భ్రమ - బెహరా కోటేశ్వరరావు

bhrama

మొదటి భాగం వర్షా కాలం లో వస్తుంది శ్రావణ మాసం. ఇది శివ భక్తులకు పావనమైన సమయం. ఈనెలలోని అన్ని సోమవారాలు శివునికి ప్రీతిపాత్రమైనవే! భక్తులు విశేష పూజలు, అభిషేకాలు చేస్తారు. హరహరుడు ఈ సమయం లోనే హాలాహలాన్ని మింగి నీలకంఠుడైనట్టు ప్రతీతి! శివునికి ప్రీతిపాత్రమైన -- పాలు, నీరు, పంచామృతం, పాలకోవా, రేగిపళ్ళు మొదలైనవి భక్తులు నైవేద్యం గా పెడతారు. సిసలైన శివభక్తుడు చంద్రం. శివార్చన లో తనకు తానే సాటి! పూజా గదిని సదా స్వచ్చంగా, నిశ్శబ్దం గా ఉంచుతాడు. ఆరోజు శ్రావణ మాసం లోని తొలి సోమవారం. పూజ కోసం నైవేద్యం ఏర్పాటు చేసి, తన పూజా దిండు మీద పద్మాసనం వేసుకొని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. అలా చదువుతుంటే -- అది హాయినిచ్చే జోలపాటలా మారి, మనసు దైవం లో విలీనం అయినట్లుగా భ్రమ కలుగుతుంది! అంతలోనే ప్రశాంతతని పటాపంచలు చేస్తూ ఒక ఈగ ' గుయ్ ... గుయ్ ' మంటూ చంద్రం మీద మెరుపు దాడి చేసింది. అది గది లోకి ఎలా దూరిందో, ఎక్కడనుండి వచ్చిందో తనకు అంతు చిక్కలేదు. ఏకాగ్రతను ఎగతాళి చేస్తూ ముందు ముక్కు లోపలి కి దూరింది. మెల్లగా అదిరితే అతగాడి చెవి లో దూరింది. తరువాత పెదాల్ని చప్పరిస్తూ వీపు మీదికి చేరింది. ఈగ తాండవం తో ఆరాధన కి చుక్కెదురు కాగా - తనలో విసుగు, నిరాశ చోటు చేసుకుంది. " ఈశ్వరుని పట్టుకోవచ్చేమో గాని ఈగని పట్టుకోవడం అసాధ్యం" అనిపించింది. గత్యంతరం లేక చివరికి ఈగ రొద నుండి కాపాడమని శివుని మనసు లో ధ్యానించాడు. ఆశ్చర్యం! తక్షణం ఆ గది వెన్నెల లాంటి కాంతి తో తేజోమయమైంది. ఆ కాంతి నుంచి ఒక వింత ధ్వని మారు మోగింది... " చంద్రం! నీలోని నిజాయితీ, ఓర్పు, సహనం పరీక్షించాలని ఈగనై వచ్చాను, నువ్వు మాత్రం భ్రమ, అసహనం ముసుగులో నన్ను గుర్తించలేకపోయావు. నేను పెట్టిన పరీక్షలో ఓడిపోయావు! "అంటూ గది నుండి -'కాంతి', దానితో బాటు 'ఈగ', ఒకే సారి మాయమైపోయాయి! చంద్రం మనసు చివుక్కుమనిమూగబోయింది.'ఈగ' లో వచ్చిన ఈశ్వరుని గుర్తించలేని తన కళ్లు చెమర్చాయి. మున్ముందు దైవ లీలను అవహేళన చేయకూడదని ఒట్టు పెట్టుకున్నాడు.ఇకముందు- అల్ప జీవులతో బాటు అన్ని జీవుల లోను దైవత్వం చూడాలని సంకల్పించుకున్నాడు. "రెండో భాగం" అది రెండో సోమవారం! తొలి సోమవారం నాటి శివానుభవం ఇప్పటికీ కళ్ళు ముందు తిరుగుతోంది! పెరిగిన భక్తి భావాన్ని, ఏకాగ్రత శక్తి ని మనసులో దాచుకుని - శివారాధన ప్రారంభించాడు. నైవేద్యం శివ ప్రతిమ ముందు ఉంచి, మెరుగైన చిత్తశుద్ధితో 'పంచాక్షరీ' మంత్ర పఠనం నిరాటంకంగా ముగించాడు.శివుని మనసు లో ధ్యానిస్తూ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నాడు -- " ఓం త్రయంబకం యజామహే... " మంత్ర ఉచ్ఛారణ మధ్యలో --- తన ముందు ఏదో పాకుతున్న సవ్వడి అనుభూతి కలిగింది. గత మారు ఈగ రూపం లో వచ్చిన దిగంబరుని ఉపదేశం గుర్తు రాగానే --- దృఢమైన ఏకాగ్రతతో ఆగిన స్తుతిని కొనసాగించాడు- " .....సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివబంధనాన్... " ఇప్పుడు చంద్రానికి తన ముందు ఏదో నాకుతూ ఉన్న శబ్దం వినిపించింది. తనలో జిజ్ఞాస పెరిగింది! ఏకాగ్రత సన్నగిల్లింది! కుతూహలం మూసిన కళ్ళని తెరిపించింది! తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎదుటి దృశ్యం అంతులేని ఆశ్చర్యం కలిగించింది - మృత్యుంజయుడే స్వయానా నాగేంద్రుని రూపం లో వచ్చి కలశం లోని నీటిని చప్పరిస్తున్నాడు!"పరమాత్ముని పరీక్ష అద్భుతం!ఈగ గా వచ్చి ఓడించావు, 'నాగు'గా వచ్చి ఓడిపోతావు లే !" ముసి ముసి గా నవ్వుతూ మృత్యుంజయుని తలచుకుని మంత్రాన్ని పూర్తి చేసాడు " ....మృత్యోముక్షీయ మామృతాత్ ". నిరాటంకంగా పూజ ముగించుకుని చివరిగా శంఖాన్ని గట్టిగా ఊదాడు. శంఖనాదం గది లో మారు మోగింది! అదే ధ్వని లో -- " బుస్సు " మన్న శబ్ధం, " అబ్బో " అన్న ఆర్తనాదం కలిసి పోయాయి!! ***** చంద్రం కళ్ళు తెరిచి చూస్తే -- ఎదురుగా, తళ తళ మెరుస్తున్న మంచు రత్నం!! శివ నివాసం కైలాసం! శరీరం తో పాటు ఆత్మ కూడా ప్రవేశించగల ఏకైక ప్రదేశం. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై స్ఫటికాసనం మీద ఆసీనుడవ్వగా, పాదాల వద్ద నందీశ్వరుడు కూర్చున్నాడు.సదా ద్యానం ముద్రలో వుండే శంకరుడు చంద్రాన్ని ప్రశ్నార్థకంగా చుసాడు. అయోమయం లో వున్న చంద్రం --- " దేవా! నా ఏకాగ్రతను మరో సారి పరీక్షించాలని నాగేంద్రుని రూపం లో వచ్చావు కదా! గెలుపు నాదే కదా!! " దృఢ విశ్వాసం తో అన్నాడు. " అది నీ భ్రమ! మామూలు అడవి త్రాచుని చూసి మృత్యుంజయుడని అపోహ పడ్డావు! వర్షాకాలంలో పాములు ఆహారం కోసం జనం నివాసాల వైపు వస్తాయి. నీ గది లోకి దూరింది కూడా సాధారణ నాగుపాము. పాముల జీవక్రియ కి నీరు కావాలి. ఆ నీటి కోసం నీదగ్గర కు చేరింది. ఇంకో నిజం చెప్పాలంటే -- పాములు వాడి 'పుంగీ' శబ్దం, శంఖనాదం లోని 'కంపన' ధ్వనులను సర్పాలు ఏవగించుకుంటాయి. పగ తీర్చుకోవడానికి కాటు వేస్తాయి. నీ విషయంలో - సమయానికి వైద్య సదుపాయం అందక తిన్నగా నన్ను చేరుకున్నావు" విషకంఠుడు వివరించాడు. " నా కైలాసయాత్ర పరమార్థం ఏమిటి స్వామీ " అయోమయం గా అడిగాడు చంద్రం. నంది ని పరిచయం చేస్తూ -- " ఇతడు నా ప్రమద గణాలకు అధిపతి. ఇతడు అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. అయోమయాన్ని దూరం చేస్తాడు. ఏకాగ్రతను బలపరిచే శక్తివంతుడు. అతడు పెట్టే పరీక్షలో నీవు గెలిస్తే -- నా ప్రమద గణాల్లో చోటు దక్కుతుంది. " పరమార్ధాన్ని వివరించాడు పరమేశ్వరుడు. ముందు నందీశ్వరుడు తన వెంట చంద్రం -- ఇద్దరూ మానససరోవరం వైపు పయనించారు. * సమాప్తం *

మరిన్ని కథలు

Kalisi vunte kaladu sukham
కలిసి ఉంటే కలదు సుఖం
- డా:సి.హెచ్.ప్రతాప్
Paatradhaari
పాత్రధారి
- బొల్లిముంత వెంకట రమణా రావు .
Surigaadu
సూరిగాడు
- అనిసా తబస్సుమ్ sk
Chintoo lo bhayam poyindi
చింటూలో భయం పోయింది
- నారంశెట్టి ఉమామాహేశ్వరరావు
Subhashini-Charavaani
సుభాషిణి - చరవాణి
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Maa manchi donga
మా మంచి దొంగ
- అనిసా తబస్సుమ్
Mali vayasu chivari majili
మలి వయసు చివరి మజిలీ..
- వరలక్ష్మి నున్న