Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavaan shree ramana maharshi biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

సుశాస్త్రీయం -'మంచి గుమ్మడి' - టీవీయస్. శాస్త్రి

gummadi venkateshwara rao

నటుడన్న తరువాత అన్ని పాత్రలను పోషించి మెప్పించాలి. తండ్రిగా, రైతుగా, జమీందారుగా, తేనెపూసిన కత్తిలాంటి విలన్ గా...  మరెన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు వారి మన్ననలను పొందిన 'మంచి గుమ్మడి పండు' లాంటి నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. అన్ని పాత్రలకూ న్యాయం చేకూర్చి నప్పటికీ, ప్రేక్షకులు మాత్రం వారిని సాత్వికమైన పాత్రల్లోనే చూడటానికి ఇష్టపడేవారు. బహుశా:ఆ పాత్రలు ఆయన స్వభావానికి దగ్గరగా ఉండటం వల్లనేమో! తెలుగు భాషను ఎంత మధురంగా పలకాలో ఈ తరం నటీనటులు నేర్చుకోవాలంటే, వారి సినిమాలన్నిటినీ చూసి తీరవలసిందే!

సినిమా రంగంలో 'గుమ్మడి' గా ప్రసిద్ధి చెందిన వీరు, అయిదు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర రంగంలో విభిన్న పాత్రలను పోషించి, తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వంచేత 'రఘుపతి వెంకయ్య' అవార్డును స్వీకరించారు. దాదాపుగా 500 లకు పైగా సినిమాలలో నటించారు. చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవలను గుర్తించి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు, ఈ మహానటునికి 'కళాప్రపూర్ణ' అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అంటే తెలియనివారు తెలుగునాట ఉన్నారంటే నమ్మశక్యం కాని విషయం. అద్వితీయమైన నటనతో చిత్రసీమలో ఆయన తనకొక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. పౌరాణిక, సాంఘీక, జానపద, చారిత్రిక పాత్రలన్నిటిలోనూ విశేష ప్రతిభను కనబరచారు. తండ్రిగా, అన్నగా, తాతగా--- వేషమేదైనా దానిని పండించటం ఆయనకు కరతలామలకం. ప్రేక్షకులు ఆయనను ఎక్కువగా కరుణరస పాత్రల్లోనే చూడటానికి ఇష్టపడేవారు. తెలుగువారి పంచకట్టులోని హుందాతనాన్నిచూపించటమే కాకుండా, 'అచ్చమైన తెలుగువాడంటే ఇలానే ఉండాలి' అనిపించేటట్లు వుండేవారు.

NTR తో నటించిన 'తోడుదొంగలు' (1954 ), 'మహామంత్రి తిమ్మరుసు' (1962) సినిమాలు గుమ్మడికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'తోడుదొంగలు' కు రాష్ట్రపతి బహుమతి రాగా, 'మహామంత్రి తిమ్మరుసు' లో ఆయన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా బహుమతి వచ్చింది. 'మాయాబజార్' (1957), మాయింటి మహాలక్ష్మి(1959), కులదైవం(1960), కులగోత్రాలు(1962), జ్యోతి(1977), నెలవంక(1981), మరోమలుపు(1982), ఏకలవ్య(1982), ఈ చరిత్ర ఏ సిరాతో(1982), గాజుబొమ్మలు(1983), పెళ్ళిపుస్తకం(1991)... గుమ్మడికి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో కొన్ని మాత్రమే! తెలుగు విశ్వవిద్యాలయంవారు, మహామంత్రి తిమ్మరుసు లోని ఆయన కనబరచిన విశేష నటనా ప్రాభవానికి గుర్తింపుగా, డాక్టరేటుతో సన్మానించింది. 1982 లో 'మరోమలుపు' లోని నటనకు, ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వంచేత నందీ అవార్డును బహుమతిగా పొందారు. జాతీయ సినిమా బహుమతులకు న్యాయ నిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నందీ అవార్డుల న్యాయ నిర్ణేత సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. NTR అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డుల సంఘాలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆయన తన జీవితచరిత్రను 'తీపిగుర్తులు - చేదు జ్ఞాపకాలు' అన్న పేరుతో రచించారు. 1995లో ఆరోగ్యం సరిగాలేక, గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతును అరువు తీసుకోవటం ఇష్టంలేక నటించటం మానుకున్నారు. మరల శ్రీ జగద్గురు కాశీనాయన చరిత్ర(2008)లో, ఆయన వయసు, గొంతు - ఆ పాత్రకు సరిపోవటం వల్ల నటించారు. అదే ఆయన ఆఖరి సినిమా.

గుమ్మడి స్వగ్రామం, తెనాలి దగ్గర రావికంపాడు అనే ఒక చిన్న గ్రామం. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో, 09-07-1927న బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. గుమ్మడి గారికి ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. గుమ్మడి గారి బాల్యమంతా గారాబంగా గడిచింది. ఉమ్మడికుటుంబ వాతావరణంలో పెరిగిన గుమ్మడి జీవితం ఆయన నటజీవితంలో ప్రతిఫలించి, సాత్విక పాత్రలలో ఆయన జీవించటానికి సహకరించింది. తన తండ్రి బసవయ్య, పెదనాన్న నారయ్య గార్లు రక్తసంబంధంతోనే కాకుండా స్నేహానుబంధంతో మెలిగేవారని గుమ్మడి మాటల్లో తెలుస్తుంది. గుమ్మడి ప్రారంభ విద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు స్వంత వూరు అయిన రావికంపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడనే ఆయన SSLC దాకా చదివారు. ఈ దశలోనే, తమ గ్రామంలో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసం వల్ల ప్రభావితుడయ్యి, కమ్యూనిష్టు పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. గుమ్మడి SSLC లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. తరువాత విద్యాభ్యాసాన్ని గుంటూరులోని హిందూ కాలేజీలో కొనసాగించాలని ఎంతో అభిలాషించినా, ఆయన దారితప్పి కమ్యూనిష్టు ఉద్యమం వైపు ఆకర్షితుడవుతాడని భయపడి, పెద్దలు దానికి అంగీకరించలేదు. అదీగాక, ఆయనకు వివాహ ప్రయత్నాలను మొదలు పెట్టారు. అప్పుడు ఆయన వయసు 17 సంవత్సరములే! ఆయన వివాహం 1944 లో పెద్దల సమక్షంలో నాయనమ్మకు అమ్మమ్మ అయిన 103 సంవత్సరాల వృద్ధురాలు, నాయనమ్మ, అమ్మమ్మ వంటి పెద్దల ఆశీర్వచనంతో జరిగింది. గుమ్మడిని తన కుమారుడిగా భావించిన ఆయన అత్తగారు, ఆయన విద్యాభిలాషను గమనించి, వివాహానంతరం గుంటూరులోని హిందూ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసానికి సహకరించింది. అత్తగారి సహకారంతో గుంటూరు, హిందూ కాలేజీలో ఇంటర్ వరకు(1944-46) చదువు సాగింది. ఆయన సహవిద్యార్ధి, ప్రముఖ చలనచిత్ర నటి సీనియర్ శ్రీరంజని కుమారుడైన యమ్. మల్లికార్జునరావు సాహచర్యంతో ఆయనలో కలిగిన విపరీతమైన సినిమా వ్యామోహం వలన, ఇంటర్ పరీక్షలో అపజయం పాలైనారు. ఈ అపజయం వలన, అవకాశం కోసం చూస్తున్న పెద్దలు వారిని వెనుకకు పిలిపించి వ్యవసాయపు పనులను అప్పగించారు. అంతటితో ఆయన విద్యార్ధి జీవితం ఒక ముగింపుకు వచ్చింది.

గుమ్మడి గారి రంగస్థల జీవితం యాదృచ్చికంగా ప్రారంభం అయింది. ఆయన ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులలోనే, ఉపాధ్యాయుని ఆదేశంతో పేదరైతు అనే నాటకంలో వయోవృద్ధుడైన రైతు పాత్రను పోషించారు. ఆ నాటకంలో అయన నటనకు మంచి గుర్తింపు లభించింది. అలా ఆయన రంగస్థల ప్రవేశం జరిగింది. ఒకసారి ఆయన వీరాభిమన్యు నాటకం చదవటం తటస్థించింది. ఆ కాలంలో పద్య నాటకాలకు ఎక్కువ ఆదరణ వుండేది. వీరాభిమన్యు నాటకంలో వచనం ఎక్కువగా వుండటం చేత, ఆ నాటకం వీరిని బాగా ఆకర్షించింది. కొంతమంది స్నేహితులను కూర్చుకొని స్వంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి, అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభినయించారు. ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి శ్రీ మాధవపెద్ది వెంకటరామయ్య గారి దాకా చేరింది. ఒకసారి ఆయనను, శ్రీ మాధవపెద్ది వెంకటరామయ్య గారే స్వయంగా పిలిచి, దుర్యోధన పాత్రను మరింత రసవత్తరంగా నటించటం గురించి వివరించి ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత వారిరువురికీ పెరిగిన పరిచయం, శ్రీ మాధవపెద్ది వెంకటరామయ్య గారి నాటకంలో గుమ్మడి గారు దుర్యోధన పాత్ర , మాధవపెద్ది వారు కర్ణ పాత్రను నటించేవరకు వెళ్ళింది. ఆ నాటకంలో నటించిన అనంతరం, ఆయన గుమ్మడితో, "నాటకంలో బాగా నటించావు. కానీ, నాటకంలో నటించటానికి కావలసిన ఆంగికాభినయం కంటే సాత్వికాభినయం నీలో ఎక్కువగా ఉంది. సినిమాలలో ప్రయత్నిస్తే, అభివృద్ధిలోకి వస్తావు" అని సలహాను ఇచ్చారు. సినిమాల మీద గుమ్మడిగారికి ఉన్న వ్యామోహం, వెంకటరామయ్య గారి సలహాతో మరీ ఎక్కువైంది.

ఆ తరువాత గుమ్మడి మనసు సినిమాలవైపు మళ్ళింది. గుమ్మడి హై స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఆయన తెలుగు మాస్టర్ గారైన శ్రీ జాస్తి శ్రీ రాములుగారి వల్ల, ఆయనకు తెలుగు భాషపై మక్కువ పెరిగింది. ఆ కాలంలో ఆయన తెనాలిలో, ఆంధ్రా రేడియోస్ అనే వ్యాపార సంస్థను ప్రారంభించారు. వ్యాపారం పెట్టినా, నటనా వాసనలు ఆయనను వదలని కారణంగా, ఆయన షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది. వ్యాపారంలో నష్టాలను చవిచూసారు. కుటుంబం ఇద్దరు పిల్లలవరకు పెరిగింది . తెనాలిలో ఆయనను కలసిన ఆయన సహవిద్యార్ధి, మిత్రుడు మల్లికార్జునరావు సినిమాలలో నటించమని సలహాను ఇచ్చాడు. గుమ్మడి, మల్లికార్జునరావుగారితో కలసి తొలిసారి మద్రాసుకు ప్రయాణ మయ్యారు. మద్రాసులో, శ్రీ కే. వీ. రెడ్డి, యెచ్. యమ్. రెడ్డి వంటివారిని కలసి అవకాశం కోసం వారిని అర్ధించి చూసారు. వారి వద్ద నుండి సముఖమైన సమాధానం రాకపోవటం వల్ల తిరిగి తెనాలికి వెళ్లి యధావిధంగా జీవితం సాగించారు. శ్రీ డీ. యల్. నారాయణ గారికి గుమ్మడి గారి నటన అంటే ఎంతో ఇష్టం. ఆయనకు ఎప్పుడు సినిమాలలో అవకాశం కల్పించాలా అని తగిన సమయంకోసం చూసేవారు. గుమ్మడిగారి ఫోటోలు ఎప్పుడూ ఆయన జేబులోనే ఉండేవి. తమిళనాడు టాకీస్ అదినేత అయిన సౌందరరాజన్ అయ్యంగారితో మాటల సందర్భంలో, సౌందరరాజన్ అయ్యంగారు తాను తెలుగులో తీయబోయే సినిమాకు కొత్తవాళ్ళు కావాలన్న వెంటనే, శ్రీ డీ. యల్. నారాయణ గారు ఆయన జేబులో ఉన్న గుమ్మడిగారి ఫోటోలను చూపించారు.

వాటిని చూసిన సౌందరరాజన్ అయ్యంగారు గుమ్మడి గారికి అవకాశం ఇవ్వటంపై మొగ్గు చూపటంతో, గుమ్మడి గారి సినిమా జీవితం ఆరంభమైంది. ఆ విషయం గుమ్మడి గారికి తంతి ద్వారా తెలియజేసి, వెయ్యి రూపాయల పారితోషికం కూడా ఇవ్వటానికి నిర్ణయం జరిగింది. ఆ చిత్రం పేరు 'అదృష్ట దీపుడు '(1950). దానిలో గుమ్మడిగారి పాత్ర ముక్కామల గారికి అసిస్టెంట్. రెండవ సినిమా, నవ్వితే నవరత్నాలు. మూడవ సినిమా పేరంటాలు, నాలుగవ సినిమా ప్రతిజ్ఞ. వీటన్నిటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి అవకాశాలు లేవని, తిరిగి వెళ్లాలని భావించిన సమయంలో, NTR తో కలిగిన పరిచయంతో, NTR గారు గుమ్మడిని వెళ్ళవద్దని చెప్పారు. తన స్వంత చిత్రం ' పిచ్చిపుల్లయ్య' లో మంచి వేషం ఇచ్చారు. అది ప్రతినాయక పాత్ర. దానితో గుమ్మడి సినీజీవితం మరో మలుపు తిరిగింది. N. T. రామారాగారు, వారి తదుపరిచిత్రమైన 'తోడుదొంగలు ' లో కూడా గుమ్మడిగారికి మంచి పాత్రను ఇచ్చారు. ఆ సినిమా ఆర్ధికంగా విజయం సాధించకపోయినా, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును పొందింది. అలా సాగుతున్న ఆయన సినీ జీవిత ప్రస్థానంలో, మరో మంచి మలుపు 'అర్ధాంగి ' సినిమా. 'అర్ధాంగి' సినిమాలో ఆయన వేషం, జమీందారు మరియు శాంతకుమారి గారి భర్త. ఆ సినిమాలో, దర్శకుడు పుల్లయ్యగారు ఆయనను ఆ వేషానికి ఎన్నిక చేసే సమయంలో శాంతకుమారి గారు అభ్యంతరం చెప్పారు. ఆయన తన కన్నా చిన్న వాడని, తన భర్త పాత్రకు నప్పడని ఆవిడ అభ్యంతరం. పుల్లయ్య గారు, ఎవరు చెప్పినా వినకుండా గుమ్మడి గారినే ఆ పాత్రకు తీసుకున్నారు. ఆ సినిమా అఖండ విజయాన్ని చవిచూసింది.

అక్కడినుండి ఆయన చివరివరకూ నటయాత్రలో వెనక్కు తిరిగి చూసుకోనవసరం లేకపోయింది. చిన్న వయసులోనే కారక్టర్ నటుడయ్యారు. నిజానికి, రామారావు, నాగేశ్వరరావుల కన్నా చిన్నవాడై నప్పటికీ, అనేక సినిమాలలో వారికి తండ్రిగా, మామగా నటించారు. నటించిన ప్రతి పాత్రలో ఒదిగిపోవటం, ఆయన ప్రత్యేకత. అత్యంత వైరుధ్యమైన వసిష్ఠ, విశ్వామిత్ర లాంటి పాత్రలను నటించి ప్రశంసలు పొందారు. కర్ణుడిగా, ధర్మరాజుగా, సత్రాజిత్తుగా, బలరాముడిగా, భ్రుగుమహర్షిగా, భీష్ముడిగా-- పౌరాణిక పాత్రలలో ఆయన కనబరచిన నటన మరువలేనిది. సాంఘీక చిత్రాలలో సాత్విక పాత్రలతో పాటు ప్రతినాయకునిగా (నమ్మినబంటు, లక్షాధికారి, ఇద్దరు మిత్రులు మొదలైనవి) ఆయన కనబరచిన నటన శ్లాఘనీయం. రామారావు గారితో ఆయనకు కుటుంబ సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఆయన సలహామేరకు, కుటుంబాన్ని మద్రాసుకు తీసుకొని వచ్చారు. గుమ్మడి గారిగి అయిదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యవహరించారు. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా చిత్రాల నిర్మాణానికి దూరంగా ఉండిపోయారు. కుమార్తె మరణం, భార్య మరణం కొంత బాధను కలిగించినా, తృప్తికరమైన జీవితాన్ని అనుభవించినట్లు వారి మాటల్లో చెప్పుకున్నారు.

మొదటి సినిమాలో నటించే సమయంలో నాగయ్య గారి కార్యాలయంలో ఒక రూములో ఉండే గుమ్మడి, తరువాత తన మకాంను ఒక హోటల్ కు మార్చారు. ఆ సమయంలో TNT ఆఫీసుకు ఎదురుగా వున్న హోటల్ రూములో టీ. వీ. రాజు గారితో కలసివున్న రామారావుగారితో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారి, ఆ పరిచయం గుమ్మడి గారి నటజీవితానికి పునాది అయింది. అర్ధాంగి సినిమాలో ఆయన భార్యగా నటించిన శాంతకుమారిగారు, ఆయనకన్నా ఎనిమిది ఏళ్ళు, ఆయన కుమారుడిగా నటించిన నాగేశ్వరరావు గారు మూడు ఏళ్ళు పెద్దవారు. ఆయన చిన్నకుమరుడిగా నటించిన జగ్గయ్య గారు ఒక ఏడాది పెద్ద. సినీ జీవితపు తొలినాళ్ళలో, తీసుకొని వచ్చిన డబ్బులు అయిపోయి, రెండురోజులు మంచినీటితో సరిపెట్టుకున్నారు. పెళ్లి నాటి ఉంగరాన్ని తాకట్టు పెట్టి, తరువాతి రోజుల్లో దాన్ని విడిపించుకున్నారు. వారి జీవితంలో ఇబ్బందిపడ్డ రోజులివే! మహామంత్రి తిమ్మరుసులో ఎన్. టి. ఆర్. శ్రీ కృష్ణదేవరాయల పాత్రను పోషించినా, సినిమాకు గుమ్మడి నటించినపాత్ర పేరు ఉండటం విశేషం. అలాగే, మర్మయోగి సినిమాకు కూడా. ఇవి అరుదైన సంఘటనలు.

'తీపిగుర్తులు - చేదు జ్ఞాపకాలు'
శ్రీ గుమ్మడి తన స్వీయ చరిత్రను, 'తీపిగుర్తులు-చేదు జ్ఞాపకాలు' అనే పేరు మీద వ్రాసుకున్నారు. అందులోనుండి రామారావు గారికే సంబంధించిన రెండు తీపిగుర్తులు-చేదు జ్ఞాపకాలను చెబుతాను.

తీపిగుర్తులు
శ్రీ గుమ్మడి గారికి ఎప్పుడూ చేతిలో సిగరెట్టు ఉండవలసిందే. అవి రామారావు గారు సీతారామకళ్యాణం సినిమాను తీస్తున్న రోజులు. దానికి దర్శకుడు కూడా రామారావు గారే. ఆ సినిమాలో గుమ్మడి గారిది విశ్వామిత్రుడి వేషం. గడ్డం. మీసాలు, చేతిలోదండం, కమండలాలతో అచ్చం విశ్వామిత్రుడు లాగానే ఉన్నారు. విరామం మధ్యలో సిగరెట్టు తాగాలనిపించింది. ఆ వేషం సిగరెట్టు పెట్టె , అగ్గిపెట్టె పెట్టుకోవటానికి అనుకూలంగా లేదు. అదీగాక, ఆ వేషంలో సిగరెట్టు తాగితే రామారావు గారు ఒప్పుకోరు. అప్పుడు గుమ్మడి గారు ఏమి చేసారో తెలుసా? తన సహాయకుడి చేత సిగరెట్టు పెట్టె, అగ్గిపెట్టెను తెప్పించుకొని, వాటిని కమండలంలో పెట్టుకొని, toilet కు వెళ్ళినప్పుడల్లా గబగబా రెండు దమ్ములు పీల్చి వచ్చేవారు. ఆ సినిమాలో మొత్తం ఆయన కమండలంలో మంత్రజలానికి బదులుగా సిగరెట్టుపెట్టె, అగ్గిపెట్టె ఉన్నాయి.

చేదు జ్ఞాపకాలు
నాగేశ్వరరావు, రామారావు గార్ల మధ్య చెలరేగిన వివాదాలు చిలికిచిలికి గాలివానగా మారాయి. గుమ్మడి ఆ సమయంలో ఎక్కువగా నాగేశ్వరరావు గారి సినిమాలలో నటించటం వల్ల, కొన్ని అనుకోని సంఘటనలవల్ల, గుమ్మడి, రామారావుల మధ్య దూరం అధికమయింది. ఆ దూరం ఎంతవరకు పోయిందంటే, గుమ్మడిగారి కుమార్తె వివాహానికి కూడా రామారావు గారు హాజర్ కానంతవరకు! ఇందుకు తాను ఎంతో బాధపడినట్లు గుమ్మడిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చిట్టిచెల్లెలు అనే సినిమాలో వారిద్దరూ, తండ్రీ కొడుకులుగా కలసి నటించినప్పటికీ, వారిద్దరూ కలసి నటించే దృశ్యాలు లేకుండా ఆ సినిమాను తీయటం జరిగింది. కాలగతిలో, నాగేశ్వరరావు, రామారావు గార్ల మధ్య ఉన్న విబేధాలు తొలగి పరస్పరం తెలుసుకొని, అందులో గుమ్మడి గారి ప్రమేయం ఏమీ లేదని తెలుసుకున్న రామారావు గారు తిరిగి గుమ్మడికి చేరువ కావటంతో ఆయన మనసు కుదుటపడ్డది.

ఈ మహానటుడు హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో 26-01-2010 న, శరీరంలో చాలా అవయవాలు పనిచేయకపోవటం వల్ల మరణించారు. ఆయన, చివరి సారిగా 'మాయాబజార్ '(రంగుల్లోకి మార్చినది) ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపారు. "ఆ గొప్ప సినిమాను రంగుల్లో చూడటానికేమో, నేను ఇంత దీర్ఘ కాలం బతికి ఉన్నాను." అని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

ఈ మహానటుడుని గురించి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు-
గుమ్మడిగారు విపరీతమైన ఆవేశి, కోపిష్ఠి. ఆయనకి నచ్చిన విషయాన్ని నెత్తిన వేసుకుని పదిమందికీ ఎలా పంచుతారో, నచ్చని విషయాన్ని కుండ బద్దలుకొట్టేవరకూ నిద్రపోరు. ఈటీవీ ఛానల్ కో, దినపత్రికకో సంబంధించిన ఏదో విషయానికి క్రుద్ధులయి ఫోనెత్తి సరాసరి రామోజీరావు గారితోనే చెప్పారట. నచ్చని విషయంలో దాపరికం లేదు, నిజాయితీ లోపం లేదు. ఓ గొప్ప నటుడి ఆవేశం, కోపం అతని నటనలో తప్పక తర్జుమా అవుతుంది. ద్రోణూడూ, బలరాముడూ ఇందుకు ఉదాహరణలు. ఆ కోపం గుమ్మడిగారి నటన కాదు. ఆయన ఆస్తి. ఆయన చేసే పాత్రల్లో రాజీ లేదు. మధ్యేమార్గం లేదు. ద్రోణుడయినా, భానోజీ అయినా ఆయన కళ్ళముందు రూపుకట్టాలి. తర్వాతనే మన కళ్ళముందుకు ఆయన తెచ్చేది. నేను రాసిన ఒకానొక సినీమాలో నాకిష్టమయిన ఒక పాత్రకి ఆయన్ని అనుకున్నాం. నాకు ముందు రోజు పొల్లాచిలో షూటింగ్. వేషం వేసుకుని లొకేషన్ కి వచ్చారట. బడిపంతులు వేషం. తన అవగాహనని అర్ధం చేసుకోని డైరెక్టర్ ని ఒప్పించాలని ప్యయత్నించి, సాధ్యంకాక, విసిగి- విగ్గుతీసేసి వెళ్ళిపోయారు. మరునాడు నాకు చెప్పారు. ఆయన్ని ఆ పాత్రకి నష్టపోయినందుకు బాధపడినా, నటుడిగా, రచయితగా ఆయన నిజాయితీకి గర్వపడ్డాను. ఉత్తమమయిన కళకి ఆయన తలవొంచే గొప్ప సందర్భాన్ని నేను మరిచిపోలేను.

ఓ విదేశీయానంలో నేనూ, మా శ్రీమతి, గుమ్మడిగారూ వస్తున్నాం. ఆ విమానంలో ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గారున్నారు. విమానం గాలిలో తేలేదాకా విలవిలలాడిపోయారు గుమ్మడి. తర్వాత మా ఆవిడా, ఆయనా లేచి వెళ్ళారు ఆమె దగ్గరికి. మా ఆవిడ తన చిన్నాయన శ్రీపాద పినాకపాణిగారి పరపతిని చెప్పుకుంది. కాని ఆ గాన సరస్వతికి గుమ్మడిగారు తెలియదు. మా ఆవిడ పరిచయం చేసింది. ఆవిడ పవిత్రమైన గంగానది. అందులో ఎందరు భక్తులో మునకలు వేస్తారు. వారి ఉనికి నదికి తెలియనక్కరలేదు. ఇద్దరూ సభక్తికంగా ఆమెకి పాదాభివందనం చేసి వచ్చారు గర్వంగా. జీవితాన్ని తన షరతులతోనే నడిపారు. తెరమీద కన్నీళ్ళు ఆయన బాంక్ అకౌంట్. జీవితంలో వాటిని స్వయంగా రెండుసార్లే చూసాను. వారి శ్రీమతి కన్నుమూసినప్పుడు. ప్రాణప్రదమయిన కూతురు వెళ్ళిపోయినప్పుడు. దేనితోనూ రాజీపడని నిరంకుశుడు, గర్విష్టి, కోపిష్టిని అనారోగ్యం ఆఖరి రోజుల్లో లొంగదీసింది. అద్భుతమైన వాచకంతోనే అశేష ప్రజానీకాన్ని అలరించిన ఆయన గొంతు సహకరించకపోవడం ఆయన్ని కృంగదీసింది. ఓ గొప్ప నటుడికి విధి చేసిన భయంకరమైన దోపిడీ అది. మొదటిసారిగా గుండె కలుక్కుమంది.

ముందు ముందు కంప్యూటర్ యుగం వినోదాన్ని వింతగా అలంకరిస్తుంది. నేటితరం సంప్రదాయానికి అప్పుడే దూరంగా జరిగిపోతోంది. హారీపోటర్ చదివే పసివాడికి హరిశ్చంద్రుడి వైభవం తెలుసుకునే ఆస్కారం పోతోంది. డిజిటల్ ధర్మమాంటూ ఒక గొప్ప ఇతివృత్తం ఈ దేశంలో చచ్చిపోయి చాలారోజులయింది. ఆ ఇతివృత్తాన్ని ఒక జీవితకాలం తన సొత్తుగా, మాధవపెద్ది, అద్దంకి, పులిపాటివారికి వారసుడుగా ఓ తరాన్ని ప్రభావితం చేసిన ఆఖరి యోధుడి నిష్కమణాన్ని తలపండిన అభిమానులే తలచుకుని కంటతడిపెట్టే రోజులొచ్చేసాయి. అయితే గుమ్మడివంటి మహానటుల చరిత్రని పంచరంగుల కలగా భద్రపరిచే ప్రయత్నాలు అదృష్టవశాత్తూ ఈ దేశంలో ప్రారంభమయాయి. నిన్నటి “మాయాబజార్” అందుకు మంచి శకునం. ముందు తరాలకి తెర అంతా పరుచుకున్న ఇలాంటి మహానటుల విశ్వరూపం- ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ, గర్వాన్నీ, ఈ కళని అపురూపమయిన వారసత్వ వైభవాన్నీ సంతరించక మానదు.

ఆ మహానటుడికి నా కళాభివందనాలు!

మరిన్ని శీర్షికలు
Mahabalipuram