ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, అందాల భామ శ్రీదేవితో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. బోనీ కపూర్ ని పెళ్ళి చేసుకున్నాక సినిమాలు చాన్నాళ్ళు మానేసిన శ్రీదేవి, ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాలో నటించింది. ఆ తరువాత కూడా ఆమె కెరీర్ విషయంలో తొందరపడలేదు.
చాలా కథలు శ్రీదేవి దృష్టికి వెళ్ళినా, ఆమె వాటిని పెద్దగా ఇష్టపడలేదు. కోన వెంకట్ ఏం చెప్పి, శ్రీదేవిని ఒప్పించాడోగానీ, ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే, మేటర్ చాలానే వుందని అనుకోవాల్సి వస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది.
‘ఇంగ్లీష్ వింగ్లీష్’ రేంజ్ దాటే సినిమా అంటున్నారు కొందరు. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటుగా, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లోనూ, ఇంగ్లీషులోకీ డబ్ చేయాలని కోన వెంకట్ అనుకుంటున్నాడట. అలా జరిగితే, కోన వెంకట్ శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చే సినిమా అంతర్జాతీయ సినిమా అవుతుందనడం నిస్సందేహం.
|