Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aham Brahmasmi

ఈ సంచికలో >> శీర్షికలు >>

'ఆదర్శం' పిట్ట కథ - కె. విజయప్రసాద్

aadarsham small story

"మా అల్లుడు బంగారం. మా అమ్మాయిని కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు." గర్వంగా చెప్పింది లక్ష్మి.

" ఉన్న ఒక్క కూతురుకు ఎటువంటి అల్లుడు దొరుకుతాడోనని తెగ భయపడ్డాను. దాని అదృష్టం ఏమో గాని మంచి ఆదర్శభావాలుగల అల్లుడు దొరికాడు మాకు." నారాయణ కూడా గర్వపడ్డాడు.

"అమ్మా! నా అందం ఎవరినైనా చిత్తు చేస్తుందన్న సంగతి మీరు మర్చిపోతున్నారు!" స్వప్న సిగ్గుపడుతూ చెప్పింది.

అలా ఆమెకు స్నేహితురాళ్ళలో ఒక గొప్ప గుర్తింపు లభించింది.

పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కళ్యాణ మండపంలో చెవులు కొరుక్కున్నారు. "మనవాడికి డబ్బు పిచ్చి కదా! ఇంతటి ఆదర్శభావాలు ఎలా ఎప్పుడొచ్చాయి ఆశ్చర్యంగా ఉంది." అని.

"నాలుగు కట్నం డబ్బులు తెస్తాడు - దాంతో మా అమ్మాయికి పెళ్ళి చెయ్యొచ్చని కలలు కన్నాం - తీరా వీడిలా ఆదర్శ వివాహం చేసుకుంటున్నాడు" కళ్ళు తుడుచుకున్నాడు పెళ్ళికొడుకు తండ్రి.

"అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలా!" పెళ్ళి కొడుకు తల్లి ఏడ్పు.

శోభనం గదిలో పాలగ్లాసు యిస్తూ, సిగ్గు పడుతూ, స్వప్న అతన్ని పొగుడుతూ అడిగింది. "నిజంగా మీరు దేవుడండి. నన్ను కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నందుకు చాలా చాలా థాంక్సు! నిజానికి మీ అమ్మా వాళ్ళు కట్నం అడిగినా మీరు వద్దని, కట్నం తీసుకోనని, పట్టుపట్టి నన్ను చేసుకున్నారు. మీది ఎంత విశాల హృదయమండి!"

పొగడ్తలకు ఉబ్బి తబ్బిబ్బయిపోతూ రాజు సమాధానం చెప్పాడు. "పిచ్చిదానా! మీ ఆస్తికంతా నువ్వే కదా ఏకైక వారసురాలివి! అంటే ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం నాదే కదా! మళ్ళీ కట్నం ఎందుకు దండగ."

"ఆ! దండుగా!" బిత్తెరపోతూ అడిగింది స్వప్న.

"ఆ నిజంగానే దండుగ! మీరు కట్నం యిచ్చినా అది నాకు రాదు. మా ప్యారెంట్స్ తీసుకుంటారు. దాంతో నా చెల్లెలు పెళ్ళి చేస్తారు. ఇంక నాకు ఏమి మిగుల్తుంది అందులో! అందుకే కట్నమే వద్దన్నా!" ఖుషీగా చెప్పాడు.

రాజు విశాల హృదయానికి ఈసారి స్వప్న నిజంగానే నివ్వెరపోయింది.

కిటికీలోంచి వారి మాటలు వింటున్న అతని తల్లితండ్రులు యింకో సారి మనస్సులో ఏడ్చుకున్నారు అతని ఆదర్శభావాలకు.

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi