Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చంద్రబోసూ - పులిదోష నివారణ

Interview with Chandra Bose

కొంతమందికి కుజ దోషం వుంటుంది. ఇంకొంతమందికి నాగ దోషం వుంటుంది. మరికొంత మందికి కాలసర్ప దోషం వుంటుంది.  అలా చంద్రబోస్ కి పులి దోషం వున్నట్టుంది. లేకపోతే 'కొమరం పులి' సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ గా అన్ని పాటలూ రాయడమే కాకుండా, శ్వేతామోహన్ కి 'సూటిగ సూటిగ నాటుకుపోయిన' వంటి స్పీడ్ సాంగ్ ని నానా తిప్పలు పడి నేర్పించి, రికార్డింగ్ బాధ్యతలు కూడా తలకెత్తుకుంటే - పాటల సీడీ కవర్ లిరిక్ రైటర్ గా ఆయన పేరు వెయ్యకపోవడం ఏమిటి... పులి దోషం కాకపోతే !?

దోష నివారణ కోసం రాహు కేతు పూజలు చేయించడమో, సుబ్రహ్మణ్య స్వామి గుడి కో, శ్రీశైలం శ్రీకాళహస్తి రామేశ్వరం  కో వెళ్ళినట్టుగా చంద్రబోస్ కూడా థాయ్ ల్యాండ్ లో ఉన్న ' టైగర్ టెంపుల్' కి వెళ్ళి అక్కడ పులులతో గడిపి వచ్చినట్టనిపిస్తోంది కదూ ఈ ఫొటోలు చూస్తుంటే ...




అలాగే 'మగధీర' సినిమాలో 'ధీర ధీర ' పాటలో - హీరో పులుల్తో గ్రాఫిక్స్ లో పరుగెత్తినట్టు పులితో విహారం చేస్తూ మరో ఫొటో ... తేడా ఏమిటంటే - అక్కడ హీరోయిన్ 'మనసాగ లేదురా' అని పాడుతుంది. ఇక్కడ 'భయమాగ లేదురా' అని సుచిత్ర గారు పాడుకొని వుంటారు. (అన్నట్టు మగధీర లో ఆ పాట రాసింది కూడా చంద్రబోసేనండోయ్).  తర్వాత ఫోన్ చేసి సుచిత్ర గారిని అడిగాను 'నిజంగానే చాలా భయపడ్డాను ఆ ఫొటోలు చూసి' అని జవాబిచ్చారామె.

హంస పాలూ నీళ్ళని వేరు చెయ్యగలదన్నట్టుగా  - ఇక్కడ పాఠకులు - కొంత వేరు చేసి  అర్ధం చేసుకోవలసి వుంటుంది. కొమరం పులి సీడీ కవర్ మీద బోస్ పేరు వెయ్యకపోవడం, ఆయన థాయ్ ల్యాండ్ లో 'టైగర్ టెంపుల్' కి వెళ్ళడం ఇవన్నీ కరక్టే ... కానీ 'పులిదోషం - నివారణ' లాంటి 'పులి మీద పుట్ర'  లన్నీ నేను కల్పించిన 'కుట్ర'లే ... అసలు నిజం ఏమిటంటే ....

నటుడు ప్రకాశ్ రాజ్ నిర్మిస్తున్న సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆయనిచ్చిన ట్యూన్ లకు పాటలు రాయడానికి చంద్రబోస్ ని థాయ్ ల్యాండ్ తీసుకు వెళ్ళారు.

చాలామంది వచ్చిన పని అయిపోయాక షాపింగ్ చేసుకుని వెనక్కి వచ్చేస్తారు. ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాలు, విశేషాలు కొంతవరకూ తెలుసుకుంటారే తప్ప లోతుగా అధ్యయనం చెయ్యాలనుకోరు. కానీ చంద్రబోస్ లో విషయానురక్తి, పరిశోధనాసక్తి చాలా ఎక్కువ. ఆ మక్కువతోనే ఆయన తెలుసుకున్న  విషయాల్ని  ఆయన మాటల్లోనే   రాబట్టే చిన్ని ప్రయత్నం ఇది ....

"థాయ్ ల్యాండ్ ఈజ్ ఇంటర్నేషనల్ బుక్ క్యాపిటల్ " - ఇదీ  చంద్రబోస్ థాయ్ ల్యాండ్ నుంచి రాగానే అన్న మొదటి మాట.

"అంటే ?"
"అంతర్జాతీయ పుస్తక రాజధాని అన్నమాట"

"థాయ్ ల్యాండ్ అనగానే మసాజ్ లు, చిలిపి సరదాలు లాంటి టాకే వినిపిస్తూ వుంటుంది. పాస్ పోర్ట్ లో థాయ్ ల్యాండ్ స్టాంప్ కనబడితే 'అహా ... గ్రంథసాంగుడివే !?' లాంటి కామెంట్లు కూడా వుంటుంటాయి. అటువంటిది మీరిలా అనడం కొత్తగా వుంది. అసలా పేరు ఎలా వచ్చింది ?"
"అక్కడి ప్రజలు పుస్తకాలు, వార్తా పత్రికలు చాలా ఎక్కువగా చదువుతారు. అందుకని అంతర్జాతీయ స్థాయిలో థాయ్ ల్యాండ్ ని గురించి అలా అంటారు. దురదృష్టవశాత్తూ అటువంటి మంచి విషయాలు మనకు చేరడం తక్కువ"

"థాయ్ ల్యాండ్ గురించి మీరు తెలుసుకున్న మరో మంచి విషయం ?"
"రెండేళ్ళ క్రితం థాయ్ ల్యాండ్ లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్స్ కాంపిటీషన్ ... అదే అంతర్జాతీయ లిపుల సదస్సు ... అది జరిగింది. అందులో తెలుగు లిపికి రెండవ స్థానం లభించింది"

"మొదటి స్థానం ?"
"కొరియా లిపికి"

"ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది ? "
"ఉచ్చారణ, విధేయత - ఈ ప్రాతిపదిక మీద జరిగింది ?"

"అంటే !?"
"మనం ఎలా మాట్లాడతామో అలా రాసే సౌకర్యం అన్నమాట "

"మరి థాయ్ లిపి గురించి తెలుసుకున్నారా ?"
"బ్రాహ్మీ లిపి ని అనుసరించి థాయ్ లిపి తయారయింది. ఇది స్వర ప్రధానమైన భాష. ఏకాక్షర పద రూపం. అంటే ... ఒకే పదానికి అర్ధాలు స్వరాన్ని బట్టి మారడం అన్నమాట. సంస్కృత, పాళీ పదాలు వుంటాయి. అందుకే వాళ్ళ ఎయిర్ పోర్ట్ పేరు - సువర్ణ భూమి. ఎయిర్ పోర్ట్ లో దిగగానే మన క్షీర సాగర మథనం పేద్ద బొమ్మల రూపంలో కనిపించగానే సంస్కృతి పట్ల వారి కున్న గౌరవానికి ముచ్చటేస్తుంది. అంతే కాదు అక్కడ నమస్కారం మామూలు గా చెయ్యరు. చేతులు జోడించి తలవంచి మరీ నమస్కరిస్తారు "

"ఇంకా?"
"శుంథోర్ణ్ ఫూ (Shunthorn phu) ని అక్కడ ప్రజాకవి గా అభివర్ణిస్తారు. థాయ్ సాహిత్యానికి ఆయన పితామహుడు"

"మరి పులుల్తో ఈ  ఫొటోలేమిటి ?"
"థాయ్ ల్యాండ్ లో వున్న కాంచనపురి లో ఈ టైగర్ టెంపుల్ వుంది. ఇక్కడ పులుల్ని మనుషులే పెంచుతారు. వాళ్ళ పెంపకంలో, వాళ్ళ సాహచర్యంతో అవి తమ  లోని జంతు ప్రవృత్తిని, క్రూరత్వాన్ని కూడా మరిచిపోయి సాధు స్వభావం తో వుంటాయి. అందుకు నేను తీయించుకున్న ఫోటోలే కాకుండా నేను తీసిన ఈ వీడియో కూడా ఒక సాక్ష్యం."

"మరి అవి శాఖాహారం తింటాయా ... మాంసాహారమా !?"
"మాంసాహారం కూడా తింటాయి. కానీ సాధు స్వభావులైన వారి సాహచర్యం, పెంపకం - వాటికి తమ  ప్రవృత్తిని కూడా మరిచిపోయేట్టు చేయగలిగిందంటే - ఈ ఒక్క ఉదాహరణ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చనిపించింది. అందుకే రాగానే ఈ ఫొటోల్ని ఫేస్ బుక్ లో పెట్టి లీక్ చెయ్యకుండా - వీటిని మీకిచ్చి నా మనసులో మాటని మీతో పంచుకుంటే - అది ఎంతో మందికి చేరుతుందనే సదుద్దేశ్యం తోనే మీకిస్తున్నాను" అంటూ సంభాషణని ముగించారు బోస్.






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Mahesh