స్వయంకృతం - లత పాలగుమ్మి

self made mistake

ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ నుండి రెండు వైపులా లిల్లీలు, సంపెంగలు, రక రకాల గులాబీలతో కనులకు ఇంపుగా అలంకరింపబడి సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఒక వైపు శ్రావ్య వెడ్స్ శ్రీరామ్ అని పూలతో అలంకరింప బడిన పెద్ద బ్యానర్ శోభాయమానంగా వేలాడుతోంది అతిధుల దృష్టిని ఆకట్టుకుంటూ.

ఫంక్షన్ హాల్ బయట దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవడంతో కార్ పార్కింగ్ ఏమో అనే భ్రమ కలుగుతోంది. అన్నీ ఖరీదైన కార్లే.. మెర్సడెస్ బెంజ్, ఆడి, లిమోజెన్స్. చాలా కార్ల పైన ఫ్లాషింగ్ రెడ్ లైట్ ఉండటంతో అవి వీఐపీ వెహికల్స్ అని చెప్పకనే తెలుస్తోంది.

పెళ్లి కూతురి తాత గారు, తల్లి, పేరున్న రాజకీయ నాయకులు అయినప్పుడు పెళ్లిలో ఇంత హడావిడి ఉండటం సబబే మరి..... న్యూస్ లో శ్రావ్య పెళ్ళి గురించి విన్నప్పటి నుండి వెళ్ళాలా... వద్దా... అని చాలా ఆలోచించి చివరకి ఏది ఏమైనా నా చిట్టి తల్లి పెళ్ళి చూసి తీరాల్సిందే అని మనసు ఉండబట్టక వచ్చేశాడే కానీ ఎలా లోపలికి వెళ్ళడం ఇంత టైట్ సెక్యూరిటీలో... అని ఒక ప్రక్కగా చీకట్లో చెట్ల చాటున నక్కి కారులు వరసగా లోపలికి వెళ్ళడం గమనిస్తున్నాడు మనోహర్. పెద్ద గడ్డంతో, రెండు రోజుల ట్రైన్ జర్నీ వల్ల నలిగి పోయిన దుస్తులతో ఉన్న నా ఈ అవతారాన్ని చూసి ఎవరు లోపలికి రానిస్తారు?

పోనీ కాసేపాగి రష్ తగ్గాక వెళదామా అనుకుంటే పెళ్ళి అయి పోయాక కూడా ఈ అతిధుల రాక ఆగేలా లేదు. నా అదృష్టం బాగుండి క్లీనింగ్ స్టాఫ్ గుంపుగా వెళుతుంటే వాళ్ళతో కలిసి లోనికి వెళ్ళడమైతే వెళ్ళానే కానీ ఎవరైనా గుర్తు పడతారేమోనని చచ్చేంత భయంగా ఉంది.

పెద్ద సువిశాలమైన హాలు, దేదీప్యమానమైన ఎల్. ఈ. డీ... లైట్లతో, పూల అలంకరణతో స్వర్గలోకమే దిగి వచ్చిందా అన్నట్లు ఉంది. దాదాపు ఆరు, ఏడు వేల మంది అతిధులు, అందరూ పెళ్ళి వివరంగా చూడడానికన్నట్లు అన్ని చోట్ల టీ.వీ. స్క్రీన్స్ అమర్చబడి ఉన్నాయి.

ఎవరి కళ్ళా పడకుండా ఒక ప్రక్కన నిలబడి పెళ్ళి చూసి వెళ్లిపోదామనుకున్న నాకు అలాంటి ప్రదేశమే కనపడలేదు. ఒక్కడినే కూర్చుంటే ఎవరైనా గుర్తు పడతారేమోనని జనాల మధ్యలోకి వెళ్ళి వెళ్ళి కూర్చున్నాను.

పెళ్ళి మండపం మీద బ్రహ్మ గారు పెళ్లికొడుకుతో పూజ చేయిస్తున్నారు. సంగీత కోసం నా కళ్ళు వేగంగా అటు ఇటు పరుగులు తీస్తున్నాయి. అసలు నేను తనని గుర్తు పట్టగలనా! అని ఒక సందేహం.

దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయి మానసతో సహజీవనం గడపడానికి. నేను మెడిసిన్ చదివే రోజుల్లో గర్ల్స్ అందరికీ నేనంటే చాలా క్రేజ్. కాలేజీ టాపర్, ఆరడుగుల అందగాడినని నాకు చాలా పొగరు, అహంకారం తదితర అన్ని ఉండేవని అందరు అనుకునేవారు. మరి ఆ మాత్రం ఉండక పోతే ఎలా చెప్పండి!! ఏం ఉపయోగం అదే నీకింత వరకు తెచ్చి పెట్టాయి అని నా మనసుని ఒక్క కసురు కసురుకొని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళా.

రాజకీయాలలో అప్పటికే బాగా స్థిరపడిపోయిన రామారావు గారి అమ్మాయి సరితతో నా వివాహం ఖాయపరిచారు. తను నా అంత అందంగా లేకపోయినా (అదిగో మళ్ళీ అహంకారం అని నామనసు కయ్యిమంది) ఫామిలీ మంచిదని ఒప్పుకున్నాను. మేము కూడా స్థితిపరులమే కావడంతో పెద్దవాళ్లందరి ఒప్పందంతో మా వివాహం అట్టహాసంగా జరిగింది.

సరిత చాలా నిరాడంబరంగా, మితభాషిగా, పనివాళ్లంటే ఏంతో దయగా ఉండేది. మా కన్నా నాలుగు రెట్లు స్థితిపరులు కాబట్టి పెట్టుపోతలు బాగానే పెట్టారు. తను కూడా చాలా ఒద్దికైన అమ్మాయి కాబట్టి నా అజమాయిషీని (ఒక రకంగా పొగరు అనుకోండి) ఇష్టంగా భరించేది, ఎంతమంది పనివాళ్ళు ఉన్నా సరే నాకు కావలిసినవన్నీ తనే సమకూర్చేది. నాకెంత సేవ చేసినా తక్కువే, నాలాంటి భర్త దొరకడం తన అదృష్టం అనే అపోహలో ఉండేవాడిని. నిజానికి తనని భార్యగా పొందడం నా అదృష్టం అని తెలియని అవివేకిని.

మాకు ఇద్దరు పిల్లలు. మొదట శ్రావ్య, తర్వాత ఒక బాబు పుట్టడం వరకు సాఫీగానే గడిచాయి మా జీవితాలు. నాకు మానస శాపంలా తారస పడింది. మానసని అనటమెందుకు, నీ బుద్ధి ఏమైంది! అని మళ్ళీ నా మనసు చిరాకు పడింది. ఇంత జరిగినా ఇంకొకరి మీద నింద వెయ్యడం మానలేదు నువ్వు అని.

మా మామయ్యగారు నాకు అత్యాధునిక సదుపాయాలతో ఒక పెద్ద హాస్పిటల్ కట్టించి ఇచ్చారు. మానస గైనిక్ గా జాయిన్ అయింది అందులో. రెండేళ్ల పాటు కలీగ్స్ లానే మసులుకున్నాము. తర్వాత “వినాశ కాలే విపరీత బుద్ధే “ అన్నట్లు నా పుర్రెకి ఏం పాడు బుద్ధి పుట్టిందో ఏమో తన వైపు అట్ట్రాక్ట్ అవ్వడం ప్రారంభించింది.

అప్పటికే డాక్టరుగా నాకు మంచి పేరు రావడంతో డబ్బు బాగానే గడించాను. మానసతో మెడికల్ కాంఫరెన్స్ కి అటెండ్ అవడానికని వెళ్ళి మళ్ళీ ఇంటి ముఖం చూడలేదు. సరితతో ఒక్క ఫోన్ కాల్ తో సంబంధ బాంధవ్యాలు తెంపుకున్నాను. తన గురించి కానీ, పిల్లల గురించి కానీ ఆలోచించలేదు సరి కదా మళ్ళీ వెనుతిరిగి చూడలేదు.

మా మామయ్య గారు ఆయన పలుకుబడినంతా ఉపయోగించి మా గురించి వెతికారని, మా మెడికల్ ప్రాక్టీస్ కాన్సిల్ చేయించటానికి ప్రయత్నించారని, సరిత ససేమిరా వద్దని చెప్పిందని తెలిసింది నాకు. నన్ను, నా పిల్లలని ఒక్క ఫోన్ కాల్ తో వద్దనుకున్న వ్యక్తి గురించి మనం ప్రయాస పడటం దండగ అని, ఒక వేళ అతను తిరిగి వచ్చినా అతనితో కలిసి ఉండటం జరగదని సరిత నిక్కచ్చిగా చెప్పిందని విన్నాను.

సరితని నిరాశ, నిస్పృహల నుండి బయట పడేసేందుకు వాళ్ళ నాన్నగారు ఆమెని రాజకీయ రంగప్రవేశం చేయించారు. న్యూస్ పేపర్ లో సరితకు మళ్ళీ వివాహం జరిపించారని తెలిసి జీర్ణించుకోలేక పోయాను. నా మనసంతా చేదుగా అయిపోయింది. నా యావదాస్తి కోల్పోయినట్లుగా బాధ పడ్డాను. పిల్లలు, భార్యే కదా నా అసలైన ఆస్తి అని పశ్చాతాపం మొదలైంది. నాలో. అతను సరిత చిన్న నాటి స్నేహితుడని, ఫేమస్ కార్డియాలజిస్ట్ అని, అతని ఆధ్వర్యంలో ఇంకా రెండు హాస్పిటల్స్ ఓపెన్ చేసారని తెలిసింది.

మానసతో కూడా సంతోషం గా గడపలేక పోతున్నాను. వివాహము మీద నమ్మకం లేకపోవడంతో మేమిద్దరం కలిసి కొంతకాలం గడిపాము. తర్వాత తనకి కాన్సర్ రావడంతో సరితని మోసం చేయబట్టే తనకీ దుస్థితి వచ్చిందని మరింత క్రుంగిపోయింది. కీమోథెరపీ వలన కూడా లాభం లేకపోయింది. రెండు ఏళ్ళు హాస్పిటల్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా ఫలించక చనిపోయింది. మనసు సరిలేక, కాన్సన్ట్రేషన్ లేక ఆపరేషన్స్ ఎక్కువగా ఫెయిల్ అవడంతో ఉద్యోగం కూడా పోయింది. మారు మూల చిన్న గ్రామానికి వెళ్ళి బీదవారికి వైద్యం చేయడం ప్రారంభించాను.

బ్రహ్మ గారు పెళ్ళికూతురిని తీసుకురండి అని మైకులో పెద్దగా అనౌన్స్మెంట్ వినపడటంతో ఆలోచనల్లోంచి బయట పడ్డాను. ఎంతో కుతూహలంతో టీ.వీ. స్క్రీన్ కేసే చూస్తున్నాను. పెళ్ళికూతురి అలంకరణలో ముగ్ధ మనోహరంగా ఉన్న శ్రావ్యని పల్లకిలో తీసుకు వస్తున్నారు. శ్రావ్య అచ్చంగా నా పోలికే అని అందరు అనేవారు, అందులో ఏమీ సందేహం లేదనిపించింది.

ప్రక్కనే ఉన్న సరితను చూడగానే ఆనంద భాష్పాలో ఏమో తెలీదు. మసక మసకగా కనిపిస్తున్నారు అందరూ. నుదుటి మధ్యలో పెద్ద బొట్టు, మెడ నిండా నగలు, వయసుతో వచ్చిన పెద్దరికమో, పదవితో వచ్చిన హుందాతనమో తెలీదు కానీ అచ్చం లక్ష్మీదేవిలా మెరిసి పోతోంది సరిత. జీవితం ఎంతో సంతృప్తి గా, సాఫీగా సాగిపోతోందనడానికి నిదర్శనంగా ప్రశాంతంగా ఉంది ఆమె వదనం. ప్రక్కనే ఉన్న నవ యువకుడు మా అబ్బాయే అని గుర్తు పట్టేసేలా అచ్చం సరితలా ఉన్నాడు. వాడిని అక్కున చేర్చుకోవాలనే కోరికని బలవంతంగా ఆపుకున్నాను.

బ్రహ్మ గారు కన్యాదానానికి పెళ్ళికూతురి తల్లి తండ్రి వేదిక మీదకి రావాలమ్మా త్వరగా, ముహూర్తం సమయం అయిపోతోంది అని పిలవడంతో ఎంతో సంతోషంగా సరిత, ఆమె భర్త వచ్చి వేదిక మీద శ్రావ్యకి ఇరు పక్కలా కూర్చున్నారు.

నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. గొంతు తడారి పోయినట్లయింది. “నేనే శ్రావ్యతండ్రిని” అని గట్టిగా గొంతు చించుకుని అరవాలనిపించింది, కానీ గొంతు పెగలలేదు. “నాది కదా ఆ స్థానం” అని మనసు ఆక్రోశించిన వెంటనే నా అంతరాత్మ నువ్వే కదా... నిర్దయగా వదిలేసి వెళ్ళిపోయావు వాళ్ళని పసిపిల్లలప్పుడు .. ఇప్పుడు నిర్లజ్జగా ఆ స్థానం నాది అని ఏం మొఖం పెట్టుకొని అంటున్నావు? అని ఘోషించింది.

ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆ రోజు నేను తీసుకున్న ఆలోచనా రహితమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకో గలిగితే ఎంత బాగుండును ..,,నాలాంటి వాళ్ళ కిలాంటి శాస్తి జరగాల్సిందే అనిపశ్చాత్తాపంతో కుమిలిపోయాను.

మాంగళ్య ధారణ, కన్యా దానం అన్నీ అయిపోయినాయి. నేను స్థాణువల్లే కూర్చున్న చోట నుండి కదిలితే ఒట్టు. మెల్లగా అందరూ డిన్నర్కి బయలుదేరుతున్నారు. ఎవరైనా నన్ను పరీక్షగా చుస్తే గుర్తు పట్టే అవకాశముందని మెల్లగా అక్కడ నుండి తప్పుకోవాలనుకుంటుండగా సరిత నా వైపే వస్తోంది. నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినిపిస్తోంది, కొట్టుకోవడం ఆగిపోతుందేమో అనిపించింది కూడా. ఎవరితోనో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నా ప్రక్క నుండే వెళ్ళిపోయింది. ఆశా సౌధం కూలి పోయినట్లు నిరాశగా అనిపించింది. గుర్తు పడుతుందేమో అనే భయం, గుర్తు పట్ట లేదనే నిరాశ, నేనేం కోరుకుంటున్నానో నాకే తెలీటం లేదు. ఆమె జీవితంలో ముఖ్య వ్యక్తిగా ఉండవలసిన నేను ఈరోజు ఒక అనామకుడుగా మిగిలి పోయాను.


జీవితం అమృత భాండం లాంటిది, ఒకసారి చేజారి పోతే మళ్ళీ చేజిక్కించుకోవడం అసంభవం. ప్రలోభాలకు లోను కాకుండా, ఒడుదుడుకులని ఎదుర్కొంటూ, కుటుంబ విలువలను కాపాడుకోవడం లో ఎవరు సఫలీకృతులు అవుతారో వారే విజేతలు అనుకుంటూ మనసులోనే నూతన దంపతులను ఆశీర్వదించుకుంటూ అక్కడ నుండి బయలుదేరాను.

తన వైద్య వృత్తితో చేతనయునంత మందికి సేవలు చేసి జీవితం చరితార్థం చేసుకోవాలనే దృఢనిశ్చయంతో ఎవరు చూడకుండా చెట్ల మధ్య లోంచి చీకట్లో కలిసిపోతాడు మనోహర్.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి