మంచి – చెడు - కందుల నాగేశ్వరరావు

Manchi-chedu

మంచి – చెడు

ఈ భూగ్రహంపై బ్రతికే ప్రతీజీవి, తన చుట్టూ ఉన్న విపరీత పరిస్థితులనుండి తనను తాను రక్షించుకొని, తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి క్షణం పోరాటం చేస్తూనే ఉంటుంది.

మంచి-చెడు; కాంతి-చీకటి; జ్ఞానం-అజ్ఞానం; సత్యం-అసత్యం; ఆనందం-దుఃఖం; దైవత్వం-రాక్షసత్వం అనే తత్త్వాలు ఎప్పుడూ జంటగా ప్రకటిత మవుతాయి. ఈ విరుద్ధ భావాల మధ్య నిరంతరం యుద్ధం సంభవిస్తూనే ఉంటుంది.

కాంతి చీకటిని అణచి వేస్తుంది, కాంతి తగ్గిన వెంటనే చీకటి మరల వస్తుంది. అలాగే మంచి చెడుని నియంత్రిస్తుంది. ‘మంచి’ నీరసించినప్పుడు ‘చెడు’ వృద్ధి చెందుతుంది.

భగవంతుడు ప్రతి అవతారంలో కొందరు దానవులను సంహరిస్తాడు. అంతేగాని దానవజాతి పూర్తిగా నాశనం కాదు. ఓడిపోయి పారిపోయిన రాక్షసులు పాతాళంలో తలదాచుకుంటారు. తగిన సమయం వచ్చాక మరల విజృంభిస్తారు. అంతేగాని వారు పూర్తిగా నాశనం కారు. అదే విధంగా మనలో ఉండే మంచి చెడుల మధ్య యుద్ధం నిరంతరం జరుగుతూనేఉంటుంది. నిరంతర భగవధ్యానమే మనలో దాగి ఉన్న దానవ శక్తులను ఎల్లప్పుడూ అణచిపెట్టి మంచిని ప్రోత్సహిస్తుంది.

మనం మనకి ఉపయోగపడే ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు, మరికొన్ని ఉప ఉత్పత్తులు తయారవుతాయి. ఆ పనికి రాని లేక నష్టం కలిగించే ఉప ఉత్పత్తులను వేరుచేసి పారవేస్తాము లేదా వేరొక ప్రక్రియలో పనికివస్తే వాడుకుంటాము.

ఒక మంచి పని చేయాలని కొంతమంది సన్మార్గులు ప్రయత్నించినపుడు, ఆ పనిని ఆపడానికి కొంతమంది దుర్మార్గులు ప్రయత్నిస్తారు. ఈ విశ్వాన్ని సృష్టించడానికి దైవశక్తి పనిచేస్తే అదే సమయంలో ఆ సృష్టిని ఆపడానికి కొన్ని దానవ శక్తులు ప్రయత్నించాయి.

మనిషి ‘ఆత్మ’ ఎన్నో జీవులతో నిండిన సామ్రాజ్యం లాంటిది. ఆ సామ్రాజ్యంలో ఉన్న దైవ శక్తులకు, దానవ శక్తులకు (మంచికి, చెడుకి) మధ్య ఎల్లప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనలో నివసించే కొన్ని దానవ శక్తులు, భగవంతుని వైపు వెళ్ళే మన లక్ష్యానికి విఘ్నాలు కలిగిస్తూ ఉంటే, అదే సమయంలో మనలో ఉండే దైవశక్తులు మనం పరమాత్మని చేరే మార్గం వైపు లాగుతూ ఉంటాయి. మన ఆత్మ మనకు సాయం చేసేవారికి, మనను వేటాడే వారికి మధ్య పోరాటం జరిగే యుద్ధభూమి లాంటిది.

సృష్టి జరిగే ప్రక్రియలోనే సృష్టిని వ్యతిరేకించే శక్తులు స్వాభావికంగా మిళితమై ఉంటాయి. ఈ విషయం మనకు దేవీమహాత్యంలో మొదటి చరితయైన మధుకైటభవధలో సృష్టమౌతుంది. కల్పాంతంలో వచ్చిన ప్రళయ సమయంలో శ్రీమన్నారాయణుడు అనంత సాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలో శయనించి ఉన్నాడు. పునసృష్టి జరుపవలసిన సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు ఒక కదలిక, పురిటి నొప్పి లాంటి దడ మొదలైంది. శ్రీహరి నాభి నుండి మొదట శబ్దం (నాద బ్రహ్మ) ఉత్పన్నమైంది. అదే సమయంలో ఆ శబ్దం శ్రీహరికి చేరకుండా అడ్డుకోవడానికి ఆయన రెండు చెవుల్లో గుల్మం తయారయ్యింది. నారాయణుని నాభి కమలం నుండి సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడు పుట్టిన తరుణంలోనే, జగన్నాథుని చెవి గుల్మం నుండి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు పుట్టారు. ఆ దానవులు సృష్టి కార్యాన్ని ఆపడం కొరకు బ్రహ్మదేవునితో యుద్ధానికి తలపడ్డారు.

సృష్టి కార్యం నిర్వర్తించడానికి బ్రహ్మదేవుడు దానిని ఆపడానికి మధుకైటబులు అనే రాక్షసులు శ్రీహరి శరీరం నుండే ఉదయించారు. బ్రహ్మదేవుడి ప్రార్థనతో శ్రీహరి కనులపై నుండి ‘యోగమాయ’ నిష్క్రమించింది. యోగనిద్ర నుండి లేచిన లక్ష్మీపతి మధుకైటబులతో యుద్ధంచేసి వారిని వధించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని నిర్వర్తించాడు. అంటే విష్ణుమూర్తి మేల్కొని తన నుండి ఉత్పన్నమైన చెడును (రాక్షసులను) తానే అణచివేసి మంచిని (సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు) రక్షించాడు.

ప్రతీ వ్యక్తిలో మంచి, చెడు (దైవ గుణం, దానవ గుణం) కలిసే ఉంటాయి. తనలో ఉన్న చెడుని నియంత్రించి, మంచిని పెంచేవాడు దైవగుణం కలవాడు, అలాకాక తనలోని మంచిని తానే గ్రహించక చెడు పనులు చేసేవాడు దానవగుణం కలవాడు అవుతారు. అందుచేత దేవతలు దానవులు మానవ సమాజంలోనే ఉన్నారు.

***

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి
కల్యాణ వైభవం.
కల్యాణ వైభవం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు