
“సార్, ఇంటికెల్తన్నాను. కూరగాయలేవైనా అట్టుకెల్లమంటారా?”
గోవిందు అడిగిన ప్రశ్నకు కేష్ కౌంటర్లోనుండి తల వెనక్కి తిప్పి చూశాడు అనిల్. సమయం మధ్యాహ్నం సుమారు 12 గంటలు కావస్తుండటంతో కౌంటర్ కొంచెం రద్దీగానే ఉంది.
“ఇంటికా? ఎందుకు?” అడిగాడు గోవిందుని చూస్తూ.
“మేనీజరు గారు కప్పులట్టుకు రమ్మన్నారు”
“కప్పులా? ఎందుకు?”
“మజ్జేన్నం ఆరెమ్ గారూ ఇంకా ఎవలెవలో ఒస్తారంట. సాయంకాలం మీటింగుకి పకోడీలూ, కాపీలూ చెయ్యించమన్నారు. కాపీలు ప్లాస్టిక్ కప్పుల్లో ఒద్దన్నారు. గాజు కప్పులెట్టమన్నారు”
అటు పూర్తిగా పల్లే కాని, పట్టణమూ కాని ఓ మేజర్ పంచాయతీ గ్రామం లో నడుస్తున్న గ్రామీణ బేంకు బ్రాంచి అది. ఓ మేనేజరూ ఓ కేషియరూ వెరసి ఇద్దరే సిబ్బంది. అనిల్ ఓ ఆర్నెల్ల క్రితం కేషియర్ గా వచ్చాడు. ఇతరత్రా పనుల కోసం అక్కడ టెంపరరీగా నియమించబడ్డ ఆల్ ఇన్ వన్ ఆర్మీ గోవిందు. చిన్న గ్రామం కావడంతో పట్టణాల్లో ఉండే సౌకర్యాలేవీ అక్కడ లేవు. అప్పటికింకా సెల్ ఫోన్లూ కంప్యూటర్లూ రాలేదు. హెడ్డాఫీసు నుండి పై అధికారులు ఎవరైనా వస్తే చిన్న చిన్న ఏర్పాట్లు చేయడం కూడా ఇబ్బందే. మేనేజర్ గారూ కేషియర్ గారూ వాళ్ల ఇళ్లనుండి కావలసిన సరంజామా సర్దుబాటు చెయ్యడం పరిపాటి. ఆ పద్ధతిలో భాగంగానే ఇప్పుడు గోవిందు తమ ఇంటికి బయలుదేరింది!
తెలిసిన విషయమే అయినా అనిల్ కి తమ ఇంటినుండి కప్పులు తెప్పించడం ఇష్టంగా అనిపించలేదు. వంట పాత్రల లాంటి మెటల్ వస్తువులేమైనా అయితే కొంత ఫర్వాలేదు కానీ గాజు కప్పులు తెప్పిస్తే, ఆ తరువాత వాటి వాడకంలో ఏమాత్రం అశ్రద్ధ జరిగినా అవి విరిగిపోతాయి. విరిగిపోవడం సరే, తరువాత సంధ్యతో ప్రాబ్లం మొదలౌతుంది! ఆమెకు జాగ్రత్తా ఎక్కువే, పరిశుభ్రతా ఎక్కువే! పైపెచ్చు ఆమె చాలా కచ్చితమైన మనిషి. ఏదైనా తేడా వస్తే ఎవరని కూడా చూడకుండా కడిగేస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే మేనేజరుగారి దగ్గర తనకు ఇబ్బందౌతుంది. ఏమైనాసరే తన ఇంటినుండి గాజు కప్పులు తెప్పించడం నివారిస్తేనే మంచిదనిపించింది.
“అద్సరే గానీ గోవిందా, కప్పులు వేరే ఏదో ఏర్పాటు చెయ్యు. ఇంట్లో గాజు కప్పుల్లేవనుకుంటాను” తప్పించే ప్రయత్నం చేశాడు అనిల్.
“లేకపోడవేటి. మీరీవూరొచ్చినప్పుడు మీ సామానంతా నేనే సరిదాను కదా! తెల్లటి గాజు కప్పులు కొత్త సెట్టు చూసాను. రేప్పొద్దున మల్లీ తెచ్చిచ్చిస్తాను” తిరుగులేని వాదన కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
ఇహలాభం లేదని అనిల్ కౌంటర్ నుండి బయటికొచ్చి గోవిందు భుజం మీద చెయ్యేసి మెల్లగా సణిగాడు “అది కాదు గోవిందూ. ఆ సెట్టంటే అమ్మగారికి ప్రాణం. చెయ్యి జారి ఒక్క కప్పైనా విరిగిందనుకో! చాలా కష్టం“ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
“ఏం పర్లేదు సార్. మీరు టెన్షను పడిపోకండి. జాగ్రత్తగా యెనక్కిచ్చే బాద్యత నాది. నాకొదిలీండి” అంటూ తన జవాబు కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు గోవిందు.
మధ్యాహ్నం మందీమార్బలంతో ఆరెం గారు రావడం, తనిఖీలు చెయ్యడం, చివాట్లు వెయ్యడం, చిరాకు పడడం వగైరా ప్రహసనాలన్నీ పూర్తయ్యాక మీటింగ్ మొదలైంది. అనిల్ కి కాస్త లోలోపల భయంగానే ఉన్నా, పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు.
మీటింగ్ జరుగుతుండగానే మేనేజర్ గారు సైగ చెయ్యడం, దానికి ‘అలాగే‘ అన్నట్టుగా గోవిందు తలాడించి డైనింగ్ రూమ్ లోనికి వెళ్లడం, పేపర్ ప్లేట్లలో … ఆ ఊళ్ళో దొరికే స్నాక్స్ … లడ్డూలు, కాసిని పకోడీలు, జంతికలు అన్నీ తెచ్చి అందరికీ చాలా మర్యాదగా అందించడం జరిగాయి. అనిల్ కి టెన్షన్ పెరగడం మొదలైంది. వద్దని చెప్తున్నా వినకుండా ఇతడు ఇంటికెళ్లి శ్రీమతి గారు ప్రాణంకన్నా మిన్నగా చూసుకునే లా ఒపాలా సెరామిక్ కాఫీ కప్పుల సెట్టు తీసుకొచ్చాడు. ఏదైనా జరిగి ఓ కప్పేదైనా విరిగితే ఆమెతో తను పడలేడు. ఆ సెట్టు ఆమె ఇచ్చి ఉండకపోతే బాగుండేది.
కాస్సేపటికి కప్పులతో కాఫీలొచ్చాయి. అనిల్ అందరినీ శ్రద్ధగా గమనిస్తున్నాడు. మేనేజర్ గారితోనూ తనతోనూ కలిసి మొత్తం పదిమంది! అందరి చేతుల్లోనూ అవే కప్పులు!! ఆశ్చర్యంగా అనిపించిందతనికి. తమ దగ్గర ఉన్నది ఒక్కటే సెట్టు. అందులో ఆరే కప్పలు. మరి పది కప్పులెలా వచ్చాయి? మెల్లగా గోవిందుని దగ్గరికి పిలిచి అడిగాడు “ఎక్కడ తెచ్చావు కప్పులు?”
“మనింటినుండొక సెట్టు, మేనీజరు గారింటినుండొక సెట్టు”
“అన్నీ ఒక్కలాగానే ఉన్నాయి?” వివరం కావాలన్నట్టు అన్నాడు అనిల్.
“సారింట్లో కూడా సేమ్ మనలాటి డిజైన్ కప్పులే ఉన్నాయి సార్. అట్టుకొచ్చీసాను, అన్నీ ఒక లాటియే!” కిసుక్కున నవ్వాడతను శబ్దం రాకుండా.
మీటింగ్ ముగిసింది. ఆరెం గారినీ ఆయనతో పాటు వచ్చిన వాళ్లనీ రెండు కార్లలో ఎక్కించి, వెంటనే సరాసరి డైనింగ్ రూం లోనికి పరుగులు తీశాడు అనిల్. గోవిందుని చూసి “జాగ్రత్తగా కడిగేసి, పొడి గుడ్డతో శుభ్రంగా తుడిచి వెంటనే అమ్మగారికి అప్పజెప్పెయ్. ఏమైనా తేడా వస్తే తెలుసుగా! ఇక్కడెక్కడా దొరకవు అలాంటివి” హెచ్చరించాడు.
“మీరు బెంగెట్టుకోకండ్సార్. నేను సూసుకుంటానులే!” ధైర్యం చెప్పాడు గోవిందు.
కాస్త అనుమానంగానే సీట్లోకొచ్చి కేష్ టేలీ చెయ్యడం మొదలుపెట్టాడు అనిల్. ఎక్కడో ఒక రూపాయి తేడా వస్తోంది. అతడికి మనసంతా కప్పులమీదే ఉంది. మనసు కుదురుగా లేకపోవడంతో కేష్ టేలీ అవ్వడం లేదు. చాలా అసహనంగా ఉంది. ఈ లోగా త్వరగా సేఫ్ క్లోజ్ చెయ్యాలని మేనేజర్ గారు హుకుం జారీచేశారు.
ఎలాగోలా టేలీ చేసి సేఫ్ క్లోజ్ చేసి మేనేజర్ గారిని పంపించి మళ్లీ డైనింగ్ రూం లోకి పరుగెత్తాడు. అక్కడ కప్పులన్నీ తుడుస్తూ గోవిందు కనిపించాడు. నెమ్మదించిన మనసుతో వెనక్కి తిరగబోయిన అనిల్ కి కనిపించిన దృశ్యం అతణ్ని నివ్వెరపోయేలా చేసింది. జరాసంధుణ్ని భీముడు చీల్చినట్టుగా ఓ కప్పు నిలువునా రెండు ముక్కలై పడి ఉంది. ఆవేశమూ నిస్సహాయతా నిండిన కళ్ళతో గోవిందుకేసి చూశాడు.
“చెయ్యి జారిపోయింది సార్. జార్తగానే కడిగాను. అయినా …. “ నాన్చాడు గోవిందు.
విరిగిన ఆ కప్పు తమది కాకుండా మేనేజరు గారిదైతే బాగుండుననుకుంటూ “ఎవరిదది?” అనడిగాడు. “మనదే సార్. జారిపోయింది” సంజాయిషీగా లో గొంతుకలో చెప్పాడు.
“అందుకే నేను ముందు నుండీ వద్దని చెప్తున్నాను” రెట్టించాడు అనిల్.
“పరవాలేదు సార్. ఆరు కప్పులు మనింట్లో ఇచ్చెత్తాను. మేనీజరు సారు గారింట్లో మేడం గారికి మిగతావిచ్చి, ఒకటిరిగి పోయిందని చెప్తాను. మేడం గారేవనర్లెండి” భరోసా ఇచ్చాడు గోవిందు.
“ఏదో ఒకటి తగలడు. తొందరగా ఇంట్లో ఇచ్చి అమ్మగారేవన్నారో చెప్తే నేను ఇంటికెళ్తాను. నేను డే బుక్ చూసుకునే లోపు ఏదో చెయ్యు” విసురుగా అని డే బుక్ రాయడం మొదలెట్టాడు అనిల్.
ఓ పావుగంట తర్వాత గోవిందు వచ్చాడు “కాపీ ఇమ్మంటారేటి?” అంటూ. ఆ మాటలో హుషారు ధ్వనించింది అనిల్ కి. తలెత్తి అతణ్ని చూసి “ఇచ్చేశావా?” అనడిగాడు. “ఇచ్చీసాను, ఒచ్చీసాను” కాస్త కొంటెగా కాస్త గర్వంగా కాస్త ధైర్యంగా ఉందామాట. “ఏవైందీ, చూశారా అమ్మగారు?” అడిగాడు కుతూహలంగా. “టేబిల్ మీదెట్టీసాను. అమ్మగారు లెక్కెట్టుకున్నారు. అమ్మయ్య అనుకొని ఒచ్చీసాను” సక్సెస్ స్టోరీ వెల్లడించాడు గోవిందు. “సరేలే పోనీ” ధైర్యంగా నిట్టూర్చి కాఫీ తెమ్మని గోవిందుకి పురమాయించాడు.
ఫోన్ మోగింది. రిసీవరెత్తి “హలో” అన్నాడు అనిల్. అవతలి స్వరం తన శ్రీమతి సంధ్యది. ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని తెలిసు గనక లైట్ గానే రిసీవ్ చేసుకున్నాడు.
“ఆ, చెప్పు సందూ. కప్పులన్నీ సరిపోయాయా?” అడిగాడు.
“దానికే చేశానండీ. గోవిందున్నాడా?”
“ఆ ఉన్నాడు. ఎందుకు?” అనిల్ అంటుండగానే అనుమానంగా దగ్గరికి వచ్చాడు గోవిందు.
“ఏం లేదండీ. అతను తెచ్చిన కప్పుల్లో ఒకటి మనది కాదు” స్వరం కాస్త గట్టిగానే ఉండటంతో బయటికే వినబడుతోంది.
గొంతులో పచ్చి వెలక్కాయ పడింది అనిల్ గోవిందులిద్దరికీ.
“ఆ? అదెలా చెప్పగలవు?” ఆమెకు ఏ కోణంలో తెలిసిందో అర్థం కాక ఆశ్చర్యపోతూ అడిగాడు.
“ఒక కప్పు కొంచెం ఎక్కువ బరువుగా ఉందండీ” అంది సంధ్య!!!!!
నోరెళ్లబెట్టారిద్దరూ!!!