11.చందమామ రావో జాబిల్లి రావో
చందమామ రావో జాబిల్లి రావో మంచి
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో
1.నగుమోము చక్కనయ్యకు - నలువ పుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు - మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి - చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి - మా ముద్దుల మురారి బాలునికి
2.తెలిదమ్మి కన్నుల మేటికి - మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకు - మా కతలకారి ఈ బిడ్డకు
కులముధ్ధరించిన పట్టెకు - మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండ వొయ్యారికి - నవనిధుల చూపుల చూచే సుగుణునకు
3.సురల గాచిన దేవరకు - చుంచు గరుడు నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు - మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు - వేవేల రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జనకు - మా శ్రీ వేం కటనాధునికి
తాత్పర్యము
ఓ చందమామ! ఇటు రా ! చంద్రుడా !ఇటురా !
మేలిమి బంగారపు పసుపు పచ్చని గిన్నెలో వెన్న, పాలు తీసుకురా !
1. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అందాల బాలునికి, బ్రహ్మ యొక్క కన్నతండ్రికి,పాలు తీసుకొనిరా !
వేదాలలో వర్ణించబడిన మా తండ్రికి, మా నల్లనివానికి, ప్రపంచాలను పరిపాలిస్తున్న మా ప్రభువుకు, అందమైన లక్ష్మీ దేవి మగనికి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మూల కారణమైన దేవునికి, ముర అను రాక్షసుని చంపిన మా ముద్దుల బాబుకు పాలు తీసుకొని రా !
2. తెల్లతామరవంటి కన్నులుకలిగిన మా విష్ణు మూర్తికి, గుమ్మ అంటే పాలుపిండునప్పుడు వచ్చెడు ధార. అలా మంచివైన, తియ్యనైన మాటలుమాట్లాడే మా అందమైన బాబుకి, నేర్పు కలిగిన పనులు చేసే మా పడుచువానికి మా మాట కారి యైన బిడ్డకు తన కులాన్ని ఉద్ధరించిన బిడ్డకు, మంచి గుణములు కలిగిన మా పడుచువానికి, శరీరమందు అణువణువున అందం కలిగిన మా అందగాడికి, నవనిధులను(1.మహాపద్మము 2.పద్మము 3.శంఖము 4.మకరము 5. కచ్ఛపము 6. ముకుందము 7. కుందము 8. నీలము 9.ఖర్వము) తన చూపులలో ప్రసాదించే మంచి గుణములు కలిగిన వానికి పాలు తీసుకొని రా!
3 . దేవతలను రక్షించిన ప్రభువుకు, బలమైన గరుత్మంతుని వాహనంగా చేసుకొని ఎక్కిన గొప్పవానికి, నేర్పరి ,పెద్ద బుద్ధులు కలవానికి, మా మురిపెపు చేతలు కలిగిన బిడ్డకు, మన్మథుని అయ్యకు, అనేక రూపములు ధరించిన ప్రభువుకు, నేర్పరియైన ప్రద్యుమ్నుని తండ్రికి, వేంకటేశ్వరుని అవతారమైన మా బాల కృష్ణ మూర్తికి పాలు తీసుకొని రా !
విశేషాలు
1.అన్నమయ్య జీవిత చరిత్ర పీఠికలో ఈ చందమామ పాట ఉన్నది. 29 సంపుటాలలో లేదు.
చందమామ రావే, జాబిల్లి రావే
కొండెక్కి రావే, గోగుపూలు తేవే
బండెక్కి రావే, బంతి పూలు తేవే
పల్లకిలో రావే, పారిజాతం తేవే
తేఱెక్కి రావే, తేనెపట్టు తేవే
ఆటలాడ రావే, అబ్బాయి(అమ్మాయి)కిచ్చి పోవే
ఈ పాట ముందు పుట్టిందా ? అన్నమయ్య చందమామ పాట ముందు పుట్టిందా ? చెప్పటం కష్టం కాని రెండు పాటల పల్లవులు ఒకనాటి తెలుగు వారికి నాలుక మీద నర్తించేవి .ఇందులో అనుమానం లేదు.
2. రావే ... రావో .. ఈ రెండు పదాల్లోను ఆత్మీయత ఉంది. బిడ్డని చంకనెత్తుకొని తల్లి పాడే పాటలో ఆ కొసరు కొసరు ముద్దలో రావో అనే పిలుపు అందమైన రుచిని జతపరుస్తుంది.
3.చంద్రుడు తెలుగు వారికి మామ. లక్ష్మి మనకు తల్లి. లక్ష్మికి తమ్ముడు చంద్రుడు. ఇద్దరూ క్షీర సాగర మథన సమయంలో ఒకరి తర్వాత ఒకరు పుట్టారు కనుక అక్కా తమ్ముళ్ల వరుస పెట్టి, చంద్రుడిని మామగా , చందమామగా తెలుగు వాడు మార్చేసాడు.
4.బహుజనపల్లి శబ్దరత్నాకరములో జాబిల్లి పదానికి అర్థం ఇస్తూ జాను + బిల్లిక = జాబిల్లి అన్నారు. జాను అంటే అందమైన అని అర్థం. బిల్లిక అంటే బింబం. కనుక జాబిల్లి అంటే అందమైన చంద్రబింబం అని అర్థం చెప్పుకోవాలి.
5. అన్నమయ్య ఈ కీర్తనలో ఒక తల్లిగా మారాడు. వేంకటేశుని(కృష్ణుని ) తన బిడ్డగా భావించి , ఆ తాదాత్మ్యతలో ఈ అందమైన తెలుగు పదాలతో స్వామికి గోరు ముద్దలు పెట్టాడు.
6. చందమామ వెన్న , పాలు తెస్తుందా ? నిజంగా ఆలోచిస్తే తీసుకురాదు. మరి ఎందుకు అన్నమయ్య ఆహ్వానిస్తున్నాడు ? భ్రాంతి అని తెలిసినా సంసారంలో ఆనందం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం అని తెలిసినప్పుడు, ఆస్పత్రి పాలయినప్పుడు , ఆత్మీయులు తల్లడిల్లుతున్నారు. తనపై తనవారికి ఉన్న ప్రేమను చూసి ఆ రోగి మానసికంగా స్వస్థత పొందుతున్నాడు. తెలియని ఆప్యాయతల ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ నిర్వచనాలకి అందని ఆనందం చందమామ పిలుపులో ఉంది. పసిదనం, చల్లదనం రెండు విడదీయలేని పద బంధాలు. అందుకే ఆ పసిదనం చల్లదనం ఇచ్చే చందమామ రూపాన్ని చూసి పరవశించి పోతుంది. అందుకే పసివానికి చందమామను చూపిస్తూ చందమామ రావో అంటూ కవిలోని మాతృ హృదయం ఆలపించింది.
7. ఏ స్థాయి వారికి ఆస్థాయిలోనే సత్కారాలు చేయాలి. మా బాల కృష్ణునికి గుణం బంగారం. మాట బంగారం. అసలు నిలువెల్లా బంగారం. అందుకే మేలిమి బంగారపు పసుపు పచ్చని గిన్నెలో వెన్న, పాలు తీసుకురా ! అని చందమామను కోరుతూ అన్నమయ్య పల్లవి.
8. ప్రేమ పూర్వకంగా ఎదుటివారిని చూస్తూ పలకరించే చిరునవ్వు మనలను ఎప్పుడూ నవ్వుల పాలు కానీయకుండా చేస్తుంది.మల్లెమొగ్గ విచ్చినట్టు, చల్లగాలి తాకినట్టు, సన్నజాజి పాకినట్టు చిరునవ్వు పులకరింపచేస్తుందని కవులు వర్ణిస్తుంటారు. కృష్ణ మూర్తి నవ్వు రాజిల్లెడి మోము వాడు.అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండే అందాల బాలునికి పాలు తీసుకొని రా!’ అని కవి వర్ణించాడు. నవ్వు వలన మనిషికి చక్కదనం వస్తుందనే సండేశం నగుమోము చక్కనయ్యకు పంక్తిలో ఉంది.
9. పింగళి సూరన గారి ప్రభావతి ప్రద్యుమ్న కావ్యంలో కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని నేర్పరితనం మనకు బాగా తెలుస్తుంది. వజ్రపురానికి కృష్ణుని ఆదేశం మీద వెళ్లి అక్కడ నటునిగా తనకున్న ప్రావీణ్యాన్ని ప్రద్యుమ్నుడు ప్రదర్శించటమే కాకుండా, చెలికత్తెలు నాయిక కోసం తెస్తున్న పూలలో తుమ్మెదగా మారి దూరి వెళ్ళేడు ప్రద్యుమ్నుడు. అందుకే అతడు నెరవాది(నేర్పరి) అని అన్నమయ్య వర్ణింఛాడు. ఆ నేర్పరియైన ప్రద్యుమ్నునికి జనకుడు (నెరవాది జనకు) అంటే కృష్ణమూర్తి ఇంకా నేర్పరి అని ఆంతర్యం.
10. కృష్ణుడు నేర్పుకలవాడు అనటానికి, భారతంలోను, భాగవతంలోను బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. భారతంలో కర్ణ పర్వంలో ఒక చిన్నఘట్టాన్ని ప్రస్తావించుకొందాం.
చేతికిజిక్కిన ధర్మరాజును కర్ణుడు విడిచి పెడతాడు. పరాభవంతో ధర్మరాజు తిరిగి శిబిరానికి వెళ్తాడు.ధర్మరాజు క్షేమం కనుక్కోటానికి కృష్ణార్జునులు వస్తారు. కర్ణుడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని భరించలేని ధర్మరాజు అర్జునుని తిడతాడు.
“నువ్వు కుంతి కడుపున బడకుండా ఉంటే బాగుండేదిరా ! నీ గాండీవాన్ని కృష్ణునికి ఇవ్వు.” అని గాండీవాన్ని దూషిస్తాడు. తన గాండీవాన్ని ఎవరికైనా ఇమ్మంటే వాళ్ళని చంపుతానని అర్జునుని ప్రతిజ్ఞ. అందుకే ధర్మరాజును చంపటానికి అర్జునుడు కత్తి దూస్తాడు. అర్జునుని నివారిస్తూ కృష్ణుడు అన్నని తిట్టమంటాడు.
తర్వాత అన్నని తిట్టిన పాపానికి తల నరుక్కోవటానికి అర్జునుడు సిద్ధపడితే "నిన్ను నువ్వు పొగుడుకో! అది మరణంతో సమాన’’ మంటాడు. ఈ విధంగా కృష్ణుడు అన్నదమ్ముల మధ్య మాట పట్టింపును నేర్పుగా పరిష్కరించి ఉండకపోతే భారతం ఇంకో రకంగా ఉండేది. కృష్ణుడు ఇలా అనేక సందర్భాలలో నేర్పుగా మాట్లాడాడు కనుకనే అన్నమయ్య అతనిని కతలకారి అన్నాడు.
ఇలా అన్నమయ్య చందమామ కీర్తనలో ప్రతి పంక్తి వ్యాఖ్యాన ప్రాయమే. చందమామకి అమృత కిరణుడని పేరు. అమృతాన్ని చందమామ స్రవింపచేస్తుంటాడట. ఈ చందమామ కీర్తన కూడా అటువంటిదే. స్వస్తి.
|