ఏకశిలానగరం (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

ekashilanagaram-oorugallu-tourism

ఆంధ్రప్రదేశ్ లో ని వరంగల్ జిల్లాలో ఉన్న వరంగల్ నగరం రాష్ట్రరాజధాని హైదరాబాద్ నుండి 148 కిలోమీటర్ల దూరం లో ఉంది. 12 వ శతాబ్దం నుండి 14 వ శతాబ్దం వరకు కాకతీయుల రాజ్యానికి రాజధానిగా వరంగల్ నగరం వ్యవహరించింది. ఈ నగరం యొక్క పురాతన పేరు 'ఓరుగల్లు'. 'ఒరు' అనగా ఒకటి, 'కళ్ళు' అనగా రాయి అని అర్ధం. ఒకే ఒక రాయితో ఈ నగరం మొత్తం మలచబడింది. అందువల్ల 'ఓరుగల్లు' అనే పేరు ఈ నగరానికి వచ్చింది. 'ఏక శిలానగరం' గా కూడా వరంగల్ ప్రసిద్ది. ఆకట్టుకునే కోట, నాలుగు భారీ రాతి ముఖ ద్వారాలు, శివుడికి అంకితమివ్వబడిన స్వయంభు ఆలయం, మరియు రామప్ప సరస్సు వద్ద ఉన్న రామప్ప ఆలయాలు కాకతీయుల కాలం నాటి కొన్ని స్మృతి చిహ్నాలు.

రాష్ట్రం లోనే నాలుగవ అతి పెద్ద నగరంగా పేరొందింది వరంగల్ నగరం. కాకతీయ రాజ్యం యొక్క ప్రోల రాజు ఈ అందమైన నగరాన్ని 12వ శతాబ్దం లో నిర్మించి రాజధాని హోదాని కల్పించారని భావిస్తారు. దాదాపు 200 ఏళ్ళకు పైబడి ఈ నగరాన్ని ఏలిన కాకతీయులు ఎన్నో ఘనమైన స్మారక కట్టడాలను నిర్మించారు. గొప్ప యాత్రికుడు మార్కో పోలో కూడా ఈ నగరం గురించి ప్రస్తావించారు.

వరి, ఎర్ర మిరపకాయలు, దూది, మరియు పొగాకుల పంటలను వరంగల్ లో గమనించవచ్చు. వివిధ రాష్ట్రాలకు గ్రానైట్ క్వారీలను ఎగుమతి చెయ్యడం లో వరంగల్ ప్రసిద్ది.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ నగరం, అధ్బుతమైన స్మారక కట్టడాలతో, అందమైన ఆలయాలతో, సుందరమైన తోటలతో, మైమరిపించే సరస్సులతో మరియు అభయారణ్యాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. వరంగల్ కోట, శివాలయం, భద్రకాళి ఆలయం మరియు వేయి స్థంభాల గుడి పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రదేశాలు.

వాతావరణం
ఇక్కడ వాతావరణం సాధారణం గా వేడిగా తేమతో ఉంటుంది. మార్చ్ నుండి మే వరకు ఎండాకాలం లో ఉష్ణోగ్రతలు  20 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటాయి. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం లో ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలం లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతాయి. నైరుతి ఋతుపవనాల రాకతో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం నమోదవుతుంది.

సంవత్సరం లో రెండు సార్లు జరిగే సమ్మక్క- సారక్క జాతరకు వరంగల్ ప్రసిద్ది. సుమారు 5 మిలియన్ల ప్రజలు పాల్గొనే అతి పెద్ద జాతర ఇది.అక్టోబర్ నుండి మార్చ్ వరకు వరంగల్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

రామప్ప గుడి
పాలంపేట లో ఉన్న రామప్ప ఆలయం వరంగల్ నగరం నుండి 77 కిలోమీటర్ల దూరం లో ఉంది. చాళుక్య మరియు హోయసల నిర్మాణ శైలి ని ఈ ఆలయం ప్రతిబింబిస్తుంది. దక్షిణ భారత దేశం లోని దేవాలయాల నిర్మాణాలకి గొప్ప ఉదాహరణ ఇది. 12 వ శతాబ్దంలో కాకతీయుల పరిపాలనా కాలంలో నిర్మించబడిన పురాతన ఆలయం ఈ రామప్పగుడి. మహాశివుడికి అంకితమివ్వబడిన ఈ ఆలయం దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడినది. ఈ ఆలయంలో ఆరు అడుగుల ఎత్తున్న శివలింగం నక్షత్ర ఆకారంలో ఉన్న వేదికపై ప్రతిష్టింపబడినది. తొమ్మిది అడుగుల ఎత్తున్న నందీశ్వరుని విగ్రహాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో గమనించవచ్చు.

మహాభారత రామాయణ ఇతిహాసాలలోని కథలను వర్ణించే చెక్కడాలను ఈ ఆలయ గోడలపై గమనించవచ్చు.  ఈ ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించే శివరాత్రి పండుగలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో భక్తులు అలాగే పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తారు.

వేయి స్థంభాల గుడి
హనుమకొండ- వరంగల్ రహదారిలో హనుమకొండ యొక్క వాలు ప్రాంతాల్లో ఈ ఆలయం నెలకొని ఉంది. క్రీ.శ. 1163 లో రుద్రా దేవి చేత ఈ చాళుక్య ఆలయాల నిర్మాణ శైలిలో ఈ ఆలయం నిర్మించబడినది. శివుడు, విష్ణువు మరియు సూర్యుడికి అంకితమివ్వబడిన మూడు ఆలయాలను ఇందులో చూడవచ్చు. వైభవంగా చెక్కబడిన స్థంభాలకి, తెరలకి మరియు వివరణాత్మక శిల్పాలకి ఈ ఆలయం ప్రసిద్ది.

నక్షత్రపు ఆకారంలో నిర్మితమయిన ఈ ఆలయం అధ్బుతంగా చెక్కబడిన వేయి స్థంభాలకు ప్రసిద్ది. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న మండపంలో ఆరు అడుగుల ఎత్తున్న నందీశ్వరుని విగ్రహం కనువిందు కలిగిస్తుంది. ఇంకా, అందంగా చెక్కబడిన ద్వారబంధాలు, స్తంభాలు మరియు పైకప్పులు భక్తులు మరియు పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటాయి.

వరంగల్ కోట
13 వ శతాబ్దానికి చెందిన వరంగల్ కోట హనుమకొండ నుండి 12 కిలోమీటర్ల దూరం లో ఉంది. కాకతీయ రాజైన గణపతి దేవ మరియు అతని కుమార్తె రుద్రమ్మ ఆధ్వర్యం లో ఈ కోట నిర్మించబడింది. ఈ కోట లో ఉన్న ఆలయం 'స్వయంభూదేవి' కి అంకితమివ్వబడింది. నాలుగు పెద్ద ముఖ ద్వారాలు, నిశితంగా చెక్కబడిన వంపులు మరియు స్థంభాలకు ఈ కోట ప్రసిద్ది. ఈ భారీ కోట దాడులకు లొంగబడేది  కాదు. 13 వ శతాబ్దం నుండి 14 వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు ఈ కోటపై నిరంతరంగా దాడి చేసారు.

భద్ర కాళీ ఆలయం
హన్మకొండ మరియు వరంగల్ మధ్యలో ఉన్న కొండపై నెలకొని ఉన్న ఆలయం భద్రకాళీ ఆలయం. రాతి విగ్రహ రూపం లో ఉన్న భద్ర కాళీ అమ్మవారికి ఈ ఆలయం అంకితమివ్వబడింది. ఈ ఆలయం లో కాళీ మాత తన ఎనిమిది చేతులలో ఎనిమిది ఆయుధాలతో దర్శనమిస్తారు.

సిద్దేశ్వర ఆలయం
మహాశివుడికి అంకితమివ్వబడిన పురాతనమైన సిద్దేశ్వర ఆలయం వరంగల్ లోని హనుమకొండ కి సమీపం లో ఉంది. చాళుక్యుల నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయం నిశితంగా చెక్కబడిన స్థంబాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. నిర్మలమైన ఈ ఆలయ ప్రదేశంలో భక్తులకి ప్రశాంతత లభిస్తుంది.

శ్రీ వీరనారాయణ ఆలయం
క్రీ.శ. 1104 కి చెందిన పురాతన ఆలయం ఇది. వరంగల్ జిల్లాలోని కొలనుపాక లో ఈ ఆలయం ఉంది. మహా విష్ణువు శ్రీ వీరనారాయణ అవతారం లో కొలువున్న ఆలయం ఇది. చాళుక్యుల నిర్మాణ శైలి లో నిర్మితమైన ఈ ఆలయం లో అధ్బుతంగా చెక్కబడిన గోడలు అమితంగా ఆకర్షిస్తాయి. ఈ ఆలయం ఇదివరకు జైనుల మందిరమని ఆ తరువాత హిందువుల ఆలయం గా మారిందని కొన్ని వాదనలు ఉన్నాయి. వైష్ణవ భక్తులు తరచూ ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

కాకతీయ మ్యూజికల్ గార్డెన్
అద్భుతమైన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ వరంగల్ లో ని భద్రకాళి ఆలయం సమీపం లో ఉంది. ఈ గార్డెన్ 15 ఎకరాల మేరకు విస్తరించబడినది. ఈ గార్డెన్ యొక్క ప్రధాన ఆకర్షణ రంగురంగుల తో సంగీతానికి అనుగుణంగా కదిలే మ్యూజికల్ ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ కంప్యూటర్ తో ఆపరేట్ చెయ్యబడుతుంది. ఈ గార్డెన్ లో కృతిమంగా ఏర్పాటు చెయ్యబడిన లేక్ లో బోటింగ్ సౌకర్యం కలదు. ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటలకి అధ్బుతమైన మ్యూజికల్ ఫౌంటెన్ షో ని ఏర్పాటు చేస్తారు. ధగధగ మెరిసే కాంతులతో రకరకాల రంగులతో ఈ మ్యూజికల్ ఫౌంటెన్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది.

కాకతీయ రాక్ గార్డెన్
ఫోర్ట్ టెంపుల్ కి సమీపం లో ఉన్న ఈ కాకతీయ రాక్ గార్డెన్ స్థానికులని, అలాగే పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ గార్డెన్ లో నిజమైన జంతువులలా అనిపించే  జింక, సింహం, జిరాఫీ, సాంబార్(ఒక రకమైన జింక) వంటి జంతువుల యొక్క  శిలల నిర్మాణాలు అందరినీ ఆకర్షిస్తాయి.ఈ గార్డెన్ లో రాళ్ళను అందంగా అలంకరించి వాటి మధ్యలో పూల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. అవి ఎంతో అందంగా ఉంటాయి.  సాయంత్రాలు ఈ గార్డెన్ స్థానికులతో కిటకిట లాడుతూ ఉంటుంది.

ఖుష్ మహల్
వైభవోపేతమైన గతానికి నిశ్శబ్ద సాక్ష్యం శితభ్ ఖాన్ చేత వరంగల్ లో నిర్మితమైన ఈ ఖుష్ మహల్. చుట్టు పక్కల త్రవ్వకాలలో బయటపడిన విగ్రహాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు.

వరంగల్ చుట్టుపక్కల సందర్శించదగ్గ ప్రాంతాలు

ఎటుర్నాగారం సాంచురీ
ఆంధ్రప్రదేశ్ లో ని పురాతన అభయారణ్యాలలో ఒకటైన ఎటుర్నగరం సాంచురీ గోదావరి నది ఒడ్డు వరకు విస్తరించబడినది. పులి, చిరుత, ఎలుగుబంటి, నాలుగు కొమ్ముల జింక వంటి వివిధ రకాల  జంతుజాలంతో పాటు వివిధ రకాలైన పక్షులు ఈ సాంచురీలొ కనువిందు కలిగిస్తాయి.

కొలనుపాక
వరంగల్ నుండి 75 కిలోమీటర్ల దూరం లో ఉన్న కొలనుపాక 2000 సంవత్సరాల పూర్వానికి చెందిన జైను మహావీర్ మందిర్ కి ప్రసిద్ది. జైనువుల మరియు హిందువుల కి ప్రధానమైన పుణ్యక్షేత్రం ఇది. గొప్ప వీర శైవ సాధువైన రేణుకాచార్య జన్మస్థలం ఈ ప్రదేశం. కొలనుపాక 11 వ శతాబ్దం లో  కళ్యాణి చాళుక్యుల రాజధానిగా వ్యవహరించేది.

వరంగల్ కి చేరే మార్గం

వాయుమార్గం
సమీపం లో ఉన్న విమానాశ్రయం హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ నగరం బొంబాయి, బెంగుళూరు, భువనేశ్వర్, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, నాగపూర్ మరియు విశాఖపట్నం ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది.

రైలు మార్గం
భారతదేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు వరంగల్ నగరం రైలు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది.

రోడ్డు మార్గం
హైదరాబాద్, యాదగిరిగుట్ట, విజయవాడ, ఆర్మూర్, కొలనుపాక, జనగాం, కోదాడ్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, సూర్యాపేట, పాలంపేట, జగిత్యాల, ఖమ్మం, భద్రాచలం, బెంగళూరు, మైసూరు మరియు తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వరంగలు పట్టణం రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది.