన్సు.."అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ..."ఇది లైబ్రరీ...మరచి పోయినట్లు ఉన్నారు.."అన్నారు నవ్వుతూ...

"సారీ సార్."..అని చెప్తూ...నాటిక పేరు...అన్నారు నెమ్మదిగా...

"రేపేంటి..."..

ఈ నాటిక మీ గెలుపు కు బాట ...కావాలి"... .. ఆల్ ది బెస్ట్ "..అని ప్రోత్సహించారు రామారావు గారు...

"రేపేంది .."నాటిక పుస్తకాన్ని తీసుకొని,...ఉత్సాహంగా, లైబ్రరీయన్ ఆశీస్సులతో...బయటకు వచ్చారు.

****

సోమవారం స్కూల్ కు రాగానే...తెలుగు మాష్టారు సీతారామారావు గారి దగ్గరకు వెళ్లారు నలుగురు మిత్రులు...

అప్పటికి తరగతులు ఇంకా ప్రారంభించడానికి 15 ని.సమయం ఉంది.

నలుగురు మిత్రులను చూసి,సీతారామారావు మాష్టారు..." ఏరా అబ్బాయిలు...నాటిక సంగతి ఏం చేశారు...ఏ నాటిక వేయాలనుకుంటున్నారు...సామాజికమా..జానపదమా..పౌరాణికమా..."అని వాకబు చేశారు.

వెంటనే రాము తన చేతి లోని నాటిక పుస్తకాన్ని మాష్టారు గారికి ఇస్తూ..." రేపేంది..ఈ నాటిక పేరు.ఈ నాటిక ను లైబ్రరీయన్ గారు సూచించారు.." అన్నాడు.

"ఎవరు...రామారావు గారేనా..."అంటూ

ఆ నాటిక పుస్తకాన్ని ఆసాంతం పరికించి..."మంచి నాటిక ఎంచుకున్నారు అబ్బాయిలు.ఈ నాటిక ను దివాకర బాబు గారు వ్రాశారు.మంచి రచయిత.ఈ నాటిక మీరు చక్కగా ప్రదర్శిసే ...ప్రైజ్ మీదే.." అన్నారు తెలుగు మాష్టారు.

"రాజు ను అడిగి...మీరు వెంటనే...ప్రాక్టీసు మొదలు పెట్టండి...నేను వాడికి చెపుతాను..." అంటూ కుర్చీ లోనుంచి లేచారు క్లాస్ కు వెళ్లటానికి...

రామారావు గారు, తెలుగు మాస్టర్ గార్లు ఆశీర్వదించారు ఓ మంచి ప్రయత్నాన్ని...

****

ఆ రోజు సాయంత్రం స్కూల్ లీడర్ ను.. రాము మిత్ర బృందం కలిసింది.

"రాజు...తెలుగు మాస్టర్ గారు చెప్పారు.నీ దగ్గర నాటిక నేర్చుకోమన్నారు.ఈ రోజు మొదలు పెడదామా.." అడిగాడు రాము.

"ఏం నాటిక ఎంచుకున్నారు..."అన్నాడు విసుగ్గా

రేపేంది...అని పుస్తకాన్ని చూపించాడు నాగేశ్వరరావు.


పుస్తకాన్ని నిర్లక్ష్యంగా చూస్తూ..."రేపు ప్రాక్టీసు మొదలు పెడదాము..ఈ రోజు నాకు ఇంటి దగ్గర పని ఉంది..."అన్నాడు కోపంగా...నాకే పోటీ కి వస్తారా..."అని మనసు లో అనుకుంటూ..."వీళ్ళు నాటిక ఏలా వేస్తారో చూస్తా..."

సరే...అనుకుంటూ..."ఐతే రేపు వస్తాము..." అని వెనుతిరిగారు నలుగురూ మిత్రులు.

ప్రతి రోజు అవే సీన్లు రిపీట్...

వారం రోజులు గడిచాయి.ప్రతి రోజు రాము అండ్ కో నాటిక ప్రాక్టీస్ కు రావడం,ఏదో కుంటి సాకు తో రాజు వాయిదా వేయడం...ఇలా కొనసాగింది.

విషయం అర్ధమైంది రాముకి..."వీడికి మన మీద ఈర్ష్య గా ఉందిరా...అందుకే మనకు ప్రాక్టీసు లో సహాయ పడటం లేదు.ఎలాగైనా ఈ నాటిక మనం చక్కగా నేర్చుకోవాలి,ఎలాగైనా ప్రైజ్ తెచ్చుకోవాలి..." అని మిత్రులతో అన్నాడు రాము.

'అలా ఐతే...మన లైబ్రరీయన్ గారిని అడుగుదాం...మనకు తప్పక హెల్ప్ చేస్తారు..." అన్నాడు నాగేశ్వరరావు.

"సరే..."అని నిర్ణయం తీసుకున్నారు.

తర్వాత ఆదివారంనాడు లైబ్రరీ కి వెళ్ళి, రామారావు గారిని కలిసి, జరిగిన విషయం చెప్పారు.సహాయం చేయమన్నారు.ఎలాగైనా ప్రైజ్ కొట్టాలి.జరిగిన అవమానo కు, గెలుపు తో ప్రతీకారం తీర్చుకోవాలని...పట్టుదలతో కోరారు.

లక్ష్య సాధనలో మిత్రులు పట్టుదలను చూసి,ముచ్చట వేసింది ఆయనకు.వెంటనే..." మీరు అధైర్య పడవద్దు.నేను మీకు నేర్పుతాను.ప్రతిరోజు సాయంత్రం 5 గం.లకు లైబ్రరీ కు రండి " అన్నారు.

"మీరు ఏ పాత్రలు ఎంచుకొన్నారో చెప్పండి.రాము...నువ్వు ఏ పాత్ర ఎంచుకున్నావు..అని అడిగారు

"నేను ప్రెసిడెంట్ పేరయ్య...పాత్ర ఎంచుకొన్నాను సార్.." సమాధానం ఇచ్చాడు రాము.

"అనుకున్నాను.నువ్వు ఆ పాత్రకు ఖచ్చితంగా సరిపోతావు..."నీ సంగతి ఏమిటి...నాగేశ్వరరావు..'అడిగారు లైబ్రరీయన్.

"నేను సర్పంచ్ గారి పాలేరు గా వేస్తున్నాను..అని సమాధానం ఇచ్చాడు.

మిగిలిన పాత్రలు ఎవరు వేస్తున్నారో..కనుక్కోవడం పూర్తి అయింది.

ప్రతి రోజు స్కూల్ అయిపోగానే...లైబ్రరీ కు రావడం...రామారావు గారి ఆధ్వర్యంలో తర్ఫీదు..చక చకా సాగిపోతున్నాయి.

రోజు రోజు కు ఎవరి పాత్రలో వారు డైలాగ్స్ చెప్పడం..చక్కగా అభినయం తో పాత్ర పోషణ...పరిపూర్ణత సాధిoచడం..జరిగిపోతుoది.

- ****


అనుకున్న

రోజు రానే వచ్చింది...కాలేజి ఆడిటోరియం పూర్తిగా నిండి పోయింది.ముందు వరుస లో ప్రిన్సిపాల్ ,లెక్చరర్లు,టీచర్లు,గ్రామ పెద్దలు ఆశీనులైనారు.

మైక్ లో ప్రకటన వినిపిస్తుంది...

"దివాకర్ బాబు వ్రాసిన...రేపేంది...నాటిక ఇప్పుడు ప్రదర్శిoచబోవుచున్నారు.ఇందలి పాత్రలు...పాత్రధారులు...ప్రెసిడెంట్ పేరయ్య గా ...రాము..." అని చెపుతున్నాడు వ్యాఖ్యాత...

ఇంతలో కర్టెన్ తెరుచుకుంది..

బిళ్ళ గోచి పంచె,తెల్ల లాల్చీ..లో పేరయ్య గా రాము...

ముతక ఖద్దరు బనియన్,అర లాగు తో...పాలేరు పాత్ర లో నాగేశ్వరరావు..

సంభాషణలు సందర్బోచితంగా,హాస్యం నిండిన మాటలు పాత్రలు పలుకుతున్నాయి.

ప్రతి డైలాగ్ కు ఆడిటోరియం చప్పట్లు తో మోత మోగుతుంది.

"అయితే...ఓరె..ఆ పంతులు మనలిని మీటింగ్ రమ్మన్నాడు గందా...రేపేంది రా..." చుట్ట నములుతూ పాలేరు అడగసాగాడు ప్రెసిడెంట్.

"నాకేటి తెలుస్తాది..నాకేటి..చదువా..పాడా...మీ బోటి పెద్దలకే తెలుసుద్ధి అయ్యా..." అన్నది పాలేరు పాత్ర.

చివరకు రేపేంది అంటే ఆగస్టు 15 ...మనకు స్వాతంత్య్ర దినోత్సవo వచ్చిన రోజు...అని తెలియడం తో కధ ముగిసింది.

ఈ మధ్యలో జోక్స్ పేలుస్తూ శ్రీను అండ్ కో.నాటిక ఆద్యంతం రక్తి కట్టిoచారు.

ఈ చప్పట్లు వింటున్న ...లీడర్ రాజు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు.

తర్వాత ...రాజు టీమ్ వేసే నాటిక పేరు అనౌన్స్ అయింది.

"కత్తి రాజు.. ఇందలి పాత్రలు,పాత్రధారులు...కత్తి రాజు గా.....రాజు..." అని అనౌన్స్మెంట్ అవుతుంది.

హీరో వేషం లో వేదిక మీదకు వచ్చాడు...రాజు..మరియు హాస్య పాత్ర లో రాజు చెంచా ...వెంకట్...

పట్టుదల తో నవ్వులు పండిస్తున్నారు ఇద్దరు...మిగిలిన పాత్ర ధారులు వారి వారి డైలాగులు బాగానే చెబుతున్నారు..నాటిక పూర్తి అయినది.


రాజు మొండి ధైర్యంతో ఉన్నాడు.కచ్చితంగా ప్రైజ్ వస్తుందని..."అందరూ తెలిసున్న మాస్టర్లు ...అందులో మనం లీడర్...మన నాటిక కాకుండా ఇంకెవరికి ఇస్తారు ప్రైజ్..."అనుకుంటూ వెనుదిరిగాడు రాజు.

చివరి నాటిక ప్రదర్శన తరువాత,.."రేపు స్కూల్ నోటీస్ బోర్డ్ లో విజేతల వివరాలు ప్రదర్శిoచబడటాయి...కావున రేపు స్కూల్ నోటీస్ బోర్డ్ లో రిజల్ట్స్ చెక్ చేసుకోగలరు.అప్పటి వరకు..గుడ్ నైట్...బై...థాంక్యూ.."అంటూ అనౌన్స్మెంట్ ముగిసింది.


రాము,రాజు ఇద్దరూ సరిగా నిద్ర పోలేదు.

ప్రైజ్ ఎవరిని వరిస్తుందో అని.....

****

దూరంగా మంద్ర స్థాయిలో వినిపిస్తుంది వెంకటేశ్వర సుప్రభాతం...'కౌసల్యా సుప్రజా రామా...."అంటూ...

కనులు నులుము కుంటూ లేచాడు రాము.చక్కగా తల స్నానం చేసి,కొత్త బట్టలు ధరించి,ఇష్ట దైవాన్ని తలచుకున్నాడు.

వేడి వేడిగా వాళ్ళ అమ్మ వేసిన...పెసరట్లు,అల్లo పచ్చడి తో మూడు లాగించాడు.బయట... నాగేశ్వరరావు రెడీగా ఉన్నాడు.కొద్దిసేపటికి మిగిలిన ఇద్దరు మిత్రులు తోడయ్యారు..రాముకు

అందరూ కలిసి స్కూల్ కు బయలుదేరారు..స్కూల్ కు చేరుకోనే లోపే ..అప్పటికే రాజు అండ్ బ్యాచ్ అక్కడకు చేరుకొన్నారు.

నోటీసు బోర్డ్ లో విజేతల పేర్లు లేవు.ఆతృత గా చూశారు అందరూ.

"10 వ తరగతి వాళ్ళ నాటిక విన్నర్ తరగతి లొనే అనౌన్స్ చేస్తారట..."అని ఏవరో అనడం రాము చెవిని చేరింది.

ఒక్క పరుగున క్లాస్ వైపు వచ్చారు రాము అండ్ కో...

క్లాస్ లో కుర్చీలు వరుసగా వేసి ఉన్నాయి.అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు.

అనుకోకుండా...రాజు వైపు చూసాడు రాము..

కొరకొర రాము వైపు చూస్తూ,కారాలు మిరియాలు నూరుతున్నాడు రాజు..

ఇంతలో ప్రిన్సిపాల్ గారు,ఇతర టీచర్లు క్లాస్ లోకి రావడం..అందరూ లేచి అభివాదం చేశారు.

సీతారామారావు గారు..మైక్ తీసుకొని..."గెలుపోటములు దైవాధీనాలు..ప్రైజ్ వచ్చిన వారు పొంగి పోరాదు...ఓడిన వారు కుంగి పోరాదు..చక్కగా నాటిక వేస్తే,బాగా ప్రదర్శన ఇచ్చిన వారికి వస్తుంది.ఇందులో ఏ మాత్రం సందేహం లేదు..."అన్నారు.

ఆ మాటలు విని పొంగి పోయాడు రాము..."తెలుగు మాస్టర్ మన గురించే చెబుతున్నారు.."అని మనసు లో సంతోష పడసాగాడు.

ఇంతలో..తెలుగు మాస్టర్..."మొదటి నాటిక వేసిన వారు ప్రైజ్ రాలేదని భయపడకూడదు..."అనగానే....

కించిత్ అనుమానం మొదలైంది రాము మనసులో...ప్రైజ్ రాదేమోనని...

రాజు వైపు చూశాడు ...వాడు హుషారుగా కనిపిస్తున్నాడు.బహుశా ..ప్రైజ్ వాడికేనా.. అనే ఆలోచనలు పురుగులా తొలిచేస్తున్నాయి..

ఈ లోపు..ప్రిన్సిపాల్ ను ఆహ్వానించడం..ఆయన మైక్ తీసుకొని..మాట్లాడటం మొదలు పెట్టారు..రాముకి ఏమి అర్థం కావటం లేదు...ఒకటే ప్రశ్న మదిలో...ప్రైజ్ వస్తుందా...రాదా..?

" ఏ రంగమైనా అనుభవం ఉంటే చాలా ఉపయోగకరoగా ఉంటుంది.దాని వలన తప్పులు చేయం. అనుభవం వలన బహుమతులు వాటిఅంతంటా అవే వస్తాయి..."అన్నారు ప్రిన్సిపాల్ గారు.

రాము పై ప్రాణాలు పైనే పోయాయి...ఇంక ప్రైజ్ రాదని నిర్ణయం చేసుకొన్నాడు ....

ప్రిన్సిపాల్ గారు మాట్లాడే మాటలు వినిపించడం లేదు రాముకు.చెవులు దిబళ్లు పడినట్లు ఉన్నాయ్...ఏడుపు తన్ను కొస్తుంది.

రాజు విజయగర్వంతో వికట్టాటహాసం చేస్తున్నట్లు ఉంది ...రాము కు..కళ్లు తిరుగు తున్నాయి..ఇన్ని రోజుల శ్రమ వృధా అయిపోయాయి కదా...అని బాధ తో క్లాస్ బయటకు వెళ్లాలని అనుకున్నాడు.

"అయితే...గెలుపు గర్వాన్ని ఇస్తుంది.ఆ గర్వంతో మనలను మనం తెలుసుకోకపోతే...ఓటమి మిగులుతుంది.కానీ,కొన్ని సార్లు పట్టుదల అక్కరకు వస్తుంది.పట్టుదల విజయానికి బాటలు వేస్తుంది..."అంటూ మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ గారు.

ఏడుపు తన్నుకొస్తుంది రాముకు...

"కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్నారు...ఓ సినీ కవి.ఆ కోవలోకి చెందుతారు రాము మిత్ర బృందం..మొదటి ప్రయత్నం లొనే ఎంత గానో కష్టించి...రేపేంది..నాటికకు మొదటి బహుమతి సాధించారు..."ప్రకటించారు ప్రిన్సిపాల్ గారు.

తన చెవులను తానే నమ్మలేక పోయాడు రాము.మనసులోనే లైబ్రరీయన్ రామారావు గారికి ధన్యవాదాలు సమర్పించాడు.

తెలుగు మాస్టర్ వేదిక మీదకు పిలవగానే...రాము అండ్ కో ఒక్క ఉదుటున వెళ్లారు.

ప్రిన్సిపాల్ చేతుల మీదుగా...ప్రైజ్ తీసుకున్నాడు రాము ఇతర మిత్రులతో కలిసి...

రాము ప్రైజ్ అందుకుంటూ ..రాజు వైపు చూశాడు.ఆ తీక్షణ చూపులకు తట్టుకోలేక...తలదించుకొని తన ఓటమి ని అంగీకరించాడు రాజు.

పట్టుదల,అవమానం...గెలుపు బాట వేస్తాయి అనటం ఏ మాత్రం సందేహం లేదు.ఎందరో మహాను భావులు తొలినాళ్ళ లో ఇలా అవమానాలు ఎదురుకొన్నవారే...ఆ పట్టుదల తో విజయాన్ని పాదాక్రాంతం చేసుకొన్నారు అనటం లో ఎలాంటి సందేహం లేదు.

అందుకు ఓ ఉదాహరణే...రాము గెలుపు...

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ