Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chandamama raave book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎపార్టు(మెంటాలిటీ) - భమిడిపాటి ఫణిబాబు

Apart (Mentality) by Phanibabu Bhamidipaati

 ఇదివరకటి రోజుల్లో, అంటే మరీ "జంబూ ద్వీపే భరత ఖండే" అని కాకపోయినా ఏదో గత పాతిక, ముఫై సంవత్సరాలక్రితం, ఈ ఎపార్టుమెంట్ల సంస్కృతి అంతలా లేదు. ఏదో కొన్ని మహానగరాలకే పరిమితమై ఉండేది. అక్కడకూడా, ఏదో, రెండుమూడు అంతస్థులతో ఉండేవి. జనాభా పెరిగిపోవడంతో, నివసించడానికి ప్రదేశాలు తక్కువయి, ఆకాశహర్మ్యాలూ, వాటినిండా అగ్గిపెట్టల్లాటి ఎపార్టుమెంట్లూ పుట్టుకొచ్చేయి. పులిని చూసి నక్క వాత పెట్టికున్నట్టుగా పట్టణాల్లోనూ, కొన్ని చోట్ల ఆఖరికి గ్రామాల్లో కూడా, ఈ సంస్కృతి పాకిపోయింది. ఇంక ఈ ఎపార్టుమెంట్లలో ఉండేవారి జీవితాలూ, మనోభావాలూ కూడా, వాళ్ళుండే ఎపార్టుమెంట్లకి అనుగుణంగా, అగ్గిపెట్టెల్లాగే తయారయిపోయాయి.అగ్గిపెట్లో చూడండి ఎన్నెన్ని అగ్గిపుల్లలు కుక్కుతారో, అలాగే ఈ ఆకాశహర్మ్యాల్లో కూడా అంతే.మనుష్యులు ఉంటున్నారా అంటే, ఉంటున్నారు కానీ వారిలో , స్వేఛ్ఛాప్రపంచంలో ఉండే మనుష్యులలోని "జీవం" కనిపించదు.ఉత్తి zombies లా తయారయిపోతున్నారు.

ఎవరినైనా పలకరిస్తే ఏం కొంపమునుగుతుందో అనే భయం. మరీ పలకరించగానే మన కొంపకి వచ్చి కూర్చుంటారా చిత్రం కాకపోతే. ఏదో లిఫ్టుల్లో వెళ్ళేటప్పుడు, హల్లో లకే పరిమితం. అదికూడా, ఏ పదిహేనో అంతస్థులోంచో కలిసి రావడం తటస్థించేస్తేనే, అదికూడా వారంతటవారు పలకరించరు, వాళ్ళ గోలలో వాళ్ళుంటారు, ఏ ఐఫోనో నొక్కుకుంటూ నుంచుంటాడుకానీ, పక్కనే ఇంకో ప్రాణి ఉన్నట్టుకూడా చూడడు. సమవయస్కులైతే, మిగిలినవారుకూడా అలాగే ఉంటారు. అదృష్టం బాగోక, ఏ వయస్సు మళ్ళినవారైనా, అదే లిఫ్టులో ఉంటే ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేమిటీ వీళ్ళందరూ ఏమైనా శత్రువులా ఏమిటీ, ఒకే సొసైటీలో ఉంటూ, అంత ఎడముఖం,పెడముఖం పెట్టుకుంటారేమిటీ అని ! పాపం ఆయనకేమి తెలుసూ, తన కొడుకు కోరగా, కోరగా ఏదో స్వగ్రామం వదిలి రెండురోజులముందే అక్కడకి వచ్చారు, ప్రస్తుతం చూసింది ఉత్తి శాంపుల్ మాత్రమే అని.ఇంకా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు చూడాలి.  

ఒక్కో అంతస్థుకీ కనిసం నాలుగు వాటాలుంటాయి.ఎప్పుడు చూసినా తలుపులు మూసుకునే ఉంటాయి.పైగా వీటికి automatic locking ఉండడం వలన , ఆ ఇంట్లోవాళ్ళు ఎంతమందో మాట దేవుడెరుగు, అసలు ఉన్నారో ఊడేరో కూడా తెలియదు. ఏ గ్యాస్ వాడో వచ్చి, మీ ఎదురుగుండావాళ్ళు ఎక్కడకి వెళ్ళారో తెలుసునా అని అడిగినా చెప్పలేనిపరిస్థితి. అలాగని ప్రతీ రొజూ వచ్చి పలకరించాలని కాదు, కనీసం మొత్తం సొసైటీలో వాళ్ళ సంగతెలా ఉన్నా, కనీసం ఒకే అంతస్థులో వాళ్ళు ఒకళ్ళతొ ఒకళ్ళు పరిచయం చేసికుంటే బావుంటుందేమో. ఈ automatic locking  వలన ఒక బాధకూడా ఉంది.ఎప్పుడైనా భార్యాభర్తలిద్దరూ బయట ఉండి, ఏ గాలికో తలుపు పడిపోయిందా, ఇంక అయిపోయిందే పని !తాళాలు లోపలే ఉండిపోయాయి. ఆ తలుపులా ఎంత తోసినా రావాయె, పోనీ లోపలకి ఏ కిటికీలోంచో వెళ్దామంటే, అలాటి సదుపాయాలు ఉండవూ,పోనీ ఆఫీసుకెళ్ళిన కొడుకునో, కోడలినో పిలుద్దామంటే, చేతిలో ఫోన్నైనా లేదూ, పోనీ ఎవరైనా సహాయానికి వస్తారా అంటే, వచ్చి వారంరోజులైనా ఎవరితోనూ పరిచయం లేదు, నోరుమూసుకుని,ఈ పెద్దాళ్ళు సాయంత్రం పిల్లలొచ్చేదాకా ఏ మెట్లమీదో కూర్చోడమే గతి.

అందరితోనూ కలివిడిగా ఉండే స్వభావం కల, ఈ పెద్దాయనో, పెద్దావిడో  పోనీ ఎవరితోనైనా స్నేహం చేద్దామా అంటే, పిల్లలకి నచ్చదూ. ఈ నచ్చకపోవడానికి అర్ధంపర్ధం లేని లక్ష కారణాలు. సాయంత్రం ఆఫీసునుండి కొడుకూ, కోడలూ, స్కూలునుండి పిల్లలూ వచ్చేసరికి, అదృష్టం బాగోక, ఈ పెద్దవాళ్ళు, అదే సొసైటీలో ఉండే ఇంకొకరితో మాట్టాడుతున్నట్టు చూశారంటే, ఏదో మొహమ్మాటానికి వాళ్ళున్నంతసేపూ ఊరుకున్నా, వాళ్ళు వెళ్ళిపోయినతరువాత మొదలవుతాయి క్లాసులు- "డాడీ/నాన్నా ఊరికే ప్రతీవారినీ ఇంటికి పిలిచేయకండి, వాళ్ళ status వేరూ, మనదివేరూ. మీ మనవలు చదువుకోడానికి ఓ పెద్ద పబ్లిక్ స్కూలుకి వెళ్తున్నారు, వాళ్ళ పిల్లలేమో గవర్నమెంటు స్కూలూ, వాళ్ళ పధ్ధతులు వేరూ, మనవి వేరూ, ఊరికే పూసుకుని తిరిగేయకండి, ఎవరిని ఎక్కడ ఉంచాలో, మాకంటే మీకే ఎక్కువ తెలుసు..."-- ఈ పెద్దాయనేమో, వాళ్ళ ఊర్లో ఓ స్కూలుకి ఏ హెడ్మాస్టరుగానో చేసి రిటైరయినవారు, ఈ క్లాసు పీకుతున్న కొడుకు కూడా ఆ స్కూల్లోనే చదివి,అదే ఊళ్ళో కాలేజీలో డిగ్రీ సంపాదించి ఉద్యోగంలో చేరినవాడు, ఇప్పుడేమో ప్రభుత్వపాఠశాలలూ, కాలేజీలూ "అల్లం" అయిపోయాయి, ప్రెవేట్ స్కూళ్ళూ,కాలేజీలూ "బెల్లం" అయిపోయాయి.

ఇదివరకటిరోజుల్లో, ఏ ఊరికైనా కొత్తవారు వచ్చి, ఫలానావారి ఇల్లు ఎక్కడా అంటే, ఎవరో ఒకరు చెప్పేవారు. కానీ ఇప్పుడో, ఊరికే సొసైటీ పేరొకటీ సరిపోదు, ఎందుకంటే ఈ బిల్డరుగారు అదేపేరుతో Phase 1, Phase 2... అంటూ కట్టుకుంటూపోయాడు. ప్రతీ ఫేజులోనూ, ఓ డజను బిల్డింగులూ, పదిపదిహేను అంతస్థులూ , వీళ్ళకి కావలిసినవారు ఎక్కడుంటున్నారో సరీగ్గా తెలిసికోవాలి. పోనీ ఆ బిల్డింగుల వరసైనా సరీగ్గా ఉంటుందా అంటే అదీ లేదూ. ఎందుకొచ్చామురా భగవంతుడా అనుకుంటాడు.

ఈ సొసైటీల్లో ఉండేవారికి పరిచయం లేదనుకోవడం మహాపరాధం. ముఖ పరిచయం అంటే లేదుకానీ, "ముఖపుస్తక(facebook)" పరిచయం మాత్రం తప్పకుండా ఉండేఉంటుంది. ఒకరు పెట్టిన పోస్టుకి ఇంకొకరు like లూ, share లూ లక్షసార్లు చేసికున్నవారే, కొండొకచో ఇద్దరూ ఒకే అంతస్థులో పక్కపక్క ఎపార్టుమెంట్లలోనే ఉండికూడా ఉండొచ్చు ! ఈమాత్రందానికి అన్నన్ని వేషాలెందుకో?

అసలు ఒకరిని చూసి ఇంకొకరు మొహాలు చిట్లించుకోవలసిన అగత్యం ఎందుకో నాకు అర్ధం కాదు. పోనీ అందరికీ తెలిసినవాడు  ఆ సొసైటీ వాచ్ మన్ తో బాతాఖానీ పెట్టుకుందామా అనుకుంటే, పిల్లలకి అదీ కిట్టదు. పోనీ పిల్లలతో ప్రస్తావనచేసి,”ఏరా ఇంతపెద్ద సొసైటీలో ఓ నలుగురేనా తెలుసురానీకూ” అని అడిగారనుకోండి, ఆ పెద్దాయన ఉద్దేశ్యం రేపెప్పుడో తను టపా కట్టేస్తే, కనీసం ఆ నలుగురైనా వస్తారేమో అని, ఆ కొడుకంటాడూ, డోంట్ వర్రీ, ఓ ఫోనుచేస్తే యాంబ్యులెన్స్ వచ్చేస్తుందిలే అంటాడు కానీ, తనుమాత్రం ఇంకొకరితో పరిచయం చేసికుంటే బాగుంటుందేమో అనే ఆలోచన మాత్రం రానీయడు. తీరా ఆ తండ్రో,తల్లో స్వర్గస్థులైనప్పుడు, తనూ ఆ యాంబ్యులెన్సు డ్రైవరూ మాత్రమే ఉంటారు.ఇది మరీ అతిగా ఊహించి వ్రాసింది కాదు, మా ఎదురుగుండా ఓ సొసైటీలో  గత సంవత్సరంలో చూసిన సంఘటనలు చూసి వ్రాసింది. బ్రతకడం ఎలా బ్రతికేమూ అని కాదు, పోవడం ఎలా పోయామూ అనేది కూడా ముఖ్యం.

ఎప్పుడో ఒకప్పుడు ప్రతీవారికీ, ఎవరో ఒకరి సహాయం అవసరంవచ్చితీరుతుంది. అవసరం వచ్చిందికదా అని, అవతలివాళ్ళని అడిగితే, అందరూ ముందుకురాకపోవచ్చు, కొంతమంది మొహం చాటేసికున్నా ఆశ్చర్యం లేదు. అలాగని ప్రతీవారితోనూ పరిచయాలు పెంచేసికుని, ఏదో "అతి" గా ఉండమనడంలేదు, పైగా అలా చేస్తే familiarity breeds contempt లోకి కూడా దింపొచ్చు. అలా కాకుండగా ఓ చిరునవ్వు, ఓ పలకరింపు,అప్పుడప్పుడు దివ్యౌషధం లా  పనిచేస్తాయేమో...
భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని శీర్షికలు
Aham Brahmasmi