లోక్ నాయక్ జయప్రకాశ్ నాాయణ్ - కొమ్మలూరు హరి మధుసూదన రావు

లోక్ నాయక్ జయప్రకాశ్ నాాయణ్

ప్రజాస్వామ్య పరి రక్షకుడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో తీవ్ర అనారోగ్యంతో నీరసించి ఉన్న 73 సంవత్సరాల స్వాతంత్ర్యోద్యమ నాయకుడు ప్రసంగించడానికి వచ్చారు. రాంధారి సింగ్ దినకర్ రచించిన ‘సింఘాసన్ కాలీ కరో కి జనతా ఆతీ హై’ అని ఆయన అనగానే లక్షలాది మంది ప్రజలు ‘లోక్ నాయక్ జిందాబాద్! జయప్రకాశ్ జిందాబాద్!’ అంటూ భూమి దద్దరిల్లేలా నినాదం చేశారు. ఈ నినాదం ఢిల్లీ సింహాసనాన్ని తాకింది. భారత సామ్రాజ్ఞిగా పేరొందిన ఇందిరాగాంధీ పీఠం కదిలేలా చేసింది. దేశంలో మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ఆ రాజకీయ దురంధరుని పుట్టిన రోజు అక్టోబర్ 11 సందర్భంగా ప్రజా నాయకుడిగా పేరొందిన ఆ జయప్రకాశ్ నారాయణ్ ని స్మరించుకుందాం. బాల్యం : బీహార్ రాష్ట్రంలో సౌరన్ జిల్లాలోని సితాబ్దియారా అనే గ్రామంలో అక్టోబర్ 11, 1902 లో బాబూ హరసూ దయాళ్, ఫూల్ రాణి దేవి దంపతులకు జయప్రకాశ్ నారాయణ్ జన్మించారు. బోసినవ్వు ముఖంతో ఏడుపు అనేదే లేకుండా ఉండటం చూసి ‘మూగ ముసలయ్య’ అని ఫూల్ రాణి దేవి ముద్దుగా పిలిచేది. కానీ ఆ బాలుడే పాట్నా స్కూల్ లో చదివేటప్పుడు చక్కటి ఉపన్యాసాలు ఇస్తుండేవాడు. ఆ వాగ్ధాటిని గురువులు సైతం మెచ్చుకొనే వారు. తన స్నేహితులకు భగవద్గీత శ్లోకాలను చెప్పి భావం చెబుతుంటే వారు మంత్రముగ్ధులు అయ్యేవారు. గాంధేయవాదిగా : బీహార్ లోని చంపారన్ ప్రాంతంలో నీలిమందు పండించే రైతులకు మద్దతుగా సత్యాగ్రహాన్ని గాంధీజీ 1917 లో చేపట్టారు. ఈ అహింసాయుత పోరాటం విజయవంతం కావడంతో గాంధీజీ విధానాల పట్ల జయప్రకాశ్ ఆకర్షితుడయ్యాడు. గాంధీజీ అడుగు జాడల్లో నడిచి ఖద్దరు దుస్తులను ధరించి, కాంగ్రేస్ లో సభ్యుడై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. చురుకుగా ఉన్న జయప్రకాశ్ ని చూసి బీహార్ కాంగ్రేస్ సీనియర్ నాయకుడు వజ్ర కిశోర్ తన కుమార్తె ప్రభావతి దేవిని ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రిటీష్ వారి కాలేజీ లో చదవడం ఇష్టం లేక బాబూ రాజేంద్రప్రసాద్ వద్ద బీహార్ విద్యా పీఠంలో చేరాడు. బాబూ రాజేంద్రప్రసాద్ కుమారుడు మృత్యంజయ ప్రసాద్ తో ప్రభావతి దేవి సోదరి వివాహం కావడంతో అతనితో బంధుత్వం కూడా ఏర్పడింది. పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళాలనుకున్నాడు. భార్య ప్రభావతి దేవిని అహ్మదాబాద్ లోని గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఉంచాడు. ఉన్నత విద్యకై అమెరికా పయనం : జపాన్ మీదుగా అమెరికా పయనమయ్యాడు. ఇయోవా విశ్వవిద్యాలయంలో డా.సుధీంద్ర బోస్ వద్ద చేరాడు. అమెరికాలో చదువు చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికోసం అక్కడ పొలాల్లో కూలీగా, హోటల్ లో సర్వర్ గా, ఫ్యాక్టరీ లో వర్కర్ గా అనేక రకాల పనులు చేసుకుంటూ ఆ డబ్బుతో చదువుకున్నాడు. కారల్ మార్క్స్ యొక్క ‘దాస్ క్యాపిటల్’ చదివాడు. రష్యాలోని బోల్ష్ విక్ విప్లవం ఆయననెంతో ప్రభావితం చేసింది. భారత కమ్యూనిష్టు నేత ఎమ్.ఎన్. రాయ్ అభిప్రాయాలను ఎంతో అభిమానించేవాడు. తల్లి అనారోగ్య కారణంతో పి.హెచ్.డి. పూర్తి చేయకుండా మధ్యలోనే భారతదేశానికి రావలసి వచ్చింది. స్వాతంత్ర్యోద్యమంలో : నెహ్రూ ఆహ్వానం మేరకు బీహార్ కాంగ్రేస్ కార్యదర్శిగా పనిచేసాడు. 1930లో ‘అపూర్వ సత్యాగ్రహం’ పేరిట స్వాతంత్ర్యోద్యమ చరిత్రను వ్రాశాడు. ‘నిజమైన సామ్యవాది జయప్రకాశ్’ అని గాంధీజీ కొనియాడాడు. కాంగ్రేస్ లో ఉంటూనే తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవాడు. గాంధీ, నెహ్రూ లను సైతం కొన్ని విషయాలలో విభేదించాడని వారికి వ్రాసిన లేఖల ద్వారా మనకు తెలుస్తోంది. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా దండి సత్యాగ్రహం లో పాల్గొన్నాడు. జయప్రకాశ్ ని అరెస్ట్ చేసి నాసిక్ జైలులో నిర్భందించారు. అక్కడే రామ్ మనోహర్ లోహియా, అశోక్ మెహతా, సి.కె.నారాయణ స్వామి వంటి జాతీయ నాయకులతో పరిచయం ఏర్పడింది. ఆచార్య నరేంద్ర దేవ్ ఆధ్వర్యంలో కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ ఏర్పాటు దిశగా వారి స్నేహం కొనసాగింది. ‘చేయండి లేదా చావండి’ అనే గాంధీజీ నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం దేశమంతా పాకింది. ఇందులో పాల్గొన్న జయప్రకాశ్ ను అరెస్ట్ చేసి హాజారీబాగ్ జైలులో ఉంచారు. నాయకులు లేక ఉద్యమం చల్లారిపోతుందని ఎలాగైనా ప్రజల్లోకి వెళ్ళాలని జయప్రకాశ్ నిశ్చయించుకున్నాడు. 1942 నవంబర్ 9 వ తేదీ దీపావళి. అందరూ టపాసులు కాల్చుకుంటున్న సమయంలో ఎంతో సాహసంతో జైలు అధికారుల కన్నుగప్పి జైలు గోడ దూకి తప్పించుకున్నాడు. కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండి ఉద్యమాన్ని నడిపించాడు. ఏ పదవీ ఆశించని నిస్వార్థ పరుడు : స్వాతంత్ర్యానంతరం నెహ్రూ గారు మంత్రి వర్గంలోకి ఆహ్వానించారు. కానీ కాంగ్రేస్ లో కొంతమంది స్వార్థ పరులు స్వప్రయోజనం కోసం పదవులను వాడుకుంటున్నారని బాధపడి ఏ పదవీ స్వీకరించలేదు. గాంధీజీ సూచించినట్లు కాంగ్రేస్ ను రాజకీయ పార్టీగా రద్దు చేయాలని భావించాడు. ప్రజా సేవకు పదవులు అవసరం లేదని భావించాడు. వినోబా భావే తో కలిసి సర్వోదయా ఉద్యమంలో పాల్గొన్నాడు. వారి సూచన మేరకు భూదానోద్యమంలో తానూ ఒకడై తన భూమినంతా భూమిలేని ప్రజలకు రాసిచ్చాడు. సంపూర్ణ క్రాంతి ఉద్యమం : బీహార్ ముఖ్యమంత్రిగా అబ్దుల్ గఫూర్ ఉన్న కాలంలో బీహార్ లో అవినీతి పెరిగిపోయింది. పేద ప్రజలు అనేక కష్టాల పాలయ్యారు. బీమారీ బీహార్ గా మారింది. స్వాతంత్ర్యం సాధించుకుంది ఇలాంటి స్వార్థ నాయకుల కోసమా! అని జయప్రకాశ్ పరితపించాడు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిశ్చయించాడు. ఇందుకోసం యువకులైన విద్యార్థులను ఏకం చేసి బీహార్ ఛాత్ర సంఘర్ష్ సమితిని ప్రోత్సహించాడు. 1974 లో ఏప్రిల్ 9 వ తేదీన పాట్నా మైదానంలో లక్షలాది మంది ప్రజలు జయప్రకాశ్ నాయకత్వంలో పాల్గొన్నారు. అందులో జయప్రకాశ్ మాట్లాడుతూ “27 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న నేను, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి, పేద ప్రజల ఆకలి బాధలను తీర్చి వారి కన్నీటిని తుడచడానికే మీ ముందుకు వచ్చాను. అంతేగానీ ఏ పదవీ ఆశించడం లేదు. నాలో శక్తి ఉన్నంత వరకూ మీ కోసం పోరాడతాను” అని అన్నాడు. ‘సంపూర్ణ క్రాంతి అబ్ నారాహై – భావి ఐతిహాస్ హమారా హై’ అని ప్రజలకు భరోసా కల్పించాడు. ‘బయాలిస్ మె భారత్ ఛోడో – చౌహత్తర్ మె గద్దీ ఛోడో (47లో భారత్ ను వదలండి – 74లో గద్దె దిగండి)’ అంటూ జయప్రకాశ్ ఇచ్చిన నినాదం బీహార్ అంతా ప్రతిధ్వనించింది. ఎందరో నాయకులు ఇందులో భాగస్వాములయ్యారు. జయప్రకాశ్ వల్ల ప్రభావితుడైన జార్జ్ ఫెర్నాండేజ్ 1974 మే 8 వ తేదీన రైల్ రోకో ఆందోళన చేపట్టాడు. జార్జ్ ఫెర్నాండేజ్ ని అరెస్ట్ చేశారు. ఈ ఉద్యమం బీహార్ లోని రాంచి, జెంషడ్ పూర్, భాగల్ పూర్, మిథిల, ముజఫర్ పూర్ లను తాకింది. ఆందోళన కారులపై లాఠీఛార్జి చేశారు. కొంతమంది యువకులు మరణించారు. ఉద్యమం శాంతి యుతంగా జరగాలని జయప్రకాశ్ యువకులకు సూచించారు. ఆగష్టు 9 వ తేదీని ‘సంపూర్ణ క్రాంతి దివస్’ గాను, ఆగష్టు 15 వ తేదీన ‘లోక్ స్వరాజ్య దినోత్సవం’గా జరుపుకోవాలని పిలుపు నిచ్చాడు. ఈ ఉద్యమాన్ని ఎలాగైనా అణగద్రొక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అక్టోబర్ 5 వ తేదీన శాంతియుతంగా జరుపుతున్న ర్యాలీపై లాఠీఛార్జి జరిపారు. బీహార్ చరిత్రలో చీకటి దినంగా పిలవబడే ఆ రోజున 24 మంది మరణించారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. ఇందిరాగాంధీ తో విభేదాలు : బీహార్ లో జరుగుతున్న నిరసనలు పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్ ను కూడా తాకాయి. వెంటనే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జగ్జీవన్ రామ్ ని పిలిచి జయప్రకాశ్ నారాయణ్ తో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పింది. ఢిల్లీలో నవంబర్ 1 వ తేదీన సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచీ అబ్దుల్ గఫూర్ ని తొలగించి, అవినీతి వంతమైన బీహార్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని జయప్రకాశ్ కోరాడు. కానీ ఇందిరాగాంధీ అందులకు సమ్మతించలేదు. ఈ సమావేశం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తన భార్య ప్రభావతి దేవికి ఇందిరాగాంధీ తల్లి కమలా నెహ్రూ వ్రాసిన ఉత్తరాలను బహుమతిగా అందించారు. ఇందిరాగాంధీ వాటిని తీసుకుని ‘నేను మీ మాటను అంగీకరించక పోయినా నాకు మీరు అపూర్వమైన జ్ఞాపకాలను కానుకగా అందించి నందులకు మీకు ధన్యవాదాలు’ అని తెలిపింది. సైద్ధాంతిక భేదాలే తప్ప వ్యక్తిగతంగా ఏనాడూ విమర్శించని జయప్రకాశ్ నారాయణ్ నేటి నాయకులకు కూడా ఆదర్శ ప్రాయుడు. అలహాబాద్ కోర్ట్ తీర్పు : అమేథీ లోక్ సభ నియోజక వర్గంలో ఇందిరాగాంధీ రాజ్ నారాయణ్ పై అవినీతి, అక్రమాలకు పాల్పడి గెలిచిందని, ఈ ఎన్నిక చెల్లదని, రాబోయే ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత ప్రకటిస్తూ అలహాబాద్ హై కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా దృవీకరించింది. అత్యవసర పరిస్థితి : భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా పిలవబడే జూన్ 25, 1975 న అర్ధరాత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విదిస్తున్నట్లు ప్రకటించింది. పత్రికా స్వేచ్ఛను హరించింది. జయప్రకాశ్ తో సహా ప్రశ్నించిన పలువురు నాయకులను అరెస్ట్ చేసింది. జైలులో దుర్భర పరిస్థితుల వల్ల జయప్రకాశ్ ఆరోగ్యం దెబ్బ తినింది. 1975, నవంబర్ 12 వ తేదీన ఆయనను విడుదల చేశారు. జె.పి. ఉద్యమం : అనారోగ్యంతోనే ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అశేష జనవాహిని మధ్య జయప్రకాశ్ ప్రసంగం సాగింది. ‘జయప్రకాశ్ బోల్ రహాహై! ఇందిరా శాసన్ డోల్ రహాహై!’ అంటూ ప్రజలు నినదించారు. జె.పి.ఉద్యమం పేరుతో దేశమంతా వ్యాపించింది. ఉద్యమధాటికి కేంద్ర సర్కారు దిగి వచ్చి 1977 మార్చి 21 న అత్యవసర పరిస్థితిని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి : ఇందిరా కాంగ్రేస్ ను గద్దె దింపడానికి జయప్రకాశ్ కంకణ బద్ధుడై, వయసును సైతం లెక్క చేయక ప్రతిపక్ష పార్టీలను ఏకం చేశాడు. ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో భారతీయ క్రాంతి దళ్ అధ్యక్షుడు చౌదరి చరణ్ సింగ్ తో సమావేశమయ్యాడు. భారతీయ జన సంఘ్, ఉత్కల్ కాంగ్రేస్, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ దళ్, సంయుక్త్ సోషలిస్టు పార్టీ, పంజాబ్ కిషన్ మజ్దూర్ పార్టీ మొదలగు పార్టీలను ఏకం చేశాడు. ఇవి 1977 ఎన్నికల్లో జనతా పార్టీ గా కలిసి పోటీ చేశాయి. ఇందిరాగాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం లో ఓటమి పాలయ్యింది. మొరార్జీ దేశాయి, అటల్ బిహారీ వాజపేయి, అద్వానీ, నీలం సంజీవరెడ్డి వంటి ప్రముఖలు గెలిచారు. మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నిస్వార్థ రాజకీయ దురంధరుడు : స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వంలోనే కాకుండా 1977 జనతా ప్రభుత్వంలో కూడా ఎటువంటి పదవినీ ఆశించని నిస్వార్థ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్. వారి ప్రజాసేవకు మెచ్చి రామన్ మెగసేసే అవార్డు ప్రదానం చేశారు. అక్టోబర్ 8, 1979న మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ జయప్రకాశ్ నారాయణ్ తన జీవన యాత్రను ముగించారు. 1998లో వాజ్ పేయ్ ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ గా జయప్రకాశ్ నారాయణ్ ని ఎంపిక చేసి వారి మరణానంతరం ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినందుకు వారి జయంతిని ప్రజాస్వామ్య పరిరక్షక దినోత్సవంగా జరుపుకోవాలని గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్ణయించారు. నిజమైన ప్రజాస్వామ్య వాదిగా, గాంధేయ సోషలిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న జె.పి. లోక్ నాయక్ గా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.