బామ్మ చెప్పిన భలే కథలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Baamma cheppina bhale kathalu

బామ్మ చెప్పిన భలే కథలు - 1 .

సాయంత్ర సమయంలో కథ వినడానికి తన ఇంటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన విశ్రాంత ఉపాధ్యాయని భగవతమ్మ

'పిల్లలు ఈరోజు మీకు తిక్కల దెయ్యం అనేకథ చెపుతాను శ్రధ్ధగా వినండి...

అమరావతిలో నివశించే బుల్లేయ్య పొరుగు గ్రామంలో నాగేంద్రునిపుట్ట వద్ద తలవెంట్రుకలు తీయడానికి చెవులుకుట్టడానికి వెళ్ళాడు, చేతినిండుగా పని దొరికింది ,ఎంతజాగ్రత్తగా పిల్లలకు గుండుగీసినా చెవులుకుట్టినా చిన్నపాటిగాయాలతో వచ్చే నెత్తురుతో తనచేతి పనిముట్లు చుట్టుకు తీసుకువచ్చిన తెల్లని చేతిగుడ్డ నెత్తుటిమరకలతో నిండింది. సాయంత్రం యింటికి బయలుదేరేముందు నెత్తురు మరకల చేతిగుడ్డలోతన కత్తులు,కత్తెర,అద్దం,నీళ్ళగిన్నే,తదితర వస్తువులు చుట్టుకొని చేతిసంచిలో అవి పెట్టుకుని అడవిమార్గాన తనయింటికి బయలుదేరి, పౌర్ణమివెన్నెల వెలుగులో కాలిబాటన వేగంగా నడవసాగాడు, కొంతసమయంగడచాక హఠత్తుగా వచ్చినదెయ్యం

"ఒరే మనిషి నిన్నుచంపుతానురా"అంది.

అదిరిపడ్డ బుల్లేయ్య "నువ్వా హమ్మయ్య గిలిగాడేమో నని భయపడ్డాను నువ్వునన్ను చంపుతావా "అని పెద్దపెట్టున నవ్వసాగాడు. అతనిచెర్యలు అర్దం కానిదెయ్యం "ఓయ్ ఎవడాగిలిగాడు నాకన్నాగొప్పవాడా" అన్నది,

" అవును మాఊరివాడే వాడు దెయ్యలను పట్టి నిప్పులపై కాల్చుకు తింటాడు,వాడికంటేనేను ఎంతోనయం పట్టినదెయ్యాన్ని పచ్చిగానే తింటాను"అన్నాడు బుల్లెయ్య.

అతనిమాటలు చర్యలు అర్దకాని దెయ్యం బుల్లెయ్యను చూసి అయోమయంలో పడింది."ఓదెయ్యమా నువ్వు నన్ను చంపలేవు నేనే నిన్నుచంపగల సమర్దుడను ఈరోజు ఉదయం ఓపిల్ల దెయ్యాన్ని ఫలహరంగా ఆరగించాను ఈరాత్రి నాకుటుంబం అందరి ఆకలి తీర్చడానికి భగవంతుడు నిన్ను నావద్దకు పంపించాడు"అని చేతిసంచిలోని నెత్తుటిమరకలలో చుట్టిన తనవస్తువులు వెలుపలకుతీసాడు బుల్లెయ్య. "ఏమిటి అవి"అంది దెయ్యంభయం భయంగా. "చెపుతా అన్నింటికి తొందరపడతావు ఎందుకు " అని అద్దాన్నిచూపిస్తూ "ముందుగా దీంట్లోనిన్ను బంధిస్తాను కావాలంటే చూడు నువ్వుదీనిలో బంధీవి అయ్యవు"అని అద్దం దెయ్యం ముందు ఉంచాడు అద్దంలోతన ప్రతిబింబాన్ని చూసుకున్నదెయ్యం భయంతో బిగుసుకుపోయింది

" చూసావుగా ఆతరువాత నింపాదిగా ఈకత్తితో నీపీక కోసి ఈగిన్నేలోనికి నీనెత్తురు పట్టితాగుతాను,ఈకత్తెరతో నీమాంసాన్నిగుచ్చుకు పచ్చిగా తింటాను అప్పుడు నానోటికి అంటిన నెత్తురును ఈచేతిగుడ్డతొ తుడుచుకుంటాను, భయపడకు గిలిగాడిలాగా నేను పట్టినదెయ్యలను హింసించను కాల్చుకు తినను,ఏమిటి నాపై నాసామానులపైన నమ్మకం కుదరలేదా కావాలంటే నా కత్తి పదునుచూడు "అని తమకుదగ్గరగా నిద్రిస్తున్న అడవి పిల్లి తొకను కసుక్కున ఒక్కవేటుతో తెగవేసాడు శివయ్య. లబ లబ లాడుతూ అడవిలోనికి పరుగు తీసిందిపిల్లి. అదిచూసిన దెయ్యం గజగజవణికిపోతూ "అయ్య నన్నేమిచేయకు మరెప్పుడు మనుషుల జోలికిరాను "అంది చేతులు జోడించి.

"భయపడక నిన్ను చంపితిననులే నాకుఎన్నో మంత్రాలువచ్చు ముందునిన్నుఈఅద్దంలోబంధించానుకదా యికపైఎప్పుడైనా మనుషులజోలికివస్తే అద్దంలోనుండి నిన్ను వెలుపలకు తీసి చంపుతాను"అయ్యమరెన్నడు మీజోలికిరాను నన్నువదిలేయి "అన్నది భయంగాదెయ్యం "అప్పుడే వదిలేస్తే ఎలా నేనెంతటివాడినో నీకుతెలియిలిగా" అంటూ కత్తర చేతిలోనికి తీసుకుని దెయ్యం పిర్రపై ఒపోటు పొడిచిడు."చంపాడురాసామి"అంటూ ఆదెయ్యం ఆకాశంలోకి ఎగిరిపోయింది.బ్రతుకుజీవుడా అనుకుని తనవస్తువులతోయిల్లు చేరాడుబుల్లెయ్య.

బాలలు సమస్యఏదైనా చూడటానికి కొండలా కనిపిస్తుంది ధైర్యంగా ఢీకొంటే ఎంతటిసమస్య అయినా మీసాహసం ముందు తలవంచక తప్పదు .కనుక భయమే మన తొలి శత్రువు అని గుర్తించండి'అన్నది భగవతమ్మ.

సంతోషంగా పిల్లలు అందరు సంతోషంగా తమ ఇళ్ళకు బయలు దేరారు.


********************


బామ్మ చెప్పిన భలే కథలు . 2.

సాయంత్ర సమయంలో కథ వినడానికి తన ఇంటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన విశ్రాంత ఉపాధ్యాయని భగవతమ్మ

'పిల్లలు ఈరోజు మీకు శివయ్య సలహ అనేకథ చెపుతాను శ్రధ్ధగా వినండి...

శ్రీరంగపురం అనేఊరిలో శివయ్య అనే అతను ఒంటిఎద్దు బండీతో పట్నం వెళ్ళి ,షావుకారు పొరుగు ఊరిలో ఇచ్చిరమ్మన్నవారి అంగడులకు నిత్యవసర సరుకులు ఇచ్చివస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఒకరోజు '' ఏమండి మనంకూడా నిత్యవసరసరుకుల అంగడి ప్రారంభిద్దాం. మీరు ఎప్పటిలా మీబండి తోలుకుంటూ మీపనికి వెళ్ళండి నేను అంగడి చూసుకుంటాను'' అన్నది శివయ్య భార్య.

ఈవిషయం పట్నంలోని షావుకారువద్ద చెప్పాడు శివయ్య 'అలాగే ఇన్నేళ్ళు నాఅంగడి సరుకులు అన్నిఊళ్ళకు చేరవేస్తూ కష్టపడు తున్నావు. పైగా పిల్లవాడిని పట్నంలో ఉంచి చదివిస్తున్నావు కర్చులు పెరుగుతుంటాయి.నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీబండి పట్టినంత సరకు తీసుకువెళ్ళు నాకు రావలసిన పైకం కొద్ది కొద్దిగాతీర్చుకుందువులే 'అన్నాడు పట్నంలోని షావుకారు.

వారంతిరిగేసరికి తనఇంటిముందు అంగడి సిధ్ధంచేసుకుని,బండినిండుగా సరుకులు తెచ్చి,త్రాసు ముందు తనభార్యను కూర్చోపెట్టాడు శివయ్య.

ఆచుట్టుపక్కల గ్రామాలకు శివయ్య అంగడి పెట్టిన విషయం తెలిసిపొయింది. వారంలో ఒక రోజు జరిగే సంతకు పోవడం మానివేసిన చాలామంది చిన్నచిన్నఅంగడులు ఉన్న ఇరుగు,పొరుగు గ్రామాల వ్యాపారస్తులు అంతా శివయ్య అంగడిలోనే తమకు కావలసిన సరుకులు కొని బండ్లపై వేసుకువెళ్ళసాగారు.

శివయ్య బండిపని మానివేసి ఇద్దరు పనివాళ్ళను పెట్టుకుని తను అంగడిలో ఉండసాగాడు.

ప్రతిఆదివారం రాత్రికి లారినిండుగా నిత్యవసర వస్తువులు శివయ్య అంగడికి పట్నంనుండివచ్చేవి.సరుకుతోపాటు వచ్చిన షావుకారు గుమ్మస్తాకు తను చెల్లించవలసిన పైకం ఇచ్చిపంపేవాడు శివయ్య.

ఇంతలో శివయ్య కుమారుడు రఘు చదువుముగించి తండ్రికిసహాయంగా అంగడిలోనే ఉండసాగాడు. కొంతకాలానికి శివయ్యకు కంట్లో శుక్లం శస్త్రచికిత్స జరగడంతో పట్నంలోని వైద్యశాలలో నెలరోజులు ఉండి పోయాడు.శివయ్య కుమారుడు పట్నంలోని స్నేహితులతో చెడు అలవాట్లకు లోనై అంగడి పనివాళ్ళపైన వదలిపెట్టి లక్షలరూపాయలు కర్చుచేయసాగాడు. వైద్యశాలనుండి ఇంటికి వచ్చిన శివయ్య సరుకులు లేక వెలవెలపోతున్నఅంగడినిచూసి,మరుదినం తనువచ్చి

ఎప్పటిలా గల్లాపెట్టెముందుకూర్చున్నాడు.రాత్రికి లారినిండుగా సరుకులు వచ్చాయి. శివయ్య వచ్చాడని తెలియడంతో అందరూ మరలా అంగడికి రాసాగారు.ఎప్పటిలా వ్యాపారం నడవసాగింది. వారం రోజులతరువాత మాసిన బట్టలతో ఇంటికి వచ్చిన కుమారుడిని చూసిన శివయ్య ' వెళ్ళి స్నానం చేసి,భోజనంచేసి అంగడికిరా ' అన్నాడు.

ఒకనెలరోజుల అనంతరం శివయ్య బావ వెంకయ్య వాళ్ళఇంటికి వచ్చాడు.రాత్రిభోజనాల సమయంలో ''శివయ్య బావా రఘ మారిపోవడానికి ఏంసలహ చెప్పావు'' అన్నాడువెంకయ్య.

'' బావ విషంకంటే ప్రమాదమైనది చెడు వ్యసనం. అదిమనిషిని పతనానికి కారణం అవుతుంది.పోరాడేలక్షణం, శ్రమించేగుణం,తన సమర్ధతపై నమ్మకం మనిషికి ఉన్నంతకాలం ఓటమి ఉండదు.వందమంది కలసి కొండపైకి ఎక్కించలేని బండను పదిమంది కలసి తేలికగా కొండపైనుండి కిందికి దొర్లించవచ్చు. చెడు స్నేహాలవలన ఏంజరుగుతుందో మావాడు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. ఆవిషయం గురించి నేనువాడికి చెప్పన వసరం లేదు. ఏమైనా జీవిత అనుభవాన్నిమించిన ఆస్తి మనిషికి ఏముంటుంది.తన తప్పుతెలుసుకున్నవాడు మరోపర్యాయం అటువంటి తప్పుచేయడు. కానీ పిల్లల ప్రవర్తనను గమనించి వారికి మార్గదర్శకు లుగా ఉండటం పెద్దలబాధ్యత.ఎవరికైనా ఇదేనాసలహ '' అన్నాడు శివయ్య.

********************


బామ్మ చెప్పిన భలే కథలు . 3.

సాయంత్ర సమయంలో కథ వినడానికి తన ఇంటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన విశ్రాంత ఉపాధ్యాయని భగవతమ్మ

'పిల్లలు ఈరోజు మీకు అబధ్ధమాడితే అనేకథ చెపుతాను శ్రధ్ధగా వినండి...

ఉజ్జయిని పాలకుడు వీరసేనుడు సామంత రాజులు నగర ప్రముఖులతో సభలో ఉండగా, సభ లోనికి వచ్చిన సదానంద మహర్షిని ఘనంగా సత్కరించిన వీరసేనుడు 'స్వామి తమరు వచ్చిన కార్యం చెపితే తక్షణం నెరవేరుస్తాను.అన్నాడు వినయంగా చేతులు జోడించి.

'మహారాజా నేను కాశీ యాత్ర వెళుతున్నాను నా ప్రయాణా నికి దారి బత్తెం ఏర్పాటు చేయించండి'అన్నాడు సదానందమహర్షి.

వెంటనే సదానందుని కాశీ యాత్ర ప్రయాణానికి అన్నిఏర్పాట్లు చేయబడ్డాయి.

'రాజా పెద్దల ఎడల నీ ప్రవర్తన నన్ను సంతోష పరచింది ఏదైనా వరం కోరుకో'అన్నాడు సదానందుడు.

'మహర్షి నా రాజ్యంలో విపరీతంగా అబధ్ధాలకు అలవాటు పడిపోయారు ఎవరు అబధ్ధం చెప్పినా వారికి గాడిద చెవులు వచ్చేలా వరం ప్రసాదించండి'అన్నాడు వీరసేనుడు.

'తథాస్తూ' అని రాజును దీవించిన సదానందుడు కాశీ యాత్రకు బయలు దేరి వెళ్ళాడు.

మరుక్షణం నుండి ఉజ్జయిని రాజ్యంలో లక్షల మందికి గాడిద చెవులు పుట్టుకు రాసాగాయి. ఆ గాడిద చెవులు కనిపించకుండా మగవారు చెవులు కనపడకుండా తలపాగా ధరించ సాగారు.ఆడవారు చీర కొంగుతో తలపై ముసుగు వేసుకోసాగారు పిల్లలు మాత్రం గాడిద చెవులతో బహిరంగంగా తిరగ సాగారు.

కొన్ని రోజులకు ఆరాజ్య ప్రజలతో పాటుగా రాజు , రాణి, మంత్రి, సేనానీకి, సైన్యానికి గాడిద చెవులు పుట్టుకు వచ్చాయి.ఇటువంటి వరం కోరుకుని తను తప్పు చేసానేమో! అని రాజు చింతించ సాగాడు.

కొద్ది రోజుల అనంతరం కాశీ యాత్ర ముగించుకున్న సదానంద మహర్షి తన ఆశ్రమానికి వెళుతూ రాజుకు కనిపించి వెళదామని వచ్చాడు.

మహర్షి చూసిన రాజు చేతులు జోడించి 'మహర్షి తెలియక ఇటువంటి వరంకోరుకున్నాను నాతప్పు మన్నించి ఈ వరాన్ని రద్దు చేయండి'అని వేడుకున్నాడు.'మహారాజా అబధ్ధం చెప్పినందుకు గాడిద చెవులు వచ్చాయో వాళ్ళు బహిరంగంగా రచ్చబండ వద్ద ప్రజల ముందు,తను అబధం చెప్పడం వలన తనకు గాడిద చెవులు వచ్చాయని ఒప్పుకుంటే వారికి మామూలు చెవులు వస్తాయి.అని చెప్పిన సదానంద మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

ఆ విషయం రాజు తన రాజ్యం అంతటా దండోరా వేయించాడు. ప్రజలంతా తాము అబధ్ధం చెప్పామని అంగీకరించడంతో అందరికి మామూలు చెవులు వచ్చాయి.

నాటి నుండి ఆరాజ్య ప్రజలు అబధ్ధం చెప్పాలంటే బయపడుతూ నిర్బయంగా నిజమే చెపుతూ నిజాయితీగా జీవించసాగారు.ఉజ్జయిని నగర ప్రజలు అలా నిజాయితి పరులుగా మారారు.

బాలలు అబధ్ధాల వలన ఎటువంటి తిప్పలు వస్తాయో తెలుసుకున్నారుగా' అన్నది భగవతమ్మ.

బుధ్ధిగా తలలు ఊపారు పిల్లలంతా.

********************

బామ్మ చెప్పిన భలే కథలు . 4 .

సాయంత్ర సమయంలో కథ వినడానికి తన ఇంటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన విశ్రాంత ఉపాధ్యాయని భగవతమ్మ

'పిల్లలు ఈరోజు మీకు కాకి బావ చిలుక అత్తా అనేకథ చెపుతాను శ్రధ్ధగా వినండి...

అడవిలోని పసు, పక్ష్యాదులు అన్ని తెల్లవారుతూనే ఆహార అన్వేషణలో ఉన్నాయి.దోరమాగిన జామపండు తింటున్న రామచిలుక, తనకు చేరువలో మరో చెట్టుపై దిగులుగా ఉన్న కాకిని చూసి'కాకి బావా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు?'అన్నది. 'చిలుక అత్తా ఈసృష్టిలో అన్ని ప్రాణులు అందంగానే,ఆనందంగానే ఉన్నాయి.మాకు మాత్రం అసహ్యకరమైన ఈనల్లని వికృత రూపం,గొంతుక ఎందుకు ఉన్నాయి.నల్లగా ఉన్నా కొయిలకు కమ్మని పాటను ఉంది,కొకిలను అందరూ ప్రేవిస్తారు, మమ్మల్ని ద్వేషిస్తారు. ఎంగిలి మెతుకులు తిని బ్రతకడం బాధాకరం.మాఅంత కష్టజీవితం మరే ప్రాణికి లేదు'అని బాధపడ్డాడు కాకిబావ.

'కాకి బావ సీతబాధ సీతదే! పీతబాధ పీతదే! అన్న సామెత అందరికి తెలిసిందేగా! ఎవరికి కష్టాలు లేవు? వారి వారి స్ధాయికి తగిన కష్టాలు వారికి ఉంటాయి. కష్టాలకు భయపడితే మనుగడ సాగించగలమా? ఎవరికైనా ఈఅడవిలో ఆహరంకాని,మరేదైనా సౌకర్యంకాని ఉన్నదగ్గరే లభించవుగా! అయినా మీ కాకులు ఎంతగొప్పవో తెలుసా? ఆహరం దొరికితే మీసాటి కాకులను నలుగురిని పిలిచి దొరికిన ఆహారం పంచుకుంటారు.మీలో ఎవరైనా గాయపడితే,మీరు పదిమంది చేరీ సంఘీభావం తెలుపుతారు.మరే ప్రాణులలోనైనా ఇలా చూడగలమా?. ఐక్యతకు మారు పేరు మీరు! పండగలకు,పిత్రు దేవతలకు మొక్కిన నాడు తొలి ఆహార పదార్ధాలు అంటే అన్నం,కూరలు,వడా,పాయసంతొ విస్తరాకులో ముందు మీకు పెట్టి మీరు ముట్టిన తరువాతె కదా మనుషులు భోజనం చేస్తారు.మిమ్మల్ని పిత్రు దేవతలకు ప్రతిరూపంగా మనుషులు భావిస్తున్నప్పుడు నువ్వెందుకు చింతించాలి.ఈ యోగ్యత మరే పక్షులకు లేదు కదా! అందుకే మన ఈ అడవిలో ఎవరూ తక్కువ వారుకాదు గొప్పవారులేరు.ఎవరిజీవన విధానం వారిదే! ఈమాత్రం ఎందుకు ఆలోచించలేక పోయావు కాకిబావా'అన్నది రామచిలుక.

నిజమే ఎవరి విలువలు వారివే,ఎవరి జీవితం వారిదే, చిలుక తన కళ్ళుతెరిపించింది.'అత్తా నువ్వు చెప్పింది నిజమే ఒకరిని చూసి ఈర్షపడటంకన్నా ఉన్నదానితో సంత్రుప్తిపడాలి అనితెలుసుకున్నాను. ముందు జీవితంలో ఎన్నడూ నిరాశ కు లోనుకాను ఉన్నంతలోనే సంతోషంగా జీవించాలి అని నీద్వారా తెలుసు కున్నాను. వస్తాను 'అంటూ కాకిబావ ఆహార అన్వేషణకు బయలుదేరాడు 'అన్నది భగవతమ్మ.

కేరింతలు కొడుతూ పిల్లలు అందరు తమ ఇళ్ళకు బయలు దేరారు.

********************

బామ్మ చెప్పిన భలే కథలు . 5 .

సాయంత్ర సమయంలో కథ వినడానికి తన ఇంటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన విశ్రాంత ఉపాధ్యాయని భగవతమ్మ

'పిల్లలు ఈరోజు మీకు ఫలించని మంత్రం అనేకథ చెపుతాను శ్రధ్ధగా వినండి...

సిరిపురం శివావాలయం ప్రాంగణం పరిశుభ్రపరచి ,పూలతో ఒకవ్యెక్తి తనకోసం ఎదురు చూస్తూ ఉండటం చూసిన ఆలయ పూజారి ఆలయ తలుపులు తాళంతీస్తూ " ఎవరు నాయనా నీవు ? మాఊరివాడవు కాదే " అన్నాడు.

" అయ్యా నాపేరు సుబ్బయ్య నాఅనేవారు లేనివాడిని ఇక్కడే ఉండి ఆలయానికి నావంతు సేవలు చేసుకుంటాను " అన్నాడు. " సరే ఆలయ కోనేరు వద్ద మడపం లో ఉండు ,రోజు రొండుపూటల స్వామి వారికి నివేదించిన ప్రసాదం ఇస్తాను స్వీకరించి నీ ఆకలి తీర్చుకో " అన్నాడు పూజారి. అలా కోనేరు సమీపంలోని మండపంలో ఉంటూ ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులకు,పిల్లలకు విభూధి పెడుతూ, అనారోగ్యంతో ఉండే పిల్లలకు ,వంటగదిలో ఉండే దినుసులతో వైద్యసలహలు ఇవ్వసాగాడు. అతని వైద్యసలహలపై నమ్మకం కుదిరిన ఆఊరి ప్రజలతోపాటు,చుట్టుపక్కల గ్రామాలప్రజలు రాసాగారు. సుబ్బయ్య కూడా ఉచితంగా వారికి వైద్యంచేయసాగాడు.

అదేఊరిలో ఉంటున్న రంగయ్య అనేభూతవైద్యుడు ,సుబ్బయ్య రాకతో తన ఆదాయం తగ్గిపోవడంతో... సుబ్బయ్య తన మంత్రాలతో చేతబడి, చిల్లంగి వంటి క్షుద్ర పూజలు చేస్తూ పలువురి మరణానికి కారణమైయ్యడని ఆరోపణ చేస్తూ రాజుగారికి ఫిర్యాదు చేసారు. రాజు గారి సభలో " సుబ్బయ్యగారు తమరు బాణామతి, చేతబడి వంటి క్షుద్రపూజలతో మనుషులను మరణించేలా చేస్తున్నావని, పసువుల పేడ తమరే స్వయంగా సేకరించి ఆ పసువుల పై క్షుద్రశక్తులు ప్రయోగిస్తున్నావని ,ఈగ్రామ భూతవైద్యుడు ఆరోపిస్తూ మిమ్మల్ని తక్షణం గ్రామ బహిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాడు ఈ ఆరోపణలకు మీసమాధానం ఏమిటి "అన్నాడు మంత్రి. " అయ్యా నేను నిరపరాధిని నాకు ఏమంత్రాలురావు.పూజారిగారు,ఈగ్రామ ప్రజల వలన నాకు రెండు పూటలా ఉతంగా ఆహరం లభిస్తుంది.అటువంటి గ్రామప్రజలకు నేను కీడు ఎందుకు తలపెడతాను?, నాకు ఎవరితోనూ శతృత్వం,ఆస్తి తగాదాలు లేవు . పసువుల పేడ నేనే స్వయంగా సేకరించినది నిజమే! రేపు వర్షకాలంలో దేవుని నైవేద్యం సిధ్ధంచేయడానికి ఎండుకట్టెలు లభించవు ఆకారణంగా పేడ సేకరించి పిడకలుగా చేసి భద్రపరిచాను " అన్నాడు.

" రామయ్య గారు మీరు సుబ్బయ్యకన్నా గొప్ప భూతవైద్యులని విన్నాను నిజమేనా అన్నాడు మంత్రి. "అయ్య మీరు విన్నది నిజమే ఈచుట్టుపక్కల గ్రామాలలో నేనే గొప్ప భూతవైద్యుడను " అన్నాడు . "సరే మీరు అంతగొప్ప భూతవైద్యులైతే,సుబ్బయ్య క్షుద్రపూజలవలన మరణించీను మనుషులను లేక పసువులలో ఒకరిని తమ మంత్రాలతో బ్రతికించండి మీమంత్రాలతో "అన్నాడు మంత్రి. "అయ్యా మరణించినవారిని మంత్రాలతో బ్రతికించడం అసాధ్యం "అన్నాడు రామయ్య. " ఎందుకు సాధ్యంకాదు ఒక మంత్రంవలన మరణం సంభవించినపుడు ,మరో మంత్రంతో చనిపోయిన వారిని బ్రతికించడం ఎందుకు వీలుకాదు? మీరు మీమంత్రాలతో చనిపోయిన వారిని బ్రతికించకపోతే మీతల తీయిస్తాను "అన్నాడు మంత్రి.

గడగడా వణికిపోతూ రామయ్య "మహప్రభో రక్షించండి పని సోమరినై ఇలా భూతవైద్యుడిగా ,తప్పుడు తనం తో బ్రతుకుతున్నా సుబ్బయ్య మాగ్రామం రావడంతో నాకు ఆదాయం లేకపోవడంతో అతనిపై తప్పుడు ఆరోపణలు చేసాను తమరు నన్ను మన్నించి వదలివేస్తే జీవితంలో ఎన్నడూ ఇటువంటి తప్పులు చేయను రక్షించండి " అని రామయ్య రెండు చేతులు జోడించాడు.

" ఫలించని మంత్రాల పేర్లు చూప్పుకుని గ్రామాలలో తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని క్షుద్రపూజల పేరిట హింసించడం జరుగుతుంది. ఈవిషయం ప్రజలు అందరూ తెలుసుకోవాలి. గణపతి విగ్రహం పాలు తాగడం ఎంతనిజమో ! మంత్రాలకు మనుషులు మరణిస్తారు అనడం అంతేనిజం ,సుబ్బయ్యని నిర్ధోషిగా తీర్పుచెపుతూ,రామయ్య తన తప్పు తెలుసుకున్నందుకు ప్రభులపేరిట క్షమిస్తున్నాం " అన్నాడు మంత్రి.

సభలోనివారంతా కరతాళ ధ్వనులు చేసారు' అన్నది భగవతమ్మ.

పిల్లలంతా ఆనందంగా తమ ఇళ్ళకు బయలు దేరారు.

********************

మరిన్ని కథలు

Bandham Anubandham
బంధం అనుబంధం
- కందర్ప మూర్తి
Aaradhana
ఆ'రాధ'న
- కొడాలి సీతారామా రావు
Pagavadiki koodaa ee anubhavam vaddu
పగవాడికి కూడా ఈ అనుభవం వద్దు
- మద్దూరి నరసింహమూర్తి
Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ
Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు