Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
gummadi venkateshwara rao

ఈ సంచికలో >> శీర్షికలు >>

మహాబలిపురం (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

Mahabalipuram

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఒకప్పుడు మామల్లపురంగా మహాబలిపురం ని పిలిచేవారు.  7నుండి 10 వ శతాబ్దాల కాలంలో పల్లవ రాజుల కాలం లో పేరెన్నిక కలిగిన ఓడ రేవు ఇది.  పల్లవ రాజుల యొక్క రెండవ రాజధానిగా ఈ నగరం వ్యవహరించింది. భగవాన్ విష్ణు మూర్తి తో జరిగిన యుద్ధం లో మరణించిన మహాబలి అనబడే కిరాతకుడైన రాక్షసుడి పేరు ఈ నగరానికి వచ్చింది.

పల్లవ రాజుల కళాభిరుచి
పల్లవుల పాలనలో వినుత్నమైన నిర్మాణ కళలు అభివృద్ధి చెందాయి. తమ కళాభిరుచిని చక్కగా ప్రదర్శించిన ప్రాంతం గా ఈ మహాబలిపురాన్ని చెప్పుకోవచ్చు. అందువల్లే, ఈ ప్రాంతం లో సృజనాత్మకమైన నిర్మాణాద్భుతాలను గమనించవచ్చు. దాని వలన, ఈ ప్రాంతం అనేకమైన ఆలయాలకి అలాగే రాతి గుహలకి స్థావరం అయినది. నిజానికి, ఈ ప్రాంతాన్ని బహిరంగ మ్యూజియం గా పరిగణించవచ్చు. కేవలం ఒకే ఒక పెద్ద రాతి నుండి నిర్మించబడిన ఆలయాలను కూడా ఇక్కడ గమనించవచ్చు.

విశిష్టత
కేవలం ఈ మహాబలిపురం యొక్క నిర్మాణ ఆకర్షణలకి మాత్రమే కాకుండా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని పర్యాటక మజిలీ గా ఎంచుకోవడానికి మరెన్నో ఆకర్షణలు ఉన్నాయి. అందమైన తెల్లటి ఇసుక కలిగిన బీచులు ఇక్కడ అధికంగా కలిగి ఉండటం,  ఇక్కడ సమృద్దిగా కనిపించే కాసువారినా చెట్లు వీటితో పాటు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతి ని కలిగించడం మహాబలిపురం విశిష్టత. స్థానిక షాపులలో చేతితో తయారుచేయబడిన అధ్బుతమైన వస్తువులు లభిస్తాయి. UNESCO వారిచే సంరక్షించబడుతున్న ప్రాంతం గా ఇది ప్రకటించబడింది.

ఎలా చేరాలి
పురాతన కాలం యొక్క వాసనలు కలిగిన అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఈ మహాబలిపురం  పల్లవ రాజుల కళాభిరుచికి సజీవ ఉదాహరణ. పల్లవ రాజుల కాలం లో ఈ ప్రాంతం ఒకప్పుడు అందమైన ఓడరేవుగా వర్ధిల్లుతుండేది. ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గం ద్వారా సులభం గా చేరుకోవచ్చు.

మహాబలిపురం నుండి 50 కిలోమీటర్ల దూరం లో చెన్నై ఉంది. చెన్నై లో కలిగిన చెన్నై విమానాశ్రయం ఇక్కడికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. మహాబలిపురం నుండి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న చెన్నై రైల్వే స్టేషన్ ఇక్కడికి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్.  చెన్నై, చెంగల్పట్టు, పాండిచేరి మరియు కాంచీపురం  లకు రోడ్డు మార్గాల ద్వారా మహాబలిపురం చక్కగా అనుసంధానమయి ఉంది.

ఇక్కడ సందర్శించవలసిన ప్రాంతాలు

అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం
7 వ శతాబ్దం మధ్యలో కి చెందిన ఈ ప్రాంతం 30 మీటర్ల పొడవు ఇంకా 15 మీటర్ల వెడల్పు కలిగిన కట్టడం. ఈ ప్రాంతానికి సంబంధించి మహాభారతంలో ఒక కథ ఉంది. పాండవులలో ఒకడైన అర్జునుడు శివుని ఆయుధంని పొందడం కోసం ఇక్కడే ఘోర తపస్సు చేసాడని అంటారు. మరొక గాధ ప్రకారం భగీరథుడు గంగను దివి నుండి భువి కి రప్పించుట కొరకు ఇక్కడే ఘోర తపస్సు చేసాడని అంటారు. ఈ రెండు సంఘటనల యొక్క చిత్రాలను ఈ కట్టడం పై గమనించవచ్చు.  ఈ కట్టడం పై పంచతంత్ర కథలకు సంబంధించిన చిత్రాలను కూడా గమనించవచ్చు.

పంచ పాండవుల రథాలు
మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సముదాయం ఇది. ఈ పంచ పాండవుల రధాలు ఏకశిల భారతీయ రాతి నిర్మాణ శైలి లో నిర్మించబడ్డాయి.  ఈ సముదాయంలో ఉన్న ప్రతి కట్టడం రధాన్ని పోలి ఉంటుంది. ప్రతి కట్టడం ఒకే నల్ల రాయి తోచెక్కబడి ఉత్తర దక్షిణ దిశగా వాలుగా ఉంటాయి. వీటికి పంచ పాండవుల మరియు ద్రౌపతి పేర్లను పెట్టారు. ధర్మరాజు రథం, భీమ రధం, అర్జున రధం, నకుల సహదేవ రధం మరియు ద్రౌపతి రధం గా వీటిని పిలుస్తారు.

బాలన్సింగ్ రాక్
ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి బాలన్సింగ్ రాక్. కృష్ణుని వెన్న బంతి (బటర్ బాల్) గా కూడా ఇది ప్రసిద్ది. భారీ బంతి ఆకారం లో ఉన్న రాయి 45 డిగ్రీలకి వాలి ఉన్నా సెల్ఫ్ బాలన్సింగ్ కలిగి ఉండటం చేత అత్యధిక మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది. వ్యాసం లో అయిదు మీటర్లు ఉంటుంది. ఈ రాతి దగ్గర ఫోటో దిగడానికి స్థానికులతో పాటు పర్యాటకులు అమితంగా ఆసక్తి కనబరుస్తారు. ఈ రాతి ని బాలన్స్ చేస్తున్నట్టు ఫోటో లు దిగుతారు కూడా. ధైర్యవంతులు ఈ రాతి కింద నీడలో కూర్చుంటారు. ఈ రాతిని పల్లవ రాజులు ఏనుగులతో తరలించడానికి ప్రయత్నించి విఫలమయ్యారని అంటారు.

కృష్ణ మండపం
చారిత్రక విశేషాల్ని అభిమానించే వారిని అలాగే కళాభిరుచి కలిగిన వారినీ అలరించే ప్రదేశం కృష్ణ మండపం. ఇది మహాబలిపురం లోని పురాతన కట్టడాలలో ఒకటి. ఈ మండపం లోపల కృష్ణ లీలలు ఎన్నో చిత్రీకరించబడ్డాయి.  గోకులం లో ని ప్రజలను రక్షించేందుకు గోవర్ధన గిరిని చిటికెన వేలితో ఎత్తిన శ్రీక్రిష్ణుని చిత్రం అలరిస్తుంది.

సీ షోర్ టెంపుల్
మహాబలిపురం లో ని సముద్ర తీరాన సెవెన్ పగోడాస్ గా పిలువబడే ఏడు అద్భుతమైన ఆలయాలు ఉండేవని అంటారు. కాని ఇప్పటికీ నిలిచి ఉన్నది ఈ సీ షోర్ ఆలయం మాత్రమేనని గాధ. రాజసింహుని కాలం లో నిర్మించబడిన సీ షోర్ ఆలయం సముద్ర తీరానికి అతి చేరువలో ఉంది. దక్షిణ భారత దేశం లో ద్రవిడియన్ శైలిలో నిర్మించబడిన  ఆలయాలలో ఇది పురాతనమైనది. UNESCO వారి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఈ ప్రాంతం చోటు చేసుకోవడం వల్ల అనేకమంది పర్యాటకుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఈ ఆలయం లో అధ్బుతమైన చెక్కడాలను గమనించవచ్చు. ప్రధానమైన ఆలయం తో పాటు రెండు చిన్న ఆలయాలతో ఇది మూడు ఆలయాల సమూహం. పల్లవులచే నిర్మించబడిన మొదటి రాతి కట్టడం గా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు.

శిల్పకళా మ్యూజియం (Sculpture Museum)
మహాబలిపురం లో ఉన్న ఈ శిల్పకళా మ్యూజియం లో రాయి, చెక్క శిల్పాలు అలాగే పురాతన చిత్రాలు ప్రధాన ఆకర్షణలు. అలాగే, హిందూ పురాణాలకి చెందిన దేవుళ్ళు మరియు దేవతల శిల్పాల విస్తారమైన సేకరణకి ఈ మ్యూజియం ప్రసిద్ది.


మామేల్లపురం లైట్ హౌస్
ఈ లైట్ హౌస్ దాదాపు వెయ్యేళ్ళ క్రితానికి చెందినదిగా భావిస్తారు. ఒకప్పుడు రాత్రి పూట మహాబలిపురం వైపు ప్రయాణించే ఓడలకు దారి చూపేందుకు ఈ లైట్ హౌస్ లో నిప్పునిఏర్పాటు చేసేవారట. కాలక్రమం లో లైట్లని ఏర్పాటు చేసే అలవాటు ఏర్పడింది.  ఈ లైట్ హౌస్ లో నుండి మహాబలిపురం యొక్క విశాలదృశ్య వీక్షణం పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది.


వీటితో పాటు వరాహ కేవ్ టెంపుల్, గణేశ రధం,మహిషాసుర మర్ధిని కేవ్, త్రిమూర్తి కేవ్, వైడ్ బీచ్, టైగర్స్ కేవ్, ధర్మరాజ కేవ్  వంటి ఆకర్షణలు ఎన్నో పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటాయి.

మరిన్ని శీర్షికలు
weekly horoscope(July 12 - July 18)